"నీ బొందా! నీ బోలె!" వరూధిని రిసీవర్ పెట్టేసింతర్వాత గాని తిట్టలేదు. తను తిట్టింది వాడికి వినబడే ఉంటుందనుకొంది.
వరూధిని తిరిగి వెళ్ళి పక్కమీద వాలింది. రేపు రాత్రిక్కాని గోపాలరావు రాడు. ఎప్పడు వెళ్ళాడో! ఆ మాట అడగనే లేదు. ఫేమిలీని తీసుకెళ్ళాడా? బెజవాడలో వదిలి వస్తాడా? ఇవేం ఫామిలీలు మొగుడు తోడురాందే వెళ్ళ లేరా? హైదరాబాద్ నుంచి బెజవాడ వెళ్ళటానికి మొగుడుతోడుకావాలా? వీళ్ళు పెళ్ళాలా? గుది బండలా? ఈ రకం సజ్జుతో ఈ మగాళ్ళు ఎట్లా కాపరాలు చేస్తున్నారో? ఆఁ కాపరాలా? ఏదో పై పై నాటకం! ఎప్పుడూ వీళ్ళ కళ్ళు వెతుకుతూనే ఉంటాయి. ఆకలి ముఖాలు వేసుకొని అందమైన ఆడది కనిపిస్తే చాలు ఎలా చూస్తారో? చురుకైన ఆడది కనిపిస్తే చాలు! గంటలకొద్దీ మాట్లాట్టానికి ఏమీలేక పోయినా ఎదురుగా కూర్చొని పడిగాపులు కాస్తారు. చెలాకయిన ఆడది కనిపిస్తే పెంపుడు కుక్కలా తోకలాడించుకొంటూ చుట్టూ తిరుగుతారు. ఈ మగాళ్ళూ! ఈ ఆడాళ్ళూ!
వరూధిని బుర్ర వేడెక్కిపోయింది. తలలో ఏదో తెలియని సన్ననిపోటు! చెవుల్లో వింత ధ్వనులువిన్పిస్తున్నాయి. గుండె కలుక్కుమంది. పళ్ళరసం వత్తే చక్కలమధ్య పెట్టి వత్తినట్టుగా వుంది!
ఏమిటామోత? శివరాత్రినాడు జనం తొక్కిడిలో గర్భగుడిలో టెంకాయలు కొట్టినమోత! కొబ్బరికాయలు అడ్డంగా పగిలి పోతున్నాయి. తెల్లటి కొబ్బరి చిప్పలు!
అబ్బా కింది పెదవి ముందు పళ్ళతో నొక్కిపట్టి, పక్కమీద మెలితిరిగి పోయింది వరూధిని. బాగా పొద్దుపోయి పడుకున్న వరూథినికి పొద్దెక్కిగానీ మెలుకువరాలేదు.
టైంచూసుకొని గాబరా పడిపోయింది. బాబు స్కూలుకు తొమ్మిదిలోపే వెళ్ళాలి. క్లాసులు మొదలు పెట్టకముందే బాబును తీసుకు రావాలి. క్లాసులోనుంచి రావటానికి వాడు బిడియపడతాడు. క్లాసు జరుగుతుండగా తీసుకెళ్తామంటే అక్కడి టీచరూ పిల్లలు కూడా అదోలా వింతగా చూస్తారు. అదేం మామూలు స్కూలా! జాగీర్దార్ స్కూలు! వరూధిని హడావిడిలో స్నానం చేసి కాఫీ అన్నా తీసుకోకుండా హోటలు నుంచి బయటికొచ్చింది. టాక్సీ ఎక్కి బేగంపేట బయలుదేరింది.
బాబుని చూసి ఎన్నాళ్ళయిందో? వాడు శెలవల కొచ్చినప్పుడు చూడటమే. రెండు నెలలకు పైగా అయింది. ఈ ముదనష్టపు గొడవల్తోనే సరిపోయింది తనకు. బిడ్డ ఎలా వున్నాడో ఏమో? హఠాత్తుగా తనను చూసి ఎంత సంతోషపడ్తాడో? ఈ రోజంతా బాబుతోనే గడిపేయొచ్చు. తనకూ ఏమీ పనిలేదు. గోపాలరావు ఊళ్ళో లేకపోవటం మంచిదే అయింది. లాయర్లూ, కోర్టులూ, గొడవల్లో పడితే తనకు ఇంత తీరిక ఎక్కడుంటుంది?
టాక్సీ స్కూలు కాంపౌండ్ లోకి వచ్చి ఆగింది.
వరూథిని దిగి బోర్డర్స్ ఉండే బిల్డింగ్ కేసి వెళ్ళింది.
మరో పావుగంటలో కొడుకుని వెంటబెట్టుకొని తిరిగొచ్చి టాక్సీ ఎక్కింది. టాక్సీ హోటల్ ముందు ఆగింది.
"ఈ డ్రెస్సెప్పుడు కొన్నారా? గుర్తేలేదు." కొడుక్కు ఉప్మా తినిపిస్తూ అన్నది తల్లి.
"ఇవి కొత్తవిగదమ్మా! బాబాయి తెచ్చి ఇచ్చాడమ్మా?"
"ఏ బాబాయ్? ఎప్పుడిచ్చాడు?"
"మన బాబాయే? ఎప్పుడిచ్చాడు?"
"మన బాబాయే! రామనాథ బాబాయి."
వరూథిని గుండె ఝల్లుమంది.
"ఎప్పుడొచ్చాడు బాబూ? నిన్ను చూట్టానికి వస్తూవుంటాడా?"
"పోయిన మంత్ లో ఒక్కసారీ, ఈ మంత్ లో ఒకసారీ వచ్చాడమ్మా!
వచ్చినప్పుడల్లా ఏమైనా తెచ్చి ఇస్తుంటాడమ్మా!"
వరూథిని కళ్ళు చెమ్మగిల్లాయి. రామనాథబాబుకు వాడంటే ఎంత ప్రేమా? దుర్మార్గురాలు తనెంతకు సిద్దమయింది?
"బాబాయేడమ్మా?"
"రాలేదు బాబూ! ఇంద! తినుమరి?" అని ప్లేటు కొడుకుముందు పెట్టి ముఖం తిప్పుకొని పైటచెరుగుతో కళ్ళు తుడుచుకొంది.
"అమ్మా! నాన్నను ఒక్కసారికూడా తీసుకురాలేదేం అమ్మా? డాడీ మా స్కూలే చూళ్ళేదుగా? ఎట్లా వుంటుంది, పెద్దదా, చిన్నదా అని శెలవుల కొచ్చినప్పుడల్లా అడుగుతాడమ్మా." అమాయకంగా చేతులు తిప్పుతూ అన్నాడు రవి.
"ఈసారి వేసవికాలం శెలవులు అయిపోయాక వస్తావు చూడూ? అప్పుడు మీ నాన్నగారితోనే వద్దువుగానిలే బాబూ!"
"అమ్మా! నాకు తాతయ్య ఉన్నాడంటగా?"
"ఎవరు చెప్పారూ?"
"నాన్నే చెప్పాడు. తాతయ్య సంగతులు బోలెడన్ని చెప్పాడమ్మా! నీతో చెప్పొద్దంటాడు ఎందుకూ?"
"మీ నాన్ననీ అడక్కపోయావూ?"
"తాతయ్య మనింటి కెందుకనే రాడూ?"
"ఈసారి వచ్చినప్పుడు మనూరెళ్ళి తాతయ్యనే అడుగు."
"తాతయ్య దగ్గిరకు నువెళ్ళనిస్తావా?"
వరూథిని కొడుకుకేసి ఓ క్షణం చూసింది.
"నాకేం పట్టింది? నువ్వెళ్తే?"
"తాతయ్యంటే నీ కిష్టం లేదంటగా? తాతయ్యతో నువ్వు పోట్లాడావా?"
"ఇవన్నీ మీ నాన్నే చెప్పాడా?" వరూథిని ముఖం కందిపోయింది.
రవి బెదురు చూపులు చూశాడు.
"ఊఁ, తొందరగా కానియ్? బజారుకు పోవద్దా?"
"అమ్మా! జ్యూ కెళ్దామే?"
తల్లీ కొడుకూ జ్యూలో సాయంకాలం నాలుగ్గంటలదాకా గడిపారు. జంతువులను చూస్తూ, ఐస్ క్రీం తింటూ, కేరింతలు కొడుతున్న కొడుకుని చూస్తూ, తన్మయురాలై పోయింది వరూథిని. కొడుకు తల్లిచేత బలవంతంగా ఐస్ క్రీం తినిపించాడు. చెట్టుకింద కూర్చొని సేద తీర్చుకొంటూ రవి భవిష్యత్తును గురించి ఎన్నో ఊహలల్లుకొంది.
తిరిగివస్తూ బజార్లో రవికి బట్టలు కొన్నది. ఇంకా వాడడిగినవన్నీ కొన్నది. ఐదున్నరకు హోటల్ చేరారు తల్లీ కొడుకు. వరూధిని అలసిపోయి వుంది. పక్క మీద వాలి నిట్టూర్పులు విడిచింది.
హైకోర్టులో కూడా కేసు నెగ్గకపోతే? రవి భవిష్యత్తు ఏమికాను?
"అమ్మా సినిమాకు తీసుకెళ్ళవా?" అడిగాడు రవి.
"అబ్బ నీ ఓపికేంరా?"
ఏం సినిమాలో? పాడు సినిమాలు. ఒక్కటీ అయ్యా అమ్మకు పుట్టినవి కావు. ఈ సినిమా కథలకు తలా తోకా వుండదు.
"ఏంమ్మామాట్లాడవేం? సినిమాకు తీసుకెళ్ళవా?"
"ఏం సినిమాలున్నాయిరా? ఏం సినిమా చూస్తావ్?"
"టార్జాన్ అండ్ ది గ్రేట్ రివర్!" తనే టార్జాన్ లా ఫోజు పెట్టి అన్నాడు రవి.
"ఊఁ, త్వరగా బట్టలు మార్చుకో పోదాం."
"ఇప్పుడు కొన్నవి కొత్తడ్రస్ వేసుకోనా?" సంతోషంగా అడిగాడు.
* * *
ఆ రాత్రి కొడుకుని పొదువుకొని పడుకొని ఎన్నో ఆశా సౌధాలు నిర్మించుకొంది వరూథిని.
తెల్లవారి తొమ్మిది దాటకముందే రవిని స్కూల్లో దిగబెట్టి తిరిగి హోటలు కొచ్చింది.
రాత్రి గోపాల్రావు ఊరినుంచి తిరిగి వచ్చి ఉంటాడా? ఆలోచిస్తూ వరూథిని ఫోన్ ఎత్తింది.
"హల్లో!"
నౌకరు పలికాడు.
"గోపాల్రావుగారు వచ్చారా?"
"ఆఁ. రాత్రే వచ్చారు."
"నేను ఫోన్ చేసిన సంగతి చెప్పావా?"
"మీ పేరు గుర్తులేదమ్మా! ఎవరో అమ్మగారు మూడుసార్లు చేశారని చెప్పాను."

