Previous Page Next Page 
హద్దులున్నాయి జాగ్రత్త పేజి 10


    "నాకు బిడ్డని కని నా మీద హక్కులు సాధిద్దామని కలలు కనకు. అసలు నీ కడుపులో బిడ్డకి నేనే తండ్రినని ఏమిటి గ్యారంటీ?"
    
    "లోకానికి తెలీకపోవచ్చు కానీ మీ అంతరాత్మకి తెలీదా?" విస్మయంగా అడిగాను.
    
    "తెలుసు! కానీ నా తల్లి దండ్రులు కూడా నమ్మరు. నమ్మకూడదు. ముఖ్యంగా ప్రియకి ఈ విషయం తెలీకూడదు. తెలిస్తే వూరుకోదు. ఏదో మా ఇంట్లో పనిమనిషి హోదాలో పడి బ్రతుకుతున్నావని అనుకుని ఏమీ పట్టించుకోడంలేదు. మొన్న ఫోన్ చేసి ఆనంద్ భార్యని అని చెప్పావట. అలా ఇంకెప్పుడూ చేయకు. నీకో పేరు ఏడిసిందిగా...అది చెప్పి ఏడు!" అన్నాడు.
    
    ఒక్కొక్క మాటా నా గుండెని తూటాల్లా తాకాయి. కట్టుకున్న పెళ్ళానికి కడుపొచ్చిందని వుంచుకున్నదానికి తెలియకూడదంటున్నాడు. తెలిస్తే ఆవిడ వూరుకోదట. నేను పనిమనిషిలా పడున్నానని వూరుకుంటోందిట. లేకపోతే ఏంచేసేదో? సన్నగా నాలో కసి మొదలయింది.
        
    "అలాగే ఇంకెప్పుడూ చెప్పను. కానీ నాకు ఒక్క విషయం చెప్పి వెళ్ళండి" అన్నాను.
    
    "ఏమిటీ?"
    
    "ఆవిడ మిమ్మల్ని వుంచుకున్నందుకు ఏమిస్తోంది నెలకి...? రేట్లు తెలుసుకుందామని అడుగుతున్నాను..." నా మాట పూర్తవకముందే నా జుట్టు పట్టుకుని గోడకేసి కొట్టాడు. అలా  ఆపకుండా కొడుతూనే వున్నాడు. నుదురు చిట్లి రక్తంతో నైటీ తడిసిపోతోంది. అతని కక్ష తీరక బూటు కాలితో ఎడాపెడా తన్నాడు. నేను కడుపుకి చేతులు అడ్డు పెట్టుకుని తప్పించుకోడానికి ప్రయత్నించాను.
    
    "నీ కడుపులో పిండాన్నే కాదు, నిన్నుకూడా కిరోసిన్ పోసి తగలబెట్టేస్తాను జాగ్రత్త!" అని బెదిరించి గదిలోకి వెళ్ళిపోయాడు.
    
    ఈ సన్నివేశం కోసమేనా నేను ప్రొద్దుటినుండీ అంతగా ఎదురుచూసింది. ఏడవడానికి నా కళ్ళల్లో నీళ్ళు మిగలలేదు. మాధవి అందుకే చెప్పింది అని రేషన్ గా వాడుకోమని. నా పెదవుల మీదకి నిస్సారమైన నవ్వొకటి వచ్చింది. సాయంత్రం విరించి అన్నాడు. 'నాకు అప్పట్లో ప్రేమని వ్యక్తం చేయడానికి సరైన పద్దతి తెలీలేదని! ఒకడికి ప్రేమని ఇవ్వడం తెలీదు.....రెండింటికీ నేనే బలైపోయాను.
    
                                                                * * *
    
    ప్రొద్దుట లేవలేకపోయాను. అలాగే పడుకుని వుండిపోయాను. పాలవాడు వచ్చి పిలిచి పిలిచి వెళ్ళిపోవడం, పనిమనిషి రావడం, పనులు చేయడం అన్నీ తెలుస్తూనే వున్నాయి. అయినా లేవలేకపోతున్నాను. కడుపంతా బిగబట్టినట్లుగా వుంది. అత్తయ్య వచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తుందేమో! అమ్మో....ఆవిడతో వెళితే కొడుకు మాటమీద అబార్షన్ చేయించేస్తుంది. కడుపుమీద చెయ్యేసి నిమురుకుని 'ఇఒంకా రూపం రాని నీ మీద ఎందుకమ్మా ఈ రాక్షసులకి ఇంత కక్షా?' అనుకున్నాను. ఆలోచిస్తే అన్నింటికీ కారణం డబ్బే అని తోచింది. బహుశా ప్రియంవద డబ్బే వ్యాపారానికి పెట్టుబడిగా పెట్టి వుంటారు. మార్కెట్లో వీళ్ళ కాస్మోటిక్స్ కి మంచి గిరాకీ వుంది. ఆమె భర్తకేం గొంతు వున్నట్లు లేదు. మావయ్య ఈనాడు ఇంత పొజిషన్ లో వుండడానికి ఆవిడే కారణం అయి వుంటుంది. అందుకే ఆనంద్ కీ, ఆవిడకీ వున్న అక్రమసంబంధాన్ని ఆనందంగా స్వీకరించారు. తాళి కట్టడానికి వీల్లేకపోయింది కానీ ఆ ఇంటి కోడలిస్థానం ఆవిడదే! అత్తయ్యకీ, మావయ్యకీ 'ప్రియ' పేరు నోట రాని క్షణం వుండదు. జయంతికి కూడా సిగ్గులేదు. ప్రియ తెచ్చిన బట్టలూ, ప్రియ తెచ్చిన కాస్మోటిక్స్....ఎంతసేపూ ఇవే కబుర్లు ఆవిడకన్నా సిగ్గులేనివాడు ఎప్పుడూ అత్తారిల్లు పట్టుకుని వేళ్ళాడే ఆ అల్లుడు. అసలు వినోద్ ఆనంద్ ముందు సిగ్గులేకుండా ఎలా తిరగగలడో నాకు అర్ధంకాదు. నేనంటే పనిమనిషి హోదాలోకి తెలిసే వచ్చాను. వినోద్ ఎందుకు నోరు మూసుకుని పడి వుంటున్నాడూ? ఆ ఇంట్లో ఎవరికీ వెన్నెముక లేదని నాకు అర్ధమైపోయింది. కూరలు తెప్పించడం దగ్గర్నుంచి కోడలు నెలతప్పడం వరకూ ప్రియంవద అంగీకారం లేకుండా జరగకూడదు. జరిగితే...ఆ కోణంలో ఆలోచిస్తుంటే నాకు బ్రతకాలనే ఆశ కలుగుతోంది. ఏదో తెలియని కసే బ్రతుకుమీద తీపిని పుట్టిస్తుంది. అది లేకే చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు.
        
    ఆనంద్ ఆఫీసుకి వెళుతూ వచ్చి "అమ్మ వస్తుంది. వెళ్ళు.....వెళ్ళి ఆవిడ చెప్పినట్లు విను. లేకపోతే తెలుసుగా" అని హెచ్చరించి వెళ్ళిపోయాడు.
    
    నాకు మాట్లాడడానికి ఓపికలేదు. అలాగే పడుకుని వుండిపోయాను. పక్కకి తిరుగుదామంటే కూడా చాతకావడంలేదు.
    
    డోర్ బెల్ మ్రోగుతోంది అత్తయ్య వచ్చి వుంటుంది అనుకోగానే ఏడుపు తన్నుకొచ్చింది. దిండులో మొహం దాచేసుకున్నాను. దగ్గరకొస్తున్న అడుగుల చప్పుడు వినిపిస్తోంది. ఎక్కిళ్ళు పెడుతూ అలాగే పడుకున్నాను. అడుగుల శబ్దం నా మంచం దగ్గరకొచ్చి ఆగింది.
    
    "ఒద్దు.....నా కడుపులో బిడ్డని చంపొద్దు. నేనేం అపకారం చేసానని నన్నింతలా ఏడిపిస్తున్నారు? మీరెన్ని బాధలు పెట్టినా నోరు మెదిపి ఎవరికీ చెప్పుకోనన్నా చెప్పుకోవడం లేదుగా.....ఎందుకిలా హింసిస్తున్నారు? ప్లీజ్....నన్ను నామానాన వదిలిపెట్టండి..ఇంక నేనేం కోరను,  నన్ను తల్లినవనీయండి" అని వలవలా ఏడ్చాను.
    
    నా తలమీద ఓ ఆత్మీయమైన స్పర్శ!
    
    ఆశగా తలెత్తి చూసాను. విరించి నిలబడి వున్నాడు.
    
    "మీరా...." లేవబోయాను. కానీ లేవలేకపోయాను.
    
    "తలుపుతీసే వున్నా లోపలికి రాకూడదనుకో కానీ నువ్వు ఏడుస్తున్న ధ్వని విని వుండలేక  వచ్చేసాను" అన్నాడు.
    
    నేను లేచి పైట సరిచేసుకుని కూర్చున్నాను. బుగ్గలమీద ఎండిపోయిన చారికలూ నుదుటిమీద గాయం, మెడ క్రిందుగా వాతలు దేరిన చర్మంతో అతని ముందు పడడం నా దురదృష్టం.
    
    "నిన్న గుళ్ళో చూసి నీ జీవితాన్ని చాలా గొప్పగా వూహించుకున్నాను. ఇలా రాకపోయినా బావుండేది, నిన్నిలా....మైగాడ్! ఎందుకిలా చేస్తున్నాడు?" అన్నాడు.
    
    "ఏం లేదు. బాగానే వుంది. బాగానే చూసుకుంటాడు" అతనివైపు చూడకుండా అనేసి "రండి.....హాల్లో కూర్చుందాం" అని లేచాను.
    
    విరించి నా భుజం మీద చెయ్యి వేసి "మొత్తం తెలిసిపోయింది అయినా భారతీయ మహిళవి  కాబట్టి ఇంకా దాచాలని చూస్తున్నావు. ఏదైనా డౌరీ ప్రాబ్లెమా?" అడిగాడు.
    
    ఆ నిమిషంలో అతనలా చెయ్యివేసి మాట్లాడడం నాకు ఏమీ తప్పనిపించలేదు. పైపెచ్చు ఆ మాత్రం స్వాంతనకే కరిగిపోయి అతని గుండెల్లో తలదాచుకోవాలనిపించింది.
    
    "చెప్పు....వరకట్న బాధితురాలివా?" అడిగాడు.
    
    "కాదు - వాళ్ళు  బోలెడు బంగారం ఎదురిచ్చి నన్ను కొనుక్కున్నారు. పుత్తడిబొమ్మా పూర్ణమ్మని" అన్నాను.
    
    "మరెందుకిలా..."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS