Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 101

   
    వరూధిని మాట్లాడకుండా బస్ ఎక్కింది.
    "వరూ! నే వస్తామరి!" కింద నిలబడి చెయ్యి ఊపాడు రామనాథబాబు.
    వరూధిని తల ఊపింది.
    "వస్తాడు? వస్తాడు? ఇక ఒకటే రావటం! ఇక నీ నాటకం మీద తెర పడుతుంది!! హైదరాబాద్ వచ్చి లాయర్లను పట్టుకొని పెళ్ళాన్ని గెలిపించే రోజులు అయిపోయినై. ఆ శ్యామలాంబ ఇంకెలా గెలుస్తుందో నే చూస్తాగా? హైకోర్టుకు వెళ్తున్నాననగానే కాళ్ళబేరాని కొచ్చాడు. కింద కోర్టులో దొంగ ఏడ్పు ఏడ్చి గెలిచాడు. హైకోర్టులో ఓడిపోతామని వాళ్ళకీ తెలుసు. తెలిసే ఇట్లా దిగజారిపోయి మాట్లాడుతున్నాడు. అసలు వాడి పెళ్ళామే అదిరిపోయి మొగుడ్ని పంపించి ఉంటుంది. బోడిముండ. దాని పని అప్పుడే ఏమయింది? వెధవముండ. దాన్ని...." అనుకొంటూ ఆగిపోయింది.        కారు దగ్గర కెళ్తున్న రామనాథబాబును రెప్పవాల్చకుండా చూసింది వరూథిని.
    ఆ నడకలో ఎంత రాజసం? ఆ మనిషి పొందికా? ఆ మాట తీరూ, ఆ చూపులూ--- ఆ నవ్వూ--- మళ్ళీ తనకు కన్పించనా? అతను మళ్ళీ కన్పించడా?
    వరూథినికి కడుపు తరుక్కుపోయింది. గుండెలు తోడేస్తున్నాయి.
    భగవంతుడా? తను మనసారా ప్రేమించిన మనిషిని చేజేతులా చంపుకొంటున్నదా?
    రామదాసు చేతిలో చురకత్తీ, కొండల్రావు చేతులో ఈటే వరూధిని కళ్ళముందు నిగనిగలాడాయి! ఆమె గుండెలోనే దిగబడ్డాయి. పొర్లుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగడానికి ప్రయత్నించి విఫలురాలైంది.
    "ఏమ్మా? మీ ఆయన రావటం లేదా? పుట్టింటి కెళ్తున్నావా?" పక్క సీట్లో కూర్చున్న గంగాభగీరధీ సమానురాలు ఓదార్చటానికి ప్రయత్నించింది.
    "ఎన్నో నెలా?" నెత్తిమీద ముసుగు సర్దుకొని వరూథిన్ని ఓసారి పరీక్షించి అన్నది మళ్ళీ.
    "అప్పుడే వెళ్తున్నావేం అమ్మాయీ? మా కాలంలో ఏడోనెల నిండంది పోనిచ్చేవాళ్ళు కాదమ్మా."
    అంత దుఃఖంలోనూ వరూథినికి నవ్వొచ్చింది.
    "మీ నాన్నగారు హైదరాబాద్ లో ఏం చేస్తుంటారు?"
    "ఇక్కడ మీ ఆయన కేంపని?"
    "మా పెద్దబ్బాయి పెళ్ళానికి కడుపు పోయిందంట! అబ్బాయి రమ్మని రాస్తే వెళ్తున్నా"
    ఇక అక్కడికి ఆపి, ఎన్ని అడిగినా మాట్లాడవేం అన్నట్టు వరూథినికేసి చూసింది. వయసు మళ్ళిన ఆ విధవావిడ.
    కర్మగాలి ఆవిడకు తన పక్కనే సీటు దొరకాలా! డోకు వచ్చేట్టుంది. వీలయినంత ఎడంగా జరిగి ముఖం తిప్పుకొని బయటికి చూస్తూ కూర్చుంది. వరూథిని.
    బాబు ఎలా వున్నాడో? డిసెంబరు సెలవలకు వచ్చినపుడు బాగా చిక్కిపోయి వున్నాడు. వాడికి పరీక్షలుకూడా దగ్గిరకొస్తుండాలి. ఎలా చదువుతున్నాడో!
    
                          47
    
    బస్ హైదరాబాద్ చేసే సరికి ఎనిమిది అయింది. టాక్సీ చేసుకొని హోటల్ కెళ్ళింది వరూధిని.
    హోటల్ గదిలో దిగుతూనే గోపాలరావు నంబరుకు ఫోన్ చేసింది.
    "హల్లో!"
    "గోపాల్రావుగారి యిల్లు ఇదేనా అండీ?"
    "అవునండీ! మీరెవరూ?"
    "వరూథిని."
    "గోపాలరావుగారింట్లో లేరండి."
    "ఎప్పుడొస్తారో?"
    ఏమో తెలియదు.
    "వారొచ్చాక ఒకసారి ఫోన్ చెయ్యమని చెప్తారా?"
    "అలాగే!"
    "రూం నంబరు ట్వెంటీవన్. క్రీడావన్ హోటలు ఆబిద్....."
    అవతల ఫోన్ పెట్టేశారు. వరూధిని రిసీవర్ పెట్టేసింది. అదేం పొగరూ? మాట్లాడుతుండగానే పెట్టేసింది ఆవిడ? మాట్లాడింది పెళ్ళామా? కూతురా? గొంతు పెద్దదాని గొంతులా వుంది. మాట్లాడే తీరుచూస్తే చిన్నపిల్లలా వుంది. స్టయిల్ గా మాట్లాడింది. పెళ్ళామా! తల్లా కాదు.... తల్లా పెళ్ళామా? అమ్మా? కూతురా? ఏదీకాదు. కోడలేమో? గోపాలరావుకు అంత పెద్ద కొడుకు ఉండటానికివీళ్ళేదే? ఆయన మనిషి అలా కనిపిస్తాడుకాని వయస్సు ఎక్కువ ఉండదు. అంత పెద్దకూతురూ ఉండదు. అయితే అత్తా? కోడలా? అత్తో, కోడలో అయివుండాలి. ఎవరైతే ఏంగాని అసలు గోపాలరావుకు రాగానే చెప్తారా? పెళ్ళాం అయితే చెప్పదు. అమ్మయితే మర్చిపోతుంది. కూతురయితే ఇంట్లో ఉండదు సినిమాకు పోతుంది. కోడలయితే చెప్తుంది. అసలు మామతో మాట్లాడుతుందా? మామ సాంబయ్యకు ఎదురుపడి మాట్లాడాలంటే తనకు ప్రాణాలు అన్నుబట్టేవి. కోడలైతే మొగుడికి చెప్పి తండ్రికి చెప్పిస్తుంది. కోడలే....
    ఆలోచిస్తూ వరూధిని టవల్ భుజాన వేసుకొని బాత్ రూంలోకి నడిచింది.
    అరగంట తర్వాత ఫోన్ మోగింది. వరూథిని మంచంమీద నుంచి ఫోన్ దగ్గర కొచ్చింది.
    "హల్లో!"
    "గోపాలరావుగారా? నేను వరూథిన్నండీ?"
    "వరూథినా? అంటే?"
    "నేనేనండీ? వరూథినీ పిక్చర్ ప్యాలెస్....."
    "సారీ! గుర్తు రావటం లేదే?"
    "మీరు గోపాల్రావుగారే కదూ?"
    "అవునూ!"
    "విశాఖపట్నం హోటల్ ప్రొప్రయిటరు గోపాలరావుగారి కజినేకదూ మీరు?"
    "ఆహాఁ! మీకా గోపాల్రావు కావాలా? ఆయన యం. గోపాల్రావు. నేను యస్. గోపాల్రావుని."
    "క్షమించాలి. పొరపాటయిపోయింది." వరూథిని ఫోన్ పెట్టేసింది.
    "ఛీ! ఛీ! తనెంత పొరపాటు పనిచేసింది? ఆయన యం. గోపాల్రావా? ఆ హోటల్ ఆయన యన్. గోపాల్రావా? ఈయనేమో యస్. వీళ్ళకు పేర్లే దొరకవా ఏం? గోపాల్రావులూ వెంకటేశ్వరరావులూ, సుబ్బారావులూ....వీళ్ళను తగలెయ్య ఏం మనషులూ? ఏం పేర్లూ? ఆంద్రదేశంలోని జనాభాలో సగంమందికి ఇవే పేర్లు;
    రామనాథబాబు! ఎంత అందంగా ఉంది పేరు? మళ్ళీ అతను గుర్తొచ్చాడేం? వీడు చచ్చినా నన్ను వదిలేట్టు లేడు! అన్నట్టు రామదాసు ఏ ఈపాటికి....
    టెలీఫోన్ డైరెక్టరీ తిగేస్తున్న వరూధిని వేళ్ళు వణికాయి.
    గోపాలరావు యం. బంజారా హిల్స్. ఇదేం ఇక్కడేవుంది.
    వరూథిని రిసీవర్ ఎత్తి హోటల్ ఎక్స్చేంజి వాడికి నంబరు చెప్పింది.
    "స్పీక్ ఆన్ సర్!" ఎక్స్చేంజి వాడి కంఠం పలికింది.
    సార్ అంట సార్! వీడి బొంద! మేడం అనొద్దూ?
    "హల్లో! ఎవరు కావాలండీ?" మొరటుగా అడిగాడు అవతలివాడు.
    "యం. గోపాల్రావు గారు లేరా?"
    "ఇది గోపాలరావ్ గారిల్లండి." బండగా వుంది మాట.
    వీడని తగలెయ్యా వీడెవడూ? పెళ్ళయిన కొత్తలో వెంకటపతిలా ఛ! ఛ! వెంకటపతి తన భర్త! వీడెవడో?
    "మీ రెవరూ?"
    "ఆరి నౌకర్ని."
    "గోపాల్రావుగార్ని పిలువ్!" నొక్కి అన్నది వరూథిని.
    "అయ్యగారు ఊళ్ళో లేరమ్మా" అవతలవాడు మెత్తబడిపోయాడు.
    "ఎక్కడికి పోయారూ? ఎప్పుడొస్తారూ?"
    "బెజవాడ వెళ్ళారమ్మా! ఫేమిలితో వెళ్ళారు."
    "ఎప్పుడొస్తారు?"
    "ఫేమిలీని దిగబెట్టివస్తారు. రేపు రాత్రికి వస్తారేమో!"
    "రాగానే క్రీడా భవన్ నుంచి వరూథిని ఫోన్ చేసిందని చెప్తావా? గుర్తుంటుందా?"
    "ఆఁ ఏంటీ! కీచక భవన్ నుంచి అరూదినా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS