Previous Page Next Page 
చీకటి పొద్దున వెలుగురేఖ పేజి 11


    "ఆ, ఆ ఈరోజు మీరుండారని తిన్నారు. లేకపోతే ఆ రెండూదా తినడానికి నానా అల్లరిదా చేస్తురు" అన్నాడు నాయర్. పిల్లలిద్దరూ సిగ్గు సిగ్గుగా నవ్వారు.
    సుజాతకి తనువచ్చి యింకా రెండుగంటలన్నా కాకముందే పిల్లలు తన కెంత చేరువగా వచ్చారో చూస్తూంటే సంతోషంగా, గర్వంగా వుంది. ఈ పిల్లలు తనని యెంత అభిమానిస్తున్నారో! సుజాతకి ఆ పిల్లలపట్ల అప్పుడే అభిమానం, అనురాగం కల్గాయి. ఇంత చక్కని ఇల్లు, ఇంత మంచి పిల్లలు, ఈ డాక్టరుగారు, అన్నీ చూస్తుంటే తన కీ ఉద్యోగం దొరకడం అదృష్టం అన్పించింది. తను నమ్మకంగా యీ యింటి బాధ్యత తీసుకుంటే డాక్టరుగారి కెంత ఆటవిడుపులా వుంటుందో! రేపటినించి ఆవిడకి, పిల్లలకి యెవరికీ యే లోటూ రాకుండా, అన్నీ చక్కదిద్దుకుంటూ వాళ్ళందరూ తను వుండడంవల్ల హాయిగా వున్నామనుకుంటే అంతకంటే యింకేం కావాలి. తను చెయ్యాల్సిన పనులు యేమీ కష్టమయి నవి కావు. వంటకి మనిషి, పై పనులకి దాసీది వున్నారు. ఎటొచ్చీ యెవరెవరికి యేం కావాలో వేళపట్టున అమర్చడం. ఓస్. ఇంతేగా! హాయిగా నీడపట్టున కూర్చుని చేసే ఉద్యోగం! సుజాతకి చాలా సంతోషంగా వుంది! వచ్చేముందు యెన్నో అనుమానాలతో, సందేహాలతో, ఎలాంటి వారో, ఎలా వుండాలో అనుకుంటూ భయపడింది. కాని వచ్చి రెండు గంటలయినా కాకముందే పాత మనిషిలాగ అప్పుడే ఆ యింట్లో పిల్లల మధ్య యిమిడిపోయింది సుజాత!
    
                                             5
    
    పిల్లలిద్దరూ తొమ్మిదిన్నరకి స్కూలుకి వెళ్ళారు సుజాతకి టాటా చెప్పి డాక్టరుగారు వంటిగంట లోపల రారు. ఈ లోపల యేం చెయ్యడమో సుజాతకి తోచలేదు. వంటింట్లోకి వెళ్ళింది వంటిల్లు ఆధునికంగా కట్టారు. షెల్ఫులు, నిల్చుని వండుకోడానికి వీలుగా గట్టు, గ్యాస్ స్టౌ, వాష్ బేసిన్ అన్నీ వున్నాయి. అయితే గది గోడలనిండా నూనె మరకలు, క్రింద అంతా బురద అడుగుజాడలు, తరిగిన కూరల తుక్కు ఓ ప్రక్క, అడ్డదిడ్డంగా పడివున్న గిన్నెలు, ఏదీ వుండాల్సిన స్థానంలోకాక నానా గలీజుగా వుంది. గది చూసి 'ఛా, ఇలా వుంచాడేమిటి యీ సాయరు గదిని. తను యికమీద శుభ్రంగా వుంచాలి' అనుకుంది. నాయరు అటూ యిటూ తిరుగుతూ వంట చేస్తున్నాడు చాలా బిజీగా. మాటలు కలిపి యింటి సంగతులు యేమన్నా అడగాలనిపించింది సుజాతకి. కానీ నాయరు సుజాతని చూసీ చూడనట్టు పనిచేసుకుంటున్నాడు. ముభావంగా వున్న నాయరుని ఏమడగాలో తోచలేదు.
    "వంట చేస్తున్నావా? ఏం కూర చెయ్యమన్నారు యివాళ వంట యేం చెయ్యాలో డాక్టర్ గారు రోజూ చెప్తారా?"
    "ఆవిడేం చెప్పరు. నా యిష్టంవచ్చింది చేసేస్తాను" అన్నాడు గర్వంగా నాయరు.
    నాయరుకి సుజాత రాక యే మాత్రం ఇష్టంలేదు. ఇన్నాళ్ళు యింట్లో యెవరూ లేకుండా అతనిష్టం వచ్చినట్టు యధేచ్చగా వుండే వాడు. ఎన్నిసార్లు కాఫీలు చేసుకు త్రాగినా, ఎంత టిఫిన్ తిన్నా, ఎంత దూబరా చేసినా, ఎంతడబ్బు మిగుల్చుకున్నా, పనిమనిషి కెంత పెట్టినా చూడడానికి యెవరూ వుండేవారు కారు యింట్లో హాయిగా ఇష్టారాజ్యం యేలుతున్న నాయరుకి సుజాత రావడం ఏ మాత్రం ఇష్టంలేదు. తనమీద కాపలాకి ఓ మనిషి వస్తూందంటే అతనికి చాలా చిరాకుగా, అసంతృప్తిగా వుంది. అంచేత ఆ వచ్చేమనిషికి ముందే తన కా యింట్లో యెంత హోల్డులోవుందో, తను లేకపోతే యేదీ జరగదని, హౌస్ కీపర్ ఆజ్ఞలు, అధికారాలు తనమీద యేం పనికిరావని తెలియ చెప్పాలనీ నిశ్చయించుకున్నారు.
    "అమ్మగారుదా, నేనేం చేసినా యేం అనరు. ఇంటి సంగతి దా అంతా నేనే చూస్తాను. అంతా నా యిష్టమే. అమ్మ యేం చెప్పదు" అన్నాడు.
    "ఆహాఁ ఆవిడకి పాపం తీరుబాటు వుండదు గదా" అంది సుజాత.
    "తీరుబాటుగా వుండదు. ఉన్నా అంతానేను సరి చూస్తానని అమ్మకి తెలుసు. అందుకే యేం చూడదు" అన్నాడు గర్వంగా.
    సుజాతకి నవ్వు వచ్చింది వాడి మాటలు యాక్షన్ చూస్తే నిజంగా ఆవిడకి వంటమనిషిమీద అంత నమ్మకంవుంటే మళ్ళీ వాళ్ళం దరిమీద అజమాయిషికి ఓ రెండు మూడు వందలు ఖర్చుచేసి హౌస్ కీపర్ ని ఎందుకు పెట్టుకుంటుంది? అనుకుంది సుజాత. ముసలావిడ వీడుత్త దొంగ అని గోలపెట్టింది యిందాకా. వీడు చూస్తుంటే యింటి బాధ్యత అంతా తనే మోస్తున్నట్టు మాట్లాడుతున్నాడు.
    సుజాత యేం అనకుండా మాట మార్చింది. పిల్లలకి యెన్ని గంటలకి క్యారియరు పంపాల్సింది ముసలావిడికి యెన్ని గంటలకి భోజనం పెట్టాల్సింది అడిగింది.
    ఈ సంగతుల మధ్య సుజాతకి యింటి యజమాని సంగతి గుర్తు వచ్చింది. అన్నట్టు ఆమె భర్త యేం చేస్తారో, ఆయన సంగతే ఎవరూ చెప్పలేదే అనుకుంది!
    "అన్నట్టు అయ్యగారికి ఏం పని?" అనడిగింది సుజాత నాయరుని.
    నాయరు అదోలా నవ్వి "ఏం పనీ లేదు" అన్నాడు.
    "అదేమిటి? ఉద్యోగం చెయ్యరా! ఏం చేస్తారు?" అంది కాస్త ఆశ్చర్యంగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS