3
"ఆయన ఏం గొడవ చెయ్యలేదా, ఏమన్నారు?" ఆరాటంగా అడిగాడు.
"ఏమంటారు, బెదిరించారు, భయపెట్టారు, అడుక్కుతింటావన్నారు మొగుణ్ణి వదిలితే. నేనూ ధైర్యంగా ఎదుర్కున్నాను, నామీద చెయ్యిచేసుకుంటే పోలీసు కంప్లైంట్ యిస్తానన్నాను. మీదకి వచ్చి కొట్టగానే వంటింట్లో కత్తి తీసుకు అడుగు ముందుకు వేసి చూడమన్నాను. ఆయనకే అర్ధమైంది. నేను అన్నింటికి తెగించానని, ఆఖరి అస్త్రంగా పాపని లాక్కున్నారు. మీరు అన్నట్లే చెప్పాను పాపని వుంచుకోమని, "ఈ పీడ నాకెందుకు తీసుకుని ఫో" అని గెంటేసారు దాన్నికూడా...." చాలా తేలిగ్గా అంది అర్చన. ఆమె ఈ విషయం యింత తేలిగ్గా తీసుకోగలగడం అర్చనకే ఆశ్చర్యం అన్పించింది. రాత్రివరకు ఎంత బేలగా, ఎంత భయంగా తల్లడిల్లి పోయింది. ఎన్ని కన్నీళ్ళు కార్చింది. తన భవిష్యత్తేమిటో అని ఎంత బెదిరింది. ఆ కన్నీళ్ళింకిపోయాయి. కన్నీరు ఆఖరన్నట్టు-గుండెల్లో గుదిబండలాంటి గుబులు మాయమయింది. ఏం జరిగిగినా ఫరవాలేదన్న ఈ నిబ్బరం ఏం జరిగినా ఎదుర్కోగలనన్న ఈ ధైర్యం ఎలా వచ్చింది తనకి! పరిస్థితులే కల్పిస్తాయి గాబోలు!.....రాత్రి గనక రాజేష్ ఆశ్రయం యివ్వకపోతే తన స్థితి యిప్పుడెలా వుండేదో గుమ్మం ముందు కూలబడి ఏడుస్తూంటే తెల్లారి ఇరుగు పొరుగు చూచి జాలిపడి ఆయనని కేకలేసి పిలిచి బుద్దిచెప్పి తిట్టి తనని యింట్లోకి పంపేవారేమో ఆయన ఏం రాద్దాంతం చేసేవారో....ఇంత తేలిగ్గా ఈ గొడవ ముగిసి యిలా అన్నీ తెంచుకుని బయట పడగలనని ఎదురు చూడలేదు రాజేష్ కూడా అదే అన్నాడు.
"మీరింత తేలిగ్గా బయట పడతారనుకోలేదు. ఆయన ఏం సీన్ క్రియేట్ చేస్తారో, ఏం రాద్దాంతం చేస్తారో నేను మీకు సహాయపడగలనో లేదో నన్ను ఆయన, నీ వెవడివి నోరుమూసుకుని అవతలికి వెళ్ళు అంటే ఏం జవాబివ్వాలో, ఎవరెవరిని పిలవాలో అన్నీ రిహార్సల్స్ వేసుకున్నాడు పోనీలెండి తేలిగ్గా బయటపడ్డారు. అసహ్యంగా నలుగురూ పోగవకుండా వెళ్ళనిచ్చారు అదే పదివేలు."
"అవును. నేనూ అనుకోలేదు ఆయనింత తేలిగ్గా వదలుతారని నేను తిరగబడగానే ఆయన పిరికివారయి పోయారు. పిల్లినయినా గదిలో బంధించి హింసిస్తే తిరగబడుతుందన్నది ఆయన ఎదురు చూడలేదేమో పోలీసులు, కత్తి అనగానే బెదిరిపోయారు."
"రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడున్నావు అనైనా అనలేదా."
"ఊహు....నేనేదో కూరలకి వెళ్ళి వచ్చినంత మామూలుగా తలుపు తీసి వెళ్ళి పడుకున్నారు. యిప్పుడైనా నేనేం చేస్తున్నానో, ఎక్కడకు వెడుతున్నానో కూడా చూడకుండా తలుపులు మూసుకున్నారు" నిర్లిఫ్తత అంది అర్చన.
"పోనీ అదీ మంచిదే లెండి మీరిలా నా దగ్గరికి రావడం చూస్తే యింకేవేవో అంటే, అసహ్యంగా నలుగురూ వినేవారు."
ఒక అధ్యాయం ముగిసింది. యిప్పుడింక యింటికివెళ్ళి మావాళ్ళని ఎలా ఎదుర్కోవాలో, ఎలా నమ్మించాలో.....ఎలా కన్విన్స్ చేయాలో ఆలోచించాలి. రాజేష్ గారూ ఇంట్లోంచి రావడం అంటే వచ్చేసాను ఇంక జరగబోయేది తల్చుకుంటే భయంగావుంది. పాపని పెట్టుకుని వంటరిగా ఎలా...ముందంతా ఎంతో బతుకు వుంది. వంటరిగా ఈదగలనా అని భయం వేస్తూంది ఆలోచిస్తూంటే. నిన్నరాత్రి అవమ్నంతో ఆవేశంతో తీసుకున్న నిర్ణయం సరి అయినదే అంటారా?" బేలగా అంది. ఉదయం లేచి నప్పటి నిబ్బరం ఆమెకి తగ్గిపోయింది.
"చూడండి అర్చనగారూ! యిప్పుడింక జరిగినదాని గురించి ఆలోచన పెట్టుకోకండి మంచికో చెడుకో ఆ యింటి తలుపులు యింక మీకోసం తెరవవు అనుకుని ముందు గురించి ఆలోచించండి. జరిగినదంతా మీ వాళ్ళతో చెప్పండి. మీ అత్తవారి వైపు వారితో కూడా మీ పెద్దలని తీసికెళ్ళి చెప్పండి" సలహా యివ్వబోయాడు.
"పెద్దవాళ్ళంతా కలిసి ఆయనని తిట్టి, నచ్చచెప్పి యింక సరిగా వుంటాడులే, ఈ మాత్రానికి కాపురం వదులుకుంటావా" అని నన్ను కేకలు వేసి నచ్చచెప్పి మళ్ళీ పంపిస్తారేమో. ఇది వాళ్ళ పరువుప్రతిష్టలకి సంబంధించిన విషయం. ఆడపిల్ల ఉండాల్సింది భర్త యింట్లోనే అని నమ్మేరకం మావాళ్ళు. అంతా కలిసి నామీద దండెత్తి మళ్ళీ యిక్కడికి పంపించేస్తారేమో..."
"అర్చనగారూ....ముందే చెప్పాను. మీరనుకున్న మార్గం పూలబాటలా వుండదని. చాలా రకాలుగా, చాలా మందిని మీరు ఎదుర్కోవాలన్నది మీకూ తెలుసు. ఈ ప్రతిఘటనకి చాలా శక్తి ధైర్యం వుండాలి. అవిలేకనే చాలామంది ఆడవాళ్ళు భర్తల ఆగడాలు సహించి పడుంటున్నారు మీకు ఆ శక్తి అధైర్యం నిబ్బరం వుందనుకునే గడపదాటి బయటికి వచ్చారు. వచ్చాక యిలా బెంబేలు పడిపోతే ఏం లాభం. ముందు యింటికి వెళ్ళి అంతా చెప్పండి మీ వాళ్ళకి. ఆ మనిషితో యింక కలిసి బతకటం అసంభవం. నాకేదో దారి దొరికేవరకు ఆదుకోండి అని అభ్యర్ధించి బతకడానికి ఏదో దారి దొరక్కపోదు. మీరు చదువుకున్నవారు ఏ ఉద్యోగమో దొరక్కపోదు. మీ కాళ్ళమీద మీరు నిలబడ గలిగితే పరిస్థితులు తేలికవుతాయి. అప్పటి వరకూ మీరు ధైర్యంగా అన్నీ ఎదుర్కోవాలి యివన్నీ మీరు చేయలేనని అనుకుంటే మీ పెద్దలు రాజీ కుదిరిస్తే ఒప్పుకోండి."
