Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 104


    "సుబ్బరామయ్యగారికి మించిన చెయ్యిలేదు. సివిల్ దావాల్లో ఆయన్ని మించినవాడు మన రాష్ట్రంలోనే లేడు." గ్లాసు అందుకొని సోడాపోసి కలుపుతూ అన్నాడు గోపాల్రావు.
    "ఆయన చెప్పిందాన్ని పట్టి చూస్తే నాకు అంత నమ్మకం కలగటంలా మరి??" తన గ్లాసులో మరికొంచెం సోడా కలుపుకొంటూ అన్నది.
    "అరెరే అంత సోడా పోస్తావేం? డైల్యూట్ అయితే మజా ఏం ఉంటుంది?"
    "నాకు స్ట్రాంగ్ అవదూ? గుండె అసలే బలహీనం" అన్నది వరూధిని.
    అసలు తనకు జబ్బు ఏమిటా అన్న ఆలోచన వచ్చింది వరూథినికి. మొదట్లో భర్త కొట్టినప్పుడు - పల్లెటూరికి మూటాముల్లేకట్టమన్నప్పుడు తనకు గుండెనొప్పి అని ఊహించింది. కావాలనే భర్తతో బొంకింది. భుజంగరావు పరీక్ష చేసి అదోలా నవ్వాడు ఆరోజు! రామనాథబాబు ఉండబట్టి సరిపోయింది. లేకపోతే ఆ డాక్టరు ఎంతమాట అనేవాడో మరి? ఆ రోజు భర్త లేవకముందే రామనాథబాబు దగ్గిరకెళ్ళింది. అప్పుడు రామనాథబాబు తనను ఎంత తమాషా చేశాడు? ఎన్ని గిలిగింతలు పెట్టాడు? నవ్వించి కవ్వించాడు ....
    "నిన్ను మళ్ళీ ఆ పల్లెటూరికి పంపించకుండా ఆపలేనంటావా? అదెంత పని? నిన్నే ఏం ఖర్మ! నీ భర్త వెంకటపతినే ఈ టౌన్ కు కట్టిపడెయ్యలేనూ? అది నువ్వు కావాలంటేనే సుమా? నీకిష్టమయి ఇక్కడ కాపరం ఎత్తేసి, మీ ఊరి కెల్తానంటే నేనేం బలవంతం చెయ్యను."
    అని అతడన్నప్పుడు తనకెంత కోపం వచ్చింది? మళ్ళీ ఎంతలో నవ్వించాడు? ఆ రాత్రిభర్త కొట్టిన దెబ్బలూ, అవమానం క్షణాలమీద మరిపించి మురిపించలా? అయస్కాంతంలాంటి అతన్ని వదిలి తను ఎలా ఉండగలదు?...
    "మీరు ఆలోచించే పనేం లేదు. ఆయన మాట తీరే అంత? ఆయన తరహాయే అంత. గెలుస్తాం. గెలుస్తాం అని మాయమాటలు చెప్పి అయినకాడికి డబ్బు గుంజి, తీరా కేసు హియరింగ్ కు వచ్చేసరికి జూనియర్ గాళ్ళను కోర్టుకు పంపి, 'వాడేళ్ళబట్టి పోయింది, నేను వెళ్తే తప్పక గెలిచేవాళ్ళం - సుప్రీంకోర్టుకు అపీలు చేద్దాం, ఇక్కడ వాళ్ళంతా...' అంటూ అంకచెండాలం చెత్తంతా వాగి, మళ్ళీ డబ్బు గుంజే చౌదరిలాంటి వాడనుకొనేవ్ మన లాయరు సుబ్బరామయ్యగారంటే" గోపాల్రావు నాలుగు గుక్కలేసి, ఏకబిగువున మాట్లాడి, ఏక వచన ప్రయోగందాకా వచ్చి వరూధిని కళ్ళల్లోకి మత్తుగా చూశాడు.
    అప్పటికిగాని రామనాథబాబు గురించిన ఆలోచనలు వరూధిని బుర్రలో ఆగిపోలేదు.
    "అయితే ఎంత ఫీజు తీసుకొంటాడూ?" గ్లాసు దించి అడిగింది.
    "ఫీజా? ఇట్లాంటి కేసులో ఆయనకో పద్దతి ఉంది. కేసు గెలిస్తే అందులో సగం వాటా ఆయన కివ్వాలి! ఈ లోపల దమ్మిడీ ముట్టుకోడు. స్టాంపు ఖర్చులు మాత్రం మనం పెట్టుకుంటే చాలు."
    వరూథినికి గుండె గొంతులోకి ఎగబాకి అడ్డం పడ్డట్టయింది! అంతకు ముందు తాగిన విస్కీ నిషా దిగిపోయింది.
    తనకు నిజంగానే గుండెపోటు వుంది! లేకపోతే ఇంత బాధేమిటి? కొద్ది క్షణాలు కళ్ళు మూసుకొని తెప్పరిల్లింది.
    "ఏమిటప్పుడే కళ్ళు మూస్తున్నావ్? రోజూ అరబాటిల్ అయినా మనిషవి తొణికేదానివి కాదే?"
    "అదికాదు. ఆస్తిలో సగం ఆయన కివ్వడం ఏమిటి? ఐదులక్షల ఆస్తి!"
    "ఐదు లక్షలవనీ పదవనీ! ఇప్పుడది నీదికాదు. శ్యామలాంబది. అందులో ఇప్పుడు నీకు దమ్మిడీ లేదు. గెలిస్తే రెండున్నర లక్షల ఆస్తి నీకు ఊరికినే వచ్చినట్టు!"
    గోపాల్రావు తర్కం అర్ధం చేసుకోవటానికి ప్రయత్నిస్తుంటే, నాలుగు పెగ్గుల విస్కీ తాగినంత నిషా ఎక్కి తల తిరిగిపోయింది వరూథినికి.
    "నువ్వేం ఆలోచించవద్దు. నామాట విను. కోర్టు ఖర్చులూ, స్టాంపు ఖర్చులూ నేను పెట్టుకొంటా. నువ్వొట్టి సంతకాలు నాలుగు పడేసి కూర్చో నేను తిప్పుతా చక్రం. అ రామనాథబాబుగాడి పని నేను చెప్తాగా?" అంటూండగానే ఫోన్ మోగింది.
    వరూధిని ఫోన్ ఎత్తి  "మీకే?" అంటూ రిసీవర్ అందించింది.
    "ఫామిలీ వచ్చారా? ఇంత ఆలస్యం అయిందేం? బెజవాడలో ఎప్పుడు బైలుదేరారు? ఆఁ! ఎప్పుడూ? ఎక్కడా?" గోపాల్రావు ముఖం ముందు నల్లబడింది. మెల్లగా షాక్ తట్టుకొని తేరుకొన్నాడు.
    "ఏం జరిగిందీ?" వరూధిని ఖంగారుపడుతూ అడిగింది.
    "జగ్గయ్యపేట దాటింతర్వాత కారాపి మనిషిని పొడిచేశారట."
    "ఎవర్నీ?" ఆ ప్రశ్న ఆమె గుండెల్ని చీల్చుకొని వచ్చింది.
    "ఎవర్నో తెలియలేదు. ఎంబాసిడర్ కారు. నంబరూ - ఆ 2434 అట! మన వైపు నుంచే హైదరాబాద్ వస్తున్నదట. మన కారుముందే ఉందట ఆ బండి. మన డ్రైవర్ అది చూసి కారు వెనక్కి తిప్పి జగ్గయ్యపేట పోయి పోలీస్ స్టేషన్ లో  చెప్పాడట." గోపాలరావు చెప్పుకు పోతూనే ఉన్నాడు.
    వరూధిని తన గ్లాసు ఖాళీచేసి మళ్ళీ గ్లాసు నింపుకొని సోడా పోసుకోకుండా రెండు గుక్కలు వేసింది! ఆమె కళ్ళు నిప్పుకణాల్లో మండుతున్నాయి! చంపలు విద్యుత్ కాంతిని తిప్పికొడ్తున్నాయి?
    గోపాలరావుకు వరూధినిలో ఎప్పుడూ చూడని అందం కన్పించింది. ఆ అందం కవ్వించింది.
