Previous Page Next Page 
నీరజ పేజి 10

 

    ప్రభు సమాధానం చెప్పలేకపోయాడు -- ఈ విషయంలో పట్టుబట్టి అంతా నిస్చయమయిపోయిన చెల్లెలి పెళ్లి చెడగొట్టడానికి అతని మనసు అంగీకరించలేదు.
    "నీరజ దగ్గరకు నేనే వెళ్ళి పరిస్థితి అంతా వివరించి రావద్దని చెపుతాను." అంది లక్ష్మీదేవి.
    "వద్దు వద్దు నేనే చెపుతాను?" అన్నాడు ప్రభు....
    ఆరోజు "పరవాలేదు ప్రభూ! నేను రానులే!" అని ప్రశాంతంగా అన్న నీరజ మాటల్లో అంతర్లీనమై ఉన్న పదును ప్రభు మనసును కోస్తూనే ఉంది. నీరజతో ఒక్కసారి మనసు విప్పి మాట్లాడాలని ఎంతగానో ప్రయత్నించాడు -- ప్రభు. ఎప్పుడు ఎక్కడికి రమ్మన్నా ఆ సమయంలో 'ఊ!' అనేది నీరజ -- కానీ వచ్చేది కాదు- నీరజ కోసం పడిగాపులు పడి విసిగిపోవటమే ప్రభుకు దక్కేది. నీరజకు కాన్వెంట్ లో ఉద్యోగం పోయిందని విని బాధపడ్డాడు - క్లబ్ లో జాయినయిందని విని భయపడ్డాడు-- ఆరోజు ఏమైనా సరే నీరజను కలుసుకుని తీరాలని క్లబ్ ముందు పడిగాపులు పడుతూ నించున్నాడు .....
    నీరజ దగ్గరగా వచ్చి అనునయంగా నీరజ చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు ప్రభు.
    నీరజా ! నా అనందం కోసం మిగిలిన వాళ్ళ జీవితాలు చికాకు చేసేటంత స్వార్ధం లేకపోయింది నాకు -- అందుకే ఆరోజు నిన్ను రావద్దని అనవలసి వచ్చింది -- అర్ధం చేసుకోలేవా?"
    అర్ధం చేసుకుంటోంది నీరజ -- అర్ధమవుతోన్న కొద్దీ తన సమస్య మరింత భయంకరంగా ప్రత్యక్షమవుతోంది -- సమాజం ఎన్నటికీ తనను ఎప్పటిలా స్వీకరించలేదు -- తనతో కలిసి ప్రభు అడుగడుగునా ఎలాంటి సమస్యను ఎదుర్కోవలసి వస్తుందో? అంత సంఘర్షణకు అతణ్ణి గురిచెయ్యటం తనకు న్యాయమేనా?" అంత స్వార్ధం ఉందా తనలో .....
    "ప్లీజ్ నీరజా!"
    చేతులు జాపాడు ప్రభు -- తనమీద తనకేమీ అధికారం లేనట్లు తూలి ఆ చేతులలో వాలిపోయింది నీరజ ........ మాటలకందని మహాశక్తి ఏదో తమను బందించినట్లు ఒకరికొకరు హత్తుకుపోయారు.
    "ఆయామ్ సారీ!" అన్న మాటలు విని ఉలికిపాటుతో ప్రభుకు దూరంగా జరిగింది నీరజా ------- ఎదురుగా నీలకాంత్ ను చూసి నిర్ఘాంత పోయింది.
    నీలకాంత్ నవ్వుతూ "ప్రభూ! నీరజను ఇక్కడికి తీసుకోస్తున్నానని నాకు చెప్పి ఉండవలసింది. నేను వచ్చేవాణ్ణి కాదు!" అన్నాడు.
    "దట్సాల్ రైట్ " సిగ్గుపడుతూ అన్నాడు ప్రభూ....
    "ఈ ఇల్లు నీలకాంత్ దా?" పాలిపోయిన ముఖంతో అడిగింది నీరజ.
    "ఏం? తెలిస్తే వచ్చేదానివి కాదా?"
    కవ్విస్తున్నట్లు అడిగాడు నీలకాంత్.
    'కంఠంలో ప్రాణం ఉండగా వచ్చేదాన్ని కాదు"
    "నీరజా......." మందలిస్తున్నట్లుగా ఏదో అనబోయాడు ప్రభు ........ నీలకాంత్ కల్పించుకున్నాడు.....
    "ఆవిడ భయమంతా తన రహస్యం నేను నీకు చెప్తానని ప్రభూ ! నీరజా! భయపడకు. ఆ రహస్యం నానోటి నుండి రాదు"
    నీరజ మాట్లాడలేదు- పెదవి మాత్రం పళ్ళ కింద నలిగిపోతుంది.
    ప్రభు ముఖం జేవురించింది .
    "నీరజ నా దగ్గర రహస్యంగా ఉంచవలసిన విషయాలేమీ లేవు -- భయపడవలసిన అవసరం అసలే లేదు . అదేమిటో చెప్పు నీలకాంత్ "
    "నేను చెప్పలేను ప్రభూ! నీరజనే అడుగు"
    "నీరజా! నీ రహస్యం తెలుసుకోవాలని నాకేవిధమయిన కుతూహలమూ లేదు -- ఎలాంటి విషయమయినా మన మధ్య అడ్డుగా నిలవలేదనీ -- నీ విషయంలో నేను క్షమించలేనిదంటూ ఏదీ లేదనీ ....... రుజువు చేసుకోవటానికి అదేదో చెప్పెయ్యి నీరజా! ఈ తెరలు చీల్చేసుకుంటే కాని మనకు శాంతి ఉండదు"
    జీవం లేని తన ముఖాన్ని పైకెత్తింది నీరజ.
    "నాదగ్గిర నుంచి వెళ్ళిపో ప్రభు! శాశ్వతంగా వెళ్ళిపో"
    ఆ చిమ్మచీకట్లోకి పిచ్చిదానిలా పరుగు పెట్టింది.
    

                                       *    *    *   

    ప్రతిరోజూ అక్లబ్ ఎదురుగా నీరజ కోసం ఎదురు చూస్తూ నిలబడుతున్నాడు ప్రభు ..... వారం రోజులు గడిచాయి. నీరజ జాడలేదు -- ప్రభు ఆందోళనను  అనచుకోలేకపోయాడు - క్లబ్ కు వెళ్ళాడు. ఎంక్వయిరీలో "మిస్ నీరజను కలుసుకోవాలి ! ఆవిడతో చెప్పగలరా?" అన్నాడు. అక్కడి క్లర్క్ "మిస్ నీరజను ఇక్కడ ఉద్యోగం లోంచి తీసేశారు. ఇప్పుడు ఇక్కడ లేదు -" అన్నాడు.
    "ఉద్యోగంలోంచి తీసేశారా?"
    "ఆవిడ వెనక పోలీసులు తిరుగుతున్నారని తెలిసింది. ఇది పెద్ద మనుష్యులు వచ్చే క్లబ్ - అలాంటి వాళ్ళను ఎలా ఉంచుకోగలం?"
    అది పెద్దమనుష్యులు వచ్చే క్లబ్ -- ఆ పెద్ద మనుష్యులకు న్యాయమైనవీ, అన్యాయమైనవీ అనేక వ్యవహారాలుంటాయి. ఆ క్లబ్ లో .......... పోలీసుల దృష్టి ఆ క్లబ్ మీద పడటం ప్రమాదమే మరి.
    చేసేది లేక నీరజ కోసం ఇంటికే వెళ్ళాడు ప్రభు .....వర్ధని చిరునవ్వుతో ఆప్యాయంగా ఆహ్వానించింది.
    "నీరజ ఏం చేస్తోంది అత్తయ్య?"
    వర్ధని విస్తుపోయి చూసింది -- కంగారు పడ్డాడు ప్రభు.
    "అయితే, నీకు నిజంగానే తెలీదా?"
    "ఏమిటి అత్తయ్యా?"
    "నీరజ ఇక్కడెక్కడ ఉంది "
    "ఎక్కడికి వెళ్ళింది?"
    "ఏమో! ఎక్కడకు వెళ్లిందో. ఎలా వచ్చిందో , తెలియదు. మళ్ళీ ఎక్కడకు వెళ్ళిందో , ఎప్పుడు వస్తుందో అసలు తెలియదు. నేనేం చెప్పగలను?"
    వర్ధని చిన్న కూతురు కల్పించుకుని "కాదు ! అమ్మ వెళ్ళిపొమ్మంది?" అంది.
    "నోరు మూసుకో!" అని కూతుర్ని కసిరింది వర్ధని. ప్రభును చూస్తూ "అవును నేనే వెళ్లి పొమ్మన్నాను. నేను సామన్యురాలినే! నాకు పెళ్ళి కావలసిన పిల్లలున్నారు. ఇన్ని గొడవలతో ఉన్న ఆ పిల్లను రొమ్ముల మీద కుంపటిలా ఎలా భరించగలను?" అంది.
    "వస్తానత్తయ్యా" అని లేవబోయాడు. వెళ్ళ నివ్వలేదు వర్ధని.....
    "కూచో , కూచో! అన్నట్లు ఈ మధ్య మా రాధను చూసావా నిముషాలలో ఎదిగి కూర్చుంది -- ఈ ఆడపిల్లలు కాదు గాని - అంటే దృష్టి కొడుతుందని భయంగా ఉంది. ఎంత అందంగా తయారయిందనుకున్నావ్! నీరజ కంటే ఎంతో అందంగా ఉంది. ఇప్పుడు దీని పెళ్ళి చెయ్యాలి ..... నీలాంటి వాళ్ళు కట్నం తీసుకోకుండా చేసుకుంటే ఏదో చెయ్యగలం కాని, లేకపోతే మాబోటి వాళ్ళం ఆడపిల్లల పెళ్ళిళ్ళు చెయ్యగలమా? అమ్మాయ్ రాదా! బావకి కాస్త వక్కపొడి పట్రా అమ్మా!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS