"అబ్బే....అదేం లేదే?...పరాకులో వచ్చేశాను! అంతే!..."
"కాదులే!...నాకు తెలుసు!..." అంటూ నవ్వింది సుబ్బులు!
"నాకు తెలియనిది నీకు తెలిసిందీ ఏమిటో చెప్పు??."
"నేను ముందు వెళ్ళిపోతాను. నువ్వు ఆలస్యంగా వస్తే మీ బావ కూడా వస్తాడని అనుకునివుంటావు?
...అసలు యింతకీ మీ వినాయకం బావ నీ వెనుక వస్తున్నాడా? వచ్చి ఈ కాలువ గట్టుమీద ఏ చెట్టుచాటునయినా దాక్కుని వున్నాడా?"
"ఛా! ఛా! అలాంటిదేమీలేదు! నా కోసం కాలువగట్టుమీద, చెట్ల చాతునా దాక్కోవలసిన అవసరం ఏమిటి? నేరుగా మా యింటికే వస్తాడు. మేమిద్దరం గంటల తరబడి సినిమాలు గురించి, సినిమా తారలు గురించీ మాట్లాడుకుంటాం...నాకని ఎన్నో పుస్తకాలు బస్తీనుంచి కొనుక్కుని వస్తాడు. నేను కొత్తబట్టలు కట్టుకుంటే చాలు! సినిమా స్టార్ లాగా వున్నావని అంటాడు!" కావేరి చేపుకుని పోతోంది.
"మీ అమ్మవాళ్ళు ఏమీ అనరా?"
"ఎందుకు అంటారు? చిన్నప్పటినుంచీ నేనూ మా బావా మా అమ్మదగ్గిర పెరిగిన వాళ్ళమేగా? మా యిద్దరికీ పెళ్ళి చేయాలని యింట్లో అనుకుంటుంటే విన్నాను. యింక అలాంటప్పుడు అనుకోవలసిన అవసరం ఏముంటుంది?"
కావేరి అలా అనేసరికి సుబ్బులలో అసూయలాంటిది జనించింది. వినాయకరావు అంటే పిన్నలే కాదు పెద్దలు కూడా ఎంతో యిష్టపడతారు. ఎంతో మంచివాడన్న పేరున్నది! ఆస్థికి ఆస్తీవుంది. ఎవరయినా యిబ్బందులలో వున్నామంటే తన జేబులో గబుక్కున చెయ్యిపెట్టి తీసి యిచ్చేస్తాడని చెప్పుకుంటారు. వినాయకరావులాంటి బుద్దిమంతుడు కావేరికి భర్త అవబోతున్నాడంటేనే బాధగా వున్నది. తన భర్త అయితే ఎంత బాగుండును? ఆ వేలినవున్న ఉంగరం తను పెట్టుకోవచ్చును. తన పిచ్చిగానీ! తమలాంటి తక్కువ స్థితిపరుల పిల్లని తన కోడలిగా ఆ కామాక్షమ్మగా నీ చేసుకోదు! అదీగాక చిన్నప్పటినుంచీ వాళ్ళిద్దరినీ భార్యా భర్తలనే అనుకుంటున్నప్పుడు తను కావాలనుకోవటం ఆశకదూ? పొట్టిగా లావుగా వున్నాడన్నమాటేగాని కావేరి ఎంతో అదృష్టవంతురాలు.
"ఏమిటే ఆలోచించుకుంటున్నావు సుబ్బులూ?...."ఎంతకీ మాట్లాడకపోయేసరికి కావేరి అడిగింది.
"నువ్వు సినిమా యాక్టర్ వి అయితే ఎంత బాగుంటుంది? ఆ జయప్రద-జయసుధ నీముందు తీసినట్టే అవుతారు. ఒక్క సినిమాలో నటించావంటే యింక నిన్ను వెతుక్కుంటూ వందలాది నిర్మాతలు నీ యింటి చుట్టూ తిరుగుతారు." తనూ సినిమా పుస్తకాలు చదివి వుండటంవలన ఆపైత్యం కొంత బుర్రకి ఎక్కింది.
"నాకు సినిమాలలో నటించాలనే వున్నది. నటించాలంటే మార్గం ఏమిటో తెలియుట లేదు. "సాలోచనగా అంది.
"మనసుంటే మార్గమే వుండదేమిటి? తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ సినిమాలన్నీ తీసేది మద్రాసులోనే కదా? హీరో, హీరోయిన్ను వుండేది మద్రాసు. డైరెక్టర్సు, ప్రొడ్యూసర్సు వుండేది మద్రాసు! మద్రాసు వెళ్ళి ఎవరిని కలుసుకున్నా నీకు యిట్టే సినిమా ఛాన్సు తగులుతుంది. యిక్కడ కాలువగట్ల వెంబడి నడిస్తేను-మన తాటియాకు కొంపల్లోవుంటే వచ్చి వేషాలు ఎవరిస్తారు? మనమే పోయి వెతుక్కోవాలి వేషాలు!"
"అమ్మో!....మద్రాసే?....అంత దూరం ఎలా వెళ్లేది? ఎవరు తీసుకెళ్ళతారు?" "గుండెలమీద చేతులుంచుకుని అంది కావేరి.
"సినిమా యాక్టర్లంటే మనవాళ్ళకి గిట్టదు...ఎవరు తీసుకెళ్ళుతారు? నీ అంతట నువ్వే వెళ్ళి ప్రయత్నించాలి!"
"ఒక్కదాన్నే?...." కళ్ళు యింతింత చేసింది.
"ధైర్యం వుండాలి దేనికయినాను! లేకపోతే ఈ మారుమూల పల్లెటూరిలో నువ్వున్నావని డైరెక్టర్లకి ఎలా తెలుస్తుంది? తెలియాలంటే నువ్వు మద్రాసు వెళ్ళటమే!....నీలాంటి అందగత్తెను చూడగానే తమ సినిమాలలో వేషాలు యిచ్చేయగలరు? నీకంటే యిప్పటి గొప్ప హీరోయిన్ లు ఎవరయినా బాగున్నారా? వాళ్ళంతా వాళ్ళయిళ్ళల్లోనే కూర్చుంటే యిప్పుడు యింత పెద్ద హీరోయిన్ లు అయివుండే వారా? అలాగే నువ్వు ప్రయత్నించు!"
సుబ్బులు చెప్పినమాటలు కావేరిమీద బాగా పనిచేశాయి. ఎలా మద్రాసు వెళ్ళాలి? వెళ్ళి ఎవరిని కలుసుకోవాలి? అవునూ! ఈ మారుమూల పల్లెటూరిలో వుంటే తన ప్రతిభ గుర్తించేదెవరు? కావేరి ఆలోచించుతున్నదని పసిగట్టింది సుబ్బులు! కావేరి కనుక వినాయకరావుని చేసుకోకుండా మద్రాసు వెళ్ళిపోతే తను అతగాడిని చేసుకోవచ్చునని ఉవ్విళ్ళూరుతున్నది. అందుకే ఈ ఎగవేత కార్యక్రమం మొదలుపెట్టింది. అంతకుముందు క్లాసులోనుంచి కావేరి బైటికి వెళ్ళితేచాలు! పక్కబెంచీల మీద వున్న అమ్మాయిలతో ఎంతో హేళనగా కావేరి గురించి చెప్పుతుండేది!
"దాని నడక చూసు? ఎన్ని వయ్యారాలు వలుకబోస్తుందో? తానొక గొప్ప సినిమాయాక్టర్ అయిపోవాలని కలలు కంటోంది. తనేదో ఎంతో అందగత్తెననుకుంటోంది...దారి పొడుగునా దాని సినిమా విన్యాసాలు చూడలేక వినలేక చచ్చిపోతున్నాననుకో! యింట్లోనుండి డబ్బులు ఎత్తుకు వచ్చి ఎన్ని సినిమా పుస్తకాలు కొంటుందో? ఒకవేళ సినిమాలో చాన్సుల కోసం మద్రాసు వెళ్ళినా దీనికి లభించేపాత్రలు ఏ పనిమనిషిగానో? ఏ ఉంపుడుకత్తెగానో తప్ప హీరోయిన్ మాత్రం అవదు..."అని చెప్పి పాక పకా నవ్వేది!
అదేదో విన్తవార్త అయినట్టు అమ్మాయిలందరూ సుబ్బులు చుట్టూ చేరేవారు. యింకా యింకా అడిగి మరి చెప్పించుకునేవారు. విన్నది ఒక విషయం చెప్పితే లేనివి పది విషయాలు పది రకాలుగా వర్ణించి చెప్పేది. ఆ చెప్పటంలో ఎంతో హేళన!... ఆ తరువాత క్లాసులోకి వచ్చిన కావేరి సుబ్బులుచుట్టూ చేరినా అమ్మాయిలను చూసి ఏమిటా? అని అనుకుని అడిగేది!...
"నువ్వు సినిమా హీరోయిన్ వి ఎప్పుడు అవుతావు? అని వీళ్ళందరూ నన్ను అడుగుతున్నారు నాకు తెలియదు! కావేరినీ అడగమని చెప్పాను!" అని కావేరీ చూడకుండా తన చుట్టూ వున్నవారికి కన్నుగీటింది. ఉత్తిత్తి అనే రీతిలో నాలిక ఆడించింది. అది అర్ధం చేసుకుని తమలో తాము నవ్వుకుని కావేరివైపు చూసేవారు...
"సినిమా హీరోయిన్ ని కావాలని వున్నదిగాని ఎప్పుడు అవుతానో నాకే తెలియదు!...ఆ విషయం గురించే ఆలోచించుతున్నాను!" అనేది అలా అంటున్నప్పుడు హీరోయిన్ ఫోజు యిచ్చేది.
"ఇలాంటి ఏబ్రాసి మొహాలూ హీరోయిన్ అయితే ఆ సినిమా తీసిన వాడు దివాళా ఎత్తవలసిందే?"
అని తమలో తాము అనుకుని హేళనగా కావేరిని చూసేవారు....వాళ్ళలా చూస్తుంటే తనలోని హీరోయిన్ని చూస్తున్నారన్న భావం కలిగి మురిసిపోయేది!
"కళ్ళు మూసుకుని నడుస్తున్నా రేమిటమ్మాయిగారూ?"
ఎక్కడనుంచో బెల్ మ్రోగించుతున్నా దారిలోనుంచి తప్పుకోకబోవటంతో కనుక బట్టలమూట బరువుతో సైకిల్ దిగలేకదిగలేక ఎలాగో అవస్థపడి, మూటపడిపోకుండా దిగిన మస్తాన్ కి ఆయాసం కలిగి ఏమీ అనలేక అలా అన్నాడు.
కావేరి ఏమీ చెప్పలేకపోయింది సమాధానం! ఆయాసంతో అతను పడుతున్న అవస్థని, సైకిల్ మీద మూట బరువుని నిలదొక్కుకునేటందుకు ప్రయత్నించుతున్న మస్తాన్ ని తదేకంగా చూసింది.
"కొత్తఫాషన్ లంగా గుడ్డలు ఓ ఓణీలూ తీసుకువచ్చావా?"
"ఆఁ. తీసుకువచ్చాను. వాణిశ్రీ "వివాహబంధం"లో కట్టిన చీర మోడల్సు. జయప్రద "రాజరాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్" సినిమాలో వేసుకున్న లంగా ఓణీ మోడల్సు, ఒకటేమిటి? మీకు కావలసిన...మీకు నచ్చే మోడల్సుతో కొత్త కొత్త రకాలు తెచ్చానమ్మా!" అన్నాడు.
