Previous Page Next Page 
జొన్నలగడ్డ రామలక్ష్మీ కధలు -1 పేజి 9

 

                            మల్లెపూల మంచం

                                                               జొన్నలగడ్డ రామలక్ష్మీ

                                 

    ఎవరో తలుపు తట్టగానే ఆమె ఒక్క పరుగున వెళ్ళి తలుపు తీసింది. తలుపు తీసేక ఎదుట కళ్ళబడిన వ్యక్తిని చూసి నీరస పడిపోయింది.
    "లక్ష్మీకాంతం మీపేరే కదండీ --" అన్నాడతను.
    "అవును -- " అన్నదామె.
    "టెలిగ్రాం --" అన్నాడతను.
    ఒక్కసారి ఆమె గుండె అదిరింది. ఇప్పుడు టెలిగ్రాం ఏమిటి?' ఎవరి దగ్గర్నుంచి?
    "నువ్వే చదువు -- అందులో ఏముందో?"-- అన్నదామె.
    అతడామె వంక జాలిగా చూసి -- "మీకు ఇంగ్లీషు రాదా?" అన్నాడు.
    "పోనీ అలాగే అనుకో -- ముందు అందులో ఏముందో చదువు------"
    "ఫాదర్ సీరియస్ ....అంటే...."
    'అర్ధం చెప్పక్కర్లేదు -- ఇది నా టెలిగ్రాం కాదు. ఎందుకంటె నాకు తండ్రే కాదు-- ఆ వరుస వాళ్ళెవ్వరూ బ్రతికి లేరు --"అన్నది లక్ష్మీ కాంతం.
    "మరి లక్ష్మీ కాంతం మీరేనన్నారు ....' అన్నాడతను.
    "ఏదీ ఆ అడ్రసు ఒకసారి నన్ను చూడనీ...." అంటూ టెలిగ్రాం అతడి వద్ద నుంచి తీసుకుని చూసి -- "నాయనా నీకు ఇంగ్లీషు సరిగా రాదా?' అన్నది.
    "ఎమయిందండీ ?" అన్నాడు మెసెంజర్.
    "ఇది నాకు కాదు! లక్ష్మీ కాంతం గారిది. మా యింటికి కుడి వైపు నుంచి నాలుగో యిల్లు దీని మీద MR .S లక్ష్మీ కాంతం అని వుంటే నువ్వు MRS లక్ష్మీ కాంతం అని చదివినట్లున్నావు-" అన్నది లక్ష్మీ కాంతం.
    మెసెంజర్ ముఖం యింత చేసుకుని వెళ్ళిపోయాడు. ఎదుటివాళ్ళ సత్తా తెలుసుకోకుండా మరెన్నడూ తన తెలివి ప్రదర్శించకూడదని అతడు గ్రహించాడు.
    లక్ష్మీ కాంతం తలుపులు వేసుకుని మరోసారి టైము చూసుకుని -- "అయినా అతడప్పుడే యెందుకు వస్తాడూ -- యింకా రెండు గంటలు టయిముంది ?' అనుకున్నది.
    కానీ ఆమె అసహనంతో బాధపడుతున్నది.
    ఈరోజు ఎలాంటిది? జీవితంలో మళ్ళీ యిలాంటి రోజూ యెదురురాదు. తన మనసుకు నచ్చిన మగవాడికి తన సర్వస్యం అప్పగించుకోబోతున్నది. ఎన్నేళ్ళుగానో తీరని కోరికలకు ఈరోజు రూపకల్పన చేయబోతున్నది.
    ఆమెకు సత్యమూర్తి గుర్తుకు వచ్చాడు.
    ఏనాటి సత్యమూర్తి ?
    తను కాలేజీలో చదివే రోజుల్లో అతణ్ణి ఆరాధించింది. అతడు తన్ను ప్రేమించాడు. ఒకరు లేకుండా ఒకరు బ్రతికే దెలా అనుకున్నారు. పెద్దలి ఈ వివాహానికి అంగీకరించలేదు. ప్రేమికులు విడిపోయారు.
    ఒకర్నీ విడిచి ఒకరు బ్రతకలేమనుకున్నారు. కానీ పదేళ్ళు గడిచినా యిద్దరూ బ్రతికి వుండడమే కాక ఎంతో ఆరోగ్యంగా కూడా వున్నారు.
    అనుకోకుండా రెండు రోజుల క్రితం ఒక పెళ్ళిలో ఒకరి నొకరు కలుసుకున్నారు.
    ఇద్దరూ కుటుంబాలతోనే కలుసుకున్నారు.
    అప్పుడు లక్ష్మీ కాంతానికి అనిపించింది -- యిన్నాళ్ళూ తను బ్రతికింది ఓ బ్రతుకేనా అని!
    అలాగని భర్త ఆమెకు ఏ లోటూ చేయడం లేదు. ఆమెకు డబ్బు, హోదా అందమయిన పిల్లలు.... అన్నీ అమిరాయి.
    అయితేనే -- మనసులో తీరని కోరిక ఒకటి వున్నది. సత్యమూర్తిని చూడగానే ఆ కోరిక పురి విప్పింది. ఓక్కసారి ....సత్య మూర్తితో.
    అదేం ఆశ్చర్యమో సత్యమూర్తి కి కూడా లక్ష్మీ కాంతాన్ని చూడగానే అటువంటి కోరికే కలిగింది. ఇంకా ఆశ్చర్యమేమంటే తన స్నేహితురాలికి వివాహమైనదని తెలిసుండీ కూడా అతడేలాగో ఏకాంతాన్ని సంపాదించి ఆమెకు తన కోరికను తెలియ బర్చాడు.
    లక్ష్మీ కాంతం అతడిని సానుభూతితో అర్ధం చేసుకున్నది. ఆమె సానుభూతిని పెంచే విశేషాలనేకం ఆమెకు అఫైన తెలిశాయి. అందుకే ఆమె అవకాశం కోసం ఎదురు చూస్తున్నది.
    ప్రస్తుతం పిల్లలిద్దరూ ఊళ్ళో లేరు. తాతగారింటికి వెళ్ళారు.
    లక్ష్మీ కాంతం వాళ్లనేప్పుడూ అలా ఒంటరిగా పంపలేదు. ఇద్దరూ మగపిల్లలు. పెద్దవాడి వయసు ఏడు. రెండో వాడి వయసు ఆరు. వాళ్ళు తల్లిని విడిచి వుండలేరు. కానీ సత్యమూర్తి కోసం ఆమె వాళ్ళను తాతగారింటికి పంపేసింది.
    ఈరోజు తను చేసిన ఏర్పాట్లు చూసి సత్యమూర్తి డంగైపోతాడు.
    లక్ష్మీ కాంతం పడకగదిని నడిచింది. గదిలో అడుగు పెట్టగానే కమ్మని పరిమళం. ఆ పరిమళం అదో రకం మత్తును కలిగించగా -- "అయ్యో -- సత్యమూర్తి -- నీవు అప్పుడే రాలేదా?" అనుకున్నది.
    గదిలో విశాలమైన మంచం. ఆ మంచం మీద వాటిపై మెత్తటి ఫోం బెడ్స్ . మల్లె పువ్వు లాంటి తెల్లటి దుప్పటి, మత్తెక్కించే మల్లె పూవు. గదిలో వున్నది కృత్రిమమైన సెంటు పరిమళమయితే యిది సహజమయిన అద్భుత పరిమాళం.
    లక్ష్మీ కాంతానికి వివాహమైన తోలి రోజున కూడా యింత అద్బుతానుభూతి కలుగలేదు. ఈరోజు ఏదో థ్రిల్. అది మాటలకే కాదు -- మనసుకు కూడా అందడం లేదు.
    అయితే ఆమెకు తెలుసు!
    తను తప్పు చేస్తున్నది. తన కిద్దరు పిల్ల లున్నారు. భర్త వున్నాడు. సమాజంలో హోదా వున్నది. ఒకనాటి సత్యమూర్తి కోసం ఈనాడు అన్నింటినీ వదులుకునేందుకు సిద్ద మవుతున్నది.
    అందుకు కారణం లేకపోలేదు. కారణం తలచు కున్నప్పుడల్లా ఆమెకు తను తప్పు చేయడం లేదన్న భావం కలుగుతుంది.
    సత్యమూర్తి , తను శారీరకంగా ఒకటి కాకపోయినప్పటికీ మానసికంగా భార్యాభర్తలను మించి దగ్గరకు వచ్చారు. అ రోజుల్లో, భావి జీవితం గురించి ఎన్నో కలలు కన్నారు. తమ కలలు నిజమవుతాయని ఆశపడ్డారు.
    లక్ష్మీ కాంతానికి అడ్వెంచర్ అంటే యిష్టం. సర్యమూర్తికీ అంతే!
    అయితే అప్పుడు పెద్దలచాటు పిన్నలు కావడం వలన ఏమీ చేయలేక పోయారు. ఇప్పుడిద్దరు తమకు తామే పెద్దలు.
    అయితే....
    ఒక్కసారి సత్యమూర్తి తో కలిసేక అది పాపమే అవుతుంది. ఇంతవరకూ జీవితంలో తను ఏ పాపమూ చేయలేదు. తను తప్పు చేసినా సరే పాపి మాత్రం కాకూడదు అందుకు ఏం చేయాలి ?
    పాపాన్ని పాపంతోనే కడగాలి.
    అంటే మరో పాపం చేయాలి.
    తనను పాపిని చేసిన ఆ మనిషిని....
    "పాపం ....శేఖర్ ...." అనుకున్నది లక్ష్మీ కాంతం .
    శేఖర్ ఆమె భర్త.
    లక్ష్మీ కాంతం మంచం మీద తలగడను కాస్త కదిపింది. తలగడ క్రిందకు చేయి పోనిచ్చింది . ఆమె కోరిన వస్తువు చేతికి తగిలింది. సంతృప్తి తో ఆమె కళ్ళు మెరిశాయి. ఆమె ఆ వస్తువును బయటకు లాగింది.
    ఒక్కసారి కళ్ళు జిగేల్ మన్నాయి.
    అది అరంగుళాల పొడుగున్న చిన్న కత్తి.
    పాపం....శేఖర్ ఇలా జరుగుతుందని ఊహించనైనా ఊహించడు.
    లక్ష్మీ కాంతం కత్తిని మళ్ళీ తలగడ క్రిందకు తోసేసింది.
    
                                     2
    అతడు టేపు రికార్డరు కట్టేశాడు.
    చాలా అసహనంగా వున్నదతనికి. టైము చూసుకుని, "ఆఖరికి సెకండ్ల ముల్లు కూడా కడుల్తున్నట్లనిపించడం లేదు--" అనుకున్నాడు.
    "సత్యమూర్తి! తప్పు చేయడానికి కూడా ఇంత అసహనమా?" అన్నదతడి మనసు.
    "తప్పు....."అతడు నవ్వుకున్నాడు.
    "నేను తప్పంటూ చేస్తే అది కాంతాన్ని వదులుకోవడమే..."
    "కాదు....నీకు పరస్త్రీ వ్యామోహం ...------" అన్నది మనసు.
    తనకు పరస్త్రీ వ్యామోహమా?" సత్యమూర్తీ ఆత్మ పరిశీలన చేసుకున్నాడు.
    అతను, లక్ష్మీ కాంతం ఎన్నో సార్లు ఏకాంతంలో ఒకరి కొకరు దగ్గరగా వున్నప్పుడు తానెప్పుడూ తొందరపడి ఆమెను ప్రోత్సహించలేదు. ఆమె ఆడది....తను జాగ్రత్త తీసుకోవడం ఆశ్చర్యం లేదు! మగవాడిగా తను ఆమెకు మించి జాగ్రత్త తీసుకున్నాడు.
    అది స్త్రీ వ్యామోహమా?"
    అటుపైన వివాహమయ్యేక ఆమెను తప్ప మరోస్త్రీని కళ్ళ జూడలేదు. అందులోనూ తనకు అవకాశాలు కూడా వచ్చాయి. అందులోనూ ఆఫీసులో మిస్ జూలీ వున్నది. ఆమెకు శీలం మీద , వివాహం మీద ఏమాత్రం నమ్మకం లేదు. అది యెందరో మగవారికి అదృష్టమయింది. ఆ అదృష్టాన్ని తను స్వీకరించలేదు. స్వీకరించాలని అనుకోలేదు. ఆ అదృష్టం పోగొట్టుకున్నానని కూడా అనుకోలేదు. అసలది అదృష్టమనే గుర్తించలేదు.
    ఎక్కడుంది స్త్రీ వ్యామోహం తనలో!
    లక్ష్మీ కాంతాన్ని చూడగానేతన మనసు పురి విప్పిన నెమలిలా ఆడుతుంది. ఆమె తనకోసమూ, తనామే కోసమూ పుట్టారు. పెద్దలకు భయపడి అప్పట్లో యిద్దరూ చాలా పెద్ద పొరపాటు చేశారు. ఇప్పుడు దిద్దుకునే అవకాశం వచ్చింది.
    అయితే సత్యమూర్తి అంతరాత్మ అతడిని ఆగకుండా వేధిస్తూనే వున్నది.
    "ఒకప్పుడు మీరిద్దరూ యెంతో చనువుగా వుండేవారు. అయితే శారీరకంగా ఒకటి కాలేకపోయారు. అది తీరని కోరికగా నిన్ను వేధిస్తున్నది. ఆ కోరిక తీరితే ఏమీ వుండదు. అయితే ఆ కోరికలో తప్పు వున్నది...."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS