"అదీగాక మేము ఈ స్కూలు ఓనర్ కి ఫ్రెండ్స్ మి మేడమ్. ఆయనే అందర్నీ రమ్మని చెప్పారు-" అన్నాడు విజయ్ యాదవ్.
ఆమె ముఖంలో సంతృప్తి కనిపించింది.
"అయితే మనం కూడా అగ్రిమెంట్ చేసుకుందాం! ఎనీ ప్రాబ్లెమ్?"
"నో ప్రాబ్లెమ్ మేడమ్- మేము రడీ-"
"78 మంది"
"ఓ.కే. ఇప్పుడు అగ్రిమెంట్ రాసుకుందాం! ఫీజు కట్టటానికి ఒక నెల టైమిస్తాను. నెలలోగా ఫీజు కట్టకపోతే అగ్రిమెంట్ కాన్సిల్."
"అలాగే మేడమ్."
"ఇంతకూ ఇప్పుడు అడ్మిట్ చేసే పాపాయి ఏదీ?"
బోసు, అతని భార్య ముందుకొచ్చి ప్రిన్సిపాల్ పక్కనే ఉన్న ఉయ్యాల్లో పాపాయిని పడుకోబెట్టారు.
ప్రిన్సిపాల్ ఓ నిమిషం పాపాయిని అబ్జర్వ్ చేసి ముఖం అదోలా పెట్టింది.
తర్వాత పాపాయి బుగ్గ గట్టిగా గిల్లేసరికి పాపాయి ఇల్లెగిరిపోయేట్లు ఏడుపు మొదలుపెట్టింది.
"ఓ గాడ్" చెవులు మూసుకుంది ప్రిన్సిపాల్. ఆ తరువాత కోపంగా మా వేపు తిరిగింది.
"వాట్ ఈజ్ దిస్ నాన్సెన్స్ మిస్టర్? ఏడుపు అలవాటు చేశారేంటి? చూస్తే అంతా ఎడ్యుకేటెడ్స్ లాగున్నారు మళ్ళీ! ఏమయినా డిసిప్లినుందా ఈ పాపాయికి! ఇప్పుడే ఇలా ఏడిస్తే తరువాత పెద్ద న్యూసెన్స్ అయిపోతారు మాకు" ఆవేశంగా అందామె.
ఆమె మాటలు వింటూంటే మా అందరికీ మతిపోయినట్లయింది.
"అదేమిటి మేడమ్! మీరు గిల్లారు కదా! అందుకని ఏడుస్తున్నాడు!" అంది ఝాన్సీ తన పాపాయిని ప్రిన్సిపాల్ గిల్లినందుకు తెగ బాధపడిపోతూ.
"ఇదిగో చూడమ్మా! ఇలా గిల్లగానే ఏడ్చే రకాలు ఎవరో తెలుసా? కల్చర్, డిసిప్లిన్, ఎడ్యుకేషన్ లేని ఫామిలీస్ తాలూకు పిల్లలు! ఇలా వెధవగారాలు చేసి చెడగొట్టిన పిల్లల్ని మా స్కూల్లో చేర్చుకుంటే ఢిల్లీలో ఉన్న మా బ్రాంచ్ కి చెడ్డ పేరొస్తుంది. అసలు మీరు అమెరికా పిల్లల్ని ఎప్పుడయినా చూశారా?"
అందరం మొఖాలు చూసుకున్నాం.
మా అపార్ట్ మెంట్స్ లో చౌదరి ఒక్కడే అమెరికా వెళ్ళి వాళ్ళ కొడుకు దగ్గర ఆరునెలలు ఉండివచ్చాడు. వెంటనే అందరం చౌదరిని ముందుకు తోశాం.
"నేను చూశాను మేడమ్! ఆర్నెల్లు అమెరికాలో ఉన్నా కదా!"
"అయితే వీళ్ళందరికీ చెప్పండి! అక్కడి పిల్లలెలా డిజిప్లిన్డ్ గా ఉంటారో-"
"అస్సలు ఏడవరయ్యా అక్కడి పిల్లలు- ఒక్క పిల్లడు కూడా ఏడుస్తూండగా నేను చూళ్ళే-" మాతో చెప్పాడు చౌదరి.
"ఎవరైనా గిల్లినా కూడా ఏడవరా?" బోసుబాబు ఆశ్చర్యంగా అడిగాడు.
"గిల్లు, కొట్టు, వాతలు పెట్టు! కిక్కురుమంటే ఒట్టు-" కావాలని రెచ్చిపోయి అబద్దాలు చెప్పాడతను. చెప్పాక అదంతా కేవలం ప్రిన్సిపాల్ ని బుట్టలో వేసుకోడానికి అలా చెప్తున్నట్లు మాకు కన్నుకొట్టాడు.
"అబ్బ! అమెరికా వాళ్ళ డిజిప్లినే డిజిప్లిన్" అన్నాడు శంకరమూర్తి ప్రిన్సిపాల్ ని ఆనందపర్చడానికి.
"అదే నేనూ చెప్పేది, ప్రతి ఇంటినుంచీ ఒకళ్ళు అమెరికాలో ఉంటున్నారీ రోజుల్లో. అయినా గానీ వాళ్ళ పద్ధతులేమీ నేర్చుకోవటం చేతకాదు- ఇదిగో ఈ ఉయ్యాల్లో బాబుని చూడండి! గిల్లినా ఏడవరు!"
"అహా! ఎంత గొప్పబాబు మేడమ్- ఒకసారి ముద్దు పెట్టుకోవచ్చా?"
