Previous Page Next Page 
కావేరి పేజి 11

    మస్తాన్ సినిమాతారల పేర్లు చెప్పటంతో కావేరికి అప్పటికప్పుడు అక్కడే మూట విప్పించి జయప్రద వేసుకుని నటించిన ఆ లంగా ఓణీ తీసేసుకోవాలనిపించింది. తను స్కూలుకి తీసుకెళ్ళవలసి వస్తుంది....అందుకని మస్తాన్ తో చెపింది తల్లికి చెప్పమని-


    "జయప్రద వేసుకున్న లంగా ఓణీ తీసుకోమను!"

    "అలాగేనమ్మా! అయినా మీరు తిరిగి వచ్చేవరకూ ఊరిలోనే వుంటాను- అంతకీ అమ్మగారు కొననంటే మీరు వచ్చాక కొందురుగాని లెండి! ఆ లంగా ఓణీ వేసుకుని ఆ సినిమాలో జయప్రద నటించిన తరువాతనే వరుసగా డజను సినిమాల్లో బుక్ అయింది!" అని ఓ సెంటిమెంటు కావేరిమీద విసిరి సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు మస్తాన్!.....

    "నువ్వూ జయప్రద అంత హీరోయిన్ వి అయిపోతావేమో? ఆ బట్టలు కొనుక్కుని వేసుకో!..." అంది సుబ్బులు!....

    ఆ వచ్చే మస్తాన్ నిన్న వచ్చినా బాగుండేది! తనకి ఏ యే రంగులు నచ్చేవో చూసి తీసుకునేది! ఎటూగాని వేళలో వచ్చాడు....తను చెప్పగానే తీసుకుంటుందేమిటి తల్లి??...సాయంత్రం వరకూ వుంటానన్నాడుగా? తల్లి తీసుకోక పోతే అప్పుడే చూద్దాం! అనుకుంది. స్కూలుకి వచ్చేసరికి కూడా షర్టు బెల్ అయిపోయింది.

    "కావేరీ! ఈ ప్రకటన చూశావా??"."

    అంటూ డ్రాయింగ్ మాష్టారు పేపర్ చేత్తో పట్టుకుని కావేరీ దగ్గరకు వచ్చి ఆ ప్రకటన తీసి చూపించారు.

    "మా ఊళ్ళో ఒక్క మా బావ తప్ప ఇంకెవరూ పేపర్ తెప్పించరు ఆ పేపరాయినా "ఉదయం" తెప్పించుతాడు. మీ చేతిలోనిది "ఆంధ్ర జ్యోతి". అంది లేచి నిలబడుతూ.

    "పేపర్ ఏదయితేనేమిగానీ కొత్త హీరోయిన్ లు కావాలన్న ప్రకటన చూడు! నువ్వు అప్లయ్ చేస్తే బాగుంటుందేమో??" అని పేపర్ చేతికిచ్చారు. యిలా మభ్యపెడితే కావేరి తనమీద ఏం చెప్పకుండా వుంటుందని ఆలోచించి ఆ పేపర్ తీసుకువచ్చాడు.

    కావేరికళ్ళు ఆ ప్రకటన మీదనిలిచిపోయాయి.

    "వయస్సు పదహారు, పద్దెనిమిది మధ్యలో వుండాలి. ఎత్తు అయిదూ రెండు; నాలుగు వరకూ వుండవచ్చును! అందమూ నాటకానుభవం వున్న వారికి ప్రాధాన్యత యివ్వబడును! ఆసక్తిగలవారు మూడు కార్డుసైజు ఫోటోలు క్లోజప్సు; బస్ట్ సైజులో మూడు వేర్వేరు రకాలకి చెందినవి పంపించవలయును....అర్హతగల వారిని ఎంపిక చేసి మేము నిర్ణయించిన తేదీనాటికి స్వంత ఖర్చులుతో రావలసి వుటుంది. ఆసక్తి గలవారు వెంటనే వివరాలతో వ్రాయండి!
   
                                                                                      రమ్య ప్రొడక్షన్స్.
                                                                               నార్త్ బోగ్ రోడ్సు   
                                                                               మద్రాసు_17
   

    చదవటం పూర్తి చేసిన కావేరికి ఎంతో సంతోషం కలిగించింది. తను వెంటనే వారికి వ్రాయాలి!....తన ఫోటోలు నచ్చి తనను మద్రాసు రమ్మనమని అంటే?? ఎలా వెళ్తుంది?....అసలు తనను వెళ్ళనిస్తారా??

    "వారు కోరినన్ని అర్హతలు నీలో ఎక్కువే వున్నాయి. నువ్వు వారి పరీక్షలకి నిలబడగలవు...నీలాంటి అందమయినవారే సినీ ఫీల్డులోకి తారాజువ్వలా దూసుకుపోగలరు....నీ అందమేమిటో నీకు తెలియదు. నిన్ను చూసేవారికి తెలుస్తుంది!....యింక ఎంత మాత్రం సందేహించకుండా అప్లయ్ చెయ్యి!...." అని ప్రోత్సహించారు.

    "ఫోటోలు మూడు రకాలువి కావాలట!..."

    "మొన్న నీకిచ్చినవి మూడు రకాలుగా తీసినవేగా? నాటకానుభవం కావాలన్నారుగా??...నువ్వు నాటకంలో నటించుతుండగా తీసినవిగా? ఆ సినిమా కంపెనీవారికి బాగా నచ్చుతాయి!..."

    "మీరెంత మంచివారండీ మాష్టారు??..." తాను అప్పుడే రమ్య ప్రొడక్షన్సువారి చిత్రంలో నటించుతున్న అనుభూతి కలిగింది....

    "నీకు నటనలోని మెళుకువలన్నీ నేర్పాలనే ఆరోజున అలా చేశాను....నువ్వేమో మరోలా అర్ధం చేసుకున్నావు!..."

    "అలాగని మీరు చెప్పలేదుగా మాష్టారూ?"

    "ఏదీ?....నువ్వు చెప్పనిస్తేగా?..."

    "పోనీ రేపటినుంచీ రమ్మంటారా మీయింటికి!"

    "వద్దు!....వద్దు...!"

    చప్పున అన్నాడు. ఆయన భార్యకి యిరుగు పొరుగు ఎవరయినా చెప్పుతారేమోనన్న భయం కలిగింది. కావేరీ వెళ్ళటం చూసిన ఓ ముసలాయన తనను అడగనే అడిగాడు.

    "ఆ వెళ్తున్న పిల్ల నీదగ్గరకే వచ్చినట్టున్నదే!"

    "కాదండీ!....మన పక్కవాటా వారింటికి వచ్చినదండీ! వారి బంధువుల అమ్మాయి అనుకుంటాను!" అన్నాడు ఏమీ ఎరుగని వాడిలా ఈ ముసలాయనకీ ఆ పక్కింటి వారికీ మనస్పర్దల కారణంగా ఆరు నెలల నుచీ ఎడమొఖాలు పెడముఖాలుగా వున్నారు ఆ కాంపౌండ్ లో ఎనిమిది కాపురాలు వున్నాయి. గేటుకి ఓ వైపుకి డ్రాయింగ్ మాష్టారు యిల్లు వుండటం వలన ప్రత్యేకించి బయటకివస్తేనేగాని ఆ యింటికి ఎవరు వచ్చేది తెలియదు. ఆ ముసలాయన దగ్గుతూ వుంటున్నాడని చెప్పి వరండాలో మంచంవేశారు. చూపు ఆనకపోయినా అనుమానం వచ్చినదంటే మాత్రం పట్టిపట్టి చూస్తాడు.

    ఇంకానయం! కావేరి ఎలాంటిగొడవా చేయలేదు. చేసివున్నట్లయితే తన పరువు ఏం కావాలి? అందుకే భయపడ్డాడు.

    "సమయం రాకపోతుందా? నలిపినలిపి నాశనం చేయనా?" అని సరిపెట్టుకుని ఆ సమయంకోసం ఎదురుచూస్తున్నాడు. ఆరోజు రాకపోదన్న నమ్మకంవుంది!

    "మనస్కూల్ యానివర్సిడే కి మంచి నాటిక వ్రాశాను ప్రదర్శింపచేయాలని! స్త్రీ పాత్రకి ఎంతో ప్రాముఖ్యత వున్ననాటిక. నువ్వు నటించుతానంటే యింకా ఎక్కువగా ఆ పాత్రను మలచి రాస్తాను. నీకు మంచి తర్ఫీదు యిచ్చి ఆ పాత్రలో లీనమయినట్టు నటించేలా తీర్చిదిద్దుతాను. నీ అమోఘమయిన నటనకి మన టీచర్సేకాదు! ఆహ్వానితులుకూడా ఆశ్చర్యపోగలరు! నువ్వు నటివి అవటానికి యిప్పటి ఈనాటిక నీకుపునాది అవగలదు! నటించుతావా?"

    "ఆతప్పకుండాను. మీరెలా చెపితే అలా చేస్తాను రిహార్సలు  ఎప్పటినుంచి మొదలుపెడతారు? ఎక్కడ?" అంది కావేరి.

    "హైస్కూలులోనే స్టాఫ్ రూంలో రోజుకి ఓ గంట అయితే సరిపోతుంది. ఇంకా వ్రాయవలసివుంది. అయినతరువాత నటీనటులను ఎన్నిక చేసి ఆ తరువాత రిహార్సల్స్ మొదలుపెడతాను. నేను నీ విషయంలో ఎందుకింత శ్రద్ద చూపించుతున్నానన్న అనుమానం రావచ్చును! నువ్వు ఎప్పటికయినా పెద్ద సినీతారవుగలవన్న నమ్మకంనాకున్నది. అవుతావు కూడాను. అప్పుడు నన్ను మర్చిపోవుకదూ?"

    "ఎలా మర్చిపోగలను మాష్టారూ? మీ ఆశీస్సులు పొందిన నేను సినీతారనయితే అంతకంటే అదృష్టం లేదని పొంగిపోతాను!"

    "అంతేనా? ఈ గురువుకి ఏమయినా సమర్పించుకుంతావా? లేదా?"

    "ఏం కావాలో కోరుకోండి మాష్టారూ?"

    "నువ్వు పెద్ద సినీతారవయితే నీ కాల్షీటులు, షూటింగ్ తేదీలు, అగ్రిమెంట్ లు, డబ్బు లావాదేవీలూ అన్నీ చూసుకునేటందుకు ఓ సెక్రటరీ అవసరపడతాడు. ఆ సెక్రటరీగా నన్నే నియమించుకో కావేరీ! సెక్రటరీగానేకాక నీ నటన విషయంలోకూడా మరింత శిక్షణయిచ్చి అఖిలాంధ్ర ప్రేక్షకుల ఆరాధ్య సినీతారగా చేయగలను!"

    డ్రాయింగ్ మాష్టారు అలా అంటుంటే కావేరికి పట్టరానిసంతోషం కలిగింది.

    ఆయన మనసుని అర్హ్ద్మచేసుకోలేక మూర్ఖంగా ప్రవర్తించింది. నిజానికి ఎవరిమీదా చూపించని శ్రద్ద తనమీదనే చూపించుతున్నాడంటే నిజానికి తనలో సినీతారగల అంశాలు ఎన్నో వున్నాయి.

    కావేరి ఆలోచనలో పడిందని గ్రహించి నెమ్మదిగా అక్కడనుంచి బదిలి కుర్చీదగ్గరకు వెళ్ళాడు. తనమీద ఆరోజు జరిగిన సంఘటనలను ఎవరికయినా చెప్పుతుందేమోనన్న భయం పట్టుకుంది. ఈ విధముగా నయినా ఉబ్బేస్తే మరిచిపోతుందని ఆలోచించి మరీ వల్లించాడు. నువ్వు సినీతారవు కాగలవు అనంటేచాలు! పిచ్చిముండ! ఎంత పొంగిపోతుందో. గాడిలో పడవేశాను. యింక తనకి ఢోకావుండదు! ఏది ఏమయినా రేపు తను వ్రాసిన నాటికలో వేషం వేయించాలి! అనిమాత్రం అనుకున్నాడు.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS