Previous Page Next Page 
నల్లంచు-తెల్లచీర పేజి 10

  

       "......పదిసంవత్సరాల క్రితంలాగే బట్టలమూట మోస్తూవుంటే ఏమి వుండేది? శర్మగారు తనని కలుసుకోకపోతే ఎలా వుండేది!" అనుకున్నాడు. గతం గుర్తొచ్చింది.
   
    .....పట్నంలో వీధి వీధి తిరుగుతూ అతడో విషయం గుర్తించాడు. రోడ్డున పోయేవాడి బట్టలు సాయంత్రమయ్యాక ఎవరూ కొనరు. భర్తలు ఇంట్లో లేనప్పుడే కాలక్షేపంకోసం పిలుస్తారు. ఒకటీ అరా కొంటారు. కాబట్టి ఆ సమయంలోనే అమ్మటం మంచిది. మిగతా వేళల్లో తిరగడం అనవసరం.
   
    అందువల్ల సాయంత్రం పూట పని చేయటానికి అతడో బట్టల షాపులో చేరాడు.
   
    ఒకరోజు ఒకాయన వచ్చాడు. దాదాపు యాభై ఏళ్ళుంటాయి. షాపులో యజమానితో సహా అందరూ ఆయన రాగానే లేచి నిలబడ్డారు. "బయట అద్దాల్లో మోడల్ బొమ్మకి కట్టిన చీర చాలా బావుంది. కార్లో వెళుతుంటే అట్రాక్ట్ చేసింది అదివ్వండి" అన్నాడు. హడావుడిగా యజమాని రవివైపు తిరిగి "ఆ చీర ఇవ్వు" అని, కూల్ డ్రింక్ తెప్పించటం కోసం వెళ్ళాడు.
   
    రవి ఒక చీర తీసి యిచ్చాడు. ఆయన దానివైపు పరీక్షగా చూసి, "ఇదికాదు బయట బొమ్మకు కట్టింది" అన్నాడు.
   
    "అదే ఇది. ఒకటే శారీ సర్!"
   
    "కానీ అది బావుంది!"
   
    రవి ఆయనవైపు చూసి నవ్వేడు. "-ఎంత బావున్నా, షోకేస్ లో కట్టిన చీరలు ఎప్పుడూ కొనకండి సర్. రోజుల తరబడి ఎండకి అవి కలర్ షేడ్ తప్పిపోయి ఉంటాయి." ఆయన మొహంలో ఆశ్చర్యం కనిపించింది, "కానీ ఈ చీరకీ దానికీ తేడా ఉన్నట్టుందే."
   
    "చీరలో లేదు సర్. కట్టడంలో వుంది."
   
    ఆయన ఈసారి అతడివైపో క్షణం కన్నార్పకుండా చూసి "సరే, పాక్ చెయ్యి" అన్నాడు. అని యజమాని దగ్గరికి వెళ్ళి కూల్ డ్రింక్స్ తీసుకున్నాడు. ఇద్దరూ కౌంటర్ దగ్గిర మాట్లాడుతూ వుండగా, "ఎవరా కుర్రాడు?" దూరంగా చీరని ప్యాక్ చేస్తున్న రవివంక చూస్తూ అన్నాడు.
   
    "సాయంత్రం పూట పార్ట్ టైం చేస్తూ వుంటాడు సర్!"
   
    "సాయంత్రం పూటా? ఇంతకు ముందీ సిస్టమ్ లేదే!"
   
    "పగలంతా ఎక్కువ రష్ ఉండదు. సాయంత్రం పూట ఓ రెండు మూడు గంటలు నలుగురైదుగుర్ని పెట్టుకుంటే బావుంటుంది. ఎక్కువ జీతం ఇవ్వనవసరం లేదు."
   
    "ఈ సలహా కూడా ఆ కుర్రవాడే యిచ్చాడా?" అంటూ కారువైపు నడిచాడు.
   
    -ఈ లోపులో రవి చీర ప్యాకెట్టుతో వచ్చాడు. "అయ్యగారి కార్లో పెట్టు" అన్నాడు యజమాని.
   
    ఆయన కార్లో కూర్చుని స్టార్టు చేస్తూ వుండగా, రవి ప్యాకెట్టు అందజేశాడు.
   
    ఆయన చీర అందుకుంటూ, "ఎప్పుడూ కస్టమర్లకి 'ఈ చీర కొనకండీ!' అని చెప్పకూడదు" అన్నాడు క్లుప్తంగా.
   
    "మన దగ్గిర రెండో చీర అలాంటిదే ఉన్నప్పుడు మొదటి చీరలో లోపం చెప్పటం ద్వారా కస్టమర్ కి నమ్మకం పెరుగుతుంది. రెండో చీర ఎలాగూ అమ్ముడవుతుంది...... సర్!"
   
    కారు కదిలి వెళ్ళిపోయింది. రవి లోపలికి వచ్చి, పక్కనున్న సేల్స్ మన్ ని అడిగాడు ఆయన ఎవరని.
   
    "శర్మగారు తెలీదా? తేజా టెక్స్ టైల్స్....." రవికి షాక్ తగిలినట్టయింది. తేజా టెక్ టైల్స్ చైర్మన్ తో తను మాట్లాడాడు. ఆయనకీ 'తఃను' చీరాల గురించి చెప్పాడు.
   
                              *    *    *   
   
    ....ఒకప్పుడు తేజా టెక్స్ టైల్స్ ఎంతో ప్రసిద్ది. కానీ అది గతం శర్మగారికి గుర్రప్పందాల అలవాటు వుంది. దాంట్లో లక్షలు పోయాయి, తాగుడు అలవాటయింది. వ్యాపారంమీదా ఉత్సాహం పోయింది. క్రమంగా ఆ కంపెనీ మూతపడే స్థితికి వచ్చింది. ఇది వర్తమానం.
   
    ఆ మరుసటిరోజు మధ్యాహ్నం మూడింటికి ఒక అమ్మాయి వచ్చింది షాప్ కి. ఆమెకి పాతికేళ్ళుంటాయి. యవ్వనంతో మెరిసి పోతోంది. లోపలికి రాలేదు. షోకేస్ దగ్గరే నిలబడి బొమ్మని చూస్తూ, "అందుకే నేను కట్టుకుంటే ఆయనకి నచ్చలేదు" అనుకుంది స్వగతంగా.
   
    షాపు యజమాని పరుగెత్తుకుంటూ వచ్చి, "ఏమయింది మేడం?" అన్నాడు కంగారుగా.
   
    "నిన్న ఆయన ఇక్కడే కొన్నారటగా ఇలాంటి చీర!"
   
    "అవును మేడమ్!"
   
    "ఈ బొమ్మలో వున్న అందం-నేను కట్టుకుంటే సగంకూడా రాలేదన్నారు. అదేమిటో చూద్దామని వచ్చాను" నవ్వింది. ".....ఎవరు దానికి కట్టింది?"
   
    "రవి అని కుర్రాడు మేడమ్!"
   
    ఆమె కారు దగ్గరకు నడిచి, కార్లో కూర్చుంది; ఆమె కెందుకనో నవ్వొచ్చింది. బహుశా భర్త మాటలకి కాబోలు.
   
    ఆడవాళ్ళు షోకేసుల్లో బొమ్మల్లా వుండాలని ఏ భర్తయినా కోరుకుంటాడు. కుదరకపోతే విసుక్కుంటాడు.
   
    "ఆ కుర్రవాడెవరో కట్టాడు. అది ఒక ఆర్ట్!" వెనుకే వచ్చిన షాపు యజమానితో చిరునవ్వుతో అంది. ఆమె మొహంలో ఎప్పుడూ చిరునవ్వు చెరగకుండా వుంది. అదో అందాన్ని ఇస్తుంది.
       
    "రవి అని సాయంత్రం పూట వస్తాడు మేడమ్. పగలంతా స్వంతంగా వీధుల్లో అమ్ముకుంటాడు."
   
    ఆ అమ్మాయి నవ్వుతూనే తలూపి, కారు స్టార్ట్ చేసింది. యజమాని లోపలికి వెళ్ళిపోయాడు. కారు పోనిస్తూ యధాలాపంగా తల పక్కకి తిప్పి సడెన్ గా ఆపింది.
   
    అప్పుడే రవి షాప్ మెట్లెక్కి లోపలికి వెళుతున్నాడు. ఆమె చేతులు స్టీరింగ్ మీద బిగుసుకున్నాయి.
   
    అతడే.....
   
    అయిదు సంవత్సరాల క్రితం -
   
    మిస్ విజయవాడగా ఎన్నికవటానికి సరిగ్గా రెండు గంటల ముందు-అతడు అమర్చిన అలంకారంతో తనని తాను అద్దంలో చూసుకుని - ఆపుకోలేని ఎగ్జయిట్ మెంట్ తో ఎవర్నయితే ముద్దు పెట్టుకుందో - ఆ 'కుర్రవాడు'!
   
    ఆమె లోపలికి తిరిగి వెళ్ళలేదు. కారు ముందుకు సాగిపోయింది. అతడిని కలుసుకునే ప్రయత్నమేమీ చేయలేదు. ఆమె మొహంమీద ఏదో ఉద్వేగభావం మాత్రం కదలాడుతున్నది.
   
    ఆ రోజు సాయంత్రం షాపులో గొడవ జరిగింది. అందులోనే గోపీమాధుర్ అని ఇంకో సేల్స్ మాన్ పని చేస్తున్నాడు. అతడు చాలా సంవత్సరాలనుంచి ఆ షాపులో పని చేస్తున్నాడు. కొనటానికి వచ్చే ఆడవాళ్ళతో జోక్స్ వేసి మాట్లాడుతూ వుంటాడు. చీరలు చూపించేటప్పుడు కావాలని చెయ్యి తగిలించటం, ఈ చీర మీ వంటి రంగుకి చాలా బావుంటుంది అనటం, మీ స్టక్చర్ కి ఏ చీరయినా సరిపోతుంది- లాంటి కామెంట్స్ చేయటం చేస్తూ వుంటాడు. అవతలివారి వైపునుంచి కాస్త ప్రోత్సాహకరమైన నవ్వు కనపడగానే, మరింత ముందుకు సాగుతాడు. "షోకేసులో బొమ్మకి చీర కట్టిన విధానం చూశారుగా- అలా కట్టుకోండి. బావుంటుంది- నేనే కట్టాను. కావాలంటే.." అని నవ్వి, సగంలో అర్ధవంతంగా నవ్వు ఆపుచేస్తాడు.
   
    చాలామంది ఆడవాళ్ళు ఇలాంటివి ఇష్టపడరు. ఆ రోజు జరిగిన సంఘటన ఇలాంటిదే. ఆ షాపులోనే రెడీమేడ్- గార్మెంట్స్ విభాగం ఉంది. ఫాస్ట్ గా వున్నవాళ్ళు కాలేజీ అమ్మాయిలు అయితే, నంబర్ చెప్పి 'బ్రా వుందా?' అని అడుగుతారు. కొంతమంది బాగా మొహమాట పడతారు. అటువంటి అమ్మాయే ఒకామె వచ్చి, తల దించుకొని సన్నటి స్వరంతో చెప్పి, 'థర్టీ' వుందా? అని అడిగింది. గోపీమాధుర్ ప్యాకెట్ విప్పి, "థర్టీ టులో ఈ వెరైటీ అయితే...." అసభ్యంగా ఏదో మాట్లాడాడు. ఆ అమ్మాయి ఏమీ అనకుండా వెళ్ళిపోయాక, "ఎందుకలా అని కస్టమర్ని పోగొడతావు?" అన్నాడు రవి.
   
    "నీ పనేదో నువ్వు చూసుకోరాదూ! నా సంగతెందుకు?" అన్నాడు మాధుర్. ఇద్దరికీ గొడవ జరిగింది. ఆ సాయంత్రం రవిని ఇద్దరు రౌడీలతో  వచ్చి గోపీమాధుర్ తన్నబోయాడు. రవి తిరగబడ్డాడు. అతడు పల్లెల్లో పెరిగినవాడు, ముగ్గురినీ కొట్టాడు. మొత్తంమీద నలుగురూ ఆస్పత్రిలో చేరారు.
   
    వారంరోజుల తరువాత రవి ఆస్పత్రినుంచి విడుదలయ్యే సరికి - అతడికి షాపులో ఉద్యోగం పోయినట్లు తెలిసింది. రెండు రోజులముందే డిశ్చార్జి అయి వచ్చేసిన మాధుర్, రవి గురించి నాలుగు కల్పించి చెప్పాడు. అతడెంతో కాలం నుంచి పనిచేస్తున్న వాడవటంచేత, యజమాని అతడి మాటనే నమ్మాడు.
   
    రవి పెద్దగా బాధపడలేదు.
   
    అతడికి అప్పటికే ఈ ఉద్యోగం బోర్ కొట్టింది. నిరర్ధకంగా తోచింది. ఎంతకాలం చేసినా ఈ పని ఇంతే. అప్పటికతడు ఒక వేయి రూపాయలదాకా జమచేశాడు కానీ వేయి రూపాయలతో ఏ పనికాదు. ఏదో ఒకటి చేయకపోతే చొచ్చుకుపోవడం కష్టం. ఆలోచించసాగాడు... రెండురోజుల తర్వాత అతడికో ఆలోచన తట్టింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS