"సర్లే! ఆయన్ను పిలువు!"
"లేరమ్మా! ఇప్పుడే ఫ్యాక్టరీకి పోయారు. ఫోనా? ఉంది. వేసుకోండి... ఐదూ - ఏడూ - మూడూ -మూడూ - మళ్ళీ ఏడూ -"
వరూథిని నంబరు నోట్ చేసుకుని రిసీవర్ ఎత్తి నంబరు తిప్పింది.
"హల్లో! గోపాల్రావ్, హియర్!"
"నేనండి! వరూథిని!" వరూధిని హృదయం పొంగింది.
"ఆఁ. ఎవరూ? ఓహో! మీరా? ఎప్పుడొచ్చారూ?"
"మొన్నరాత్రి."
"మొన్నరాత్రా? మరయితే.... ఓహో మీరేన్నమాట. మొన్నా నిన్నా కూడా ఫోన్ చేసింది. వెధవ మీరని చెప్పలేదే? ఏదో కీచకా బోచకా అన్నాడు"
"వాడు తప్ప మరొకడు దొరకలేదా ఏం మీకు?"
"నమ్మకస్తుడు. పిచ్చాడు. మా ఊరినుంచి తీసుకొచ్చా. ఇంతకూ ఎక్కడున్నారూ? ఏమిటి సంగతీ?"
"క్రీడాభవన్ లో, రూం నంబరు..."
'ఛ! ఛ! ఆ హోటల్లో ఉన్నారా? ఆ హోటల్ కు అంత మంచిపేరు లేదు. వెంటనే మార్చేయండి.'
"ఎక్కడికి మార్చమంటారూ?"
"ఆఁ చూడండీ! మీరు గది ఖాళీచేసి రెడీగా వుండండి. కారు పంపిస్తున్నా."
"మీరు రాకూడదా ఏం?"
"నే చెప్పాగా! ఆ హోటల్ సంగతి! మీరు కార్లో వచ్చేయండి. ఈలోపల న్యూమూన్ హోటల్లో రూం బుక్ చేస్తా. ఓ.కే! ఉంటామరి!" గోపాలరావు ఫోన్ పెట్టేశాడు.
వరూధిని న్యూమూన్ హోటల్ చేరేసరికి గోపాల్రావు పోర్టికో మెట్లమీద నిలబడి వున్నాడు.
డ్రైవర్ కారాపి దిగి, వెనక్కు పరుగెత్తుకొచ్చి డోర్ తెరిచాడు. వరూథిని కారు దిగింది.
గోపాల్రావు ఎదురెళ్ళి కళ్ళతోనే స్వాగతం పలికాడు. ఆమె పెదవులపైన కదిలిన చిరునవ్వులు కృతజ్ఞతను తెలియజేశాయి.
48
వెంకటపతికి భార్య వెళ్ళాక మొదటి మూడు రోజులూ సర్దాగా ఉంది. భార్య ఇచ్చిన డబ్బంతా మూడురోజుల్లోనే ఖర్చు పెట్టాడు. పొద్దునా సాయంకాలం మస్తుగా తాగి కోడి పలావులు తిన్నాడు. ఎన్నో నెలల తర్వాత దొరికింది. అంత సుఖం. నాలుగో రోజున డబ్బులయిపోయేసరికి, తనే అన్నం వండుకొని పచ్చడీ, పెరుగూ వేసుకొని తిన్నాడు. ఆ రోజంతా ఇంటిపట్టునే ఉన్నాడు.
ఇంట్లో ఉంటే పిచ్చెత్తినట్టయిపోతుంది. బయటికెళ్ళి ఏం చేస్తాడు? చేతిలో చిన్న పైసాలేదు. మూడు రోజులుగా పుష్కలంగా తాగాడు. ఒకరోజు లేకపోయేసరికి పిచ్చెత్తినట్టయింది. ఐదోరోజుకు మనిషి చచ్చుబడిపోయాడు. వళ్ళంతా జలగలుపట్టి పీకినట్లయింది. తెల్లవారి కాఫీనీళ్ళకు కూడా కరవైపోయింది. ఇల్లంతా వెతికాడు. ఎక్కడా ఒక్క రూపాయికూడా దొరకలేదు.
'ఎక్కడ దాస్తుందో! దాని దాపరికమూ అదీ? డబ్బంతా పట్టుకుపోయింది'.
అనుకొంటూ ఇల్లంతా కాలుగాలిన పిల్లిలా తిరిగాడు.
ఈ రోజు తాగకపోతే తను బతకలేడు. కాళ్ళు కుంగదీస్తున్నాయి. తల వాలిపోతోంది. మెడలు నిలవడం లేదు.
పడక గదిలోకి వెళ్ళి బీరువా హాండిల్ గుంజాడు. రాలేదు.
తాళం చెవులు పట్టుకెళ్ళిందా? అలా పట్టుకెళ్ళదే? ఇక్కడే ఎక్కడో దాచి ఉంటుంది.
పరుపుకింద వెతికాడు కన్పించలేదు. మంచం ఎక్కి బీరువా మీద వెతికాడు. కన్పించింది - వెండి బిందె!
వెంకటపతి మరొక ఆలోచన రాలేదు. మరోక్షణం ఆగలేదు. వెండి బిందె పుచ్చుకొని మంచం మీద నుంచి దూకాడు.
మార్వాడీ దుకాణంలో వెండి బిందె అయినకాడికి అమ్మాడు. వాడిచ్చిన మూడొందల పాతిక రూపాయలు తీసుకొని బయటపడ్డాడు. కూల్ డ్రింక్ షాపు సందులోకి వెళ్ళాడు.
అన్నం బదులూ, నీళ్ళబదులూ కూడా నాటుసారా తాగాడు. ఆరు గంటలకు సందులో వున్న గదిలో నుంచి బయటపడ్డాడు. బ్రహ్మాండంగా వుంది! మనసుతో పాటు ఒళ్ళుకూడా గాల్లో తేలిపోతూంది. తోవలో కనబడ్డ హోటల్లో తినగలిగినంత తిన్నాడు. హోటల్లో మెట్లు దిగుతుంటే వెంకటపతికి మెట్లూ రోడ్డూ ఒకే లెవల్లో కన్పించాయి.
రిక్షా పిలిచి మెల్లగా కూర్చున్నాననుకుంటూ ఎగిరి అందులోకి ఎక్కాడు.
"పోనియ్!" అన్నాడు రిక్షావాడ్ని చూడకుండా.
"ఎక్కడికండీ?" అన్నాడు రిక్షావాడు.
"ఎక్కడికయితే నీ కెందుకూ? పోనియ్ మంటూంటే? ఇట్టా పోనియ్!" అంటూ ఎడంచెయ్యి కుడివైపుకు చూపించాడు.
రిక్షావాడు నవ్వాపుకోలేక ముఖం దించుకొని రిక్షా వెంకటపతి చూపించిన రోడ్డుకు మళ్లించాడు.
రిక్షా వేగంగా పోతుంటే చల్లగాలి వెంకటపతి ముఖాన్ని తాకి అతడి మత్తుని కొంత మోసుకొని పోయింది.
"ఆపాపు! ఇంకా పోతావేం? మా హాలొచ్చేసిందిగా?" వెంకటపతి మూసినా కళ్ళు తెరుస్తూ అన్నాడు.
"ఇది శ్యామలాథియేటర్ బాబూ?" అన్నాడు రిక్షావాడు. వెంకటపతి తెలిసి మాట్లాడటం లేదని.
"ఇది వరూథిని పిచ్చర్ పాలాస్! తెలిసా? ఎవర్ధనుకొన్నావ్? నాది!" గుండె మీద చెయ్యి కొట్టుకొంటూ "వందెకరాల పొలం! ఎట్టాంటిది పొలం! మొనగాడి పొలం! అమ్మి కట్టాం ఈ హాలు!"
"శ్యామలా అని పేరు మార్చారు గదయ్యా?"
"మళ్ళీ మారుస్తాం! వరూథినీ పిచ్చర్ అని. హైకోర్టే వచ్చి మార్పిస్తది. కింద కోర్టులో దగా చేశారు."
"కథానాయక ఆడుతోంది! ఎల్తారా?"
"ఆడనియ్! ఆడనియ్! శ్యామల్నే ఆడనియ్!"
"శ్యామల కాదు... శ్యామల్లో కథానాయక ఆడుతోందండీ?"
"దేన్నో దాన్ని ఆడనియ్! కతానాకినే ఆడనియ్! నువ్వు రిక్షా ఆపావా?"
"మీరే దిగాలి రిక్షా ఆగేవుంది."
వెంకటపతి రిక్షా దిగుతూ తూలి రిక్షా పట్టుకొని నిలబడ్డాడు. రూపాయి రిక్షావాడి కిచ్చి నీ కెంత రావాల అంత తీసుకో!" అన్నాడు ఎప్పుడో తప్ప రిక్షా ఎక్కని వెంకటపతి.
టికెట్ కొనకుండానే హాల్లోకి వెళ్ళి కూర్చున్నాడు వెంకటపతి. గేట్లో వాడు చూసీ చూడనట్టు ఊరుకొన్నాడు.
సినిమా చూస్తున్న వెంకటపతికి మొదటి మూడురీళ్ళూ గజిబిజిగా వుంది. తర్వాత కథలో పట్టు దొరికింది.
కథానాయికలో సగం వరూధినీ.....వరూధినిలో సగం కథానాయక కన్పించారు వెంకటపతికి. వరూథిని కథ కథానాయకి కథగానో, కథానాయకి కథ వరూథిని కథగానో, నడిచి కథ ముగిసినట్టుందేగాని స్పష్టంగా తెలియలేదు వెంకటపతికి.
సినిమా అయిపోయింది. జనంలోపడి తోసుకొంటూ వెంకటపతి రోడ్డెక్కాడు.
ఆకలి ఒకటే ఆకలి. మనిషి కరకరలాడిపోతూ మిలటరీ హోటల్ కు నడిచాడు. మీల్స్ టికెట్ కొనడానికి కౌంటరు దగ్గిర నిలబడి జేబులోకి చేయి పోనిచ్చాడు వెంకటపతి. జేబులోకిపోయిన చెయ్యి చాలాసేపటి వరకు బయటికి తిరిగి రాలేదు.
"కొట్టేశారు! డబ్బు కొట్టేశారు!" వెంకటపతి మత్తు పూర్తిగా దిగిపోయింది.
కేకలు పెట్టాడు. పెద్ద పెద్ద అంగాలు వేస్తూ కథానాయక ఆడుతోన్న సినిమాహాలుకేసి పరుగెత్తాడు వరూధిని భర్త -
49
"మన లాయరేమిటి అట్లా మాట్లాడతాడూ?" వేట్ 69 గ్లాసులోకి వంచుతూ అన్నది వరూధిని.

