ఆమెను ఇంకెలాంటి ప్రశ్నలు అర్ధం కాక వెనుదిరిగింది రీటా.
మరొక ముగ్గురిని కలిసినా వాళ్ళు కూడా ఇంచుమించు సుభద్ర చెప్పినట్టే చెప్పారు. ఎవరు చెప్పినా విష్ణు ఒక దైవాంశ సంభూతుడుగానే చెబుతున్నారు. ఎవరిని కదలించినా అయన సాక్షాత్తూ విష్ణుమూర్తి అవతారంగానే భావిస్తున్నారు.
రీటా జాలోచనలు అన్నీ ప్రస్తుతం అయన మీదే కేంద్రీకృతమయ్యాయి. ఆమె కళ్ళ ముందు విష్ణు రూపమే మెదులుతున్నది.
ఆమె మదిలో తళుక్కున ఒక ఆలోచన మెరిసింది. దానిని అమలుపరచడానికి తన శక్తి చాలుతుందా అన్న అనుమానం మరొకవైపు ఆమెను వెంటాడుతున్నది!
విష్ణు మందిరం....
ఆ రోజున అది భక్తులతో కిటకిటలాడిపోతున్నది. అయినా అంతటా ప్రశాంతత. మధ్యాహ్నం సమీపిస్తున్న కొలదీ భక్తులు పలచబడుతున్నారు.
అలుపూ , ఆయాసం , అలసటలు అనేవి ఎలా వుంటాయో అసలు తెలియవు అన్నట్టు విష్ణు వదనం నిర్మలంగా, నిశ్చలంగా వున్నది.
నుదుట ఆద్యాత్మిక తేజస్సు ప్రకాశిస్తున్నది.
తమ సమస్యలను విన్నవించుకుంటున్న భక్తులకు చిరుదరహాసంతో , ప్రశాంత చిత్తంతో పరిష్కార సమాధానాలను విష్ణు ఇస్తూనే వున్నాడు . చిద్విలాసంగా నవ్వుతున్నాడు.
పన్నెండు గంటలకు మందిరం మెయిన్ గేటును మూసివేశారు.
స్వామివారి దర్శనం లభించని వాళ్ళు వెనుదిరిగి నిరుత్సాహంతో వెళ్ళిపోయారు.
పట్టు పీతాంబరాలు ధరించిన శిష్యులు తమ పనులలో నిమగ్మమై వున్నారు.
అపరాహ్న వేళకు పూజా మందిరంలో పరమేశ్వరునికి బిల్లపాత్ర పూజ నిర్వహించాలి. కనుక మరికొందరు శిష్యులు ఆ ఏర్పాట్లలో మునిగిపోయారు. క్రమశిక్షణ అక్కడ రాజ్యమేలుతున్నది.
మందిరం లోపల వున్న భక్తులు మెట్లెక్కి పై గదిలోకి వెళుతూన్నారు.
అందరూ భక్తీ పారవశ్యంతో నిదానంగా, నిశ్శబ్దంగా కదులుతున్నారు.
ఉన్న అతి కొద్దిమందిలో మినీ స్కర్టు ధరించిన ఒక యువతి మాత్రం మాటిమాటికి తన ముంజేతి రిస్ట్ వాచ్ కేసి చూసుకుంటున్నది. ఆమెకు ముందు వెనుక వున్న భక్తులు ఆమె చర్యను గమనించే స్థితిలో లేరు. ఉన్నట్టుండి ఆ యువతి క్యూ లోనుంచి తప్పుకున్నది.
పిల్లిలా అడుగులు వేస్తూ ప్రక్కగదిలోకి నడిచింది. ఆ గదిని పరిశీలనగా చూశాకా, తనకు కావలసిన గది అదికాదని అర్ధం కావడంతో ప్రక్కగదిలోకి వెళ్ళిందామె.
మరుక్షణం ఆ మినీ స్కర్టు యువతి కళ్ళు మిలమిల మెరిశాయి.
ఆనందంతో ముందుకు కదిలిందామె!
పూజా మందిరంలో పూజ మొదలయిందని వినపిస్తున్న మంత్రోచ్చటనను బట్టి వూహించింది. అదే తనకు అనుకూలమయిన సమయం అని గ్రహించి , తను వచ్చిన పని పూర్తీ చేసుకుని మెల్లిగా ఆ గదిలోంచి ఎయిర్ బ్యాగ్ బయటపడింది.
నెమ్మదిగా మందిరం దాటి మెయిన్ రోడ్ పై కాలు మెపింది.
అంతవరకూ ఆ భవంతి వంద గజాల దూరంలో వున్న నాలుగంతస్తుల భవనం రెండో ఫ్లోర్ నుంచి చూస్తున్న ఇన్ స్పెక్టరు వినయ కుమార్ లో చలనం వచ్చింది.
ఉదయం నుంచి బైనాక్యులర్స్ తో విష్ణు మందిరాన్ని కూలంకషంగా పరిశీలిస్తున్న వినయ కుమార్ చూపుల నుంచి ఆ యువతి తప్పించులేకపోయింది. అవి డేగ చూపులు.
ఆమెను గమనించిన వెంటనే ఆమె ఎందుకు లోపలకు అడుగు పెట్టింది తెలిసిందతనికి. ఆటోను కేక వేసి ఆమె ఎక్కుతూ వుండడం గమనించిన వెంటనే వి.హెచ్. ఏప్ లో తన స్టాఫ్ ను ఎలర్ట్ చేశాడు. ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్ ఉత్సాహంగా, ఉద్వేగంగా.
వెనువెంటనే చకచకా క్రిందకు దిగి జీప్ ను స్టార్టు చేసి, అటో వెళ్ళిన దిశలో వేగంగా బయలు దేరాడు.
ఎంతో దూరం వెళ్ళక ముందే తనకు ఎదురుగా వస్తున్న పోలీస్ బైక్ లను గమనించి అయోమయంగా జీప్ ను స్లో చేశాడు వినయ్ కుమార్.
"సర్.....మీరు చెప్పినట్టు ఏ అటోనూ మాకు కనిపించలేదు" రిపోర్టు చేశారు పోలీసులు.
ఆ సమాధానం విన్న వినయ్ కుమార్ ఖంగుతిన్నాడు.
హౌ ఈజ్ ఇట్ పాజిబుల్? తను ఎక్కడ ఏమరినట్టు?
విష్ణు మందిరం మంచి బరువుగా వున్న సంచితో సహా ఆమె అటో ఎక్కడం తన కంటితో తను చూశాడు. అది కల కాదు. పచ్చి నిజం.
కానీ , పోలీసులకు ఎదురు కాలేదు........ఏమైనట్టు? ఇంతలోనే అంత కనికట్టా?
తన ఉనికిని ఎప్పుడు ఎక్కడ ఎవరు గమనిస్తారోనని అనుక్షణమూ తన జాగ్రత్తలో తను వుండి వుంటుందనే విషయం వినయ్ కుమార్ కు అప్పుడు అర్ధమయింది.
