Previous Page Next Page 
నల్లంచు-తెల్లచీర పేజి 11

 

      పై సంఘటన జరిగిన వారంరోజులకి తేజా డైరెక్టర్ శర్మ తిరిగి ఆ షాప్ కొచ్చి రవి గురించి వాకబు చేశాడు.
   
    "అతడిని తీసేశాం సార్!"
   
    ఆశ్చర్యంగా, "ఎందుకు?" అని అడిగాడు. "ఏవో గుడ్డ ముక్కలు కొట్టేస్తున్నాడట. మా మాధుర్ చెప్పాడు."
   
    "దొంగతనమా? ఆ కుర్రవాడు వప్పుకున్నాడా?"
   
    "ఎందుకొప్పుకుంటాడు సర్? అతడేదో మాధుర్ మీద చెప్పాడు, ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని కానీ మాధుర్ మా దగ్గర చాల సంవత్సరాలనుంచి పనిచేస్తున్నాడు" అన్నాడు యజమాని. ఆ వివరాలన్నీ కనుక్కున్నాక, శర్మ ఇంటికెళ్ళి భార్యతో జరిగిన సంగతి అంతా చెప్పాడు. "ఏదో మంచి ఉద్యోగం ఇద్దామని వెళితే, ఆ షాపులోనే తీసేశారట. నువ్వు గొప్ప పనిమంతుడన్నట్టు రికమెండ్ చేశావు. చూడు ఎలా చేశాడో?" అన్నాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు.
   
    మరుసటిరోజు సాయంత్రం షాపింగ్ కి ఆ షాప్ కే వెళ్ళిందామె. మధుర దగ్గరకెళ్ళి నిల్చుంది. వెనుతిరిగి బట్టలు సర్దుతున్న మాధుర్ వెనక్కి తిరిగి ఆమెను చూశాడు. ఒక్కక్షణం ఆమె అందాన్ని చూసి మతిపోయింది.
   
    "ఏమి చూపించమంటారు మేడమ్?"
   
    ఆమె వెంటనే జవాబు చెప్పకుండా నవ్వింది.
   
    అయిదు సంవత్సారాల క్రితం లయోలా కాలేజీ కుర్రాళ్ళనంతా మజ్నూలని చేసి సత్యనారాయణపురం చుట్టూరా తిప్పిన నవ్వు అది.
   
    "బ్రాసరీ లున్నాయా?" అని అడిగింది, నవ్వుతూనే "....36 నంబర్!"
   
    ఆమె నెంబర్ చెప్పగానే మాధుర్ మొహంలో వెకిలినవ్వుతో కూడిన అదోలాటి భావం కదలాడింది. అదేదో మామూలుగా చూసినట్టు ఆమె బ్రెస్ట్ మీద రెండు క్షణాలు చూపు నిలిపి, తరువాత ఆమె మొహంలోకి చూశాడు. ఒక రకమైన ప్రొఫెషన్ ఇచ్చే 'పాస్' అది. ఆమె మొహంమీద నవ్వు అలాగే వుంది.
   
    అతడు వెనుదిరిగి, వెనుకవున్నా బీరువాలోంచి ప్యాకెట్టు బయటకు తీయసాగాడు. తీస్తూ ఆలోచించాడు. ఆమె తన చూపుని గమనించి కూడా అలాగే చిరునవ్వుతో వుండటం అతడికి అదోలాటి ధైర్యాన్నిచ్చింది. అంతకు ముందయితే ఆమెలోని హుందా అతడిని భయపెట్టింది.
   
    అతడు అన్నిరకాల బ్రాలని చూపుతూ, "ఈ హుక్స్ కొత్తగా వచ్చాయి మేడమ్ విప్పటానికి సులభంగా వుంటాయి" అన్నాడు. అలా అంటూ అతడు ఆ బ్రాని ఎత్తిపట్టుకున్న భంగిమ అసహ్యంగానూ, ప్రవొకేటింగ్ గానూ వుంది.
   
    ఆమె తలెత్తి చూసింది. అతడు నవ్వేడు.
   
    "ఎవరికి? నాకా? ఆయనకా-?" అందామె సన్నటి స్వరంతో పక్కనే వున్న సేల్స్ మెన్ కి కూడా వినిపించనంత నెమ్మదిగా దాంతో అతడికి పూర్తిగా ధైర్యం వచ్చింది. అతడికి తన అందం మీద చాలా నమ్మకం వుంది.
   
    ఈ లోపులో ఆమె ప్యాకెట్ లోంచి మరొకటి తియ్యటానికి చెయ్యి వేసింది. అదే సమయానికి అతడు, తన చేత్తో పట్టుకున్న దాన్ని వదిలేశాడు. అది ఆమె చెయ్యిమీద పడగానే, మరొకటి తీసి ఆమెకి చూపెట్టే నెపంమీద తనూ వాటిమీద చెయ్యిపట్టి, బట్టలక్రింద వున్న ఆమె చేతిని నెమ్మదిగా స్పృశించాడు. ఆమె చెయ్యి తీయకపోవడంతో, చిటికెన వేలిని గట్టిగా వత్తాడు.
   
    అప్పుడు పేలింది అతడి చెంప.
   
    అద్దాలు కదిలిపోయేలా వినబడిన ఆ చప్పుడికి, ఒక్కసారి ఆ షాపు హాలంతా మార్మోగింది.
   
    మాట్లాడుతున్న కస్టమర్లందరూ తలతిప్పి చూశారు.
   
    అక్కడ శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది కొద్దిసేపు.
   
    కౌంటర్ దగ్గిరున్న యజమాని పరుగెత్తుకు వచ్చాడు.
   
    అతడికి చెమటలు పట్టినయ్. "ఏమైంది మేడమ్? ఏమైంది మేడమ్?" అన్నాడు కంగారుగా.
   
    ఆమె చెయ్యి ఇంకా మంట పెడుతూనే వుంది. ఇంతకుముందు నాలుగైదుసార్లు, చదువుకునే రోజుల్లో ఇలా కొట్టిందిగానీ, అప్పుడు సాధారణంగా అబ్బాయిలు సైకిల్ మీద కూర్చుని ఉత్తరం అందించిన వాళ్ళు, లేదా దూరం నుంచి ఏవో వెకిలి మాటలన్న వాళ్ళు అయివుండేవారు. ఇప్పుడలా కాదు. నిలబడి వున్నా మనిషిని, పది నిముషాలముందే కొట్టేటందుకు ప్రిపేరయి వుండి, సాచిపెట్టి కొట్టటం.
   
    గోపీమాధుర్ కళ్ళు బైర్లు కమ్మాయి. అతడు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ఊహించనంత వేగంతో జరిగిపొయిందంతా.
   
    .....మాధుర్ దగ్గరికి ఆడవాళ్ళు రాగానే తాము ఎంతపనిలో ఉన్నా అతడి ప్రవర్తనని గమనించటం పక్క సేల్స్ మెన్ కి అలవాటు. అతడు 'టాకిల్' చేసే విధానాన్ని గమనిస్తూ వుండేవాడు. ఆ రోజు అంత అందమైన స్త్రీ అతడితో నవ్వుతూ మాట్లాడుతూ వుండటాన్ని ఒకరిద్దరు ఈర్ష్యతో చూస్తున్నారు. ఆమె చేతిమీద అతడు చెయ్యికూడా వెయ్యటం చూశారు. ఆమె సన్నటి స్వరంతో మాట్లాడటం చూసి, ఎక్కడ కలుసుకోవాలో చెప్పుతూ వుంది అనుకున్నారు. అంతలో ఆమె చాచిపెట్టి కొట్టింది. వాళ్ళుకూడా ఓ క్షణం నిశ్చేష్టులయ్యారు. కానీ వాళ్ళలో ఏదో ఆనందం పొంగిపొర్లింది. అతడిమీద ఈర్ష్యతో వాళ్ళ మనసుల్లో తగిన శాస్తి జరిగింది అనిపించింది. చూచిన దానికి నాలుగైదు కల్పించి పక్కవాళ్ళకి చెప్పసాగారు. గాలిలా పాకిపోయింది అది.
   
    ఈ లోపులో ఆమె విసవిసా బయటికి నడిచింది.
   
    యజమాని ఆమె వెనుకే చేతులు నులుముకుంటూ పరుగెత్తాడు. ఆమె ఏమీ మాట్లాడకుండా కారులో కూర్చుని పోనిచ్చింది.
   
    ఆమె ఇంటికి చేరుకునేసరికి, అప్పటికే నాలుగైదుసార్లు ఫోన్ వచ్చింది. ఆమె ఫోన్ అందుకుంది. షాపు యజమాని "మాడమ్, సారీ మాడమ్ సారీ" అంటున్నాడు. ఈ సంఘటన షాపు అమ్మకాల్ని ఎంత తగ్గిస్తుందో అతడికి తెలుసు.
   
    "సర్లెండి. అయిపోయిందేదో అయింది-"
   
    యజమాని గుండెల్నిండా ఊపిరి పీల్చుకుని, థాంక్స్ మాడమ్-" అని ఆగి, ప్రాధేయపడుతున్నట్టు "-ఈ విషయం శర్మగారికి......" అని అర్దోక్తిలో ఆపుచేశాడు.
   
    "చెప్పన్లెండి. అయినా ఆడవాళ్ళొచ్చే షాపుల్లో అలాటి వాళ్ళుంటే అమ్మకాలు...." ఆమె మాటలు పూర్తి కాకుండానే అతడు అందుకుని- "అవును మాడమ్- చాలా డేంజర్" అన్నాడు.
   
    "ఇంతకీ వాడినేం చేశారు?"
   
    "అప్పుడే తీసేశాను మాడమ్. రావల్సిన జీతం కూడా ఇచ్చి వెంటనే పంపేశాను."
   
    "గుడ్..... అన్నట్టు వీడి సంగతి ఇంతకుముందే మీకో సేల్స్ మాన్ చెప్పినట్టున్నాడు కదూ. అనవసరంగా అతనిమీద దొంగతనం నేరం మోపి తీసేశారు."
   
    "అవును మాడమ్ పొరపాటయిపోయింది. వీడు చాలాకాలం నుంచీ చేస్తున్నాడు కదా అని వీడి మాటలు నమ్మాము."
   
    "పాపం అతనెక్కడున్నాడు?"
   
    "తె.....తెలీదు మాడమ్."
   
    "కనపడితే వెంటనే తిరిగి తీసుకోండి."
   
    "తప్పకుండా మాడమ్.... ఈ విషయం శర్మగారి వరకూ...."
   
    "నేను మర్చిపోతున్నాను. మీరూ మర్చిపోండి."
   
    "థాంక్స్ మాడమ్."
   
    "ఉంటాను."
   
                         4   

   
    అయితే రవి తిరిగి ఆ షాపు ఛాయలకి ఎన్నడూ వెళ్ళలేదు.
   
    ఉద్యోగం పోయాక ఏం చెయ్యాలా అని ఆలోచించాడు.
   
    మామూలుగా అయితే భారతదేశంలో చీరలమ్మేవాళ్ళు లక్షలమంది వున్నారు. దానివల్ల లాభం లేదు. పెద్ద ఎత్తున చేయటానికి పెట్టుబడి లేదు. ఉన్నంతలో ఏదో చేయాలి.
   
    తన దగ్గిరున్న వెయ్యి రూపాయల్తో వర్తకం చేయలేనని అతడికి తెలుసు. కొద్దిగా అప్పు తీసుకున్నా, మహా అయితే ఓ ఇరవై చీరలొస్తాయి. వాటిలో ఎన్నని అమ్మగలడు?
       
    రవి ఆలోచించాడు.
   
    ఏదో ఒకటి కొత్తగా చేస్తే తప్ప లాభంలేదు.
   
    షాపులో ఉద్యోగం మానెయ్యటంవల్ల - ఇంట్లో డబ్బు కూడా లేదు. మాధవి, మాధవి తల్లి (తన అత్తగారు) గొణుక్కోవటం ప్రారంభించి చాలాకాలమైంది. బావమరిది రోడ్డుపట్టుకు తిరగటం తప్ప పనేమీ చేయడు. బయటకు వెళ్ళటానికి పాంటు కూడా లేదు. ఉన్న ఒక్క పాంటూ చిరిగిపోయింది. "ఎన్ని సార్లు కుట్టాలి బాబూ - కుట్టుకూడా నిలబడటం లేదు" అన్న తిరస్కారంతో, తనకా పని ఇష్టంలేదని అన్యాపదేశంగా మాధవి అతడికి తెలియచేసింది.
   
    మోకాళ్ళ దగ్గిర చిరుగుని, మరో గుడ్డ వెనుకపెట్టి తనే కుట్టుకోవడం ప్రారంభించాడు అతడు! ఇటువంటి తిరస్కారాలు అతడికి అలవాటే.
   
    చేతికుట్టు పైకి కనపడకుండా పాంటు కుట్టుకుంటూ వుండగా-
   
    -అప్పుడు స్ఫురించింది అతడికి. ఆప్లిక్ వర్క్,
   
    సాదా చీరమీద వేరే గుడ్డతో డిజైను కుట్టి, దాన్నే ఒక అద్బుతమైన చీరగా మార్చటాన్ని ఆప్లిక్ వర్క్ అంటారు. ఎంబ్రాయిడరీ అంత బాగోదు అని చాలామంది అనుకుంటారు. కానీ అది కేవలం కుట్టటం చేతకాక! చీర రంగు, పైన వేసే గుడ్డ రంగు సరిగ్గా మ్యాచ్ అవ్వాలి. మళ్ళీ మ్యాచ్ అవటం అంటే తెలుపుకి నలుపు, నలుపుకి తెలుపు ఇలాంటి గుడ్డ మ్యాచింగు కాదు. అది పుస్తకాల్లో చదివితే రాదు. కుట్టవలసిన ఆకృతి (డిజైన్) బట్టిరంగు ఎన్నుకోవటం కూడా ఒక కళ. ఆలోచనంటూ రావాలేగానీ అలాంటి ఆర్టు అతడి చేతిలోనే వుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS