అందుకే ఆదిత్యా! నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. స్నేహితురాలిగా అర్దిస్తున్నాను. ప్రేమంటే పూర్తి నిర్వచనం తెలుసుకునే ప్రయత్నంలో ఉన్న నాకన్నా, నిన్ను ప్రేమించడమే బ్రతుకురచనగా మార్చుకున్న ప్రబంధే గొప్పది, నీకు ముఖ్యమయినదీను.
అర్ధంచేసుకోగలవన్న నమ్మకంతో ఇంత రాస్తున్న నా ఆలోచనని హత్య చేయాలని ప్రయత్నించకు! నీకు వరం కాగలిగిన ప్రబంధ కోసం స్వయంవరంలో పోటీకి సిద్దపడు! ప్రేమ అమరమే అయితే దాని ఆశీస్సులు మాత్రమే కాదు, నీకు ఆత్మీయులుగా మిగలాలనుకుంటున్న మా అందరి శుభాకాంక్షలూ వుంటాయి.
నువ్వు పోరాటానికి సిద్దమయితే రేపు అక్కడ నిన్ను కలుసుకుంటాను. లేదూ అంటే ఇక నిన్ను జీవితంలో కలవను. ప్లీజ్!
ఇక్కడా నీ గెలుపునే అభిలషించే....
"ప్రణయ"
ఆదిత్య నిశ్శబ్దంగా చూస్తున్నాడు.
అపరాత్రి గడుస్తోంది.
అనిత ఓ మూల నిద్రపోతోంది.
అప్పటికి కొన్ని నిమిషాల క్రితమే సూరితోపాటు మరికొందరు మిత్రులు పోటీ గురించి నచ్చచెప్పి మరీ వెళ్ళారు.
ఏం చేయాలి? ప్రణయ, ప్రబంధ యిద్దరూ యీ క్షణాన తనని సమస్యలోకి నెట్టి చూస్తున్నారు.
ప్రేమకోసమో, పెళ్ళికోసమో తను తపించటంలేదు. కాని తన కోసం తనవాళ్ళనుకుంటున్న అందరూ ఆరాటంగా ఎదురుచూస్తున్నారు.
ఎక్కడ ప్రారంభమయిన కథ యిది? ఎన్నెన్ని మలుపులు! ఎన్ని సంఘటనలు!
నిన్నగాక మొన్నటిదాకా చప్పుడుచేయని చిన్నకాలువలా ప్రవహించే తన జీవనవాహిని ఇందరి సంపర్కంతో పరిమాణాన్ని పెంచుకుందో, లేక ఊహించని పరిణామంలో అడుగుపెడుతుందో అర్ధంకాని స్థితి....!
తను ఓడటం, గెలవడం కాదు... ముందు పోటీపడటం ముఖ్యం. జయాపజయాల మాటెలా వున్నా అసలు పోరాటానికే అతీతుడైననాడు అందరికీ శత్రువయిపోతాడు.
తెల్లవారులూ ఎలా గడిపాడో అతడికే గుర్తులేదు.
సరిగ్గా సాయంకాలం ఆరు గంటలకి యూనివర్శిటీ ఓపెన్ థియేటర్ లో మిత్రులతోపాటు అడుగుపెట్టిన ఆదిత్య క్షణంపాటు నిశ్చేష్టుడయ్యాడు.
కారణం.... సత్యేంద్రబసుకీ, అతడికీ మధ్య సాగే పోటీకి న్యాయ నిర్ణేతగా నిలబడి వున్నది రోహిత్.
యూనివర్శిటీ ఆడిటోరియం స్టూడెంట్స్ తో కిక్కిరిసిపోయింది.
కేవలం విద్యార్ధులు మాత్రమే కాదు, విషయం తెలిసిన కొందరు తల్లిదండ్రులూ, అంతకుమించి 'విచిత్ర వివాహానికి ఏర్పాటుచేసిన స్వయంవరం' అంటూ రాయాలనుకుంటున్న పత్రికా విలేఖరులు కూడా వచ్చారక్కడికి.
సంచలనాత్మకమయిన నిర్ణయాలతో నిన్నటిదాకా రాష్ట్రాన్ని పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి వాసుదేవరావు పక్కగా ప్రబంధ, అదే వరుసలో సూరి, ప్రణయ కూర్చుని వున్నారు.
వేదిక పైకి వచ్చిన రోహిత్ పార్టిసిపెంట్స్ ఇద్దర్నీ ప్రేక్షకులకి పరిచయం చేశాడు.
ముందు సత్యేంద్రబసు, ఆ తర్వాత ఆదిత్య ఆడియన్స్ కి నమస్కరించి వేదికపైన చెరో పక్కన ఏర్పాటు చేసిన కుర్చీల్లో కూర్చున్నారు.
"డియర్ ఫ్రెండ్స్!" క్విజ్ మాస్టర్ స్థానంలో నిలబడ్డ రోహిత్ ప్రేక్షకుల వైపు కాక క్షణంపాటు ప్రణయ కేసి చూసి మృదువుగా నవ్వాడు. "నిజానికి నేను ఈ రోజే లండన్ వెళ్ళిపోవాల్సింది కాని గౌరవనీయులయిన వాసుదేవరావుగారి అభ్యర్ధన పైన రెండు రోజులపాటు ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాను. బిబిసిలో క్విజ్ మాస్టర్ గా ఆసియా దేశాల్ని ప్రజెంట్ చేసే ఒకే ఒక వ్యక్తిగా ఈ స్థానానికి నేను అర్హుడైన వ్యక్తినే అని మీకు చెప్పాల్సిన ఆగత్యం లేదనుకుంటాను."
ఇకపోతే మా పోటీ నిబంధనల గురించి... మొత్తం గంటన్నర పాటు సాగే క్విజ్ కాంపిటీషన్లో మొదటి అరగంట ఇద్దర్నీ ప్రశ్నించడం జరుగుతుంది. అంటే ఒకరి తర్వాత ఒకర్ని జవాబు చెప్పగలిగితే అయిదు మార్కులు, లేనినాడు అదే ప్రశ్న రెండో అభ్యర్ధిని అడగటం జరుగుతుంది. అతడు చెప్పగలిగితే అతడికి పది మార్కులు ఈ అరగంట గడిచాక ఒక్కో అభ్యర్ధికి అరగంట కేటాయిస్తాము. అందులో సుమారు ముఫ్ఫయ్ ప్రశ్నలకి జవాబు చెప్పాల్సివుంటుంది. ఒక్కో జవాబుకీ అయిదు మార్కులు" ఆగాడు క్షణంపాటు
అందరికన్నా ఎక్కువగా ఆందోళనచెందింది ప్రణయ.
రోహిత్ అసాధారణమైన ప్రజ్ఞగలవాడు మాత్రమేకాదు. ఆదిత్యని శత్రువుగా భావిస్తున్నవాడు. అంతకుమించి క్విజ్ మాస్టర్ గా మొత్తం ప్రశ్నల్ని తనే అడిగే అవకాశం చేజిక్కించుకున్నవాడు. అదిచాలు ఎంతటి మేధావినయినా ఓడించగలగటానికి ఇక్కడిలా రోహిత్ ని మరోసారి కలవాల్సివస్తుందని ముందే గ్రహించి వుంటే, ఈ పోటీకి తను అడ్డం పడేది.
నుదుట పట్టిన స్వేదం తుడుచుకుంటూ ఆలోచించింది. ఆదిత్య ఓటమికి ఏర్పాటు జరిగిపోయింది కాబట్టే వాసుదేవరావు కోరి యిలాంటి పోటీకి సిద్దపడమన్నది....! బహుశా సత్యేంద్రబసుతో ముందు చర్చించుకుని ఉంటారేమో కూడా అంటే అతడికి జవాబులు చెప్పడం సమస్యకాదు.
ఒక సభ్యతగల అమ్మాయి ఇలా ఆలోచించాల్సిరావడం బాధాకరమే అయినా రోహిత్ గురించి చాలా, వాసుదేవరావు గురించి కొద్దిగా తెలిసిన ప్రణయ కంపిస్తూనే సూరి కేసి చూసింది.
సూరిలో సైతం ఆందోళనే తప్ప భయం లేదు.
