
6
ఇందిర ఏదీ నిశ్చయించుకోలేక పోయింది.
రాంబాబు కు ద్రోహం అనేది జరగలేదు గానీ, ఈ కృష్ణ మూర్తి కి ద్రోహం జరిగేటట్లే ఉంది. మనసును మమతల వైపు మళ్ళించుకోవాలో, మాంగల్య ధారణ కే ప్రయత్నించాలో అర్ధం గాలేదు ఇందిరకు.
ఇందిర అనుకున్నదానికి విరుద్దంగా, కృష్ణమూర్తి పెళ్ళికి వారం రోజులు ముందే వచ్చాడు. సుందరి నవ్వుతూ పలకరించింది కృష్ణ మూర్తిని.
'పెళ్ళి వారం రోజులుంది గదరా ఇంకా!'
'వచ్చింది పెళ్ళికి కాదే, నీకోసం, నిన్ను చూడాలని!' అన్నాడు కృష్ణమూర్తి.
సుందరి అదోలా చూసి, అడిగింది - 'నా కోసమేనా? లేకపోతె ఇందు కోసమా?'
కృష్ణమూర్తి ఆశ్చర్యపోయాడు , ఇందిర విషయం సుందరే ప్రస్తావించటం చూసి, పక్కనే ఉన్న ఇందిర కేసి చూసినా, అతనికేమీ అర్ధం గాలేదు.
సుందరి ఆ సాయంత్రం అడిగింది ఇందిరను - కృష్ణమూర్తిని ఆ విషయమై అడగనా అని: ఇందిర ఏమీ నిర్ణయించుకోలేదన్నా వినక, రేపు వాడిని నువ్వు కలుసుకు తీరాలి. వాడికీ విషయంలో ఇంకా ఇంటరెస్ట్ చావలేదు, తప్పక మాట్లాడి తీరాలి' అని ఖచ్చితంగా చెప్పేసింది.
ఇందిరకు ఏమి చేయాలో పాలుపోలేదు.
కృష్ణమూర్తి ని ఏమి అడగాలో, అతనికి ఏం చెప్పాలో ఆలోచించుకోకుండానే అతన్ని కలుసుకోవాల్సి వచ్చింది-- నవ్వుతూ, ఆ నవ్వులో ఆప్యాయతలను , అందాలను చిందిస్తూ -- పలకరించాడు. అవీ ఇవీ చాలాసేపే మాట్లాడారు.
చివరకు అతనే అడిగాడు :'ఎందుకో కలుసుకోవాలన్నారుటగా!'
ఇందిర తత్తర పడింది. జీవితంలో ఒకానొక ముఖ్యమైన మలుపు తిరగాల్సి ఉంది. ఆ మలుపు ఇలా తిరగాల్సి వస్తుందని కలలోనైనా అనుకోలేదు. అయినా... అయినా...ఇక ఆలోచనలతో లాభం లేదు. అడిగేయ్యాలి అనుకొంది ఇందిర.
'...ఏమీ చెప్పారు కారెం.....'
'అదే, అదే...సుందరి ఏమీ చెప్పనే లేదా?-'
'సుందరా? చెప్పింది , గానీ నేనే నమ్మలేదు. అందుకే అడిగి తెలుసుకోవాలని వచ్చాను--'
'అది నిజమే - నేనే అడగమన్నాను...'
'మీరా?'
'ఔను, నేనే!...'
'తమాషాగా ఉంది- మీ దగ్గర నుంచి ఇలాటి దసలు నేను ఊహించనే లేదు--' సుందరి వేళాకోళం అడుతుందేమో ననుకున్నాను....'
'వేళాకోళం కాదు. నేనడగమంటేనే అడిగింది --'
కృష్ణమూర్తి ఏదీ మాట్లాడలేదు, ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు.
చాలాసేపు పోయాక అడిగాడు -- 'ఒక మాటాడగనా?'
'అడగండి.'
సంవత్సరం తర్వాత ఈ నిర్ణయాని కెందుకు వచ్చారు?'
ఇందిర నవ్వింది-- 'సంవత్సరం క్రితం పరిస్థితులు వేరు. ఇపుడు వేరు...'
'అంటే?..'
'అంటే, మనిషిని భావాలకు కొత్త రూపం చేరి ఉండచ్చు. మార్పు లేన్నెన్నో వచ్చి ఉండొచ్చు, భావాలకు పరిస్తితులను రాజీ కుడురుస్తూనే నిర్ణయాలు తీసుకొనేది - ఔనా?...
కృష్ణమూర్తి ఏమీ అనలేదు.
'--ఏమీ అనరేం?-'
'ఆలోచిస్తున్నాను--' అన్నాడు కృష్ణ మూర్తి.
'ఏమిటి ? జవాబా?-' నవ్వింది ఇందిర.
'జవాబు ఆలోచించాల్సిన పనిలేదు. కానీ అదృష్టం ఇంతలా ఎలా వెతుక్కోచ్చింది అని?'
ఇందిర మనసు నులినమయి పోయింది- అతను తనను పెళ్ళి చేసుకోవటం అదృష్టం అనుకొంటుంటే తను అతన్ని మోసం చేయాలని యత్నించటం -- ఛ, ఎంతగా దిగజారి పోవాల్సి వచ్చింది! పోనీ, నిజం చెప్పేస్తే...
ఔను , ఈవేళ కాకపోతే, రేపయినా ఇది తెలిసేదే! దీన్ని బ్రహ్మదేవుడు కూడా దాచలేడు, ఇదివరమో, శాపమో గానీ!
నిజం చెప్పేస్తే, అపుడతను తన్ను స్వీకరించదలిస్తే , అది వేరు.
ఇలా నిజం దాచి, అబద్డంతో అతన్ని వంచించి, ఆత్మను చంపుకొని, ఎంత కాలం?- ఊహు - నిజం చెప్పెయ్యాలి-
'ఒకటి చెప్పాలి నేను...' ఇందిర ఆగిపోయింది.
'చెప్పండి...'
'మీరు నిర్ణయానికి రావటానికి మునుపు ఇది విని , తర్వాత నిర్ణయించు కొంటె మంచిది. చెప్పమంటారా ?-' ఆగిపోయింది ఇందిర.
'చెప్పండి - మనసులో ఉన్నది చెప్పటం ధర్మం - ' నవ్వాడు కృష్ణమూర్తి.
భగవంతుడ్ని ఒక్కసారి ప్రార్ధించు కొంది - 'భగవాన్! నన్ను ఈ పరీక్ష లో ఉత్తీర్ణురాలినే చెయ్యి స్వామీ! మోసం చెయ్యాలనేది నా ధ్యేయం కాదు. అవసరం కాదు! నిజాన్ని దాచడం దోషమని, ముఖ్యంగా జీవితం పంచుకోదలిచిన వ్యక్తీ దగ్గిర దాచటం అమానుషమని చెబుతున్నాను- నన్ను రక్షించు స్వామీ!'
'చెప్పండి- ' అన్నాడు కృష్ణమూర్తి .
ఇందిర అతని కేసి చూసి తల దించుకొంది. గొంతు సవరించుకొంది.
* * * *
'అదీ సుందరీ జరిగిన సంగతి. నేననుకున్నది ఇంతలా ఎలా నిజమయి పోయిందా అనే ఆశ్చర్య పోయాను నేను--'
సుందరి ఏమీ మాట్లాడలేదు. ఆమె కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరిగాయి.
'ఛ, ఛ , కన్నీళ్లు కార్చకూడదే నువ్వు ; కొత్త పెళ్ళి కూతురివి. కలకాలం నీ కళ్ళు కళకళలాడాలే గానీ కన్నీళ్ళ తో నిండి బాధలు వ్యక్త పరచ కూడదే....అయినా ఇదంతా నీకు నేను చెప్పాలిటే, ఏదో నా పిచ్చి గాని...'
'ఇందూ, నా మాట వింటావా ?-'
'ఆ, నీ మాట వినేగదా మీ అన్నయ్య కు కలుసుకొన్నది..'
'అది కాదె--'
'ఏదయినా సరే నువ్వు చెప్పు, నేను వినకపోతే అప్పుడడుగు...'
'నీ చేత్తోటే ఒక గుక్కెడు విషం ఇచ్చేస్తే సరిపోను గదే...'
'ఎవరికి ? మీ అన్నయ్యకా?'
'కాదె, నాకు-- ఈ బాధంతా నాది కాదూ? నావల్ల కాదూ?-'
'ఛీ, ఛీ... ఇలాటివే వద్దు. ఒకవిధంగా నాకిది మేలే చేసిందే నీ కర్ధం గాదు కానీ! బ్రతకాలనే కాంక్ష పెరిగిందే నాలో! కానీ మీ అన్నయ్య అనుకొన్నట్లు కాదె నే బతికేది- ధైర్యంగా, రాంబాబు భార్యగా బతుకుతానే -- రాంబాబు పారిపోయాడేమో గానీ నేను పారిపోలేను. నాది అంత బాధ్యత లేని బతుకు కాకూడదు. ఎలా బతకలేనో, బతికి చూపిస్తాను. అసలిందుకే అంటున్నాను, మీ అన్నయ్య నాకు మేలే చేశాడని...'
'వాడా? మేలు చేశాడా/-'
'ఆ-'
'నీకు నోరెలా వస్తోందే ఆ మాట అనడానికి? కాలుజారిన ఆడది అనే భావమే గదే వాడ్నలా చేసింది? అయినా తప్పంతా నాదే ననుకో-- వాడు నిన్నేదో ప్రేమిస్తున్నాడనే అనుకున్నాను గానీ, కామిస్తున్నాడని అనుకోలేదు నేను. అలా అయితే ఇలా నిన్నోక్కదాన్నీ పంపెదాన్నే కాను నేను. అయినా వాడసలు ఇంటికి రానీ....'
'ఇదిగో, నువ్వు కృష్ణ నేమీ అనకు- అతని తప్పేమీ లేదు. జీవితంలో అడదోకటి కాలు జారింది కనిపిస్తే వదిలే రకం కాదు. ఈనాటి మగవాళ్ళు. ఆ వేలాది మందిలో ఇతనొకడు. అంతే, అంతకన్నా ఇంకేం లేదు-'
'సారీ ఇందూ...'
'ఇదిగో , ఇలాటి మాటలే వద్దనేది ఇందులో సారీకి, క్షమించడానికి ఏముంది గనుక! అదలా జరగాలని ఉంది జరిగి పోయింది. అయినా ఈ క్షమాపణ నువ్వు కోరుకోవాలా?- నీ ప్రోత్సాహం వల్ల మీ అన్నయ్యను చేరాను గనుక నీకీ ప్రోగ్రెస్ కార్డు చూపించటం . లేకపోతె ఈ అవసరమే లేదు గదా!...'
సుందరీ ఏమీ మాట్లాడలేదు. ఆమె కళ్ళు బాధను వర్షిస్తున్నా.... కళ్ళల్లో 'నా వల్ల కదా నీకింత కష్టం కలిగింది.' అనే భావం ప్రస్పుటమౌతోంది.
ఇందిర నవ్వుకొంది. క్షణం ఆగి అంది - 'నువ్వేం బాధపడకు సుందరీ! జరిగేది ఏదైనా మంచికే జరుగుతోందనుకుంటే సరిపోతుంది.... నవ్వుతావేమో రాస్కెల్?-' సాధ్యమైనంత స్వాభావికంగా అనడానికి ప్రయత్నించింది ఇందిర.
పేలవంగా నవ్వింది సుందరి 'ఇంకా ఒకటడుగుతాను, నిజం చెబుతావా?'
'ఆ'
'నీకింత ధైర్యం ఎలా వచ్చిందే?- నాకెంతో ఆశ్చర్యంగానో ఉంది...
'క్షణం సేపు అలోచించి చూస్తోంటే నాకూ అనిపిస్తోంది ఇంత ధైర్యం ఎక్కడిదా అని? కాని నాకు జవాబు తెలుసు-- ఒకసారి దెబ్బ తిన్నదాన్ని. ధైర్యం కాదది, బతకాలనే ఆశ కలిపిస్తోన్న మొండి ధైర్యం . అంతే! అంతకన్న...'
'ఇంకేమీ లేదంటావ్ - సరే, ఇంకొక్క మాట-'
'అడుగు-'
'అడుగుతాను ..నేనంటే నీకు ఎంతో కోపంగా ఉంది గదూ?-'
'నువ్వంటేనా?' ఫకాలున నవ్వింది ఇందిర. ఉలికిపడింది సుందరి. 'నువ్వంటే నాకిష్టమే! ఎంత ఇష్టమంటే ప్రాణాన్ని తీసి నీకిలా ఇచ్చేయమంటే , క్షణం చాలు నాకు! ఎందుకని అడుగుతావా? బతకాలనే ఆశ కల్పించావే! ఈ సంఘటనే నా జీవితంలో లేకపోతె కధ మరోలా ఉండేదేమోనే!..'
'అంటే?-' అర్ధం కాలేదన్నట్లు అడిగింది సుందరి.
'అంటే ఏముంది?- జీవితంలో ఏయే క్షణంలో ఏయే మలుపు తిరుగుతుందో, ఏ మలుపుకు ఎలా రియాక్టవ్వాలో అర్ధ మయిందే! 'జీవితం అంటే ఇది, ఈ జీవిత సమరంలో ఇలా నడుచు కొంటేనే గానీ నువ్వు మనలేవు.' అని నాకు ఈ క్షణం లో ఒక పాఠం నేర్పిన సంఘటన ఇదే! ఈ సంఘటన నేర్పిన పాఠం నేను తప్పకుండా నేర్చుకొని తీరాలంటే ఒకటే మార్గం కనిపిస్తోంది -'
'ఏమిటే అది?-' ఆత్రుతగా అడిగింది సుందరి.
'వెంకటేశ్వర్లు గారు చెప్పింది వినటం....'
'ఎవరూ? రాంబాబు తండ్రా?-'
'అవును . ఇంకా రాంబాబు తండ్రేమిటే? ఇపుడాయన నాకూ మామగారు. అంటే భర్త ఫాదర్.'
'ఏం చెప్పారేం?-'
'మంచికోరి . మంచి సలహా ఇచ్చారు. ఇల్లు వదిలి వెళ్ళి పోమన్నారు....'
'నిన్నా?-'
'లేకపోతె నిన్నా?-'
'ఒసేయ్, పరిహసాలతో చంపేసేయ్: సరేనా?-' కోపంగా అంది సుందరి.
'క్షమించవె! - ఇల్లు వదిలి వెళ్ళమంటే పారిపొమ్మని కాదు. ఈ ఊరు వదిలి , బిడ్డను కనే దాకా వేరే ఊళ్ళో ఉండమని సలహా ఇచ్చారు--'
