"ఎప్పుడు?"
"ఈ సాయంత్రం..."
ఆఫీసులో సుమారు నాట్య ప్రదర్శనం అయింది. సార్జంట్ మేజరు నాతో వాల్ రూం డ్యాన్సు చేసేడు. మిగిలిన వాళ్ళంతా "కొమిల్లా. కొమిల్లా. కొ.మి.ల్లా" అని దొమ్మరి డ్యాన్సు చేసేరు. నాగుండెల్లో "పద్మ పద్మ" అని ప్రతి ధ్వనిస్తూంది.
ఆ సాయంత్రం నాలుగున్నరకి మా వర్కుషాపు సిబ్బంది అంతా వెళ్ళిపోయింది. కారణాంతరాల వల్ల నేను, ఓ సీ. మా ఆఫీసు ఆర్డర్లీ వెనక వుండిపోయేం. మేం మర్నాడుదయం బైల్దేరాలి. మాకొక స్టేషన్ వాగన్ వుంది. ఆ రాత్రి ఓ సీ వెస్టాఫ్రికను రెజిమెంటు ఆఫీసర్ల మెస్ కి అతిథిగా వెళ్ళి తిరిగొచ్చి తనభాశాలోనే పడుకుంటాడు. నాకూ తనకీ మా ఆర్డర్లీ వంట చేస్తాడు. కూర ల్లేవు. బియ్యం, పాలడబ్బాలు, ఆటా, పంచదార, టీ వున్నాయి. నా దగ్గిర వెన్న, జామ్ వున్నాయి.
సాయంత్రం ఆరుగంటలకి నేను చెరువు కెళ్ళేను. కాలిపోయిన షిరాజ్ పూరు చూస్తే నాకు దుఃఖం కలిగింది. అబ్దుల్, ఆ తని కొడుకు కూతుళ్ళ ఆత్మలు ఆ బూడిదెలో తిరుగాడు తూన్నట్టని పించింది.
స్నానం చేసి తిరిగొచ్చేసరికి బాగా చీకటి పడింది. నక్షత్రాలు మెరుస్తున్నాయి. గాలి బాగా వీస్తూంది. ఖాళీ అయిన మా యూనిట్టుకి, కొంచెం దూరంగా వున్న వె.ఆ.రె జి మెంటుకీ మధ్య వున్న రోడ్డు బావురుమంటూంది. నేను నా గదిలో కెళ్ళి బట్టలు మార్చుకు బైటకొచ్చా.
పక్కనేవున్న గార్డు రూంతలుపు మూసి వుంది. బైట రైఫిలుతో పహరా ఇస్తూండవలసిన ఆర్డర్లీ లేడు. దగ్గిరకెళ్ళి చూశా. గదిలో దీపం కూడా లేదు, తలుపు తోశా అడ్డంగా వున్న కుర్చీ కదిలింది. ఇంకా బలంగా తోశా. తడక తలుపు విడిపోయి అడ్డంగా వున్న కుర్చీలు వగైరా ఒక దాని మీదొకటి పడిపోయేయి. లోపలికెళ్ళి అగ్గి పుల్ల వెలిగించా. ఆశ్చర్యం! మేగజీనులో వున్న "త్రీనాట్ త్రీ" రైపిళ్ళవరసల మద్యని ఆర్డర్లీ బోర్లా పడుకున్నాడు. నేనతన్ని తట్టిలేపా. నోట మాటరాక సౌంజ్ఞ చేస్తూ ముక్కు మీద వేలేసుకున్నాడు శబ్దం చెయ్యొద్దని సూచిస్తూ, నాకు మరీ ఆశ్చర్యం వేసింది.
"ఉర్సాస్! ఏవిటాలావున్నావు?"
"ష్! సాబ్! గట్టిగా మాట్లాడకు" గుసగుసలాడేడు.
"ఏం ? ఏమొచ్చింది, భూతనా? ఏదీ?"
"వెళ్ళిపోయుంటుంది..."
నేను నవ్వేను. హరికేసు లాంతరు వెలిగింపించేను, వెంటనే ఉర్ఫాన్ తాళాలు నా దగ్గిర్నించి తీసుకుని, మేగజీనులోంచి రైఫిలుతీసి ఐదు రౌండ్లు నింపేడు.
'కొంపముంచేవు సాబ్? అన్ని రైఫిళ్ళు మేగజీనులో పెట్టి, తాళంవేసి, తాళాలు పట్టుకు పోతే , నేను బతకాలా చావాలా?"
"ఏం? జపానీ లొచ్చారా?" నవ్వేను.
"నవ్వకు సాబ్! మా అమ్మకి నేనాఖరి కొడుకుని."
ఉర్ఫాన్ పంజాబీ ముస్లిము, ఇరవై యేళ్ళుంటాయి. సుమారు యెత్తు, బలంగా వుంటాడు.
ఉర్ఫాన్ సేఫ్టీ కాచ్ లాక్ చేసి, ట్రిగ్గరు వీణ మీటినట్టు నొక్కుతూ చెప్పాడు.
"నువ్వలా వెళ్ళేవో లేదో చూడూ మన లంగరు ఖానా వెనక నించొచ్చింది పెద్ద యెలుగు బంటి, ఇటే వస్తోంది. నేను గార్డు రూము ఓరకి నక్కిపోయేను. అది వెనక్కాళ్ళమీద నడుస్తూ కుప్పిగెంతులేస్తోంది. నా చేతిలో రైఫిల్లేదు నిమ్మళంగా గార్డు రూంలో దూరా, రైఫిళ్ళన్నీబంద్. తాళంలేదు. చావొచ్చింధనుకున్నా. ఆ గొడ్డు నీ గదిలో కెళ్ళింది. దుబ్బు దుబ్బున నాట్యం చేసింది. తరవాత యిటు మళ్ళింది. ఈ తలుపుకి గొళ్ళెం లేదు. వెంటనే దీపం ఆర్పి తలుపు మూసి కుర్చీ, బల్ల, అన్నీ అడ్డుపెట్టా, తరవాత మేగజీన్లో దారి, వూపిరి బిగబట్టి పడుకున్నా. ఆ గొడ్డు తిన్నగా యిక్కడికే వొచ్చింది. ముట్టెతో తలుపు తోశి, నాలుగైదు సార్లు "మ్హు, మ్హు, అంది. అల్లా కసమ్! నావ నైపోయిం దనుకున్నా. కాని అల్లా కాపాడేడు. అది తలుపు గట్టిగా తియ్యలేదు. రోడ్డు వేపు "బబ్బబ్బబ్బ" అని అరుస్తూ పారి పోయింది. నేను అంతా విని విరగబడి నవ్వా. ఉర్ఫాన్ కి పుడుకు మోత్తనం వచ్చింది.
"ఏవిటి సాబ్ : నవ్వుతావు! కాస్త అది ముందూ, మువ్వు వెనక అయిపోయేరు. అది నీ గదిలో కొచ్చినప్పుడు. నువ్వుంటే నీ పని తెలిసేది..."
నేను మళ్ళీ విరగబడి నవ్వేను.
"చూడు భయ్యా, నువ్వు సిపాయిని, ఇంతపిరికి పందవనుకోలేదు. ఎలుగొడ్డుకి జడిసి పోయిన వాడివి జపానీయులతో ఏం యుద్ధం చేస్తావ్? గుండెకావాలి దోస్త్! మగగుండె!
అతనికి పౌరుషం వొచ్చింది.
"నా దగ్గిర ఆయుధం లేదుకదా సాబ్! ఉంటే ఆ....భలూకీ జడుస్తానా. ఇప్పుడు రమ్మను. ఢనా మనిపించేస్తా, అని అవతల కెళ్ళి చీకట్లోకి చూస్తూ "రావే....భలూ! నీ..." అని గట్టిగా తిట్టేడు. నేను మళ్ళీ విరగబడి నవ్వేను.
"సరే సరే దోస్త్? ఏమైనా వంట చేసేదా?
"హుఁ సాబ్! పరాంఠె ఖీరే"
ఇద్దరం భోంచేసి. సిగరెట్లు కాలుస్తూ కబుర్లాడుకున్నాం, రాత్రి పదిగంటలకి ఓ. సీ. వచ్చాడు.
"అంతా ఓకే?"
"ఓ కే సార్! కాని యిక్కడొక పెద్ద యెలుగు బంటి తిరుగుతోంది......భద్రం" .... నేను.
"రివాల్వరు సిద్ధంగా వుంటే."
అతను తన గదికి వెళ్ళిపోయేడు.
మర్నాడుదయం ఏడు గంటలకి ప్రయాణానికి సిద్దంగా వున్నాం. కేబిలొచ్చింది.
'సిక్త్సిండియన్ హెవీ యాకాక్ వర్కు షాపు. 12 ఎ. బి. సి. ఓ. తోవలో వున్న కర్రవంతెన కూలిపోయింది. మర్మత్తు మూడు నాలుగు రోజులు పడుతుంది. అంతవరకూ రోడ్డు ప్రయాణం బంద్-అడ్మిన్ కమ్."
ఓ సీ కేబిలు నాకందించేడు. నేను చదివా.
"ఏం చేద్దాం సర్"
"ఏం చెప్పేది మనం యిక్కడ యిరుక్కుపోయేం...."
రైలుమీద పోతే?"
"ఈ స్టేషను వేగనో..."
"చార్లీ బ్యాటరీ యింకా కదల్లేదు. వాళ్ళ కప్పజెప్పేద్దాం. మీ వుద్దేశం..."
"కరెక్ట్: నువ్వు కరెక్ట్."
* * *
9
వెంటనే ఓసీ చార్లీ బ్యాటరీకి వెళ్ళి అక్కణ్ణించి ఫోన్లో అఖేరా ఆర్. టి. ఒ. తో మాట్లాడాడు పదకొండుగంటలకి ఒక రైలు కొమిల్లా వెళుతూంది. దాంట్లో ఒకపెట్టె మాకివ్వడానికి యేర్పాటు చేస్తానన్నాడు ఆర్, టి. ఓ.
మేం పదిగంటలకి బైల్దేరేం. ముందు చార్లీ బ్యాటరీకెళ్ళేం. అక్కడ ఒక పార్షంటు మా స్టేషను వాగన్ లో యెక్కేడు. మమ్మల్ని స్టేషన్ కి దిగబెట్టి బండి తీసుకుపోతాడు.
అఖేరా స్టేషను చేరేసరికి సుమారు పదకొండైంది. బాగా యెండెక్కింది. మాకు కేటాయించిన కంపార్టుమెంటులో సామాన్లు సర్దేం. పదకొండు దాటిందిగాని బండి కదల్దు, ఓసీ, నేనూ ఆర్. టి. ఓ, ఆఫీసుకెళ్ళి బండెప్పుడు బైల్దేరుతుందని అడిగేం. ఏదో అవాంతరం వచ్చింది. రెండుగంటలకి ముందు రైలు కదల్దని తెలిసింది.
అది యెలాంటి రైలుబండో తెలీదు. డెడ్ లైనులో వుంది. చాలా గూడ్సు పెట్టెలు కూడా వున్నాయి. మాది పై తరగతి పెట్టె. దాని తరవాత గార్డుపెట్టె వుంది.
మొదట ఆ రైలు ఫ్లాట్ ఫారానికి కొంచెం యెగూని వుంది. మేం అందులో ప్రవేశించిన గంటకి వెనక్కి "షంట్" చెయ్యబడి డెడ్ లైను చివరకొచ్చింది.
మా పెట్టె ఆగిన దగ్గిర ఒక దిబ్బ వుంది. అది చాలా ఏటవాలుగా వుంది, దానిమీద ఎత్తు వెంపు తల, పల్లం వెంపు కాళ్ళు పెట్టి పాతిక ముఫ్ఫై మంది మనుషులు వెల్లకిలా పడుకున్నారు. ఆడా మగా వున్నారు. చాలామందికి ఒంటి మీద గుడ్డలేదు.
వాళ్ళ శరీరంలో ఒక్క నెత్తురు చుక్కైనా లేదు. అరతులం కండైనా లేదు. అస్థిపంజరాలే.
ఆ దృశ్యం చూసేసరికి మా ఓసీకి రోత కలిగింది. అవతలివేపునించి బండి దిగిపోయిరైలుపట్టాలు దాటి ఫ్లాట్ ఫారం మీదికి వెళిపోయేడు. నాక్కూడా ఆ మనుషుల్ని చూస్తే బాధ కలిగింది. ఉర్ఫాన్ని సామాన్లకి కాపలాపెట్టి నేనూ ఓ సీ దగ్గిరి కెళ్ళిపోయేను. నిప్పుల్లాంటి ఎండలో యిద్దరం కొంచెంసేపు ఫ్లాట్ ఫారం మీద పచారుచేసేం. ఉదయం ఏడుగంటలకి బిస్కట్లు తిని. టీ తాగేం. తరవాత మరేంలేదు. మాకు బాగా ఆకలేస్తూంది.
స్టేషనులో తినడానికేమీ దొరకదు. చివరకి సోడా కూడా లేదు. ఓ సి స్టేషనులో దొరికే నీళ్ళు తాగడు. జబ్బు చేస్తుందని భయం. దోమకుడితే నెత్తురొచ్చేదాకా పిన్నుతో పొడుచుకుని దానికి డెట్టాలు రాస్తాడు. ఇండియా అంటే అతనికంత భయం.
ఒంటిగంటైంది. బండి కదల్దు. మా కంపార్టు మెంటులో రొట్టె, వెన్న, జామ్ వున్నాయి. కాని అటువేపు వెళ్ళడమంటే భయం, రోతగా వుంది. కదలని బండి ఓ మూల. కడుపులొ యలకలో మూల అతన్ని పిచ్చెక్కిస్తున్నాయి. నా పరిస్థితీఅలాగే వుంది.
ఉల్ఫాన్ కిటికీ దగ్గిరికొచ్చి "వెన్న, సాండ్విచ్ తింటారా సాబ్" అన్నాడు. నేను ఓసీ వేపు చూశా. అతని జఠరాజ్ఞి భగ్గుమంది. ఫ్లాట్ ఫారం మీంచీ రైలు పట్టాల మీదికి ఒక్క దూకు దూకి. నాతో "పద" అన్నాడు. మేం తిరిగి పెట్టెలో దూరేం.
అతను పనిగట్టుకుని అటుపక్కకి వెళ్ళి తలుపు తీసి కిందికి చూశాడు. ఎండలో అస్థి పంజరాలలాగే వున్నాయి. వెళ్ళండి లంజకొడకల్లారా ఇక్కన్నించి పొండి. అని అరిచేడు. వాళ్ళు పలకలేదు. ఉలకలేదు అంగుళం కద లేదు. ఓసీ చంగున కిందికి దూకేడు. నన్నూ రమ్మన్నాడు. ఇద్దరం వాళ్ళని తేరిచూసేం.
"హవల్దార్! వీళ్ళని లేవగొట్టి తరిమేయ్" అని పట్టరాని కోపంతో అన్నాడు. నే నతని మొహంలోకి ఒకసారి చూశాను, తిరిగి వాళ్ళ వేపు చూశాను.
