Previous Page Next Page 
శాంతినికేతన్ పేజి 11


    శాంతి పుట్టిననాడే గుర్తుంచబడిన ఆ ఫలపుష్పవృక్షాలు రెండూ కూడా శాంతి నామరేయమే పొందాయి. అడుగిడిన మర్నాడే అంతటి ఆత్మశాంతినీ, తృప్తినీ యిచ్చిన ఆ తోటనూ, ఇంటినీ- మూడువేలు మాత్రమే ఖరీదు చేయగల దానిని - బలరామయ్య ఏడువేలకు కొనేశాడు, స్నేహితుడి దగ్గర. శాంతివనంలో, శాంతినిలయం లోనే శాశ్వతనివాస మేర్పరచుకున్నాడు. శాంతి నిలయం చుట్టూ శాంతివనంలో ప్రశాంతంగా ఆడుకుంటూ పెరుగుతూన్న శాంతి ఆయనకు ప్రథమ ప్రాణం-ప్రాణాధికం! శాంతి అభీష్టానికి వ్యతిరేకం జరిగితే, ఏ కారణంవల్లనైనా శాంతిహృదయం బాధకు లోనైతే తిరిగి తనకూ హృదయ శాంతి దూరమౌతుందని ఆయన నమ్మకం. శాంతినీ, కాంతినీ వెదజల్లే శాంతికి ఏవిధమైన కష్టమూ ఆ పితృహృదయం ఓర్చుకోలేదు. దినదిన ప్రవర్ధమానమౌతున్న చందమామవంటి కుమార్తెనూ, విరగబూస్తున్న శిరీషాన్నీ, ఏపుగా ఎదుగుతూన్న సన్నంగినీ, శాంతివనంలో ప్రశాంతంగా నిలిచి ఉండే శాంతి నిలయాన్నీ చూచుకుంటూ 'నాకు అయిదు శాంతులూ అయిదు ప్రాణాలు' అనుకొనేవాడు.
    ఇంతటి శాంతి చరిత్రకు సృష్టికర్త అయిన శాంతికి కాశీ ప్రయాణం విషయంలో కలిగిన అభిప్రాయం మార్పును బలరామయ్యగారు పట్టించుకోలేదు.
    "నీకిష్టం లేకపోతే బలవంతం లేదు, తల్లీ. మానెయ్యి" అన్నారు.
    కాని ఆ మాటలే శాంతి మృదు హృదయం పై బాగా పనిచేశాయి. ఏపనైనా వద్దంటే, చెయ్యాలనే ఔత్సుక్యం, ప్రతిష్టంభన ఎక్కువౌతాయి. కాని ప్రవాహ వేగ్నికి ప్రతిఘటించకుండ తల ఒగ్గే చిరుమొలకలాగా చేసుకొన్న నిర్ణయాన్నే ఎదుటివారు సమర్దిస్తే సాధారణంగా మనసులో తిష్ఠ వేసుకొన్న పెంకెతనం బింకం వీగిపోవడం సహజం. అదే శాంతి విషయం లోనూ రుజువైంది.
    "పోనీ, వస్తాన్లే, నాన్నా-ఇంటిదగ్గర కూర్చుని చేసేదేముంది గనుక" అంది కొంతసేపటికి. బలరామయ్యగారు నవ్వి ఊరుకున్నారు.
    "అంతకంతకు ఆయన గారాబం అధికమై పోతోంది. నీ ఆగడం అవధులు దాటిపోతోంది" అన్నారు లక్ష్మీదేవీ, శ్రీహరీ. అందుకు ఎవరూ మాట్లాడలేదు.
    కాశీయాత్రనుండి పదిహేనవ రోజుకు తిరిగి వచ్చిన తల్లిదండ్రులకూ, చెల్లెలికీ వీధిలోనే ఎదురైనాడు శ్రీహరి.
    "దేవుడి నేం కోరుకున్నానే, శాంతీ? ప్రయాణం బాగా జరిగిందా?" అని హాస్యం చేశాడు చెల్లెల్ని. శాంతి చిన్నగా నవ్వి ఊరుకుంది.
    లోపలికి వచ్చాక పద్మ అడిగింది, "దైవ దర్శనం బాగా జరిగిందా? కాశీలో ఎన్నాళ్ళున్నారు?" అని.
    చాలాసేపు అక్కడి విశేషాలు చెప్పింది, లక్ష్మీదేవి.
    "ఏం, శాంతీ, బొత్తిగా అంత ముభావంగా వున్నావు?" అనడిగింది తర్వాత పద్మ.
    శాంతిని, "తీర్ధయాత్ర నచ్చలేదా?" అన్నాడు అక్కడే వున్న శ్రీహరి.
    నెమ్మదిగా చెప్పింది శాంతి: "ఆలయాలలో ఎక్కడా భక్తీ, నిర్మలతా అనేవి కన్పించలేదు, వదినా. భగవంతుని పేరిట వాళ్ళు చేసే వ్యాపారాలూ, అక్కడ ఆ కొలది సేపైనా మదమాత్సర్యాలను మరిచిపోలేని త్రొక్కిసలాటలూ చూస్తే అక్కడ దేవుడు నివసించడానికి బదులు పారిపోతాడనిపించింది."
    బిగ్గరగా నవ్వాడు శ్రీహరి. పద్మ విస్తుపోయింది, "నీ ధోరణి ఎప్పుడూ వింతగానే వుంటుం"దంటూ.
    "వింతకాదు, వదినా. చూస్తే నువ్వూ అలాగే అంటావు. గంగానది పవిత్రమైనదని అందరూ అంటారు. ఒకప్పుడు కావచ్చుకాని ప్రస్తుతం చాలా అపవిత్రం చేసేశారని నా భావం. ఒక విషయం చెప్తాను విను. మణికర్ణికా ఘట్టంలో స్నానం చేస్తే పునర్జన్మే లేదట. ఆ పుణ్యాసక్తితో వచ్చి కోట్లాది యాత్రికులు స్నానం చేస్తూన్న ఆ పవిత్ర ఘట్టం ఎలా వుందో చెప్తాను విను. మెట్లమీదే శవాలను కాల్చేస్తున్నారు. 'సగంసగం కాలిన ఎముకలు, కండలు, బొగ్గులలో నిండి పోయివున్న ఆ పావంచాల మీహ్డుగానే దిగి రేవు లోకి వెళ్ళాలి. ఇక ఆ రేవులో ఎలా వుంటుంది? కొన్ని శవాలను నీళ్ళలోనే వదిలేస్తారుగా? ఆ శవాలు చూస్తేనే బేజారెత్తుతుంది. మేం వెళ్ళిననాడు యింకా దారుణంగా వుంది. ఒక నల్ల కుక్క చచ్చిపోయి, ఉబ్బిపోయి భయంకరంగా ఆ ఘట్టంలోనే తేలుతూంది. అక్కడే, దాని ప్రక్కనే, చుట్టూనే నిల్చుని అంతా స్నానం చేసేస్తున్నారు. భక్తిగా ఆ నీళ్ళు నోట్లో పోసుకుంటున్నారు. నాకెంత వెగటనిపించిందో! గట్టుమీదే నిల్చున్నాను. స్నానమే చెయ్యలేదు. గంగానది పవిత్రమే. కాని ఆ పవిత్రతను పాడుజేసేశారు.
    "ఇంత భక్తిగానూ స్నానంచేసి పవిత్రంగా వెళ్తే ఇక అక్కడి సంగతి. దారులన్నీ యిరుకు. సంధు గొందులు దాటి ఆలయానికి వెళ్ళాలి. ఆవులు, దూడలు అడ్డుగా నిల్చుని ఉంటాయి. ఇంతా శ్రమపడి వెళ్ళాక ఆ దేవుని దర్శనం సరేసరి. ఏం త్రొక్కిసలాట! ఒక్క క్షణం నిలువలేం మనమక్కడ.    
    "సరే, ఊరంతా ఉంది ఓ మాదిరిగా. ఇల్లు మీద యిల్లూ, మేడమీద మేడాను. ఇంచుమించు ప్రతి యింట్లోనూ, ప్రతి మేడమీదా శివలింగాన్ని ప్రతిష్టించుకున్నారు. అది ఒక వింతగానే ఉంది. విశ్వవిద్యాలయం చాలా బాగుంది. సుమారు పదకొండు వందల యకరాలట, ఆ విశ్వవిద్యాలయం విస్తీర్ణం. ముఖ్యంగా నన్ను విశ్వవిద్యాలయంలో పాలరాతి విగ్రహాలు-విశాలాక్షీ, విశ్వేశ్వరుడూ -బాగా ఆకర్షించాయి. చాలా సుందరంగా ఉన్నాయి ఆ ప్రతిమలు."
    "పోన్లే. ఏదో ఒకటైనా నచ్చింది నీకు." బిగ్గరగా నవ్వాడు శ్రీహరి.
    "కాని, అన్నయ్యా, ఒక విశేషం. కాశీ నిండా బుద్దుని ఆలయాలే. అక్కడ బౌద్ధమతం మరీ ఎక్కువగా ఉందనుకుంటాను. వివిధ దేశాల ప్రజలూ కనిపిస్తారక్కడ మనకు. నలుగురైదుగురు విదేశీయులు మన అలయంలోకి రావడంకూడా చూచాను."    
    "విశేషమే!"
    "కాదూ, మరి? సాయంకాలం అసలు చూడాలి, గంగానధిపై పడవలలో విహరించే జనాన్ని. దేశ దేశాల ప్రజలు, స్త్రీ పురుషులనేకులు కనిపిస్తారు. విహరించేవారూ, ఈతకొట్టేవారూ, ఒకరేమిటి చూచి తీరాలి."
    శ్రీహరి అన్నాడు: "నువ్వు చెప్పినది నిజమే. పుణ్యస్థలంగా, సాంస్కృతిక ప్రదేశంగా అనేక విధాల ప్రాముఖ్యంగల పట్టణం అటువంటి నిర్లక్ష్యస్థితిలో ఉండడం విచారకరమే మరి."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS