Previous Page Next Page 
నల్లంచు-తెల్లచీర పేజి 9

   

     చేతులు రెండూ కోటు జేబుల్లో పెట్టుకుని తాపీగా బయటకొచ్చి కారు స్టార్ట్ చేశాడు. దంపతులిద్దరూ కారు వద్దకు వచ్చారు.
   
    "నా పెద్ద చెల్లెలి పెళ్ళి మీరు చేస్తారనే ఆశతో మీ భార్యని నేను చేసుకున్నాను" అన్నాడు మాధవరావు.
   
    రవితేజ నవ్వాడు. "పెద్ద చెల్లెలే కాదు, మిగతా చెల్లెళ్ళ పెళ్ళికూడా చేస్తాను. డబ్బు పెద్ద సమస్య కాదు. మా ఆవిడైతే..... సారీ......మాజీభార్య అయితే, అసలు డబ్బెందుకు అంటుంది. అంతేనా మాధవీ..... ఇప్పుడు నీ కోర్కె తీరింది. ఆఫీసు, ఇల్లు తప్ప మూడో విషయం తెలియని మాధవరావు నీకు భర్తగా వచ్చాడు. ఒకరి కష్టాల్లో ఒకరు పాలు పంచుకోవచ్చు. ఆఫీసునించి రాగానే షికార్లు వెళ్ళవచ్చు. పాలునీళ్ళులాగా కలిసిపోవచ్చు. నువ్వు కోరుకున్నదీ అదేగా! నా వాళ్ళందరూ సుఖంగా వుండాలన్నదే నా కోర్కె బెస్టాఫ్ లక్!" అంటూ కారు ముందుకి పోనిచ్చాడు.
   
                             *    *    *   
   
    ఎన్నిరోజులు గడిచాయో తెలీదు. ఒక వర్షం కురిసిన రాత్రి తలుపు కొట్టిన చప్పుడు వినిపించింది. రవితేజ తలుపులు తీశాడు.
   
    ఎదురుగా మాధవి వుంది. "వొచ్చేసానండీ అక్కడ వుండలేక వచ్చేశాను" అంది.
   
    "ఏమైంది మాధవీ? సాయంత్రప్పూట పార్కులకి వెళ్ళటం లేదా? ఒకళ్ళ కష్టాలు మరొకరు పాలు పంచుకోలేకపోయారా?" ఆత్రంగా అడిగాడు.
   
    "రాత్రి రెండింటికి లేచి ఆ పంపులో నీళ్ళు పట్టలేనండీ.....ఆ రెండో ఆడపడుచు పైకి అలా కనపడుతూంది కానీ నంగనాచి. ఆయన జీతంలో నేనేదో కాస్త తీసి చీరకోసం వుంచుకున్నానని తెలిసి, తనకీ ఓ చీర కావాలని తల్లి దగ్గిర చేరి ఒకటే నసుగుడు. అబ్బబ్బ..... ఆ ఇంట్లో నేనో క్షణం వుండలేకపోయాను."
   
    "ఇంటి సంగతి సరే! ఆయన ప్రేమగా చూసుకుంటున్నాడా? అది చెప్పు!"
   
    "ఆ! చూసుకుంటారు. ఏం లాభం! పెద్దోడి కీసారి క్లాసులో మార్కులు సరిగ్గా రాలేదు. రెండోవాడికి అజీర్తి. దాంతో ఇంతకు ముందులా ఆయన ఇంటిక్కూడా పెందరాళే రావటంలేదు. స్నేహితుల్తో తిరిగి ఏ ఎనిమిదింటికో వస్తారు. ఈ మధ్య సిగరెట్లు కూడ తెగ కాలుస్తున్నారు. కాని సిగరెట్టు పొగ అసలు పడదు. మీకు తెలుసుగా!"
   
    "వొద్దనీ చెప్పలేకపోయావా?"
   
    "చెప్పానండీ... పెళ్ళయిన మొదట్లో కొంతకాలం మానేసారు. మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టారు. ఎందుకని అడిగితే, బాధలూ, టెన్షన్ మర్చిపోవటానికి అన్నారు."
   
    "మరిప్పుడేం చేస్తావు?"
   
    "ఆయన్నొదిలేసి, ఏదైనా ఉద్యోగం చూసుకుని వెళ్ళిపోదామనుకుంటున్నాను. ఏ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లోనో వుంటాను."
   
    "అదే మంచిదనుకుంటాను మాధవీ! నీ మనస్తత్వానికి ఎలాంటి మొగవాడూ సరిపోడు."
   
    "అదేమిటండీ?"
   
    "తను కొన్న చీరకన్నా, తన తోటికోడలు కొనుక్కున్న చీరే బావున్నట్టు తోచటం సహజం! చీరలవరకూ అయితే ఫర్వాలేదు కానీ, అది జీవితానికి కూడా అన్వయించుకుంటే కష్టం. నీ మొగుడూ, నీ కాపురం కన్నా, ఎదురింటి కాపురం బావున్నట్టు అనిపించిన మరుక్షణం నీకు సుఖశాంతులు కరువైనట్లే. ఇది తెలుసుకోగలిగావు... చాలు."
   
    రవితేజకి చప్పున మెలకువ వచ్చింది. వళ్ళంతా చెమట పట్టింది. చాలా సుదీర్ఘమైన కల..... తల పక్కకి తిప్పి చూశాడు. మాధవి నిద్రపోతోంది. వెల్లకిలా, కాళ్ళు కాస్త ఎడంగా, రైల్వే ఫ్లాట్ ఫాం మీద కూలీలు పడుకునేటట్టు! - భార్యని ఆపోశ్చర్ తో చూడలేక మరోపక్కకి తిరిగి పడుకున్నాడు.
   
    వచ్చిన కలే అతడిని వెంటాడుతుంది. అతడికి సిగ్గుకూడా వేసింది. ఏమిటా కలకి అర్ధం!
   
    తననుంచి తన భార్య దూరంగా వెళ్ళిపోవాలని మనసులో కోరుకుంటున్నాడా? లేదు ఆమె చేసే పనులకి, ఆమె వాదించే డానికీ - ఒకోసారి చెంప బ్రద్దలు కొట్టాలన్నంత కోపం వచ్చే మాట నిజమే. అంతమాత్రం చేత విడిపోవాలనుకోలేదు ఎప్పుడూ తన దురదృష్టానికి తనలోనే ఏడ్చేవాడు అంతే!
   
    పెళ్ళయిన కొత్తలో ఇప్పటికన్నా ఎక్కువ కష్టపడేవాడు. దాన్ని అర్ధం చేసుకునేది కాదు. "ఎందుకింత కష్టపడటం.... ఎవరు కష్టపడమన్నారు?" లాటి మాటలనేది. ఏ మనిషైనా గుర్తింపు కోసమే చాలా పనులు చేస్తాడు. అలాటి గుర్తింపు ఇంట్లో జీవిత భాగస్వామి దగ్గిరే దొరక్కపోతే ఏం లాభం?
   
    పోనీ డబ్బంటే ఇష్టంలేదా...... అంటే.....
   
    "చాఛా......ఫంక్షన్ కి వెళ్ళటానికి ఒక్క చీరలేదు" అంటుంది తయారవుతూ.
   
    "అదేమిటి మాధవీ? బీరువాలో 350 చీరలు పెట్టుకుని..."
   
    ఆమెకి 350 చీరలున్నాయని అతడికి తెలుసు. లెక్కపెట్టలేదు. కానీ మెదడులో ముద్రితమై పోయింది. 60 ఫారిన్ చీరలు, 80 పట్టుసిల్క్ చీరలు (32 బెనారస్, 3 గద్వాల్, 10 ధర్మవరం, 1 కుంభకోణం, 24 కాంచీపురం, 2 ఆరణి, (8 కాశ్మీరి), మధుర, వెంకటగిరి, పోచంపల్లి వగైరా చీరెలు 120, ఇవిగాక షిఫాను, జార్జెటు, ఆర్గండీ, చందేరీ ఫుల్ వాయిల్, హాఫ్ వాయిల్ మరో 90.
   
    "బాగా లెక్కపెట్టి వుంచుకున్నారే."
   
    "లెక్కకాహ్డు, మూడొందల యాభై చీరలు పెట్టుకుని, ఫంక్షన్ కి వెళ్ళటానికి ఒక్క చీర లేదంటావేం?"
   
    "ఒక్కసారి వచ్చి చూడండి. అందరూ కొత్త కొత్త డిజైన్లు కట్టుకుని వస్తే- నేనేమో దేభ్యం మొహం వేసుకుని వెళ్ళాలి- ఛీ..... దేనికైనా పెట్టిపుట్టాలి. ఎప్పుడూ ఇవే చీరలు కట్టుకొస్తుందని అందరూ నవ్వుకోరూ?"
   
    "మరి వున్న చీరలన్నీ ఏం చేస్తావు?" ఆశ్చర్యం గొంతులో నిండుతుంది.

    "ఎన్నున్నాయి? అదేమీ జనరల్ మేనేజర్ గారి నడగండి. ఎన్ని చీరలున్నాయో వాళ్ళావిడకి."
   
    "ఆవిడ కూడా ఈ ఫంక్షన్ కొస్తుందా?"
   
    "వస్తుంది. ఏం?"
   
    "ఇప్పుడు వాళ్ళింట్లో కూడా ఇదే వాదన జరుగుతూ వుంటుందని నా వుద్దేశ్యం. ఆవిడ నీ గురించి వాళ్ళాయనకి చెప్తూ వుంటుంది ఇలాగే-"
   
    "చాల్లెండి ఇదో తర్కం నేర్చుకున్నారు."
   
    "అవును తర్కమే! రాత్రింబవళ్ళు కష్టపడితే, ఎవరు పడమన్నారు- మిమ్మల్ని చేసుకోవటంకన్నా గుమాస్తాని చేసుకోవటం సుఖం అంటావు. మళ్ళీ ఫంక్షన్ కి వెళ్ళాల్సివస్తే ఒకసారి కట్టిన చీర మరోసారి కట్టనంటావు. ఎలా నీతో?"
   
    "ఛీ ఛీ- పెళ్ళానికి ఎవరన్నా మంచి చీర కొనిపెడ్దామనుకుంటారు కానీ - ఇలా వాదనలతో కడుపు నింపుదామనుకోరు." అతనికి విసుగేస్తుంది, ఎంత చెప్పినా అర్ధం చేసుకోలేని భార్యని చూసి. ఫంక్షన్ కి వెళ్ళగానే పదిమంది కళ్ళూ తనమీదా, తన చీరమీదా పడాలి. తను- సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలి. అదీ కోర్కె!..... జీవితంలో మరే అఛీవ్ మెంటూ లేని స్త్రీలకి ఇంతకన్నా పెద్ద కోర్కెలేమిటుంటాయి?   
   
    అతడికింకా ఆ కలే గుర్తొస్తూంది! ఎందుకొచ్చిందా కల? అందుకే పురుషులు రేసులు, క్లబ్బులు పట్టుకు తిరుగుతారనుకుంట. మరి తనేం చెయ్యాలి!
   
    ఆ రాత్రి అతడికి మరి నిద్ర పట్టలేదు. పక్కమీద చాలాసేపు అటూ ఇటూ పొర్లాడాడు.
   
    అతడికి తన గతం గుర్తొచ్చింది. ఒకప్పుడు కటిక నేల మీద పడుకుని భవిష్యత్తు గురించి ఆలోచించేవాడు. ఇప్పుడు వర్తమానం గురించిన ఆలోచన. భవిష్యత్తును గురించిన ఆలోచనల్లో ఆనందం వుంది. మనిషి వర్తమానం గురించి ఆలోచిస్తున్నాడంటే, బాధలో వుంటాడన్నమాట.
   
    తనతో వచ్చిన పెద్ద చిక్కేమిటంటే, ఏమాత్రం అభిప్రాయ భేదం వచ్చినా వెంటనే సర్దుకుపోలేడు. ఒకరోజు ఏదో పెళ్ళికి పక్కింటావిడ చీర కట్టుకొని, ఆవిడ నగలే వేసుకుని తయారైంది. మళ్ళీ మామూలు గొడవే. "ఇన్ని నగలు, చీరలు వుండగా వేరే వాళ్ళవి వాడటం ఏమిటని" అతడు చిరాకుపడ్డాడు. ఇంకొకరి చీరలో ఆమె కనబడటం చాలా ఇరిటేటింగ్ గా అనిపించింది. అందులోనూ అన్ని చీరలు, నగలు వుండగా! ఇదంతా ఆడాళ్ళకి మామూలే అంటుంది. తను చిరాగ్గా పడుకుంటే, "ఛీ! ఏ మొగుడైనా పెళ్ళాన్ని బ్రతిమాలి మంచి చేసుకుంటాడు. అదికూడా తెలీదు. ఖర్మ!" అంటుంది. ఎందుకు చేసుకుంటాడు? రాత్రయ్యేసరికి ఆమె కావాలి కాబట్టి!! తప్పు తనదే అనిపిస్తే పగలే చేసుకోవచ్చుగా, 'అవసరం' వచ్చినప్పుడే ఎందుకు చేసుకుంటాడు? ఈ విషయం గుర్తించి కూడా గుర్తించనట్టు కనబడటం ఆడవాళ్ళ అజ్ఞానమా? లేక తెలివా?
   
    ఏదేమైనా ఈరకమైన 'దూరం' తమ మధ్యనుంచి పోదు.
   
    ఆమెవైపు నుంచి కూడా ఆలోచించడానికి ప్రయత్నించాడు.
   
    పిల్లల్ని స్కూలుకి తీసుకెళ్ళటం, పెళ్ళాంతో కలిసి కూరగాయల మార్కెట్ కి వెళ్ళటం, ప్రొద్దున్నే పదింటికి ఆఫీసుకి వెళ్ళి సాయంత్రం అయిదింటి కొచ్చేయటం...చాలా మంచి విషయాలు. ప్రతి స్త్రీ కోరుకునేది అదే. కానీ రోజురోజుకీ మనిషి జీవితం సంక్లిష్టమవుతున్న రోజుల్లో, జీవన వ్యయం పెరుగుతున్న రోజుల్లో, ఇది సాధ్యమేనా? అసలేమీ సాధించని వాళ్ళుకూడా అయిదింటికి రావటంలేదు అని గ్రహించదే! "పక్కింటాయన్ని చూడండి. భార్యనెంత ప్రేమగా చూసుకుంటాడో" అంటుంది. ఈ పక్కింటి వాళ్ళందర్నీ మిషన్ గన్ తో కాల్చి చంపెయ్యాలి. తన సంసారం తప్ప ప్రపంచంలో మిగతా సంసారాలన్నీ హాయిగా వున్నట్టు ఆడవాళ్ళందరికీ అనిపిస్తుందెందుకో?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS