శంకరమూర్తి పాపం ఇంకా కన్ ఫ్యూజన్ నుంచి బయట పడలేకపోతున్నాడు.
"అదిసరే మీ పాపాయికి పదినెలలే వయసంటున్నావ్- మరి అప్పుడే స్కూలు అడ్మిషన్ గొడవేమిటి?" అడిగాడు బుర్రగోక్కుంటూ.
"ఇదిగో - పాపం బోసుబాబు ఓ పక్కవాళ్ళ రెండో కొడుక్కి పదినెలల వయసొచ్చేసిందని చెప్తూంటే ఇంకా పాపాయ్ పాపాయ్ అంటావేంటి?" విసుక్కున్నాడు విజయ్ యాదవ్.
"అంటే- పది నెలల వయసొస్తే వాడిక పాపాయి కాడా?"
మా ఆర్గ్యుమెంట్ బోసుబాబు భార్యకు కోపం తెప్పించింది.
"ఇంకా పాపాయి, పాపాయి అంటారేంట న్నయ్యగారూ! 'ఇంకా మీవాడిని స్కూల్లో వేయలేదా?" అంటూ మా బంధువులూ, పరిచయస్తులు ముక్కున వేలేసుకుంటున్నారు. తెలుసా మీకు?" అంది చిరాకుగా.
రాజిరెడ్డి అయోమయంగా తలగోక్కున్నాడు.
"పదినెలలకే స్కూల్లో జాయిన్ చేసేయ్యాలా?" విచిత్రంగా చూస్తూ అడిగాడు.
"అయ్యో! రోజులెలా ఉన్నాయ్ మరి? జనాభా పుట్టగొడుగుల్లా పెరిగిపోతూంటే దాంతో పాటు కాంపిటీషన్ కూడా పెరిగి పోవటంలా? ఇలాంటి పోటీలో మా వాడు ఏమాత్రం వెనుకబడినా మేమేమయిపోతాము? తల్చుకుంటేనే గుండె పగిలిపోతోంది" అంది బోసు తల్లి కల్యాణమ్మ బావురుమంటూ.
"మీరింకా పాతకాలంలోనే అఘోరించారు కనుక మన చుట్టూ ఏం జరుగుతుందో తెలిసి చావటంలా! చాలామంది పిల్లలను ఆరో నెలల్లోనే ప్రీ నర్సరీలో వేసేస్తున్నారు-" అంది షైనీ మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తూ.
"ఏంటి! ఆరో నెలకే స్కూలా?" గుంపులో నుంచి ఓ గోవిందయ్య షాకయిపోతూ అడిగాడు.
వెంటనే షైనీని వింధ్యాదేవి సపోర్ట్ చేసింది.
"అవును- మొన్నటికి మొన్న మన అపార్ట్ మెంట్స్ లోనే 'ఇ' బ్లాక్ లో ఒకళ్ళు ఆరునెలల్లోనే వాళ్ళ పాపాయిని 'ఉయ్యాలా జంపాలా' స్కూల్లో వేశారు."
ఆ మాట వినేసరికి అందరికీ గుండెలు ఝల్లుమన్నాయ్.
"మంచిగయింది! మనలో ఎవళ్ళకీ ఆరునెలల పై బడిన పిల్లల్లేకపోయిరి" అన్నాడు మొహిందర్ సింగ్.
ఆ డైలాగ్ తో అందరూ సంతృప్తిగా ఫీలయ్యారు.
"ఈ లెక్కన మనదేశం ఎటుదిక్కుపోతున్నట్లు? ముంగటికా, వెనక్కా?" అడిగాడు బ్రహ్మయ్యచౌదరి.
"ముందుకెళ్ళనికి- వెనక్కుపోనిక్కూడా జాగాలేదురా భయ్! జనాభా అంతగా పెరిగిపోతున్నది! మనం వెళ్ళగలిగేందుకు ఒకే ఒక్క డైరెక్షన్ ఉంది."
"ఏ డైరెక్షనది?"విజయ్ యాదవ్ డౌటుగా అడిగాడు.
"ఇంకే డైరెక్షను? కిందకి! అంటే పాతాళానికి"
"కానీ అక్కడికెలా వెళ్తాం?" అడిగాడు అవధాని.
"అది కూడా తెలీందే నువ్వేం జర్నలిస్ట్ వయ్యా! భూకంపాలు, సునామీలు వస్తే మనం వెళ్ళేది పాతాళం డైరెక్షనే కదా!" చిరాగ్గా అన్నాడు హమీద్ మియా.
"ఇప్పుడు మా పిల్లాడికేం దారి నాయనోయ్! వాడి జీవితం మట్టికొట్టుకుపోయింది దేవుడో" అంటూ బోసుబాబు భార్య సునీతమ్మ మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసేసరికి మేమందరం ఆమెని ఓదార్చే కార్యక్రమం ప్రారంభించాం!
"మీరేం వర్రీ అవకండమ్మా! మన సొసైటీ ప్రెసిడెంట్ హమీద్ మియాకీ, అటు మొహిందర్ సింగ్ కీ కొన్ని స్కూళ్ళ మేనేజ్ మెంట్స్ తో బాగా పరిచయముంది! వాళ్ళు రంగంలోకి దూకారంటే మీ వాడికి అడ్మిషన్ గ్యారంటీ!" అన్నాడు రాజిరెడ్డి.
"ఒకవేళ వాళ్ళతో పని కాకపోతే నేను చీఫ్ మినిష్టర్ తో మాట్లాడి మన పాపాయికి ఏజ్ బార్ మినహాయింపు 'జీవో' ఒకటి జారీ చేయిస్తా!" అంది షైనీ.
"సి.ఎమ్. మీ మాట వింటారా?" షైనీ వేపు అనుమానంగా చూస్తూ అడిగా శంకరమూర్తి.
"జీవోల విషయంలో ఆయన చాలా లిబరల్ స్వామీ! ఇప్పటికి ఎన్ని జీవోలిచ్చాడో మీకేం తెలుసు"
"సరే- ఆ గొడవ ఇప్పుడెందుగ్గాని అందరం కలసి మన బోసుబాబు వాళ్ళ పాపాయిని తీసుకుని నాకు తెల్సిన స్కూలుకి పోదాం- పదుండ్రి" అన్నాడు హమీద్ మియా!
వెంటనే అందరం బోసుబాబు వాళ్ళ పాపాయిని తీసుకుని ప్రీనర్సరీ స్కూలుకి ఊరేగింపులాగా బయల్దేరాం.
వనస్థలిపురంలో ఉందా స్కూలు.
"ప్రీ నర్సరీ- ఉగ్గూ ఉంగా స్కూల్" అన్న బోర్డ్ కనబడుతోంది.
"ఇది చాలా ప్రిస్టేజియస్ స్కూల్! ఈ మధ్యే ఓపెన్ చేశారు. మొదటిసారి అడ్మిషన్ కి ఎంతమంది పబ్లిక్ జమయిన్రంటే పోలీసులు లాఠీచార్జ్, భాష్పవాయు ప్రయోగం లాంటివి చేయాల్సి వచ్చింది. సుమారు నూట నాలుగుమందికి గాయాలు కూడా తగిలాయంట"
అందరం ప్రిన్సిపాల్ రూమ్ కెళ్ళాం!
బయట ఫ్యూన్ ఏకే ఫార్టీ సెవెన్ గన్ పట్టుకూర్చున్నాడు. అతని చూస్తూంటే మాక్కొంచెం భయం వేసింది. ఎందుకంటే అదే మొదటిసారి మేము ఏకే ఫార్టీ సెవెన్ గన్ చూడటం. పైగా ఏ ప్రీ నర్సరీ స్కూల్లో వాచ్ మెన్ ఇలా గన్ లు పట్టుక్కూచోగా చూళ్ళేదు.
"క్యాహోనా? ఏక్ మినిట్ కే అందర్ సబ్ లోగ్ భాగ్ జావ్! నైతో గోలీ ఛలావూంగా" అంటూ గన్ మావేపు గురిపెట్టాడు.
ఎందుకయినా మంచిదని అందరం కొంచెం దూరంగా వెళ్ళి నిలబడ్డాం!
"మా పాపాయి అడ్మిషన్ కోసం వచ్చాం బాబూ! రాకూడదా?" దూరం నుంచే అరచాడు బోసు.
"ఒక్క పాపాయి కోసం ఇంతమందా? నో! ఎలా చేయను- ఒక కాండిడేట్ తరపున ఇద్దరి కంటే ఎక్కువమంది స్కూల్లోకెళ్ళడానికి వీల్లేదు. అసలు ఈ ఏరియాలో ఇంతమంది గుంపుగా నిలబడ్డానికి కూడా వీల్లేదు. ఇక్కడ 144 సెక్షన్ అమలు చేస్తున్నాం" బెదిరింపుగా అన్నాడతను.
"ఈ స్కూలు ఓనర్ మాకు తెలిసిన మనిషి ఉన్నయ్, కావాలంటే అడుగు! నాపేరు హమీద్ మియా" అన్నాడు మా ప్రెసిడెంట్.
వాచ్ మెన్ సెల్ ఫోన్లో ఓనర్ తో మాట్లాడాడు.
"ఓ.కే ప్రిన్సిపాల్ రూమ్ లోకి వెళ్ళండి!" అన్నాడు గేటు తెరుస్తూ.
అందరం లోపలికెళ్ళి ప్రిన్సిపాల్ ని కలుసుకున్నాం. ఆమె ఎందుకో చాలా కోపంగా ఉంది.
"అడ్మిషన్ కోసం ఇంతమందెందుకొచ్చారు? ఇలాగే గుంపులు గుంపులు గా రావటం, ఎవరో ఒక పాపాయిని కిడ్నాప్ చేయటం పెద్ద న్యూసెన్సయిపోయింది ఛ!" అంటూ అరచేసరికి హమీద్ కంగారుపడ్డాడు.
"అబ్బే- మేము కిడ్నాపర్స్ కాదు మేడమ్! జెన్యువన్ పీపుల్!"
"అయినా గానీ ఇంతమంది రావాల్సిన పనేంటి?"
"ఎందుకంటే మా అపార్ట్ మెంట్ లో 78 మంది లేడీస్ ప్రెగ్నెంట్ అయ్యాయ్ మేడమ్! ఏడోనెలలోనే హోల్ సేల్ రేటులో అందరికీ సిజేరియన్ చేసి డెలివరీ చేయడానికి ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్ తో ఎగ్రిమెంట్ రాసుకున్నాం మరి. ఆ బేబీలందరికి అడ్మిషన్లు కావాలంటే ఇప్పట్నుంచే అప్లికేషన్స్ ఇచ్చి మీ ఉయ్యాలలో రిజర్వ్ చేసుకోవాలని అందరూ చెప్పారు. ఆ విషయం మాట్ల్లడ్డానికే వచ్చాం-" అన్నాడు హమీద్ మియా.
