అసలు ఆమె విష్ణు మందిరంలో నుంచి తీసుకు వచ్చింది ఏమిటో? ఆ సంచిలో ఏమున్నదో!
తను ఉదయం నుంచి లోనికి వెళ్ళే వాళ్ళందరిని గమనిస్తూనే వున్నాడు ఎవరూ లోనికి అలాంటి సంచితో వెళ్ళలేదు.
మరి ఆ సంచి .......ఎలా వచ్చింది? అంటే ఆమె లోపల నుంచి ఏదో తస్కరించుకుని బయటకు వచ్చింది అనేది పచ్చి నిజం! సంచి నిండుగా వున్నదన్న విషయం నిజం , అదేమిటి?
అదేమిటో తెలియాలంటే విష్ణుని సందర్శించవలసిందే......
ఆలోచనలన్నీ ఒక కొలిక్కి వచ్చినట్టు జీప్ ను వెనక్కు తిప్పాడు ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్.
సరిగ్గా ఇదే సమయానికి పక్క వీధిలో రిక్షాలో వెళుతున్నది మినీ స్కర్టు యువతి. ఆమె కళ్ళ ముందు విష్ణు మందిరంలోనుంచి తెచ్చిన సంచి వున్నది. ఆమె కళ్ళు దానిమీదే వున్నాయి.
ఆమె ఎవరో కాదు.......మిస్ రీటా!
* * * *
పోలీసు జీపు ఆగడంతో విష్ణు మందిరంలోని అనుచరగణం వింతగా చూశారు. అయితే అక్కడకు పోలీసు అధికారులు రావడము వింతేమీ కాదు. కానీ ఇప్పుడు వస్తున్న యూనిఫారమ్ లో వున్న ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్ , అతని సిబ్బందిని చూడగానే ఆశ్చర్యంతో తలమునకలై పోయారు.
"ఇన్ స్పెక్టర్ ఒక్క క్షణం ఆగండి" ఒక శిష్యుడు కంగారుగా అడ్డు వచ్చాడు.
విష్ణు శిష్యులు, శిష్యురాండ్రాతో పాటు అతని దర్శనార్ధం వచ్చిన భక్తులు కూడా ఆలోచనలో పడ్డారు. వినయ్ కుమార్ ఆగి ఏమిటన్నట్టు అతనివైపు చూశాడు.
"విష్ణుగారి దర్శనం కోసం వచ్చారా?"
"అవును"
"షూ విప్పి లోపలకు వెళ్ళండి సర్.....ఈ ప్రదేశం పవిత్రమయినదే కాదు.........దేవుని నివాసం కూడాను..."
"ఆఫ్ కోర్స్....నేను వెళుతున్నది మొక్కుబడులు చేల్లించుకోవడానికి కాదు.'
"మీరు ఎందుకు వచ్చారో ....ఎందుకు వెళుతున్నారో నేను అడగటము లేదు. ఇక్కడ వున్న నియమ నిబంధనలు, ఆచారాలను పాటించమంటున్నాను. లేదంటే " అంటూ అర్దోక్తిలో ఆగిపోయాడతను.
"ఊ......లేదంటే" కోపంతో రెట్టించాడు వినయ్ కుమార్.
"విశ్నుగారి దర్శనం మీకు లభ్యం కాదు" స్పష్టంగా అన్నాడు శుష్యుడు.
ఏమనుకున్నాడో ఏమో వినయ్ కుమార్ తనను తాను నిగ్రహించుకున్నాడు. కేవలం షూస్ విప్పి వెళ్ళమన్నందుకు అతనిపై ఆగ్రహం చూపడం అనవసరం అనిపించి షూస్ తీసి అక్కడే వుంచి లోపలకు దారి తీశాడు.
ఒక శిష్యుడు వెళ్ళి విష్ణుగారి అనుమతి తీసుకుని వినయ్ కుమార్ ని వెంటబెట్టుకుని తీసుకువెళ్ళాడు.
అక్కడ పద్మాసనంలో జింక చర్మంపై ఆసీనుడై వున్నాడు విష్ణు.
"దీర్ఘాయుష్మాన్ భవ చిరంజీవి.......మీ కోసమే ఎదురుచూస్తున్నాను" వినయ్ కుమార్ ను చూడగానే విష్ణు గంభీరమయిన కంఠం వినిపించింది.
"నాకోసమా?"
ఆశ్చర్యపోయాడు వినయ కుమార్.
'అవును......మీరు ఏం పనిమీద వచ్చారో నాకు తెలుసు" అన్నారాయన.
విష్ణు వైపు వింతగా చూశాడు ఇన్ స్పెక్టర్ వినయ్.
