'అందులో ఒక్కటేమిటి చాలా పేజీలున్నాయిగా' అనబోయి నిగ్రహించుకుకున్న మంగ పుస్తకాన్ని తెరిచింది.
ఐదంగుళాల పొడవు, నాలుగంగుళాల వెడల్పు గల ఓ ఆర్ట్ పేపర్ పడింది నేలపై, అందంగా రాసిన పంక్తులు కనిపించాయి.
"మీవి నేత్రాలు కావు, రుచిర స్వప్నలను మూటగట్టుకుని శతకోటి జలపాతాలు కోరస్ లా ఒకేసారి పాడే సమ్ముగ్ధగాత్రాలు. మీ రెప్పల మాటున కదిలేని కనుపాపలు కావు, సృష్టికర్త మహేంద్రజాలంలో నిఖిల గానాల్ని వర్షింపచేసే సుమధుర తాపాలు!"
నవ్వేసింది మంగ. "ఇప్పుడు తెలిసిందమ్మా!"
"ఏమిటి ?"
"మీలో గొప్ప కవయిత్రి దాగి వుంది"
మంగ కంగారుపడింది. "అయితే ఈ వాక్యాలు చెత్తగా ఉన్నాయి.'
"నేను అడుగుతున్నది నీ సర్టిఫికెట్ కాదు."
మరేమిటి మేడం?" మంగకి కళ్ళనీళ్ళ పర్యంతమైంది.
"ఆ రాసిందెవరు?'
"నేను కాదమ్మా!"
"నువ్వు కాదని తెలుసే ......కాని రాసి నాకు చాలా తప్పు చేశాడు!"
"ఎవరతను?" సీరియస్ గా అడిగింది మంగ.
"అది ఏడవాల్సింది నువ్వు" మంగకు ఇంకా అర్ధం కాలేదని భోధపడటంతో వెంటనే అంది కిన్నెర--" ఈరోజు సెంట్రల్ లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకంలో ఈ కవిత ఉందంటే ఎవరో కావాలని రాసి ఉంటాడనిపిస్తుంది."
"ఎంత ధైర్యం!"
రాజకుమారి పంచన పడుంటే చెలికత్తెలా ఆవేశాన్ని నటించింది. "వాడి అంతు చూడాలి చిన్నమ్మగారూ! లేకపోతే మొత్తం తమ వంశానికే ఇది కళంకం!"
"నీ బోడి అనాల్సిస్ మానేసి ఇప్పుడు ఆ మనిషేవరో తెల్సుకోవటానికేం చేయాలో ఆలోచించు."
చాలా సలహాల్ని ఇవ్వగల కిన్నెర ఇప్పుడు తను ఏం తోచనట్టు హడావుడి పడుతుంటే, అబ్బురంగా చూస్తూ ఉండిపోయింది మంగ. "ఇది గోటితోనే పోవాల్సింది తప్ప గొడ్డలి దాకా వెళ్ళనివ్వకూడదమ్మా!" మంగ ఇలా అంటుండగా ఉదయ్ తన గదిలోకి వెళ్ళడం కనిపించి పిలిచింది- "ఉదయ బాబూ!"
అనవసరంగా ఈ విషయానికి మంగ మరింత పబ్లిసిటి ఇస్తుందనిపించిన కిన్నెర ఆ కాగితాన్ని దచబోతుండగా ఉదయ్ గదిలోకి వచ్చాడు.
"ఏం చరిత్రగల వంశమని ఉదయ్బాబూ?"
"బాజా మానేసి విషయానికి రా" ముక్తసరిగా అన్నాడు ఉదయ్.
ఉక్రోషంగా చూసింది కిన్నెర. అన్నయ్య అదినుంచి ఇంతే. ఇంత ఘనత వహించిన గతం గురించి ఎవరు మాట్లాడినా ఇదే పద్దతిలో ఖండిస్తుంటాడు. కిన్నేరకు మాత్రమే కాక వీర్రాజుకు సైతం నచ్చని విషయం అదే.
కిన్నెర విషయాన్ని మరుగున ఉంచుదామనుకుంటుండగానే మంగ కవితను అతడి చేతిలో వుంచి జరిగింది చెప్పింది.
ఏకాగ్రతగా చదివిన ఉదయ్ నెమ్మదిగా తల పైకెత్తి కిన్నెర వేపు చూశాడు--" మొత్తానికి ఎవరయినా కాని, తన మనోభావాల్ని అద్భుతంగా రాశాడు. ఎవరమ్మా?"
కిన్నెర మొహం జేవురించింది.
"నాన్నకు చెప్పి మీ విషయం మాట్లాడమంటావా?"
ఒళ్ళు మండిపోయింది కిన్నేరకు. అక్కడికి తనేదో వ్యవహారంలో చిక్కుకున్నట్టు అతననుకోవడం అస్సలు నచ్చలేదు.
"సిగ్గు పడకమ్మా!" అనునయించాడు ఉదయ్. "ఇంత కాలం నీ విషయం అసలు పట్టించుకోని నేను, ఈ విషయంలో సహకరించటానికి సిద్దంగా వున్నాను."
"అన్నయ్యా!" ఆవేశంగా అరిచింది కిన్నెర. అది కాదు ఆమె కళ్ళలో నీళ్ళు సుడులు తిరుగుతున్నాయి. "నిన్ను పిలిచింది, నిన్ను సహాయం అడుగుతున్నది ఇలా రాసిందెవరో తెలుసుకోమని."
పాయింటు అప్పటికి అర్ధమైనట్టు నిట్టుర్పు వదిలాడు. అర నిముషం నిశ్శబ్దం తర్వాత అన్నాడు - "దీని కింతగా బాధపడాల్సిన అగత్యమేముంది కిన్నెరా? ఎవరో మరెవరికో రాసింది అయ్యుండొచ్చుగా? అక్కడికి లైబ్రరీ నుంచి నువ్వే నవల తీసుకునేది ముందే తెలిసినట్టు, నీ గురించే కావాలని ఎవరో చేశారనుకోవడం సమంజసంగా లేదు." చెప్పి వెళ్ళిపోయాడు ఉదయ్.
ఈ లాజిక్ నచ్చింది కిన్నేరకు, కావచ్చు. ఇది తన గురించి రాసి ఉండకపోవచ్చు. ఎవరో, మరెవరికో రాసిందికాకతాళీయంగా తన దాకా వచ్చి ఉండొచ్చు.
అయినా....అది ప్రేమలేఖా, లేక వట్టి కవితేనా?
"మీవి నేత్రాలు కావు, రుచిర స్వప్నాలను మూట గట్టుకుని శతకోటిజలపాతాలు కోరస్ గా ఒకేసారి పాడే సమ్ముగ్ధ గాత్రాలు......"
అంత అద్భుతమైన నేత్రాలుంటాయా?
ఎందుకో ఎదురుగా ఉన్న నిలువు టద్దంలో తనను తాను ఓసారి చూసుకోకుండా ఉండలేకపోయింది.
"మీ రెప్పల మాటున కదిలేవి కనుపాపలు కావు....."
ఛఛ! ఏమిటి తనిలా ఆలోచిస్తుంది? ఎలాంటి వంశం తనది? మొండిగా మనసు మరల్చుకుంది.
కోపంగా ఆ కాగితాన్ని చించి ముక్కలు చేసింది మంగ చూస్తుండగానే.
ఆ రాత్రి నిద్రకు ముందు అదోలా ఉన్న కిన్నేరని చూస్తూ అంది మంగ....."ఎందుకయినా మంచిది మీరు జాగ్రత్తగా ఉండండి అమ్మాయి గారూ! ఎందుకంటే అరుదైన మీ అందం ఎందర్నో ఆకట్టుకునే అవకాశముంది. అలాంటప్పుడు ఇలాంటి వలలు విసరటం సామాన్యమేగా!" తెలుగు నవలలు చదివి సంపాదించిన విజ్ఞానాన్ని భాషా రూపంలో వ్యక్తికరించడం ప్రారంభించింది. "అంతగా మీకు నవలలు కావాలి అనుకుంటే నాకు చెబితే నేను తెస్తాగా?"