"ఓ.కే. - జాగ్రత్తగా ఎంగిలి అంటకుండా ముద్దుపెట్టుకోవాలి!"
అందరం బాబుని ముద్దు పెట్టుకున్నాం.
"అసలు మా పాపను చూస్తే ఇంకా ఆశ్చర్యపోతారు. ఒకసారి మెట్లమీద నుంచి కిందపడిపోయింది! అయినా నేను నేర్పించిన డిజిప్లిన్ ఎంత గొప్పదంటే కిక్కురుమంటే ఒట్టు-" అంది ప్రిన్సిపాల్ ఇంకా గొప్పగా!
"అబ్బ! ఎంత గ్రేట్ మేడమ్- మీ పాపను ఒకసారి పిలుస్తారా?"
"ఎందుకు?"
"ముద్దు పెట్టుకుంటా" అన్నాడు విజయ్ యాదవ్.
ఆ డైలాగ్ తో ప్రిన్సిపాల్ అదిరిపడి కోపం లేచి నిలబడింది.
"వాట్ నాన్సెన్స్ యూ ఆర్ స్పీకింగ్? నీకేమయినా కల్చరుందా? కామన్ సెన్సుందా?" అంటూ ఎటాక్ చేసేసరికి మేమంతా కంగారు పడిపోయాం.
"ఏం జరిగింది మేడమ్- మేమందరం కూడా మీ పాపను ముద్దు పెట్టుకోవాలన్నంత ముచ్చటగా ఉంది. అందులో తప్పేముంది?"
"లేకపోవటమేంటి? మా పాపకు పెళ్ళయ్యింది- ఇద్దరు పాపలున్నారు- ఆమెని ముద్దు పెట్టుకుంటానంటారా?"
వెంటనే అందరం విజయ్ యాదవ్ ని నాలుగు తిట్టాం.
"మీకేం బుద్ధున్నయ్? ఎవర్ని పడితే వాళ్ళను ముద్దు పెట్టుకోవటమేనా ఇక? ఎవరి ఏజ్ ఎంతో తెలుసుకుని మాట్లాడటం నేర్చుకోండి!" అంటూ కావాలని మమ్మల్నందర్నీ కూడా నాలుగు దులిపాడు హమీద్ మియా.
"ఈ మగాళ్ళకిదో రోగం మేడం! ఆడదంటే చాలు! అన్నీ వెధవ్వేషాలేయాలని చూస్తారు"అంది షైనీ.
ప్రిన్సిపాల్ శాంతించింది.
"ఓ.కే. ఓ.కే. సర్! మీ అపార్ట్ మెంట్స్ లో 78 మంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు కదా! ఆ పిల్లలందర్నీ మా స్కూల్లోనే చేర్పిస్తానని ఎగ్రిమెంట్ చేస్తున్నారు కాబట్టి ఈ పాపాయికి అడ్మిషన్ ఇస్తున్నాను" అంటూ అప్లికేషన్ ఫారం తీసుకొని బోసుబాబు కిచ్చింది ఫిలప్ చేయమని. బోస్ ఆనందంగా ఫిలప్ చేసి ఇచ్చేశాడు.
ఆ ఫామ్ చూస్తూనే కెవ్వున కేక వేసిందామె. ఆ కేకకు మొహిందర్ సింగ్ ఏం జరిగిందోనని హడలిపోయి బయటకు పరుగెత్తాడు.
"వాట్? మీ అబ్బాయికి పది నెలలా? టెన్ మంత్? ఇంత ఓవరేజ్ పిల్లాడిని ఇప్పుడు అడ్మిట్ చేయడానికి తీసుకొచ్చారా?"
బోసుబాబు ఆమె కాళ్ళమీద పడ్డాడు.
"పొరపాటయిపోయింది మేడమ్- ఇలా ఆరు నెలల్లోనే ఉగ్గూ ఉంగా స్కూల్లో చేర్పించాలని మాకు తెలీలేదు-"
"అవును మేడమ్- బోసుబాబు కొంచెం అమాయికం టైప్! అందుకే చుట్టూ ఉన్న ఇళ్ళల్లో పిల్లల్ని ఆరో నెలలోనే స్కూల్లో చేర్పిస్తున్నారన్న విషయం కనిపెట్టలేకపోయాడు-" అన్నాడు విజయ్ యాదవ్.
"సరే, మీ ఆయనంటే అమాయకుడు! నోట్లో వేలు పెట్టినా కొరకలేడని అంటున్నారు. మరి నీ సంగతేంటయ్యా? ఒక తల్లిగా నీ బాధ్యత నీకు తెలీదా?" బోసుబాబు భార్య మీద మండిపడింది- ప్రిన్సిపాల్.
"మా పిల్లల్ని రెండో ఏట స్కూల్లో చేర్పించాం మేడమ్. ఇంకా అదే పద్దతి ఉందనుకుంటున్నాను- పాపిష్టిదాన్ని" అంది బోసుబాబు భార్య.
"మీరు ఎలాగోలా హెల్ప్ చేయాలి మేడమ్! పొరపాటు జరిగిపోయింది" అన్నాడు చౌదరి.
"అదీగాక మూడు నెలల వయసే కదా ఎక్కువయింది! మీరు తల్చుకుంటే మూడు నెలలు ఎడ్జస్ట్ చేయటం కష్టమేం కాదు మేడమ్!" అన్నాడు శంకరమూర్తి.
దాంతో శంకరమూర్తి మీద గయ్ మంటూ లేచింది ప్రిన్సిపాల్.