'అవును నాయనా ......మీరు అనుమానిస్తున్నట్టు నా మందిరంలో ఏ విలువయిన వస్తువూ పోలేదు" సర్వం గ్రహించగల మహిమ గల యోగి పుంగవునిలా చెప్పాడాయన.
"మీ మందిరంలో నుంచి ఒక యువతి సంచితో పారిపోవడం నా కళ్ళారా చూశాను" ఏమనాలో తోచక అన్నాడు ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్.
"మీరు పొరబడుతున్నారు ఇన్ స్పెక్టర్....ఇక్కడ ఏ సంపదనూ ఏ అడదొంగ తస్కరించుకు వెళ్ళలేదు అంటున్నాను గదా....." స్థిరంగా అన్నాడు విష్ణు.
"లేదు......మీరు .......మీరు" అబద్దమాడుతున్నారని అనలేకపోయాడు.
"ఇన్ స్పెక్టర్ మీ బాధ్యత ప్రకారం మీరు వచ్చారు. మీ అనుమానము చెప్పారు. నా సమాధానం మీకు సంతృప్తికలిగించనట్టుగా లేదు. ఇంతవరకు మీలా సాహసించి నా మందిరంలోకి వచ్చిన వారెవరూ లేరు, తొలిసారిగా వచ్చిందీ, నన్ను నిలదీసి ప్రశ్నిస్తున్నదీ మీరే కావచ్చు, అయినా నేను మీరడిగిన ప్రశ్నలకు సౌమ్యంగానే జవాబులు చెబుతున్నాను. అబద్దమాడవలసిన అవసరం నాకు లేదని మీరు గ్రహించండి ఇక్కడి నుంచి ఏ సంపదనూ ఎవ్వరూ దొంగలించలేదు.
నేనేమిటో నన్ను ఆరాధించే భక్తులందరకూ తెలుసు. సర్వసంగపరిత్యాగినైన నాకు ఇహ భోగాల మీద మక్కువ లేదు.
నన్ను నమ్ముకున్న అనంత భక్తకోటికి శారీరకంగా, మానసికంగా శాంతి ప్రశాంతులను అందించాలని నా ఆకాంక్ష. అందుకే ఈమందిరంలో అందరికి అందుబాటులో వుంటున్నాను. నా శేషజీవితాన్ని వీళ్ళ సమక్షంలో గడపాలని నిశ్చయించుకున్నాను. నేనేదో విలాసవంతమయిన జీవితం కోసం భక్తులు యిచ్చే విరాళాలు, కానుకలు పోగుచేసుకుంటున్నానని ఎవరయినా భ్రమించి దొంగతనానికి పాల్పడి వుంటే వుండవచ్చు. ఈ సంపదంతా భక్తులదే కాబట్టి తిరిగి వాళ్ళకే ఉపయోగపడినప్పుడు అంత కన్నా కావలిసింది ఏముంటుంది? భక్తులు హుండీలోవేసే ప్రతి రూపాయి తిరిగి ఆ భక్తుల నిమిత్తమే ఉపయోగపడుతుంది, కానీ నేనుగా ఆ సొమ్మును తాకను కాక తాకను కూడాను" క్రమబద్దంగా , లయబద్దంగా చెప్పుకుపోతున్నాడు విష్ణు.
ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్ నోటమాట పెగలడం లేదు.
ఎవరో ఒక యువతి బరువయిన సంచితో వెళ్ళడం చూశాడు కానీ ఈయనగారేమో ఏమీ పోలేదంటున్నాడాయే! ఏది నిజం........తన కళ్ళు తనను మోసం చేయవు. తను పొరపడలేదంటే విష్ణు మాటలలోనే ఏదో మెలిక వున్నది అనేది స్పష్టమావుతూనే వున్నది.
అయన అన్నట్లు అన్నీ విసర్జించి సాధు జీవనానికి అలవాటుపడిన వ్యక్తీ. డబ్బు, దస్కంతో, నగ నట్రాతో ఏం అవసరం లేదు.
కాని అతడెందుకో ఆ దొంగను కావాలనే సమర్దిస్తున్నాడు.
అదేదో తెలియాలంటే ఆ యువతి ఎవరో తెలుసుకోవాలి. ఏం తస్కరించుకు వెళ్ళిందో తెలియాలి. విష్ణు మాటలలోని గూడార్ధం అప్పుడు తెలుస్తుంది.
నగరంలో ఈ మధ్య కాలంలో చీటింగ్, దొంగతనాలు అధిక మయ్యాయి. ఈ దొంగతనం చేసింది ఆమె అయివున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ ఆలోచనతో అప్పటికప్పుడే ఒక నిర్ణయానికి వచ్చి మౌనంగా వెనుదిరిగాడు ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్.
