Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 98


    ఇదే విషయాన్ని యిప్పటికి వందసార్లయినా అడిగి వుంటాడేమో!
    
    "ఎందుకు డాడీ! నా సంగతి తెలుసుండి మీరదే పాట మళ్ళీ మళ్ళీ పాడటంలో అర్ధంలేదు"
    
    "అయితే యిలాగే ఛస్తావ్"
    
    "చావాలనేగా డాడీ నిరాహారదీక్ష ప్రారంభించింది"
    
    "నా మాట విను"
    
    "వినను"
    
    "ఆదిత్యని విడిచిపెట్టాను కదే!"
    
    "నన్నూ విడిచిపెట్టు"
    
    "నువ్వున్నది నీ తండ్రి దగ్గరే"
    
    "కాని యిది నిర్భంధం"
    
    "నువ్వు నా మాటకి సరేనంటే స్వేచ్చనిస్తాను"
    
    "ప్రస్తుతానికి సరే అని, ఆ తర్వాత కాదంటే?"
    
    లాలనగా తల నిమరాడు "నువ్వు అన్నమాట తప్పవని తెలుసు"
    
    "కాబట్టే నేను సరే అని చెప్పి, ప్రస్తుతానికి స్వేచ్చను సంపాదించుకోలేక పోతున్నాను డాడీ!"
    
    "ఏమిటి? వాడిలో ఏం చూసి వెంటబడ్డావ్?
    
    "చెప్పినా మీ కర్ధం కాదు"
    
    "నా మాట కాదంటే..."
    
    అర్దోక్తిగా అంది ప్రబంధ "తెలుగు సినిమా తండ్రిలా ఉరేసుకు ఛస్తాననరు. ఆదిత్య శాల్తీని గల్లంతు చేస్తానంటారు. కాని మీకు తెలుసుడాడీ! అదే జరిగితే నేనూ మిగలను"
    
    "పీడా వదిలిందనుకుంటాను"
    
    "డాడీ!" ఆమె కళ్ళనుంచి రోషంగా రెండు నీటిబొట్లు రాలాయి "ఏ గెలుపునాశించి యిదంతా చేస్తున్నారు?"
    
    "నేను ఓటమిని ఎరగని రాజకీయ నాయకుడిని"
    
    "అయినా ఇప్పుడు నాయకుడుగా ఓడారుగా!" అదే వాక్యం మరెవరయినా ప్రయోగించుంటే చెంప పగిలేదే కాని ప్రబంధ ముందు నిగ్రహంకోల్పోతూ సైతం నిగ్రహించుకున్నాడు. "ఇది ఓటమి కాదు"
    
    "ఓడిన ఉక్రోషం మీచేత అలా మాట్లాడిస్తోంది"
    
    "ప్రబంధా!" గావుకేక పెట్టాడు. "నన్ను రెచ్చగొట్టకు"
    
    "నా విషయంలో మీరూ అది పాటించడం అవసరం"
    
    వాక్యం ఇంకా పూర్తి కానేలేదు. ప్రబంధ చెంప చెళ్ళుమంది.
    
    "డూ వాటెవర్ యూ లైక్ డాడ్! కాని నేను మీ మాట వినను. అంతే" కళ్ళనుంచి నీళ్ళు బొటబొటా రాలుతుంటే ఇంకా మొండితనాన్నే ప్రదర్శించింది.
    
    ఏం చేయాలో పాలుపోవడం లేదు వాసుదేవరావ్ కి. ఇక్కడ తండ్రిగా కూడా ఓడిపోవటాన్ని భరించలేకపోతున్నాడు. దీనికంతటికీ మూల కారణమయిన సౌదామినిని చంపేయాలన్నంత ఆవేశం ముంచుకొస్తోంది. కాని బయటికెళ్ళిన సౌదామిని జాడలేదు.
    
    ఎలా? ప్రబంధని ఎలా దారి మళ్ళించాలి?
    
    గది దాటి బయటికి వచ్చిన వాసుదేవరావ్ కు ఆ రాత్రి కాళరాత్రిగా మారింది. తెల్లవారుజామునే దినపత్రికలు చూశాడు. ప్రబంధ ఫోటోలు ప్రచురితం కాలేదు సౌదామిని హామీ ప్రకారం. కాని పద్మనాభం ముఖ్యమంత్రి అయిపోయాడు.
    
    అది మాత్రమే కాదు, ప్రబంధ ప్రేమ కథ ప్రచురితమైంది. కలెక్టరాఫీసు దగ్గర నిర్వహించిన ధర్నా గురించి వివరంగా వుంది.
    
    అసహనంగా మండిపడ్డాడు. ఇప్పుడేం జరగబోతోంది?
    
    అతడు చూస్తూండగానే యూనివర్శిటీ విద్యార్ధులు వందల సంఖ్యలో యింటి ముందు సమావేశమయ్యారు.
    
    "మాజీ మంత్రి వాసుదేవరావ్ జులుం నశించాలి"
    
    "నిర్భంధించిన ప్రబంధను విడిచిపెట్టాలి"
    
    "రాజకీయానికి కొమ్ముకాస్తున్న పోలీస్ వ్యవస్థ చట్టబద్దంగా వ్యవహరించాలి!"
    
    "మైనర్ కాని ప్రబంధ స్వేచ్చను హరించటం ప్రాథమిక హక్కుకి భంగం కలిగించడమే!"
    
    బ్యానర్స్ తో, అట్టలతో ధర్నాలోలా నినాదాలు మొదలుపెట్టారు.
    
    కొత్త ముఖ్యమంత్రికి టెలిగ్రామ్ లు వెళ్ళాయి.
    
    మధ్యాహ్నమయ్యేసరికి క్లాసుల్ని బాయ్ కాట్ చేసిన కాలేజీ, హైస్కూలు విద్యార్ధులు వేల సంఖ్యలో గుమిగూడారక్కడ.
    
    ఇదే అదనుగా ప్రతిపక్ష సభ్యులు వచ్చి విద్యార్ధుల్ని పరామర్శించడం ప్రారంభించారు.
    
    లాభంలేదని సాయంకాలం అయిదుగంటలకల్లా బోధపడిపోయింది వాసుదేవరావ్ కి. ఇది యింకా బలాన్ని పుంజుకోకముందే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆరుగంటలు కావస్తూండగా కొందరు విద్యార్ధులను చర్చలకు ఆహ్వానించాడు.
    
    ప్రణయతోబాటు సూరీ వాసుదేవరావుని కలుసుకున్నాడు.
    
    అంతే కాదు, రాజకీయ దక్షతని ప్రదర్శిస్తూ చర్చలకి ప్రబంధనీ రప్పించి తన దగ్గరే కూర్చోబెట్టుకున్నాడు.
    
    "నిజమే, నేను నిర్బంధించటానికిగాని ప్రబంధమార్గాన్ని నిర్దేశించటానికి గాని ఆమె మైనరుకాదు. రాజ్యంగా రీత్యా కూడా ఆమె హక్కుని భంగపరచడం నేరం. కాదనను. కాని తండ్రిగా ఆమె భవిష్యత్తు గురించి నేను ఆలోచించడం నేరంకాదు."
    
    "అంతవరకు నిజం!" టక్కున అన్నాడు సూరి.
    
    "అందుకే ఓ షరతు పెడుతున్నాను"
    
    "చెప్పండి" అడిగింది ప్రణయ.
    
    "ఆర్ధికంగాగాని, స్థాయిరీత్యాగాని ఆదిత్య అనే ఆ వ్యక్తి మా కుటుంబంలో అడుగుపెట్టడానికి అనర్హుడు!"
    
    "కాని...." సూరి వెంటనే జోక్యం చేసుకున్నాడు. "మీ అమ్మాయి ప్రబంధ అతడిని ప్రేమించింది. అదే ఆదిత్యకున్న పెద్ద అర్హత."
    
    "అలా అని నేను తండ్రిగా సరిపెట్టుకోలేను"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS