"నువ్వెళ్ళు! నాకు.... ఇక్కడ.... ఇక్కడ బాధగా వుంది." గుండెమీద చేతులు పెట్టుకొని అన్నది వరూధిని.
"పడుకో ముందు అదే తగ్గిపోతుంది. ఎక్కువగా తాగావ్ లే. అందుకని...."
"ముందు....మీ.....మీ.....రెళ్ళండి.....వె.....వెళ్ళరా?"
వరూధిని తూలి బెడ్ మీద వెల్లికిలా పడిపోయింది!
50
వారం రోజుల్లో వస్తానంది పదిరోజులు దాటింది. అయినా రాలేదు. ఇన్ని రోజులు ఆడేం చేస్తుంది? హైకోర్టుతో పనికదా? అప్పుడే ఎక్కడ తేలుద్ధి? ఉంటే ఉంది. తనకిక్కడ ఎట్టా జరుగుతుందనుకొంది? బొటాబొటిగా ఇచ్చి వెళ్ళింది. అధిచ్చింది మూడురోజులు రాలేదు. ఇవ్వాళో రేపో దిగుద్దేమో?
భార్య వరూథిన్ని గురించి ఆలోచిస్తున్న వెంకటపతికి వెండి బిందె గుర్తొచ్చింది.
వెండిబిందెలోనుంచి, వెండి పళ్ళెమూ, వెండిగ్లాసులూ, కప్పులూ, సాసర్లూ, వెండిగిన్నెలూ, స్పూన్లు దొర్లి వెంకటపతి కళ్ళల్లో మెరిశాయి! వెంకటపతి చెవులు దిబ్బెళ్ళు పడ్డాయి.
సీసాలో అడుగున మిగిలింది గ్లాసులోకి వంచుకున్నాడు. గ్లాసు ఖాళీ చేశాడు. సీసాలో ఇన్ని నీళ్ళుపోశాడు. సీసా బాగాకుదిపి నోటిదగ్గర పెట్టుకొన్నాడు. సీసా అడుగు చేత్తో తడుతూ మెడపైకెత్తి ఆఖరి చుక్కలు చప్పరించాడు.
అది వెళ్ళి పన్నెండా? పదమూడా! సోమవారం సోమవారం సోమవారం ఏడూ!.... ఏడా ఎనిమిదా? మంగళవారం నుంచీ.... ఇవ్వాళేవారం?
వెంకటపతి తల పైకెత్తి ఆలోచించసాగాడు. ఆలోచన ఆగిపోయినా తల మాత్రం కిందకు దించలేదు.
తనే మనుకుంటున్నాడో? ఇదేనెలా? ఎండలు ముదిరిపోయినై. మాగాటి చేలన్నీ నెర్రెలు కొట్టి ఉంటాయి. ఇంక పొలం పనులన్నీ అయిపోయినట్టేగా? జనపకట్టే.... కందికట్టే ఇంటికి చేరివుంటాయ్. ఈ వరదాకా ఎందుకూ? ఎప్పుడో చేరి ఉంటాయ్. కడాలు మోపులు కట్టి వరిగడ్డి తోలే వుండాలి? ఈపాటికి గడ్డి వాములు కూడా పడుండాలి. ఎందుకు పడవూ? సంవత్సరాది పండగ్గూడా వస్తావుంటే? ముసలాయనేం చేస్తున్నాడో? పొలం పనులన్నీ అయిపోయి వుండాలి. పొలం పనులా! ఎక్కడుంది పొలం? అంతా అయిపోయిందిగా? ఏం తిని బతుకుతున్నాడో? దిబ్బుందిగా దిబ్బ? ఆఁ! ఆ దిబ్బలో ఏముంది మట్టి? ఏం పండిస్తావ్ఁ? ఏకత? ఎట్టా బతుకుతున్నాడో ముసలాయన?
గెలుస్తానంటుందిగా హైకోర్టులో? గెలవనియ్? గెలవనియ్? ఆ సినిమా హాలమ్మేసి పొలం కొనుక్కొంటే సరి! మరి అమ్మనిస్తదా? ఇయ్యదియ్యదు! చూస్తా? ఎట్టా అమ్మనియ్యదో? దాని పెత్తనమేంటి? బోడి పెత్తనం? అసలెవడ్ది? దానమ్మ మొగుడ్డా? ఆస్తంతా నాదే? అసలు దాన్ని ఈసారి రానియ్!....
వెంకటపతి సీసాకేసి చూసుకొన్నాడు. తిరగా బోర్లావేసి చూసుకొన్నాడు. "చుక్కలేదు!" నీళ్ళుపోసి కడిగితాగిన సంగతి మరిచిపోయి అనుకొన్నాడు.
రానియ్? వస్తదిగా? ఇంకెన్నాళ్ళు కూర్చుంటదక్కడ? ఎన్నాళ్ళయింది పోయీ? పదమూడు.... పద్ధానుగా? సోమవారం-సోమవారం-ఎనిమిది. ఎనిమిదెనిమిది పదహారు ఆఁ. అదెల్లి పదహారురోజులైందా? పదహారు రోజులపండుగ చేశారా? చేసినట్టున్నారే? ఆహాఁ చెయ్య్ లా! అత్తగారింట్లో వున్న తనను అయ్యలాక్కొచ్చాడుగా? తను ఉందెక్కడా? మూడోరోజునే వచ్చిపడ్డాడుగా తండ్రి? 'లే! లే! రా! రా' అంటూ గిరికీలు కొట్టించి రెక్కపట్టుకొని లాక్కొచ్చాడుగా? అప్పుడు తన ప్రాణం ఎట్టా కొట్టుకులాడింది? ఇంటికొచ్చినా, మనసంతా వరూధిని మీదే ఉంది. ధ్యాసంతా దానిమీదే! దాన్ని చూడంది తన మనసు నిలిచేదికాదు.
ఎన్నాళ్ళయిందీ వరూథిన్ని చూసి? రెండో వారంకూడా అయిపోతాను? రావాలి మరి?
వెంకటపతికి ఐదుగిన్నెల స్టీలు క్యారియరూ, వరూథిని విడిచి వెళ్ళిన జరీ పట్టుచీరా జ్ఞాపకం వచ్చాయి.
రాగానే అవన్నీ చూడదూ? తనను బతకనిస్తుందా? బిందెపోయినప్పుడే అవీ పోయినై అని చెప్పాలి. రెండుసార్లు దొంగలు పడ్డారంటే అసలు నమ్మదు. ఆవలిస్తే పేగులు లెక్కపెడ్తుంది. దొంగలెట్లావచ్చారూ? తాళం పగలగొట్టి ఇంట్లో జొరబడ్డారు అప్పుడు తను ఇంట్లోలేడు. ఎక్కడ కెళ్ళాడూ? బజారు కెళ్ళాడు! ఎందుకూ అని అడిగితే?
వెంకటపతి ఏం చెప్తే బాగుంటుందని ఆలోచించాడు.
"ఏదో ఒహటి చెప్పొచ్చులే!" అని సర్దిచెప్పుకొన్నాడు తనకు తనే.
అతను షరాబు బజార్లోనూ, శారా అంగడి రత్తమ్మకూ అమ్మిన సామాను వేళ్ళు మడిచి లెక్క పెట్టసాగాడు. పదేళ్ళూ అయాక మళ్ళీ ముడిచి తెరిచాడు. వెండిబిందెతో సహా పదమూడు శాల్తీలు తేలినై.
ఇవన్నీ ఎత్తుకు పోయారు దొంగలుపడి! ఇంకా ఏమున్నాయ్ దొంగలెత్తుకు పోయేవి? ఆ ఇప్పుడేం అవసరం?
జేబులో చెయ్యి పెట్టి నోట్లకట్ట తీసి లెక్క పెట్టుకొన్నాడు వెంకటపతి.
ఇంకా రెండొందలపాతిక చిల్లర వుంది. అదీ ఇంకా పదహారు రోజులు రాకపోయినా ఫర్వాలేదు. అసలు వాడెమ్మ... నాయాల.... ఆరోజు సినిమా హాల్లో డబ్బు కొట్టెయ్యకపోతే ఇవన్నీ ఎందుకు అమ్మేవాడు? ఆ డబ్బే ఇంకా ఉండేది. అసలు బిందె అమ్మినప్పుడు వరూథినికి ఏం చెప్పాలా అన్న ఆలోచనే రాలేదు.
"డబ్బు లేకపోతే ఏం చెయ్యమంటావేం? చావమంటావా?" అని అడగాలనుకొన్నాడు. మళ్ళీ ఏది అమ్ముదామా అని ఆలోచన వచ్చి, అన్నీ వెతికేప్పుడే ఈ 'దొంగలు' ఆలోచన తట్టింది. వెండి బిందె అమ్మినప్పుడున్న భయం తర్వాత వస్తువులు అమ్మినప్పుడు లేదు. ఇప్పుడసలే లేదు. దొంగలు పడ్డారు. ఆఁ అంతే? తనేం చేస్తాడూ దొంగలు పడితే? ఆడది అట్లా ఇల్లొదిలి తిరుగుతుంటే దొంగలు పడరాఏం?
ఏమిటీ ఏం ఎక్కినట్టేలేదు? రొండో సీసాకూడా? అది ఇవ్వాళ ముట్టనని ఒట్టేసుకొని బీరువా వెనక పెట్టాడుగా! ఇట్లా తాగేస్తే ఎంతయినా చాలదు. తగ్గించేయాలి. అసలు దానివల్లే తను ఇట్టా అయిపోయాడు. అలవాటయింది పాడుది. తనకెట్టా అలవాటయిందీ?
తొలిబరం తను తాగిందెప్పుడూ? ఆఁ రామనాథబాబుగారింట్లో ఆయనే తనకిది అలవాటు చేశాడు. ఏమాటకామాట పాపం వరూధిని - వద్దనే అన్నది. అప్పుడే తను వరూధిని మాట వింటే ఎట్టా ఉండేదో? వెంకటపతి లేచి బీరువా వెనకదాచిన సారాసీసా తెచ్చుకొని పంటితో బిరడా లాగుతుండగా బయట కారు హారన్ వినిపించింది.
చేతులో సీసా, పళ్ళసందున బిరడా అట్లాగే ఉండిపోయినయ్!
చెవులు రిక్కించి విన్నాడు. తలుపు కొడ్తున్న చప్పుడు కొద్ది క్షణాలు వెంకటపతి బుర్ర పనిచెయ్యకుండా ఆగిపోయింది. మళ్ళీ గట్టిగా తలుపు కొడ్తున్న ధ్వని! వెంకటపతి లేచి నిలబడ్డాడు. కాలూ చెయ్యీ ఆడలేదు.
"వచ్చింది! వచ్చింది! సమయానికి వచ్చేసింది. ఇప్పుడెట్టా?" వెంకటపతి గుండెలు దడదడ కొట్టుకొన్నాయి.
నోట్లోవున్న బిరడాతీసి సీసాకు పెట్టి సీసా బీరువా చాటున దాచాడు. ఖాళీ సీసా దొడ్లో పారేసి గ్లాసు కడిగి పెట్టేశాడు.
మూతి పంచెకు తుడుచుకొని, జారిపోతున్న మొలపంచ బిగించి చొక్కా సర్దుకొంటున్న వెంకటపతి చేతికి నోట్లపొత్తి తగిలింది!
ఇంత డబ్బు తన దగ్గిర ఉంటే ఇంకేమన్నా ఉందా? ఎక్కడిదని అడగదూ? అసలు ముందు డబ్బు లాక్కుంటది. ఎక్కడన్నా దాయాలి. ఎక్కడ దాస్తే? ఆఁ ఈడయితే సరి! చూడదులే!
వెంకటపతి తన మంచంమీదవున్న దిండుగలీబులో నోట్లపొత్తి దాచి బయటికి వచ్చాడు.
మళ్ళీ తలుపు చప్పుడు! తలుపులు ఊగుతున్నాయి!
"ఆఁ వస్తున్నా?" వెంకటపతి అడుగులు తడబడుతున్నాయి.
వరూధిని ఇంతసేపేం జేస్తున్నావంటే? ఏం చెప్పాలీ? నిద్రపోతున్నాలే!
"ఆఁ తీస్తున్నా!" వెంకటపతి తలుపు తెరిచాడు.
"వరూధిని గారిల్లే కదండీ?"
అమ్మయ్య బతికాడు! వచ్చింది వరూధినికాదు. వరూధిని కోసం ఎవరో వచ్చారు.
"ఊళ్ళో లేదుగా? హైదరాబాద్ పోయింది. పోయి పదిహేను రోజులైంది."
వెంకటపతి చెప్పాడు అతడ్ని చూస్తూ.


