Previous Page Next Page 
విరామం పేజి 9

 

    రాత్రి విందులూ, వీడ్కోలూ జరిగేయి. అసలు మానవ జీవితమే కలుసుకోవడం విడిపోడం, అందులో, యుద్ధ సమయంలో సైనిక జీవితంలో యిది తరచు సంభవిస్తుంది. ప్రపంచంలో మూల మూలల వాళ్ళు వొక చోట కలుస్తారు కలిసి కొన్ని రోజులు గడుపుతారు. విడిపోతారు. ఈ అనుభవానికి ఆదిలో కొందరు రక్త సంబంధీకుల్ని విడిచిపెట్టవలసినప్పుళ్ళాగే దిగులు పడతారు. క్రమేపీ ఈ అనుభవం అలవాటై పోతుంది.
    మర్నాడుదయం ఆర్. హెచ్. క్యూ కడుల్తూంది. ప్రభూ నాతో కరచాలనం చేశాడు. నా గుండెల్లో గాభరా వేసింది. మేలాసింగు వేపు నేను చెయ్యి జాపేను. అలాక్కాదని అతను నన్ను గట్టిగా గుండెకు అదుముకున్నాడు. నా కళ్ళంట నీళ్ళు బొటబొట కారేయి. అతని కళ్ళు చెమ్మగిల్లలేదు కాని ఉత్కంఠతో ఎరుపెక్కాయి. మాట పెకిలించుకొని "పిర్ మిలేంగే" అన్నాడు. వాళ్ళిద్దరూ ట్రక్కులో కెక్కేరు. "కాన్వాయ్" బైల్దేరింది, క్షణంలో కనుచూపుమేర దాటి పోయింది.
    పందొమ్మిది వందల నలభై వొకటి. అంతంలో ఆగ్నేయ ఆసియాయుద్ధం ఆరంభవైంది. మరుసటి యేడు ఆరంభంలోనే జపాను సైన్యాలు వల్లేరు మీద బండిలా పురోగమనం ఆరంభించాయి మొదట స యా మ్ పడిపోయింది. తరువాత రంగూన్ తో సహా బర్మా శత్రు వశమైంది, వాళ్ళ రాకకి ఇండియా పొలిమేరలు దడదళ్ళాడేయి.
    పందొమ్మిది వందల ముఫ్ఫై తొమ్మిది సెప్టెంబర్ నెల చరిత్రలో మరుపురానిది. పద్ధతి ప్రకారం యుద్ధం ప్రకటించకుండా, చివరి గడువైనా యివ్వకుండా, జర్మనీ నియంత, నాజీ హిట్లర్. ఆ నెల ఒకటో తారీఖున సాయంత్రం నాలుగ్గంటల నలభై ఐదు నిమిషాలకి ఆ శేష సైన్యంతో పోలెండు మీది కుపక్రమించాడు. హిట్లర్ సైన్యం "నడుస్తున్న వుక్కుగోడ." పోలెండు కొన్ని గంటల్లో చేతులెత్తేసింది. తరవాత హాలెండు. బెల్జియం పడిపోయేయి. ఫ్రాన్సులో దుర్బేద్యం అని పేరుపడ్డ "మాగి నాటులెను"ని జర్మనీ తప్పించి ఫ్రాన్సు మీద విరుచుకుపడింది. ఫ్రాన్సు పేకమేడలా పతనమై పోయింది.
    ఈ పరిస్థితికి ప్రపంచం తెల్లబోయింది. బ్రిటిష్ పెద్దలు మూకుట్లో కూరముక్కల్లా వేగి పోయేరు.
    ఇంగ్లండు జర్మనీమీద వెంటనే యుద్ధం ప్రకటించింది. అప్పటి బ్రిటిష్ ప్రధాని, నెవిల్ ఛాంబర్లేను రేడియో ద్వారా ప్రజల కిచ్చిన సందేశం చరిత్రాత్మకం.
    "హిట్లరు చెప్పిన ఏమాటా నమ్మరాని పరిస్థితి నేడు కలిగింది. ఈ పరిస్థితిలో, ఏ ప్రజలు గాని, దేశంగాని క్షేమంగా వుండలేదు. ఇది భరించరానిది. అంచేత ఈ పరిస్థితిని నిర్మూలించదానికి మనం నిశ్చయించేం. మీరంతా నిదానంతో, మనో ధైర్యంతో మీ విధి నిర్వర్తిస్తారని నాకు తెలుసు. మన సామ్రాజ్యంలో ప్రజలు కూడా మనకి అండగా నిలుస్తామని మాట యిచ్చి ధైర్యం గొల్పేరు. మిమ్మల్నందర్నీ దేవుడు దీవిస్తాడు. అతడు న్యాయాన్ని పరి రక్షిస్తాడు. మనం ఎదిరించబోతూన్నది. దురార్ధాన్ని, పశుబలాన్ని, దుష్ట సంస్థని, అక్రమాన్ని, పీడక శక్తిని, హింసని, న్యాయం వీటన్నిటినీ జయిస్తుందని నాకు దృఢ విశ్వాసం వుంది."
    పందొమ్మిది వందల నలభై ఒకటి జూన్ లో జర్మనీ రష్యా మీద హటాత్తుగా విరుచుక పడింది. ఈ వార్త విని అప్పటి బ్రిటిష్ ప్రధాని చర్చిల్ అదిరిపడ్డాడు. ఆవేళ రాత్రే, అంటే జూన్ యిరవై రెండున చర్చిలు బి బి. సి.లో మాట్లాడుతూ రష్యా ప్రమాదం స్వేచ్చా ప్రపంచానికే ప్రమాదం అన్నాడు.
    ఐరోపా యుద్ధంలో ములిగిపోయిన ఐక్యరాజ్యాల వాళ్ళు, ఆగ్నేయ ఆసియా యుద్ధరంగం మీద చూపించవలసిన శ్రద్ధ చూపించలేదు పైగా జపాను శక్తిని తప్పు అంచనా కట్టేరు. ఉపేక్షించేరు. అంచేత జపాన్ మెరుపులా పురోగమించింది.
    బర్మా రంగపు కీకారణ్యాల్లో, కొండలోయల్లో అవలంభించవలసిన యుద్ధ తంత్రం తెలీక బ్రిటిష్, ఇండియన్, గూర్ఖా చీనీ పటాలాలు చెలా చెదరై పోయాయి. తుట్టి తుట్టి లై పోయేయి. సరైన ఆయుధాల్లేక, మందుగుండు సామగ్రి లేక చిందవందరైన వేలాది పటాలాలు, తిండి నీరు లేక, జబ్బులు చేసి వైద్య సహాయం లేక, నిలవ నీడలేక, నడవలేక మిలమిల మాడిపోయేయి. కొన్ని డివిజన్లు నామరూపాల్లేకుండా నశించి పోయేయి దాంతో ఐక్య రాజ్యాలకి కనువిప్పైంది. వెంటనే తూర్పు రంగంలో యితర బలగాల్ని అమెరికను బలగం కలిసింది.
    నిమిషాల మీద లక్షల కొద్దీ సైన్యం ఆగ్నేయ ఆసియా రంగానికి తర్లించబడింది, శత్రువుని తిప్పికొట్టడానికి, పటాలాల ఆయుధాలు, దుస్తులు, ఒకటేమిటి అన్నీ మెరుగుచేసేరు. ఇటు కలకత్తా, అటు ఢాకానించి చిట్టగాంగు వరకూ ఎక్కడ చూసినా పటాలం పటాలం. ఊళ్ళల్లో కొండలమీద, లోయల్లో, మైదానాల మీద, రోడ్లమీద, వంతెనల మీద, రైళ్ళలొ, ఎక్కడ చూసినా పటాలం పటాలం. తూర్పు బెంగాలు కాలేజీల్లో, భవనాల్లో పటాలం పటాలం. కార్లు, లారీలు, చివరికి సైకిళ్ళు కూడా పటాలం వశ పర్చుకుంది. సివిల్ జీవిత వాతావరణం మందులోకి మాత్రం మిగిలింది. మిగిలినదంతా ఎక్కడికి పోయిందో చెప్పలేం.
    తట్టితే కవిత్వం పలికే మట్టి యినపబూట్ల కింద పగిలింది. సుందరమైన, శృంగారమైన గుట్టలూ, తోటలు మిలిటరీ వశమయేయి. సామాన్యమైన, సున్నితమైన మానవజీవితం నల్లబజారు, తాగుడు, వ్యభిచారం. లంచం నిరాశ నిర్లజ్ఞ దోపిడీ చేసే వీరవిహారంలో పచ్చడైపోయింది.
    ఆర్. హెచ్. క్యూ వెళ్ళిపోయిన తరువాత నేను. మా ఓ సి. పది పన్నెండుగురు తెల్లవాళ్ళు డెబ్బై యనభై మంది భారతీయులు మిగిలేం. మూడ్రోజులలాగే గడిచేయి.
    రోజూ నేనూ ఓ. సి. ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఆఫీసులో కూచుంటున్నాం. నేనప్పుడప్పుడేదో టైపు చేస్తున్నా, రెండు కాగితాలు ఫైల్లో వేస్తున్నా. వర్కు షాపు ఎక్విప్ మెంటు టేబిల్ లొ వున్న వాటిని ఇండెంటు ఫారా లమీద టైపు చేస్తున్నా. ఆ గ్రంథంలో మాక్కావలసినవి. పిన్ను దగ్గిర్నించి ట్రాక్టరు దాకా అన్నీ వున్నాయి. ఆ యిండెంటు బ్రిగేడు హెడ్ క్వార్టర్సు ద్వారా పంపితే దేశం నలుమూలల్నించి ఇంకా ప్రపంచం నలుమూలల్నించీ సరుకు వచ్చిపడుతుంది. వాటితో మా వర్కు షాపు చకచక తయారౌతుంది.

 

                    
    మా ఓ. సీ. కి చిన్న యెర్రని మీసంవుంది. పని లేనప్పుడా మీసంలో వెంట్రుకలు ఎడం చేత్తో నిమ్మళంగా సవరిస్తూ, తీవ్రమైన చూపులతో తూచి తూచి మాట్లాడుతాడు. అతనేమంత చదువుకున్న వాడు కాదు. వాళ్ళ స్వస్థలం చెషైరు. అతని తండ్రి ఎలట్రీషియన్. తండ్రి దగ్గిరే తర్ఫీదయ్యేడు. తరవాత ఒక వర్కు షాపులో "అప్రింటీస్" చేసేడు.
    పెళ్లి చేసుకొని స్వంతకాపురం పెట్టిన సంవత్సరానికే అతన్ని పటాలంలో భర్తీ చేసేరు. తిన్నగా భారతదేశం పంపేరు. అతను దేశం విడిచిపెట్టినప్పటికీ భార్య నాలుగో నెల గర్బిణి. తరవాత కొడుకు పుట్టేడు. వారం వారం భార్య కొడుకు ఫోటో పంపుతూంది. అప్పుడప్పుడతనికి యింటి మీద ధ్యాస వెళ్ళిపోయేది. అలాంటప్పుడు దిగులుగా మీసంలో వెంట్రుకలు సవరించేవాడు కాని, వెంటనే 'మనం యుద్ధంలో వున్నాం" అని జ్ఞప్తికొచ్చేది. ఒకసారి తేన్పి "అయామ్ సారీ" అని గబగబ కాయితాలు చూసుకునేవాడు. మళ్ళీ వెంటనే నాతో వేదాంతం మాట్టాడేవాడు.
    "రావ్! ఈ యుద్ధం ఎందుకు జరుగుతుందో నీకు తెలుసా! హుందాగా కాలేజీ లెక్చరరు విద్యార్ధి నడిగినట్టు ప్రశ్నించేడు.
    "కారణం యేమైనా సుఖాన్నున్న ప్రాణాలు దుఃఖం పాలౌతున్నాయి"    
    "అయితే నీకీ యుద్ధం యిష్టం లేదా!"
    "మీ కిష్టమా!"
    "ముమ్మాటికీ కాదు. కాని, యీ యుద్ధం మానవుడి మనుగడ నిలబెట్టుకుందికి చేస్తున్నాం. ఈ యుద్ధం యివాళ కోసం కాదు. రేపటి కోసం. ఈతరం కోసంకాదు, ముందుతరాల కోసం. మనకొడుకుల కోసం, వాళ్ళ సంతానం కోసం....."
    "క్షమించండి. ఇది ఆఖరు యుద్ధమా?"
    "అది వేరు...." అతను టేబిలుమీద పెన్ను టక టక కొడుతూ అన్నాడు.
    "అయితే విప్పీలు (జపానీయులు) ఇండియా స్నేహితులా?"
    "చూడండి, వ్యక్తిగతంగా నేను దబ్బు కోసం, కాస్త దేశం చూడ్డంకోసం పటాలంలో చేరేను. నేనే కాదు. ఈ దేశంలో నూటికి నూరు పాళ్ళూ అంతే. కొన్ని కుటుంబాలు వంశపారం పర్యంగా సైనికులు. ది వాళ్ళ వృత్తి. పోతే ఇండియా బానిసదేశం. దీనికి శత్రువు లెవరు. మిత్రులెవరు? ఇండియాకి ప్రస్తుతం శత్రు దేశం ఏదన్నా వుంటే, అది బ్రిటనే. అర్ధ శతాబ్దం పైగా అహింసా పధ్ధతిలో పోరాడుతూన్న బ్రిటనీ దేశానికి స్వాతంత్ర్యం యివ్వలేదు. చివరికి ప్రాణం విసిగి ఈ నిరుడు ప్రజలొక చిన్న విప్లవం లేవతీసేరు. కాని ఫలితం శూన్యం. ఇక ఈ యుద్ధంలో ప్రమాద వశాత్తూ ఐక్యరాజ్యా లోడి పోతే, ఇండియాలో బ్రిటిష్ పరిపాలన ముగుస్తుంది. మరే దేశమో దీనిమీద యేలుబడి చలాయిస్తుంది,"    
    అతనొక నిమిషం మీసం సవిరిస్తూ ఆలోచించేడు. "బహుశా" అని యేదో అనబోతూంటే మోటారు సైకిలు మీద కొరియర్ వచ్చి ఒక కవరిచ్చి వెళ్ళిపోయేడు. ఓ సీ కవరు విప్పి వుత్తరం చదూతూంటే అతని మొహం వికసించింది. చిరునవ్వు క్రమేపీ అతని మొహం అంతటా పాకింది.
    "రావ్! మనం కదిలేం..."
    "ఎక్కడికి?"
    "కొమిల్లా"    
    ఓ సీ ఆర్దర్లీని కేకేసి తెల్లవాళ్ళని పిలవమన్నాడు.
    "క్షమించండి, ఇందాక నేచెప్పింది కేవలం వ్యక్తిగత అభిప్రాయం. నేను మిమ్మల్ని నొప్పించలేదని రానిస్తున్నా...."
    "నిజం నిజం. యుద్ధం ఎవ్వరికీ యిష్టం వుండదు. కాని ఈ యుద్ధం ప్రపంచాన్ని "నాజిజమ్" "పాసిజమ్" నుంచి కాపాడ్డానికి తప్పని సరైంది."
    సార్జెంటు మేజరు రెడ్ ఫర్ను. స్టాఫ్ లాంగ్ థార్న్, సార్జెంటు స్మిత్, ఎవరెట్ మొదలైన వాళ్ళంతా వచ్చేరు.
    "చూడు సార్జెంటు మేజర్! మనం కదిలేం."
    "ఎక్కడికి సర్?"
    "కొ - మి - ల్లా" నవ్వుతూ తల ముందుకీ వెనక్కీ ఆడిస్తూ, పాట పాడినట్టన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS