"మరేం చేయాలి?"
"ఆదిత్య ప్రబంధకి పరిచయమయింది ఒక పోటీలో, అవునా?" మనసులో రూపుదిద్దుకుంటున్న ఓ పథకానికి భాష్యంలా చెప్పుకుపోతున్నాడు వాసుదేవరావు. "అంటే ప్రబంధ తను ఓడి అతడిపైన అభిమానాన్ని పెంచుకుంది. అలా ఈ రోజు నన్నోడించింది."
సరిగ్గా అర్ధంకాలేదు అతడంటున్నదేమిటో.
"తను ఓడొచ్చు కాని తండ్రిగా నన్నోడించడం న్యాయంకాదు అంటే నేను నేనుగా ఓడిపోవాలి"
"కాస్త వివరంగా చెప్పండి" సూరి రెట్టించాడు.
"అంటే నేను ఏర్పాటుచేసే స్వయంవారంలో ఆదిత్య మరోసారి పోటీకి సిద్దంకావాలి నేను నియమించిన వ్యక్తిపై గెలుపు సాధించి అలా నన్ను ఓడించి, నా కూతుర్ని గెలుచుకోవాలి."
హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.
చాలా చిత్రమైన ప్రపోజల్.
"ఓకే!"
ముందు అంగీకరించింది ప్రబంధ. తన ప్రేమను నిలబెట్టుకోటానికి ఇదే పరీక్ష తప్పనిసరైతే తనపరంగా అభ్యంతరం ఉండదు.
"జవాబు మీరు చెప్పాలి" సూరిని చూస్తూ అన్నాడు వాసుదేవరావు.
ఇందులో ఏదో రాజకీయం వుందని తోచిన సూరి ప్రణయమొహం కేసి చూశాడు.
ఆమె నిశ్శబ్దంగా నేలచూపులు చూస్తోంది.
"ఈ పోటీలో నెగ్గిననాడే ఆదిత్య ప్రబంధకి భర్తయ్యేది. ఓడితే ప్రబంధని శాశ్వతంగా మరిచిపోవాలి"
"కాని..." సంశయం, భయం ప్రణయని కంగారుపెడుతుంటే నెమ్మదిగా అంది. "ఆదిత్యని ఆమోదమో, కాదో తెలుసుకోవాలి"
నవ్వాడు వాసుదేవరావు "నా కూతుర్ని నిజంగా ప్రేమించిఉంటే ఈ ఒక్క విషయంలో అయినా అతడు అర్హతని నిరూపించుకోవాలి. దానికి ప్రబంధ కూడా సరేనందిగా?"
"ఆదిత్య కూడా సిద్దమే" సూరి టక్కున అన్నాడు.
ఒకనాడు ప్రబంధమీది గెలుపుకోసం ఆదిత్యని అడగకుండా ఎలా ప్రపోజ్ చేశాడో, సరిగ్గా అదే నమ్మకంతో ఇక్కడా మాటిచ్చాడు సూరి. ప్రబంధపైన గెలుపుకోసం కాక, ప్రబంధని గెలుచుకోటానికి.
"సరే, మీరు సిద్దమేనంటే రేపు సాయంకాలం మీ యూనివర్శిటీ ఓపెన్ ఎయిర్ థియేటర్ లో పోటీ ఉంటుంది. నా ప్రతినిధి సత్యేంద్రబసు"
ఉలిక్కిపడింది ప్రణయ. ఈ మధ్యనే ఆసియా దేశాల క్విజ్ పోటీల్లో ప్రథముడిగా నిలిచినా బెంగాలీ యువకుడతను.
"ఓకే." పైకి లేచాడు సూరి.
అనూహ్యమైన చివరి పోరాటానికి సుముఖాన్ని వ్యక్తంచేసిన సూరి బయటికి రాగానే అంది ప్రణయ. "తొందరపడ్డారేమో సూరీ! నా కెందుకో భయంగా వుంది."
అదే రాత్రి తండ్రి నిర్ణయాన్ని విన్న శౌరి మండిపడ్డాడు వాసుదేవరావుపైన "ఇదేమిటి డాడీ? ఇలాంటి ప్రపోజల్ పెట్టారేమిటి? ఆదిత్య గురించి మీకేం తెలుసునని?"
నవ్వాడు మృదువుగా "ఈ పెళ్ళి జరగకూడదు అంటే ఇంతకన్నా మరో మార్గం లేదు శౌరీ! ఆదిత్య ఓడిపోతాడు"
"మీ కెలా తెలుసు?"
"ఓడిపోయే చివరి అస్త్రాన్ని నేను సంధించబోతున్నాను కాబట్టి."
ఏ నమ్మకంతో తండ్రి అలా మాట్లాడుతున్నదీ శౌరికి అర్ధంకాకపోయినా, తండ్రి గురించి తెలిసినవాడు కావటంతో చాలా రిలాక్సయిపోయాడు.
సరిగ్గా ఇదే సమయంలో ఆదిత్యకి తన చివరి సందేశంలా ముఖాముఖీ వ్యక్తం చేయలేని మనసుని కాగితంపై రాసి, అతడికి పంపింది ప్రణయ.
"ఆదిత్యా!"
ధైర్యంగా నీ ముందుకు రాగలనేమో కాని, మనసులోని ఆలోచనల్ని నిబ్బరంగా చెప్పలేనేమో! అందుకే నీకీ లేఖ రాస్తున్నాను. వాదోపవాదాల్లో నీతో ఓడిపోతానేమో అనే భయం కూడా వుంది. అంతకుమించి నా వాదంతో నిన్ను ఒప్పించితీరాలన్న కోరికాఉంది. కాబట్టే ఈ మార్గాన్ని ఎన్నుకున్నాను. ఓ తరంగంలా నా అంతరంగాన అడుగుపెట్టిన నువ్వు, నన్ను సురగంగలా మార్చి, నా బ్రతుకు ప్రబంధలోని ముఖ్యపాత్రవై, చాలా కదిలించావూ అని చెప్పలేను కాని, కొంత అలజడిని మాత్రం సృష్టించగలిగావు. అది నిజం!
అందుకే క్రమంగా నీకు దగ్గరకావాలని మాత్రమే కాక, నాకు దగ్గరవ్వాలనుకుంటున్న రోహిత్ ని నీ ద్వారా దూరం చేసుకోవాలనుకున్నది! అది సాధించగలిగాను. ఆ సంఘటనే మనం ప్రేమించుకున్నామని బలంగా విశ్వసించే ఆధారమని అప్పుడు అనిపించినా, ఎందుకో నిజం కాదనిపిస్తోంది నాకు. ఒక చిన్న భావంతో దీపంపెట్టి భవిష్యత్ ను వెలిగించుకోడమే ప్రేమనుకునే ముగ్దని కాను నేను. మంచుపొరలా వున్న మనసు మగతని చెరపేసి స్వప్నాల బృందావనాన చిరునవ్వుల పుప్పొడిని రాల్చుకుంటూ, బ్రతకడాన్ని మనోజ్ఞంగా భావించే తత్వంకూడా కాదు నాది.
నేను మెటీరియలిస్టిక్ గా మాట్లాడుతున్నాననుకోకు. మనసులోని భావాల్ని ఇంత కచ్చితంగా వ్యక్తం చేయటం నాకు అలవాటని నీకూ తెలుసు. కాకపోతే ఇంతకాలం తర్వాత ఈ విషయం చెప్పటంలో నా ఉద్దేశ్యమేమిటని నువ్వడగవచ్చు. ఒక్కటే ఆదిత్యా! కెరటంకన్నా కడలి గొప్పది. కవితకన్నా వెత బరువైనది. ఆలోచనకన్నా అనుభూతి విశాలమైనది. ఇన్నిమ్తి సమన్వయమే ప్రబంధ. మనదెంత పరిచయమని? కూనిరాగం తీసుకునే చిన్న చరణమేగా కాని ప్రబంధ ముగింపులేని ఓ సుదీర్ఘవాక్యం. బ్రతుకు అధ్యాయాన్ని మార్చుకునే ధ్యేయంతో ఆశగా, సముద్రమంత ఘోషగా నీకోసం ఆరాటపడుతున్న ఆడపిల్ల!
నువ్వెవరు విశ్లేషించటానికి అనకు. ఒకనాడు నీ గెలుపుతో నీపైన అభిమానం పెంచుకున్నదాన్ని ఆదిత్యా! ఇక్కడ ప్రబంధ గెలుపుతో నీ విజయాన్ని ఇంకా కోరుకుంటున్నదాన్ని. కలలకి నిఘంటువు లుంటాయోలేదో నాకు తెలియకపోయినా, కలల తాకిడితో పెరిగిన అనుభూతులకు అర్ధాలుంటాయని నమ్మేదాన్ని ఆరాధనకి అర్ధం నిర్జీవ జీవనయానంకాదు, జీవితాన్ని సజీవంచేయడం తెగువగల ప్రేమంటే బ్రతుకు పాఠశాలలోని ప్రయోగం కాదు, పరీక్షనాళిక ఫలితంతో పనిలేని ఓ యోగం. అది దక్కించుకోటానికి ప్రబంధ ఎంత సాహసం చేస్తున్నదీ నీ వూహకందనిది. ఎంతటి అహాన్ని చంపుకుందీ, ఎన్ని నీ కోసం కాలదన్నుకుంటుందీ నువ్వు గ్రహిస్తే, ప్రబంధ నీకెంత అనుకూలవతి అయిన వ్యక్తి అయ్యేదీ నీకే అర్ధమవుతుంది.
