"ఎంతసేపయింది బావా వచ్చి??"
"నువ్వు ముఖానికి సున్నం పూసుకుంటున్నప్పుడు వచ్చాను!..." నవ్వుతూ జవాబు యిచ్చాడు.
"సున్నం అనవద్దని నీకెన్ని సార్లు చెప్పాను బావా! అది స్నో పౌడరు. అది స్నో పౌడరు. అది రాసుకుంటే సువాసన వస్తుంది! ముఖానికి కాంతి కలుగుతుంది!"
"ఆహాఁ- ఎంత గొప్పగా చెప్పావే?? సహజమయిన అందం వుండాలిగాని యిలాంటి మెత్తుడుల వల్ల రాదు కావేరీ! ఎండలోకి వెళ్ళావనుకో! చెమటకి కరిగి ముఖమంతా జిడ్డు ఓడుతూ వుంటుంది!"
"నీకు మహ బాగా తెలిసినట్టు?? అసలు వీటిని నువ్వెప్పుదయినా వాడావా? పెట్టావా??- ఎంతసేపూ పొలం - నాగలి దున్నటం పచ్చగడ్డి కోయటం తప్ప నీకు వాటి విలువ ఏం తెలుసులే??" ఎద్దేవా చేసింది.
ఆ మాటలతో వినాయకరావు చిన్నబుచ్చుకున్నాడు. ఏమీ అనలేకపోయాడు. ఏ మాటపడితే ఆ మాట అనేస్తుంది! ఈ దుడుకు స్వభావాన్ని తగ్గించుకుంటే బావుంటుంది! అనుకున్నాడు మనసులో
"అదేమిటి? అలా అయిపోయావు బావా? నీకు చేను పచ్చగడ్డి బర్రెలు గుర్తుకు వచ్చినట్లున్నాయి" అంటూ పక పకా నవ్వింది.
"నువ్వు గుర్తుకురాబట్టే వచ్చాను యిక్కడికి? నిన్నటి నుంచీ కడుపులో నెప్పి అని పడకపెట్టినదానివి మరలా స్కూలుకి బయలుదేరావా? ఈ ఒక్కరోజుకీ మానివేస్తే బాగుంటుందిగా" అన్నాడు.
"బాగానే వుంటుంది గాని మా అమ్మ యిచ్చిన కషాయం రెండవసారి త్రాగేసరికి తగ్గిపోయింది...కడుపులో నెప్పికి వళ్ళు నెప్పులకి వ్రాసుకునే అమృతాంజనం తెచ్చియిచ్చావే?...అది వ్రాసుకున్నాను. తగ్గిపోయింది బావా!..." అంది కావేరి నవ్వుతూ!
"నిజంగానా?..." కావేరినే చూస్తూ అన్నాడు.
"ఏం బావయ్యా!....కడుపులో నెప్పి అంటె వంటి నెప్పులకి రాసుకునే మందు తెచ్చిన ఘనుడవు? నీకసలు కడుపునెప్పికీ కాలు నెప్పికీ తేడా తెలియని నీ అమాయకత్వానికి నవ్వాలో? ఏడవాలో తెలియని పరిస్థితిలో వున్నాను..." అంటూ పగలబడి నవ్వింది.
కావేరీ అలా నవ్వుతుంటే వినాయకం తెల్లమొహం వేశాడు. ఆ తరువాత తను అలా వుంటే యింకా ఏడిపించుతుందన్న భయంతో రాణి నవ్వుని పెదాల మీదకి బలవంతంగా రప్పించుకుని కావేరీ నవ్వుతో శృతి కలిపాడు.
ఆ యిద్దరూ అలా నవ్వుతుంటే దొడ్లో పనిచేసుకుంటున్న సుభద్రమ్మ ఆ పనిని వదిలిపెట్టి గబగబా వచ్చింది అక్కడికి.
ఒకళ్ళని చూసి మరొకరు నవ్వుకుంటుంటే? ఎందుకలా నవ్వుకుంటున్నారో అర్ధంకాక విస్తుపోతూ చూస్తూ నిలబడిపోయింది బుగ్గలు నొక్కుకుంటూ!
తల్లిని చూసి నవ్వు ఆపింది కావేరి!...అది చూసి తనూ ఆపేశాడు. తన వెనుకవున్న అత్తని చూడలేదు వినాయకరావు. కావేరి సైగ చేస్తే అప్పుడు అర్ధంఅయి వెనక్కి తిరిగిచూశాడు.
"నువ్వా అత్తయ్యా!... కావేరి నవ్వు కలిగేమాట అంటె ఆపుకోలేకపోయాను....నడిస్తే మరలా నెప్పి వస్తుందని స్కూలుకి వెళ్ళవద్దంటే కావేరి వినటం లేదత్తయ్యా!....నువ్వయినా చెప్పు!" అన్నాడు.
"నువ్వు చెప్పితేనే విననిది నేను చెపితే వింటుందా??...." అంది సుభద్రమ్మ.
"ఇప్పుడేమో వెళ్తుంది! మరో రెండు గంటలకంతా కడుపులో నెప్పి అంటూ తిరిగివస్తుందిలే అత్తా! అప్పుడు నువ్వు మిరియాల కషాయం, ఆ కషాయం ఈ కషాయం అని పోయకు!" అన్నాడు కోపంగా!
"పోనీ ఈ రోజుకి స్కూలు మానివేయకూడదూ?" అంది సుభద్రమ్మ. తల్లి ఒక ప్రక్కన బావ ఒక ప్రక్కన అలా అంటుంటే స్కూలుకి వెళ్ళకుండా వుండాలనే అనిపించింది కావేరికి. కాని మొన్న మరొక క్లాసులోని అమ్మాయికి కొత్తగా ప్రారంభించిన సినీవార పత్రికను తెచ్చిపెట్టమని సుబ్బులు చూడకుండా డబ్బులు యిచ్చింది. నిన్న ఆ అమ్మాయి స్కూలుకి రాలేదు! ఈరోజు తప్పకుండా తీసుకు వస్తుంది. తనకోసం క్లాసులోకి వస్తుంది పుస్తకంతోసహా! సుబ్బులు తీసుకుంటుంది.. అది సరాసరి తీసుకువచ్చి అమ్మ వుండగానే యిస్తుంది...యిక అక్కడ నుంచి తల్లి అడిగే యక్షప్రశ్నలుకి జవాబులు చెప్పుకోలేక తలప్రాణం తోకకి వస్తుంది. ఈలోగా సుబ్బులు అన్నీ పూసగుచ్చినట్టు చెప్పేస్తుంది. యింక సుబ్బులు వెళ్ళిన తరువాత తల్లి తిట్ల వర్షం మొదలుపెడుతుంది. ఈ రభస అంతా జరిగినా తరువతః డబ్బులు తనకి ఎక్కడినుంచి వస్తున్నాయో? రహస్యంగా పరిశోధించటం మొదలుపెడుతుంది. యింత అలజడి కలిగించేబదులు తనే వెళ్ళితే పోలా?...తన రహస్యాన్ని కాపాడుకున్నట్టూ వుంటుంది! తను అందుకయినా వెళ్ళాల్సిందే తప్పదు!...
"రోజూ ఆఫ్ సెంట్లు పడితే రేపు పరీక్షకి కూర్చోనివ్వరు...అసలు నీకూ బావకీ ఏం తెలుసునట? నన్ను స్కూలుకి వెళ్ళవద్దంటారు??"
ఇంకా చెప్పి లాభం లేదనుకుని వినాయకరావు బైటికి వెళ్ళి పోయాడు. కోపంతో కాదు! శాంతంగానే!
కావేరికి చదువంటే ఎంతో యిష్టం?? నిన్న మానినందుకు ఎంత బాధపడిందో?....తను చదివి రేపు పెళ్ళి అయినా తరువాత పడకగదిలో నాకు పాఠాలు చెప్పుతుందేమో? అని నవ్వుకున్నాడు.
కావేరి పుస్తకాలు పట్టుకుని బైటికి వచ్చేసరికి సుభద్రమ్మ భర్తతో విసుగు ధ్వనించే కంఠంతో అంటోంది.
"ఇంక లాభం లేదండీ!....మన కావేరికి వెంటనే పెళ్ళిచేసేయాలి! యింకా ఆలస్యం చేస్తే మన మాట వినకపోతే పోనీలే! వినాయకరావు మాట కూడా వినేటట్టు కనిపించలేదు! యిప్పుడే అతగాడి మాటలని లెక్క చేయటంలేదు!యింకా ముందు ముందు ఏం వింటుందని?...నాకేమాత్రం నమ్మకంలేదు!..."
"అయితే ఇప్పుడేమి చేద్దామని!!" నోట్లో చుట్టతీసి అడిగాడు.
"అని నన్నడుగుతారేమిటండీ! దీని చదువు సంగతి దేముడెరుక! ముందు పెళ్ళి చేసేయండి! యింక లాభంలేదు..."
"చదివించమని వినాయకమేగా మనకీ చెప్పి వప్పించింది?" అన్నాడు పరంధామయ్య.
"చెప్పాడు? అయితే మాత్రం? యింత మొండికేస్తుందని అనుకోలేదు! ఏది ఏమయినా ఈ వేసవి లగ్నాలులో కావేరికి, వినాయకానికి వివాహం జరిపించవలసిందే?....ఎంతమాత్రం ఆలస్యం చేయకూడదు!"
"అలాగేలేవే? మా చెల్లెలలో కూడా వీలు చూసుకుని ఈ విషయం కదిపి తనేమంటుందో విని ఆ తరువాత విషయం చెప్పుతాను!"
"ఏమని??...." కంగారుగా అడిగింది.
"పెళ్ళి చేయమని అడుగుతాను! యింక అంతకంటే ఏమి వున్నాయి విషయాలు? రహస్యాలూను!?..."
"ఆపాటి తేలివితేటలున్నందుకు సంతోషమేలెండి! అన్నట్టు శంకరం చదువుతున్నాడుగా? వాడి చదువు, పెళ్ళి అవనీ? ఆ తరువాత చూద్దామని అంటే??..."
"అంటే? అంటే ఏమిటే??....చెప్పింది వినాలి? అదీ సబబు అయినా మాటేగా? పెద్దాడిని వదిలి చిన్నాడికి ఎలా పెళ్ళిచేస్తారు?....అవుననిపించుకుంటే ఆ తర్వాత చేయవచ్చును!"
భర్త చెప్పింది సమంజసమే అనిపించింది సుభద్రమ్మ!
తల్లీ తండ్రీ సంభాషణ వింటున్న కావేరికి గుండెల్లో రాయిపడింది. తన పెళ్ళి చేయాలన్న కృతనిశ్చయంతో వున్నారు....తను సినిమా హీరోయిన్ అయ్యేది ఎప్పుడు? తారాపధంలో ఉజ్వల తారగా వెలిసేది ఎప్పుడు??....పెళ్ళి అనే ఈ సంకెళ్ళ నుంచి తప్పించుకునే మార్గం ఏమిటి? పెళ్ళి అంటే కట్టుకున్న మొగుడికి బానిస అయి బ్రతకటమే! కూర్చోమంటే కూర్చోవాలి! నుంచోమంటే నుంచోవాలి! పిల్లలను కనాలి! వాళ్ళని పెంచాలి! యిప్పుడున్నంత స్వేచ్ఛ పెళ్ళయిన తరువాత వుండదు. అత్తయ్య చాటు బిడ్డ వినాయకం బావ!....యిప్పుడేదో చాటుగా పుస్తకాలుతెచ్చియిస్తున్నాడుగానీ, రేపు తల్లి వద్దంటేమానివేస్తాడు అసలే మెతక! యింక తల్లి ఆజ్ఞ అంటే తలవంచాల్సిందే! యింక ఈ జీవితంలో తన కోరిక నెరవేరదా??....
కావేరి పెద్ద సమస్యల్లో ఇరుక్కుపోయింది..అలా ఆలోచించుకుంటూనే తల్లికి చెప్పి స్కూలుకి బయలుదేరింది....రోజూ సుబ్బులుని పిలుచుకుని వచ్చేది! ఈరోజు ఆ సంగతి మరిచిపోయి కాలువగట్టుకి చేరుకున్నది..వెనుకనుంచి "కావేరీ కావేరీ" అన్న పిలుపు వినిపించినా తిరిగిచూడలేదు! కనీసం ఆ పిలిచేది ఎవరో? అని కూడా చూసుకోలేదు!
"తను హీరోయిన్ ఎలా అవ్వాలి??.."
అన్న ఆలోచనే! తన జీవిత ధ్యేయం. సూపర్ స్టార్ కృష్ణ ప్రక్కన హీరోయిన్ నటించాలి! చిరంజీవితోపాటు ఫాస్ట్ డాన్సు చేయాలి! శోభన్ బాబుతో కలిసి డ్యూయెట్ పాడాలి! యివన్నీ సాధ్యం కావాలంటే తను పెళ్ళికి దూరంగా ఉండాలి!....సినీ హీరోయిన్ అవ్వాలనుకుంటే ఏంచేస్తే తన కోరిక తీరగలదు??
"ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా అలా వచ్చేస్తున్నావేమిటే కావేరీ??" అంటూ భుజం మీద గట్టిగా చేత్తో కొట్టింది సుబ్బులు!
దెబ్బ ఛేళ్ మన్నా, బాధ కలిగినా హీరోయిన్ అవ్వాలని కలలుకంటున్న కావేరికి అనిపించలేదు. పైగా నవ్వుతూ అంది.
"నువ్వా సుబ్బులూ!....ఏమిటి? నాకంటే ముందే వచ్చేశావు??"
"నీ కోసం చూసి చూసి యిప్పుడు బయలుదేరాను. నీకు కడుపులో నెప్పి తగ్గలేదేమోనని అందుకని రాలేదేమోనని నేను బయలుదేరాను...నన్ను పిలవకుండా వెళ్తున్నావంటే ఏదో విశేషం వుందిలే!"
