Previous Page Next Page 
ఆకాశ దీపాలు పేజి 9


    'ఇంతకీ...'
    'అదేనే, రాంబాబు నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాం..'
    'అది నాకు తెలుసు ----'
    'కానీ ఇప్పుడు రాంబాబు లేడుగా మరి?'
    'అంటే- పూరిగా పారిపోయాడనే నీ ఊహ?'
    'లేకపోతె...'
    'నాలుగు రోజులాగి చూడు, అతనే తిరిగి వస్తాడు, నా మాట నమ్ము--'
    'నీమాట నమ్మక కాదె, కానీ....'
    'కానీ లేదు, అర్ధణా లేదు...'
    'అది కాదు సుందరీ, ఒకవేళ రాకపోతే...?'
    'ఒకవేళ రాకపోతే, ఈ రాంబాబు కాక పొతే మరో వెంకట స్వామి -- అంతే-!'
    ఇందిర అదిరిపడింది-
    'ఈ రాంబాబు కాకపోతే మరో వెంకట స్వామి-'
    ఎంత తేలికగా అనేసింది?'
    'అలా వీలుపడదు గదే-'
    'ఏం సంగతి? అతను రాకపోతే అతని కోసం అలాగే ఉండిపోతావా ఏం?' సుందరి సూటిగా ప్రశ్నించింది.
    ఇందిర ఏం జవాబివ్వలేదు.
    క్షణం ఆగి అంది సుందరి - 'చీకటి పడింది, పోదాం పద ఇంటికి!'
    ఇందిర మళ్ళీ ఏం మాట్లాడలేదు.
    ఈసారి సుందరి లేచి నిలబడింది.- ఇందిర చెయ్యి పట్టుకుని లేవనెత్తింది ఇంరిరను. అయినా ఇందిర లేవలేదు.
    సుందరి మళ్లీ కూర్చుంది.
    కొంతసేపు తీవ్రంగా అలోచించి అడిగింది సుందరి - 'ఇందిరా,ఒకటడుగుతా నిజం చెబుతావా?'
    ఇందిర సుందరి కేసి చూసి ఊర్కోంది.
    'ఏమన్నా జరిగిందా? నిజం చెప్పు.'
    ఇందిర అవునన్నట్లు తల ఊపింది.
    సుందరి నిర్ఘాంత పోయింది. తేరుకుంటూ అడిగింది -- ఎప్పుడు?'
    ఇందిర క్షణం ఆగి అంది -- 'నిన్ననే ...'
    అలాటి క్షణం లో కూడా సుందరి అంది -- 'కంగ్రాచ్యులేషన్స్- అయినా బలత్కారమా?'
    'కాదు' అంది ఇందిర ఈసారి నోరు విప్పి.
    'మీ కంత ధైర్యం ఎక్కడిదే?'
    ఇందిర పేలవంగా నవ్వింది ఏం చెప్పాలో తెలీక-'
    'అయితే ఇప్పుడెం చేద్దామని నీ ఊహ?' సుందరి సూటిగా ప్రశ్నించింది.
    'అది అడుగుదామనేగా నిన్ను రమ్మన్నది --' అంది ఇందిర మెల్లిగా. క్షణం ఆగి అంది ఈసారి సుందరి - 'ఇదేమీ బాగాలేదే!'
    'అవును -- నాకూ తెలుసు -' అంది ఇందిర.
    'తెలిసీ చేయడమేం ఖర్మ?'
    'ఒకటి చెబుతా వింటావా?'
    'చెప్పు--'
    'కాని కాలం వస్తే కళ్ళు కనపడవు- అంతే!'
    'ఇందిరా -- కాని కాలమే అనుకుంటున్నావా?'
    'అలాగే అనుకోవాల్సి వస్తోంది మరి- లేకపోతె...నిన్నటి దాకా అలాగే ఉండటమేమిటి, నిన్న ఇలా జరగటం ఏమిటి? ఈవేళ కిలా అవటం ఏమిటి?'
    సుందరి ఏమీ మాట్లాడలేదు.
    'ఏం చేయమంటావే?'
    'ఏం చేస్తావు మరి?- చెప్పు-'
    'అది తెలీకేగా...'
    చాలాసేపు ఇద్దరూ మౌనంగా ఉన్నారు. ఏదో అలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా అంది సుందరి. 'ఇందిరా - నన్నడిగితే  ఒకటే సలహా ఇస్తాను-- ఏమీ జరగనట్లు కాలం గడుపు. అదృష్టవశాత్తు ఏమీ జరగకపోతే ప్రశ్నే లేదు. లేకపోతె ....లేకపోతె అపుడు ఆలోచిద్దాం.' అంది సుందరి.
    'ఎందుకో భయంగా ఉందే సుందరి -'
    'ఎందుకే భయం?'
    'ఏదో అవుతుందేమో నని-'
    సుందరి నవ్వింది పకాలున- ఏదైనా అంటూ అయితే, అదే అవుతుంది గానీ ఇంకోటి కాదు. అయినా, మనసులో అవుతుందేమోననుకుంటే , అయినా అవ్వచ్చు - సైకలాజికల్ ఎఫెక్ట్ ఏడుస్తుందిగా-'
    'నువ్వంత తేలికగా అంటే నేనే మనను?'
    'ఏమీ అనక నోరు మూసుకు పద - అంది సుందరి లేస్తూ.
    ఇందిర లేచింది.
    ఇద్దరూ ఇంటిదారి పట్టారు.

                          *    *    *    *
    ఓకే నెలరోజులు గడిచాయి.
    సుందరికి పెళ్లి నిశ్చయమయింది. చంద్ర మౌళితోనే- ఇంకో నెలరోజులలో పెళ్లి చేసేయాలనే ఊహతో ముహూర్త నిర్ణయం కూడా జరిగిపోయింది. ఈ విషయం తెలిసిన తర్వాత ఇందిర మరీ డీలా అయిపొయింది. మనసులో ఉన్న కాస్త ధైర్యానికి ప్రాణం పోస్తున్న వ్యక్తీ సుందరి. ఆ సుందరికే పెళ్లి అయిపోగానే, చంద్రమౌళి తో వెళ్ళిపోతుంది- వెళ్ళకుండా ఉంటె బాగుండును. తన ఊహకు తనకే నవ్వొచ్చింది ఇందిరకు- పెళ్ళి కాకుండానే తనూ, రాంబాబు ఎకమైపోగా లేనిది పెళ్ళయిన తర్వాత కూడా సుందరి చంద్ర మౌళి తో వెళ్లి పోకూడదను కునే తన ఊహ తనకే నవ్వు తెప్పిస్తోంది. మనిషిలోని స్వార్ధం ఎంతకైనా తెగిస్తుంది, ఎంతైనా ఆలోచించ చేస్తుంది!
    అయినా ఆ మాటను మనసులోనే ఉంచుకోక సుందరితో అంది ఇందిర- నవ్వింది , ' మంఛి ఊహే' అంది మళ్లీ.
    'అయినా ఆయనే మంటారో బాబూ!' ఇది సుందరిలోని స్త్రీ పలికిన పలుకులు. 'అయన' మాటకు విలువనివ్వాలి అనేది సుందరి భావం కాని ఇందిర అదోలా అర్ధం చేసుకుని అంది నవ్వుతూ -- 'ఆయనేమీ అనకపోతే ...'    
    'ఏమీ అనకుండా -- ఎలా ఉంటారే?-' అంది సుందరి చిలిపిగా.
    'అవును , ఏదో అనడానికెగా- పెళ్లి చేసుకునేది!'
    ఇద్దరూ నవ్వుకున్నారు.
    పెళ్లి ఖచ్చితంగా ఇరవై రోజులుంది. వెంకు పంతులు గారింట్లో ఒకటే హడావిడి.
    సుందరి, ఇందిరలు ఇద్దరూ ఇక ఈ జన్మ లో మళ్ళీ కలుసుకోమనే విధంగా మాట్లాడు కుంటున్నారు రాత్రింబవళ్ళు.
    ఖచ్చితంగా ఇలాటి సమయంలో వచ్చింది రాంబాబు ప్రసక్తి.
    'ఇక రాడనే నా ఊహ' అంది సుందరి.
    'రాక ఎమయిపోతాడు?' రాడనే మనసు లోనూ ఉన్నా పైకి అనడానికి జంకింది ఇందిర. మనసును మభ్య పెట్టుకుంటూ అంది.
    'వస్తే సంతోషమే ఒకవేళ రాకపోతే....'
    నిజమే ! ఒకవేళ రాకపోతే?
    'ఇందిరా . ఒక పని చేస్తావ్ నాకోసం?'
    'ఏమిటది?'
    'నన్నడిగితే పెళ్లి చేసుకో - అన్ని సమస్యలూ విడితాయి-'
    'నువ్వుత్త ఫూల్ వి- అంతే!'
    'ఎందుకే అలా అంటున్నావ్?'
    'పెళ్లయాకే సమస్యలు పుట్టేది తెలుసా?-'
    'అదేం?-'
    'నీకు తెలీదు, అందుకే అన్నాను నువ్వుత్త ఫూల్ వి అని!' ఇందిర నవ్వుతూ అంది.
    ఆ నవ్వు వెనక - ఈనాటి కొండల వెనక దాగి ఉన్నంత- విషాదం దాగి ఉంది.
    'అదికాదు ఇందిరా, రేపు నా పెళ్లికి మా అన్నయ్య వస్తాడుగా -
    'ఎవరూ?'
    'కృష్ణుడన్నయ్య, తెలుసుగా నీకు? వాడికి అంతా చెప్పేద్దాం. నీ ఊహ ప్రకారం వాడు నిన్ను చేసుకోవడానికి అభ్యంతర పెట్టడు!'
    ఇందిర క్షణం ఆగి అంది. 'అంటే, ఇక రాంబాబు సంగతి....'
    'శుభ్రంగా మర్చి పోవడమే!-' అంది సుందరి బహు తేలికగా.
    'నేను మర్చి పోవచ్చుగానీ -సుందరీ, నిజం చెప్పనీ నీతో -- నౌ ఆయామ్ కారీ యింగ్--'
    సుందరి ఒక్కసారి నిర్ఘాంత పోయింది.
    ఏమనాలో తెలీడం లేదు--
    ఇలా ఎలా జరుగుతోంది?
    ఇందిర ఇంత చేయగలదని , అయినా ఇదంతా ఇందిర చేతిలో లేదు, విధి ...అంతే! అలా అనుకుని తృప్తి పడాలి-- తప్పదు.
    క్షణం ఆగి అంది సుందరి - 'నన్నడిగితే ఒక పని చెప్తా, చెయ్-'
    'ఏమిటది?'
    'కృష్ణుడన్నయ్య వస్తాడు గా, వాడికి నువ్వంటే ఇష్టమన్నది నీకూ తెలుసుగా?'
    ఇందిరకు గుర్తొచ్చింది -- నిజమే!కృష్ణ మూర్తి కి తనంటే ఇష్టమే. కిందటి వేసవి కి వచ్చాడు సుందరి వాళ్ళ ఇంటికి. తనకు, కృష్ణ మూర్తి కి ఏకాంతంగా కలుసుకునే అవకాశం కలిగంచమని కృష్ణమూర్తి కోరాక సుందరి ఆ వెధవ పని చేయనే చేసింది. ఆ సమయంలో అడిగాడు కృష్ణమూర్తి -- 'నన్ను పెళ్లి చేసుకుంటారా?' అని. క్షణం కూడా ఆలోచించకనే అంది తను- 'క్షమించండి. అది వీలుపడదు' అని. ఎందుకంటె - అప్పటికే తనలో రాంబాబు ఉన్నాడు గనుక! ఇంతకీ ఈసుందరి ఏమంటోంది?
    '....వాడి కిష్టమేగా నువ్వంటే! ఈసారీ ఎలాగూ అడుగుతాడు మళ్ళీ - మాట్లాడ కుండా ఒప్పేసుకో!- అంతే.'
    'సుందరీ -'
    'ఇంకేమీ మాట్లాడకు- అన్ని అక్కడికి సర్దుకుంటాయి. ఏమైనా జరిగితే అపుడే చూద్దాం ' అంది సుందరి ఇందిరతో.
    'సుందరి - కృష్ణ మూర్తి మీ అన్నయ్య -- జ్ఞాపకముందా?'
    'ఆ, అందుకే అంటున్నాను-- పెళ్లి చేసుకుని, నావదినవి కా-
    'అది తప్పుగదే...'
    'నీ ముఖం -- తప్పు లేదు, తప్పిదమూ కాదు, శుభ్రంగా పెళ్ళి చేసుకో -' అంది సుందరి. ఇందిర క్షణం సేపు ఏమీ మాట్లాడక పోయేసరికి 'కృష్ణమూర్తి గారిని ఇందిరగారు కలుసుకునే ఏర్పాట్లు చేయడానికి సుందరి పూనుకుంటుంది -- అంతేనా?'
    ఇందిర నవ్వి ఊరుకుంది, ఇంకేమీ అనక.
    తనలో చెలరేగుతున్న ఈ అలజడి ని ఎలా చెప్పాలి సుందరికి? ఎలా చెబితే అర్ధం చేసుకుంటుంది?
    తనను ప్రేమిస్తున్నాడు కృష్ణమూర్తి , నిజమే!
    అందుకని....
    అందుకని అతన్ని అలా మోసగించటమే?
    సుందరి అలా అంటుందేం మరి?
    స్నేహితురాలిని ఆదుకోవాలని , అన్నయ్యకు మోసం తలపెట్టటం సబబా?
    అయినా తను మాత్రం తక్కువ తిందా?
    తన్ను ప్రేమిస్తున్నాడు గనుక అతని కళ్ళు కప్పటం తేలిక అని గదా , తను ఊరుకుంది సుందరి మాటలకు?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS