గౌతమి స్నానంచేసి రాగానే ముందు గదిలో నుంచి "అమ్మాయ్ గౌతమీ" అంటూ పిల్చాడు తండ్రి రంగారావు.
గౌతమి వచ్చింది.
"మీ ఆయనకి ఏమైనా ఉద్యోగ మయిందా. కొత్త ఊరు పోతూ మమ్మల్ని చూసిపోదామని వచ్చావా" అన్నాడు.
గౌతమి చిన్నబుచ్చుకున్నా తండ్రి తత్వం తెల్సుగనుక ఏమీ అనుకోకుండానే.
"లేదు నాన్నా! అసలు వారు ఉద్యోగ ప్రయత్నమే చెయ్యటంలేదు. నేనే వచ్చేశాను" అన్నది.
ఈ వచ్చేశాను అన్న మాట కొరడాతో కొట్టిన ట్లయింది రంగారావుకు.
"అంటే పోట్లాడి వచ్చేశావా."
తండ్రివైపు చూడలేక వదినగారి గదిలోకి వచ్చేసింది గౌతమి.
తండ్రి చరచరా వంటింట్లోకి వెళ్ళాడు. మాణిక్యమ్మ పూజ చేసుకుంటున్నది.
"విన్నావా."
పూజ చేసుకుంటూంటే ఇటుతిరిగి చూసింది మాణిక్యమ్మ.
"మన గౌతమి పోట్లాడి వచ్చేసిందిట" విచారంతో కూడిన కోపంతో అన్నాడు.
మాణిక్యమ్మ మాట్లాడలేదు. ఆవిడ దృష్టి పూజమీదనే ఉన్నది.
"ఇంత వయసొచ్చాక నా ముఖాన ఈ దిగులు కూడా అనుభవ మని రాశాడా ఆ భగవంతుడు."
"అప్పుడే అన్నీ మీరే అనుకుంటున్నారు. తరవాత అన్నీ నేను కనుక్కుంటానుగా, మీరు తొందరపడకండి" మెల్లిగా అన్నది మాణిక్యమ్మ. తిరిగి ముందు గదిలోకి వెళ్ళిపోయాడు రంగారావు.
గౌతమి అన్నీ విన్నది. కళ్ళలో నీళ్ళు తిరిగినయ్యి.
"మావగారి మాటలు నీకు తెలీనివా వదినా. ఏమీ అనుకోకు" అన్న ధాన్యలక్ష్మి మాటలకు కళ్ళు తుడ్చుకుంది గౌతమి. వదినగారి వైపు చూసింది. ధాన్యలక్ష్మి కళ్ళల్లో ఏ భావమూ లేదు. పెదవుల మీద దరహాసం, గౌతమి మనస్సులో ఆందోళన కాస్త తగ్గింది.
పూజయ్యాక రంగారావు భోంచేసి ఆఫీసుకు వెళ్ళాడు. కాస్త ఊపిరి తీసుకుంది గౌతమి.
భోజనాలయ్యాక మాణిక్యమ్మ అడిగింది.
"గౌతమీ."
"ఏమ్మా!"
"ఒక్కమా టడుగుతాను చెప్పు తల్లీ, మీ ఆయన అసలు ఏ ఉద్యోగం చెయ్యరా. ఎంతకాలం ఈ తీరుగా ఆ తల్లిదండ్రుల నెత్తినెక్కి తింటూ కూర్చుంటారు. ఆ పెద్దవాళ్ళిద్దరూ పోగానే మీగతి ఏంకావాలి. ఇన్నేళ్ళొచ్చినా మీ ఇద్దరికీ ఇంకా చిన్న తనమైతే ఎట్లాగే" విచారం వ్యక్తమైంది మాణిక్యమ్మ కంఠంలో.
"నేనేం చేసేదమ్మా. నెత్తిన నోరు పెట్టుకుని చెప్పుతాను ఉద్యోగం చెయ్యమని. ఆమాటనగానే నవ్వుతారు. ఉద్యోగం లేందే పొట్ట గడవదా అంటారు జీవించటానికి ఉద్యోగమే సాధనమా అని వారి భావన, చదువు, విజ్ఞానం పెంపొందించుకోటానికి. ఆధ్యాత్మిక చింతనకూ గాని కేవలం ఉద్యోగం చేసి పది రాళ్ళు సంపాదించటానికి కాదు. అంటారు. నేనేం చేసేది" అన్నది గౌతమి. భర్త ఉద్యోగం చెయ్యటంలేదనే నరనరాల్లోని ఆవేదనా తల్లిముందు వెళ్ళగక్కింది.
"మరి నువ్వొచ్చిన కారణం. డబ్బు పట్రమ్మన్నారా. సంపాదన లేనప్పుడు కర్చులకు డబ్బు చాలదు. అందుకే పంపించి ఉంటాడు" తల్లి ఆక్రోశం. కూతురు కాపురం ఇట్లా ఉంది కదాని బాధతో కూడిన ఆవేదన, అల్లుడు ఇంత చదివీ ఇలాంటి పనికిరానివా డయినా డేమా అనే కోపం.
"అట్లా ఎప్పుడూ అనుకోవద్దమ్మా. వారికి డబ్బెందుకు. వారికి డబ్బు అవుసరంలేదు. కనీసం కాఫీ కూడా తాగరు. ఎప్పుడూ సినిమాకు పోరు. సిగరెట్టు జీవితంలో అలవాటూ లేదు. ఏ దుర్గుణాలూ వారిలో లేవు. ఆధ్యాత్మికచింతన వార్ని పట్టుకు వేధిస్తున్నది. అంతే. డబ్బుకోసం నన్ను పంపారని కల్లోనయినా అనుకోవద్దు."
భర్త సుగుణాలకు తృప్తి. దుబారా ఖర్చులు లేనందుకు సంతోషము. కాని జీవితానికి తృప్తి లేదు. కోరికలు మనస్సులోనే అణగారిపోతున్నయ్యి. ఆశించిన ఏ కోరికా తీరటంలేదు. తీర్చటం లేదు. సంపాదన లేకపోగా సరదా కూడా లేదు ఆ జీవికి. అదే కోపము, అదే మనోవేదన, అలాంటి జీవితమే ఇంత నైరాశ్యం కలగటానికి దారితీసింది.
"అయితే నువ్వు......" తల్లి చెప్పలేకపోయింది.
"అవునమ్మా నేనే వచ్చేశాను. కొన్నాళ్ళపాటు నేను దగ్గర లేకుండా ఉంటే వారి కేమయినా తెలిసొస్తుందేమోనని నా ఆశ" బరువుగా నిట్టూర్పు విడుస్తూ అన్నది గౌతమి.
"ఇంతకీ నీ కడుపు నొక కాయ కాస్తే అతగాడికీ అన్నీ తెలిసొచ్చేవి. ఆ యోగ్యత లేకపోవటం నుంచే మరీ చిన్నవాళ్ళయి పోతున్నారు" బరువు బాధ్యత పిల్లలు కలగలేదనే విచారం. ఆ ముచ్చటలు తీరలేదనే అసంతృప్తి. పురిటికి తీసుకొచ్చే అవకాశం భగవంతుడు కలుగచెయ్యలేదనే ఆవేదన.
"అవున్లేమ్మా, మా జీవితాలకి అదొక్కటే కొరత. ఇప్పుడు ఒకదాన్నే ఏడుస్తున్నాను. అప్పుడా పుట్టినవాళ్ళూ, నేనూ కలిసి ఏడవాలి. ఈ జీవితానికి భగవంతుడు చేసిన మేలు అదొక్క టేనని నే ననుకుంటున్నాను."
తల్లి మాటలకు ఈ సమాధానం చెప్పినా, తల్లి మనస్సులో ఉన్న అభిప్రాయం తనకూ లేకపోలేదు. పిల్లల మీద ప్రేమచేత నైనా ఉద్యోగంలో చేర్తా రేమోననే ఆశ తనలోనూ తలెత్తుతూనే ఉంటుంది.
ఇంతలోనే ఆఫీసునుంచి అన్నగా రొచ్చారు. భోజనానికి వస్తూనే "ధాన్యం అబ్బిగాడు ఏం చేస్తున్నాడే వె-ధ-వ" అంటూ గదిలో కొచ్చేసరికి గౌతమి కనుపించింది. భార్య, తల్లి అంతా తన గదిలోనే ఉన్నారు.
"ఏమేవ్ గౌతమీ క్షేమమా, క్షేమమా బావగారు ఎమ్మే పాసయి అంత ఎమ్. ఏ. డి గా ప్రవర్తిస్తారేం. ఇంకా అదే పంధాలో ఉన్నారా. మిగతా ఇత్యాదులంతా క్షేమమా" అంటూ గబగబా నాలుగూ అడిగేశాడు.
సమాధానం చెప్పింది గౌతమి.
"అసలు నువ్వే చవటనే. ఇంటరు చదివిన మూర్కురాలిని నువ్వూ, ఎమ్మే చదివిన, కాదు కాదు ఫస్టు క్లాసులో పాసయిన, పరమ మూర్కుడు అయినాను.
మీ వొదిన ఆనాడే నాతో చెప్పింది, ఉద్యోగంలో చేరి మొదటి నెల జీతం నాకు చూపిస్తేనే నేను కాపురానికి వస్తాను, అని హతోస్మీ అనుకుంటూ నానా అగచాట్లూ పడి ఈ బ్యాంకు ఉద్యోగం సంసాదించాకనే ఆవిడగార్ని తీసుకొచ్చాను కాపురానికి." అన్నాడు గోపీనాథ్ భార్య ధాన్యలక్ష్మి వైపు చూస్తూ. ధాన్యలక్ష్మి మూతివిరిచి నవ్వుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది వడ్డించటానికి.
మాణిక్యమ్మ కునుకు తియ్యటానికి వరండా లోకి వెళ్ళి మంచం వాల్చుకుంది. గోపీనాధ్ బట్టలు మార్చుకుని స్నానానికి వెళ్ళాడు. గౌతమి అక్కడే కూర్చుంది ఏమిటో ఆలోచిస్తూ.
ఆ రాత్రి గోపీనాథ్ ధాన్యలక్ష్మి ని అడిగాడు గౌతమి పరిస్థితి ఏమిటని. అన్నీ
చెప్పింది ధాన్య ధాన్యలక్ష్మి.
"భర్తతో పోట్లాడి వచ్చే స్థితికి వచ్చిందన్న మాట గౌతమి. ఈ అమ్మా, నాయనా ఎల్లకాలం తిండిపెట్టి తనని పోషిస్తారనుకుందా ఈ ముద్దుల కూతురు" అన్నాడు గోపీనాథ్ పెద్దగా.
"ష్ గట్టిగా అరవకండి. ఆవిడ వింటే బాధ పడుతుంది. భర్త సంపాదనపరుడు కానప్పుడు భార్య పడే పాట్లు మీకు అర్ధంకావు. అలాంటి ఆడదాని మనస్సు మీకు అర్ధంకాదు. అనుభవించటం వరకే మీబోటి మగాళ్ళకు అర్ధమవుతుంది." అన్నది ధాన్యలక్ష్మి.
"సరేకానీ, ఈ భాగోతం ఎన్నాళ్ళు" అన్నాడు గోపీనాథ్.
పక్క గదిలోనే పడుకున్న గౌతమికి ఈ మాట లన్నీ వినిపించినయ్యి. ఇక నిద్రపట్టలేదు.
* * *
