ఈ ఆలోచన బాగానే ఉన్నట్టనిపించింది కిన్నేరకు.
తెల్లవారేదాకా ఈ ఉహా సరైనదే అనిపించినా తెల్లారేక కిన్నెర మనసు మారిపోయింది.
తను వెళ్తానన్నా మంగతో అంది కిన్నెర నిర్లక్ష్యంగా--"ఎంత మందినో ఆకట్టుకోగల సౌందర్యం నాదైనా నన్ను గెలవటం ఏ మగాడికి అంత సులభం కాదే పిచ్చి మంగా! నేను కాని నిన్ను లైబ్రరీకి పంపితే ప్రత్యర్ధుల ముందు నేను ఓడినట్టవుతుంది కాబట్టి, ఈరోజు నేనే వెళతాను."
ఇక్కడ ప్రత్యర్ధి అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చింది మంగకు మాత్రమే కాదు, కిన్నేరకు తెలిదు.
కొన్ని సంఘటనలు చాలా చిన్నవి కావచ్చు కాని, ఒక్కోమారు అవే అసాధారణమైన మలుపులకు కారణమవుతుంటాయి.
బాహ్య ప్రపంచానికి తెలీకుండా అహం పొదలమాటున అణుచుకుంటున్న కొన్ని ఆలోచనలకు ఆచరణాత్మకమైన శాస్త్రచికిత్సచేయాలని కిన్నెర తొందరపడితే అది ఆమె తప్పు కాదు ఆ కవిత సృష్టించ గలిగిన తుఫానుది.
* * * *
"మంగా!"
ఈరోజు సాయంకాలం కూడా కిన్నెర నిన్నటి స్థాయిలోనే కేక పెట్టింది....'మోహనవంశీ' నవలను అందోళనగా చూస్తూ.
మంగ చాలా వేగంగా లోపలికి వచ్చి చూసింది. నిన్నటి లాంటి ఆర్టు పేపరే. ఈరోజు మరో కవిత రాసి వుంది.
"కోర్కెల్ని కుత్తుక చెరసాలలో నిర్భందించి ఆహామనే విద్యుత్కవచాన్ని ఒంటికి చుట్టుకుంటే నా ప్రేమ సందేశ పదకోశం నీదాకా ఎలా చేరగలను నేస్తం?
మంచు పొరలా ఉన్న మగతను విదిలించుకొని నా కోసం వెదికితే.
తొలి పొద్దులోనూ, మలి సంధ్యలోనూ నేను కనిపిస్తాను.
ముందు నీలో పాతుకుపోయిన మౌనంలా అనిపించినా విజ్ఞానకోశపు దీపాన్ని నువ్వు వెలిగించి గాలిస్తే......నీ యవ్వనపు పూదోటలో ఇంకా రాలని నీ నవ్వుల సుమాల్ని ఏరుకునే పిచ్చి పిల్లాడిలా దర్శనమిస్తాను.
'కల' వరమైతే మన ప్రేమ కధకు శేషాన్ని అవుతాను. కలవర పాటైతే ఓ అవశేషంగా నేలరాలిపోతాను!!"
మంగ ఒకసారి కాదు, రెండు మూడు సార్లు చదువుతూ అక్కడికి తన యవ్వనాన్నే ఎవరో వర్ణిస్తున్నట్టు పులకించి పోతుంటే కోపంగా అరిచింది కిన్నెర "చూశావుగా?"
మంగ ఇంకా తేరుకోలేదు.
"ఈ రోజు నవలలో ఉంది కాగితం......"
"బాగుంది కాబట్టి ఇంటి దాకా తీసుకొచ్చారా?" స్వప్నంలోలా అడిగింది మంగ.
"ఏమిటే.....నువ్వనే దేమిటి?"
కిన్నెర కంఠంలోని తీవ్రతని గుర్తించిన మంగ, "అదేనమ్మా......లైబ్రరీలో నవలతోపాటు ఈ కాగితం కనిపించగానే చించేయక ఇంటి దాకా ఎందుకు తీసుకోచ్చామా అని అడుగుతున్నాను" అంది నీళ్ళు నములుతూ.
"నీ బొంద. నీ శ్రాద్దం" కిన్నెర గావుకేకలు పెట్టింది. "లైబ్రరి లోనే ఇలాంటి కాగితాన్ని చూసి ఉంటే పనికట్టుకుని ఇంటికి తీసుకువచ్చే దాన్నా? అక్కడ లేదు. ఇంటి కొచ్చాక పుస్తకంలో కనిపించింది."
"మీరక్కడ సరిగా చూసి ఉండరు.'
"నీ మొహం' గట్టిగా అరిచింది గాని, కిన్నెరకు అనుమానంగానే ఉంది.
తాను నిజంగానే సరిగా చూడలేదా? లేకపోతే చూసినప్పుడు కనిపించని ఈ కవిత ఇప్పుడు పుస్తకం మధ్య ప్రత్యక్షమెలా అయింది?
"ఏది ఏమైనా మీకోవిషయం చెప్పాలి చిన్నమ్మాయిగారూ!" వయసులో రెండు మూడేళ్ళు పెద్దదని గుర్తొచ్చినట్టు చనువుగా అంది మంగ-- "మీ మీద ఉచ్చులు బిగుసుకుంటున్నాయి. ఎవరైనా కాని ఆ అబ్బాయి మీ కోసం పిచ్చివాడవుతున్నాడు."
"ఏడ్చినట్టుంది --అతనెవరో పిచ్చివాడైపొతే నేను అంగీకరిస్తానా?"
"మీరు అబద్దం చెప్పలేదు చిన్నమ్మా!" మరీ ప్రేమ ముంచుకొచ్చేటప్పుడు కిన్నేరని చిన్నమ్మాయిగారూ అనక చిన్నమ్మా అనడం మంగకు అలవాటు. "మొన్నటికి, నిన్నటికి మీలో మార్పు కనిపిస్తే, నిన్న కవితకూ- ఇప్పుడీ కవిత చదివినప్పటికీ ముప్పాతిక మార్పు వచ్చినట్టు అర్ధమైపోయింది."
మేఘ సందేశాల గురించి, పూర్వకాలం పావురాల సందేశాల గురించి కాక, ఇప్పుడు ఆధునికంగా జరిగే లైబ్రరీ సందేశాల గురించి భారీగా మాట్లాడాలనుకుంది కాని, కిన్నెర మోహంలో భావాల్ని చూసి కొద్దిగా అందోళన చెందింది.
దీనికి తగ్గట్టు కిన్నెర కోపంగా అరిచింది కూడా ......."వెళ్ళు బయటికి."
మంగ వెళ్ళింది కాని, కిన్నెర ఆమె మాటల్ని పట్టించుకోకుండా ఉండలేకపోయింది.
ఎలా జరిగిందిది? తను లైబ్రరీలో సరిగా చూసుకోలేదా? లేక ఇక్కడేవరైనా నవల్లో కవిత ఉంచారా?
అంత అవసరం ఎవరికి ఉంటుంది? ఉన్నా ఇంత అద్భుతమైన కవిత ఎవరు రాయగలరని?
"నీ యవ్వనపు పూదోటలో ఇంకా రాలని నవ్వుల సుమాల్ని ఏరుకునే పిచ్చి పిల్లాడిలా దర్శనమిస్తాను.
'కల' వరమైతే మన ప్రేమకధకు శేషాన్ని అవుతాను.
కలవరపాటైతే ఓ అవశేషంగా నేల రాలిపోతాను."
ఇందాకట్నుంచి ఈ వాక్యాలు కంటస్థం చేసినట్టు పదే పదే మనస్సు గోడల్ని తాకుతూ ప్రతిధ్వనిస్తుంటే ఎంత పులకింతగా వుందని!
ఛఛ.....పులకింతేమిటి?
