Previous Page Next Page 
నీరజ పేజి 11


    రాధ సిగ్గుపడుతూ వక్కపొడి పట్టుకువచ్చింది. ప్రభుకు తల తిరిగి పోసాగింది. వర్ధని ఉండమంటున్నా అక్కడి నుంచి తప్పించుకుని వచ్చేసాడు.
    నీరజ కోసం ఎక్కడ వెతకగలడు?
    యశోధర పెళ్ళి చాలా వైభవంగా జరిపించాడు ప్రభు. మనసు ఎంత మధనపడుతోన్నా అన్ని పనులూ యాంత్రికంగా యధావిధిగా చేస్తోనే ఉన్నాడు.
    యశోధరకు ఒక చిన్న పార్శెల్ కానుకగా వచ్చింది ..... ఒంటి ముత్యం పొదిగిన బంగారు ఉంగరంతో పాటు ఒక చిన్న వుత్తరం కూడా ఉంది అందులో ....
    "ప్రియమైన యశోధరకు ప్రేమతో ......" అంత మాత్రమే!
    ఎవరిది? సంతకం కూడా లేదు?" అంటోన్న యశోధర ఏదో గుర్తు వచ్చినట్లు ఆగిపోయింది. భయంగా ప్రభు వంక చూసింది. ప్రభు యశోధర చేతిలోంచి ఆ ఉత్తరం తీసుకున్నాడు . గుండెలు ఝల్లుమన్నాయి. సందేహం లేదు. అది నీరజ దస్తూరి ...... ఆత్రుతగా పార్శేల్ మీద అడ్రస్ చూసాడు . ఆ ఊరి పేరు నోట్ చేసుకున్నాడు. ఆ రాత్రి బయలుదేరాడు.
    ఆ ఊరంతా గాలిస్తూ వారం రోజులు తిరిగాడు ప్రభు. ఎక్కడా నీరజ జాడ లేదు. నిరాశ చేసుకుని మళ్ళీ ఇంటికే ప్రయాణమయ్యాడు. టికెట్ కొనుక్కుని ప్లాట్ ఫాం మీద నిలబడ్డాడు. ఒక యువతి చేతిలో చిన్న సూట్ కేస్ పట్టుకుని హడావుడిగా ప్లాట్ ఫాం మీదకు వచ్చింది. ప్రభును చూస్తూనే గిర్ర్రున తిరిగి వెళ్ళిపోబోయింది. ప్రభు వెంటనే నీరజను గుర్తుపట్టాడు. "నీరజా!" అన్నాడు నీరజ పరుగులాంటి నడకతో స్టేషన్ బయటకు నడిచింది. ప్రభు సర్వమూ మరిచి "నీరజా?" అని పిలుస్తూ వెంటపడ్డాడు. నీరజ నడకవేగం హెచ్చించింది. ప్రభు నీరజనే చూస్తూ పరిగెత్తి నీరజను అందుకోబోయాడు. అంతలోనే ఒక కారు ప్రభును గుద్దేసింది. "నీరజా!" అని ఒక వెఱ్రి కేక పెట్టాడు ప్రభు.

                                  


    ప్రభు కళ్ళు తెరిచేసరికి నీరజ ఎదురుగా ఉంది. "ప్రభూ!" అంది ఆందోళనగా.......
    "హమ్మయ్యా! ఇక్కడే ఉన్నావా? మళ్ళీ నిన్ను పోగొట్టు'కుంటానేమోనని ఎంత ఆరాటపడిపోయానో తెలుసా?" నీరజ మాట్లాడలేదు..... ప్రభు తన చుట్టూ పక్కల చూసుకున్నాడు - హాస్పిటల్.
    "ఏమిటిది! నాకు ఏక్సిడెంట్ అయింది కదూ! అయితే అయిందిలే నిన్ను కలుసుకున్నాను...."
    నీరజ ప్రభు హృదయం మీద తల వాల్చి ఏడ్చింది. ..... నీరజ చేతిని తన చేతిలోకి తీసుకుని " ఇన్నాళ్ళూ ఏమయిపోయావు నీరజా! ఎంతగా వెతికాను నీ కోసం?" అన్నాడు ....
    క్లబ్బులో ఉద్యోగం పోయాక ..... వర్ధని నిర్దాక్షణ్యంగా ఇంట్లోంచి పోమ్మన్నాక నీరజకు దిక్కుతోచలేదు. ఆ సమయంలో భగవంతుడి పిలుపు లాగా కనిపించింది పత్రికలలో ప్రకటన.......
    ఊరికి దూరంగా కొండ ప్రాంతంలో ప్రత్యేకించి గిరిజనుల కోసం ఒక పాఠశాల నడుపుతున్నారు. అందులో పనిచెయ్యటానికి టీచర్ కావాలని .... అక్కడి హెడ్మాస్టర్ కు యాభై యేళ్ళ పైన వయసు ఉంటుంది. ఆయనను అందరూ "స్వామీజీ' అని పిలుస్తారు. అలా అని ఆయనకు గేడ్డాలూ మీసాలూ ఏమీ లేవు. లుంగీ కట్టుకుని లాల్చీ వేసుకుని పరమ నిరాడంబరంగా ఉంటారు. ఏ మాత్రం స్వార్ధం లేకుండా, ఆ గిరిజనులను పైకి తేవడానికి పాటుపడుతున్నారు. అందుకే అందరికీ అయన అంటే గౌరవం. ఆస్కూల్ లో పనిచేసేది అయన, నీరజ, ఇద్దరే! నీరజ దాపరికం లేకుండా ఆయనకు తన కధ అంతా చెప్పి......."
    "మీరు ఉండమంటే ఇక్కడ ఉంటాను . లేకపోతే వెళ్ళిపోతాను ." అంది.
    "నేనెందుకు వెళ్ళమంటానమ్మా! కానీ, నీకు ఆ గూండాలతో లావాదేవీలు ఏవీ లేవుగా!"
    "నేను దౌర్భాగ్యురాలినే కాని దుర్మార్గురాలీని కాను బాబుగారూ?"
    అయన నొచ్చుకుని "సరేనమ్మా. సరే! ఇక్కడి కొచ్చి పనిచేసే వాళ్ళు ఎవరున్నారు ? నువ్వు ఉంటానంటే మా అందరి అభిమానమూ సంపాదించుకోగలిగింది. స్వామీజీ చెప్పిన మీదట అక్కడి చిన్నపిల్లలందరూ నీరజను "అక్కా!" అని పిలవటం కూడా మొదలుపెట్టారు.
    ఒకరోజు బడికి ఒక్కళ్ళు కూడా రాలేదు. నీరజకూ స్వామీజీకి ఆశ్చర్యం కలిగింది. ఇద్దరూ కనుక్కోవటానికి వెళ్ళారు. వాళ్ళంతా నీరజను చూస్తూనే గబగబ గుడిసెల్లో దూరి తడికెలు బిగించుకున్నారు. నివ్వెరపోయింది నీరజ. స్వామీజీ ఒకటి రెండు సార్లు పిలవగా పెద్దవాళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చారు.
    "అయమ్మ మీద పోలీసుల నిఘా ఉందటగా సామీ! ఓయ్ నాయినోయ్! యములాల బాధలన్నా పడొచ్చు గాని, ఆ పోలీసోల బాధలు పడలెం సామీ?"
    ఏడుస్తూ , రాగాలు పెడుతూ అన్నారు వాళ్ళు....... స్వామీజీ ఎన్ని విధాల నచ్చజెప్పాలని ప్రయత్నించినా లాభం లేకపోయింది.
    ఆ సాయంత్రం నీరజ తన చిన్న సూట్ కేస్ సర్దుకుని స్వామీజీకి నమస్కరించి "నేను వెళ్తున్నాను" అంది.
    అయన తలవంచుకున్నారు.
    అంతా విని ఒక్క నిట్టుర్పూ విడిచాడు ప్రభు....
    "పోనీలే నీరజా! అంతా మన మంచికే జరిగింది ..... నువ్వు ఆకొండకోనల్లోనే ఉంటే నిన్నసలు కలుసుకోలేక పోయేవాడిని .... మనం ఎప్పుడు వెళ్దాం?"
    "నన్నూ నీతో రమ్మంటావా?"
    "మళ్ళీ అదేపాటా?"
    "డాక్టర్ ని కనుక్కుంటాను . నిన్ను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో ......"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS