ప్రపంచంలో ఒక ప్రసిద్దిగాంచిన జవాబు లేని ప్రశ్న. మరెందుకిలా? అన్నీ బాగానే వుంటాయి. పైకి కనిపిస్తాయి.... లోన చూస్తే పుచ్చులుంటాయి. మరెందుకిలా? నేను అతనికి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుండగానే అత్తయ్య గొంతు వినిపించింది. "సుమతీ...ఏం చేస్తున్నావు?"
నేను తత్తరపాటుతో బయటికి నడిచాను. నా వెంట అతనూ.... మేం బెడ్ రూంలో నుంచి అలా రావడం నాకెంతో ఎబ్బెట్టుగా వుంది.
అత్తయ్య ఇద్దర్నీ అదోలా చూసింది.
"ఈయన నేను చదువుకునే రోజుల్లో పరిచయం విరించిగారు" అన్నాను.
అత్తయ్య హుందాగా తల ఊపి ఊరుకుంది. కానీ మర్యాదకైనా నమస్కారం అనలేదు. అసలు మెడ తిరగని నగలు పెట్టుకుని మోయలేనంత పెద్ద కొప్పేసుకుని ఇంకా బరువైన పట్టుచీర కట్టుకుని చిన్నగా ఊపి అంతకన్నా వూపలేక అదే హుందాతనం అనుకుంటుంది.
విరించి మాత్రం "నమస్కారం....మీ గురించే మా సుమతి చెప్తోంది" అన్నాడు.
నేను అదిరిపడి చూసాను. అతను రెండు తప్పులు చేసాడు. ఒకటి 'మా' అని నా పేరు ముందు పెట్టడం. రెండోది మీ గురించే మాట్లాడుతున్నాం అనడం.
ఆవిడ ముఖం అప్రసన్నంగా పెట్టి "పద....హాస్పిటల్ కెళదాం బయల్దేరు" అంది.
"నీరసంగా వుంది అత్తయ్యా" అన్నాను.
"అందుకే...." పొడిగించకుండా క్లుప్తంగా అనేసి "డ్రైవర్..." అని కేకేసింది. నేను అలాగే నిలబడి విరించి ముందు ఏమీ అనలేక నేల చూపులు చూడసాగాను.
"పద...నాకు మధ్యాహ్నం నుంచీ వేరే పనులున్నాయి" ఆవిడ తొందరపెట్టింది.
నేను విరించి వైపు తిరిగి "మీరు బయల్దేరండి. ఇంకోసారి కలుద్దాం" అన్నాను.
అతడు తలవూపి అత్తయ్యకి మరోసారి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు.
అతను వెళ్ళిపోగానే నేను అత్తయ్యతో "నేను ఎబార్షన్ కైతే రాను" అన్నాను.
"బాబు ఏమన్నాడో తెలుసా? అసలు....అసలు వాడు నిన్ను తాకనైనా తాకలేదుట. కడుపెలా వచ్చిందీ? అంటున్నాడు" అంది.
"అత్తయ్యా, నువ్వూ ఓ ఆడపిల్లకు కన్నతల్లివి. ఆ మాట నమ్ముతున్నావా?" దుఃఖంతో గొంతు బొంగురుపోతుండగా అన్నాను.
"ఇక్కడికొచ్చేదాకా కూడా నమ్మలేదు" ఆ మాట నా నెత్తిమీద బాంబులా పడింది. అంటే అప్పుడు విరించిని ఇక్కడ చూశాక కొడుకు మాట నమ్ముతోందా?
"అత్తయ్యా....మీరు కూడా?" అన్నాను.
"చూడు సుమతీ....నీకు ఈ నాలుగు గోడలూ, మేం నలుగురు మనుషులమూ మాత్రమే తెలుసు అనుకున్నాను. నీ గురించి నాకు తెలియని సంగతులు కూడా వున్నాయని ఇప్పుడే తెలిసింది. అయినా ఇకముందు ఇలాంటివి జరగకుండా చూసుకో. మీ మావయ్యకి పరువుకన్నా ఏదీ ఎక్కువకాదు. చివరికి ప్రాణం కూడా" చివరి మాట నెమ్మదిగా చెప్పింది.
మూడేళ్ళ తర్వాత విరించిని నిన్ననే చూసాననీ, ఈరోజే కలిసాననీ ఎలా చెప్పి నమ్మించడం?
"అత్తయ్యా...అతను ఈ రోజే నాకోసం వచ్చాడు..." అని ఇంకా ఏదో చెప్పబోతుండగా...
"ఈ రోజు నీ కోసం ఎవరు వచ్చారో...నిన్న ఎవరొచ్చారో...మాట్లాడుకుంటూ కాలయాపన చేయకు. బయల్దేరు" అంది.
"నన్ను చెప్పనీ.....మీరనుకుంటున్నది అబద్దం. నా కడుపు మీ కొడుకు వల్లే వచ్చింది. కావలిస్తే డీ ఎన్ ఎ టెస్ట్ చేయించుకోండి!" అన్నాను.
అత్తయ్య మొహం వివర్ణమైపోయింది. అస్సలు చదువురాని పల్లెటూరి మొద్దుని కోడలుగా చేసుకోనందుకు ఆ నిమిషంలో మావయ్యని మనసులో బూతులు తిట్టుకుంటూ వుండే వుంటుంది.
"నువ్వు పెద్ద మనసుతో వ్యవహరించు. మావయ్య నిన్ను ఇంట్లో వదిలేసి ప్రతిరాత్రి మరో స్త్రీతో గడుపుతుంటే నువ్వు భరించగలిగేదానివా చెప్పు నేను తెలిసే చేసుకున్నాను కాబట్టి భరిస్తున్నాను. ఆ విషయం గురించి కంప్లెయింట్ కూడా చెయ్యడం లేదు. నాకు నా తోడు కావాలని మాత్రమే అభ్యర్దిస్తున్నాను" అన్నాను.
"నేనూ మీ మావయ్య లేని సమయంలో ఇంకోడితో పడకగదిలో లేను ఎప్పుడూ మరి" ఆవిడ ఆ మాట అనేటప్పుడు ఆ మొహంలో దాగని శాడిజం కనిపించింది.
"అతను ఇక్కడికి రావడం ఇప్పుడే.....జస్ట్ నువ్వు వచ్చే ఐదునిమిషాల ముందే అంటే నమ్మవేం?" నేనూ అరిచాను.
"అతను ఇక్కడికి ఇప్పుడే వచ్చాడు సరే.....నువ్వు ఎన్నిసార్లు వెళ్ళావో నాకు తెలీదా? నా కొడుకు ప్రియంవదని తప్ప మరో స్త్రీని వద్దనుకోవడం వల్లనే ఇన్ని సంబంధాలు వదులుకున్నాం. వాడే కావాలనుకుంటే ఐశ్వర్యారాయ్ లాంటి అమ్మాయి వచ్చేది. నీలాంటి సామాన్యమైన పిల్లని నేను చేసుకున్నామంటే ఏదో తిండికీ, గుడ్డకీ లోటుండదూ...పడుంటుందనేగా.!" ఆవిడ కోపంగా అంది.
"కానీ నీ కొడుకు నన్ను రాత్రిళ్ళు..." ఆపేశాను.
"ఛీ! ఇంక ఆపు. వాడు నేను ముట్టుకోలేదని చెప్పాక కూడా ఇంకా వాదించడానికి సిగ్గులేదా?" ఛీత్కారంగా అంది.
నేను ఎంత నిస్సహాయంగా చూశానంటే రెండు చేతులతో తల మోదుకోవడం తప్ప ఏమీ చెయ్యలేకపోయాను.
"సుమతీ....దువ్వెన పట్రా జడేస్తాను" నన్ను దగ్గరికి తీసుకుని అంది. ఆ తర్వాత "ఏమంత వయసు అయిపోయిందని....పిల్లలు ఇంకా ముందు ముందు పుట్టరనా? మావయ్య స్వంతంగా ఒక ఫర్మ్ పెట్టాలనుకుంటున్నారు. అప్పటిదాకా నువ్వు మాతో కాస్త సహకరించాలీ" అంది.
ఆమె ఏం చెప్తోందో నాకు అర్ధమైపోయింది. ప్రియంవద అభీష్టానికి విరుద్దంగా ప్రవర్తించే హక్కు ఎవరికీ లేదు. కొడుకు ప్రియంవదతో గడపకపోతే వీళ్ళ మనుగడకే ముప్పు!
నాకు జడిసి, థానే బీరువాలోంచి చీర తీసి ఇచ్చింది.
నేను బావురుమంటూ అత్తయ్య కాళ్ళమీద పడి "అమ్మయినా....అత్తయినా నువ్వే....నాకీ ఒక్క సహాయం చెయ్యి నా కడుపులో బిడ్డని నాకు దక్కనీ. ఇంకోసారి ఈ అదృష్టం పడ్తుందని నాకు నమ్మకం లేదు!" ఏడ్చాను.
"సరే....పద" అని నా కళ్ళు తుడిచింది.
"వద్దు అత్తయ్యా" అన్నాను.
"డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దంటే ఎలా? చూడు ఎంత నీరసంగా వున్నావో? పద....బలానికైనా టానిక్కులూ అవీ తీసుకుందువుగాని!" అంది.
నేను రిలీఫ్ గా వూపిరి పీల్చుకున్నాను.
ఇద్దరం డాక్టర్ దగ్గరికెళ్ళాము.
"డాక్టర్ నన్ను పరీక్ష చేసి మందులు రాసిచ్చింది.