    "నీట్ గా తాగుతున్నావ్? లే! పడిపోతావ్. పడుకో!" అంటూ గోపాలరావు ఆమె చేతిని పట్టుకొన్నాడు.
    వరూధిని గోపాల్రావు చేతిని విసిరికొట్టింది.
    ముందున్న వేట్ 69 బాటిల్ ఎగిరి కిందపడింది!
    "పగిలిపోయింది! అంతా పోయింది!" వరూధిని తెలిసి అంటున్నట్టు అనిపించలేదు గోపాలరావుకు.
    "పోతే పోయిందిలే! లే! నువ్వు రెస్టు తీసుకో."
    "నా కింకా రెండు... రెండు బాటిల్స్ కావాలి. తెప్పించు!"
    "ఇంకా ఎందుకు? ఇప్పటికే?" ఆమె కళ్ళల్లోకి చూశాడు.
    "ప్లీజ్! తెప్పించండి. మీకు పుణ్యముంటుంది. మీరు చెప్పినట్టు చేస్తాను. సుబ్బరామయ్యకే  కేసు ఇస్తాను. ఇప్పుడే సంతకాలు పెడ్తా. కాగితాలు తెప్పించండి."
    "ముందే ఆయనకు రాసివ్వకూడదు. గెలిచిన తర్వాత ఇంకో పద్దతిలో ఇవ్వాలి. అంతవరకూ హామీగా నాకు రాసివ్వాలి. ఈమాట ఆయనే చెప్పాడు ... నాతో మాట్లాడమని."
    "వరూథినీ పిక్చర్ ప్యాలెస్ అంతా రాసిస్తాను. కావాలంటే ఇప్పుడే రాయించుకో. కాని ముందు తెప్పించు.... నా.... గుండె పగిలిపోయింది."
    "పగిలింది బాటిలే వరూథినీ!"
    "రక్తం కారిపోతోంది!"
    "కాదు వాట్ 69 విస్కీ! నువ్వు తాగి మాట్లాడుతున్నావ్."
    "నువ్వు తాక్కుండా మాట్లాడొద్దు! నువ్వూ తాగు."
    గోపాలరావు ఓ క్షణం ఆలోచించి 'బోయ్'ని పిల్చి చెప్పాడు.
    ఒక వేట్ 69 బాటిలూ, ఒక బ్రాందీ బాటిలూ తెచ్చి ముందు పెట్టాడు బాయ్.
    "ఎందుకు మార్చి తెప్పించావ్? ఒకటదీ ఒకటిదీ?" అన్నది వరూథిని.
    "ఒకటే వుందట 69 అందుకే రెండోది...."
    గోపాలరావ్ వేట్ 69 బాటిల్ తీసి గ్లాసులో పోశాడు. వరూధిని గ్లాసు ఎత్తింది.
    "ఉండుండు! సోడా !" అన్నాడు సోడా కార్క్ తీస్తూ.
    వరూధిని తాగేసింది! గ్లాసు కిందకు వదలింది! గ్లాసు పగిలింది!
    పగిలిన గాజుముక్కల్ని చూస్తూ వెక్కి వెక్కి ఏడ్చింది వరూధిని.
    "హాల్లో సగం పోతుందని బాధపడుతున్నావ్ కదూ?"
    "కాదు నాలో సగం.... సగం పోయింది." ఎక్కడో చూస్తూ కుమిలిపోతూ అన్నది వరూధిని.
    "నీ కెందుకూ? ఆ హాలు గొడవా? గెలిస్తే గెలుస్తాం. లేకపోతే లేదు. న్యూ వరూథినీ పిక్చర్ ప్యాలెస్ ఒకటి ఆరునెలల్లో కట్టిద్దాం. ఆ రామనాథబాబుగాడి ముఖం మీద కొట్టినట్టు! లే మరి? ఊఁ?" అంటూ గోపాలరావు వరూథిన్ని లేవదీసి పక్కమీద పడుకోబెట్టటానికి ప్రయత్నించాడు.
    వరూథిని కళ్ళు మూతలు పడిపోతున్నాయి. తోటకూరకాడలా మనిషి జారిపోతోంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS