Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 97


    "అందుకే నిన్నూ నా తల్లి దగ్గరకే పంపాలనుకుంటున్నాను" పిడికిలి బిగించాడు బలంగా.
    
    "లాభంలేదు శౌరి! ప్రబంధ ఆదిత్యల పెళ్ళి చూసేదాకా నేను చావదలుచుకోలేదు."
    
    "అంతా నీ ఇష్టమేనటే?" కుడికాలిని పైకెత్తిన వాసుదేవరావు టక్కున ఆగిపోయాడు అప్రతిభుడిలా.
        
    సౌదామిని చేతిలో ఓ ఫోటో వుంది. ఆ ఫోటో ఆదిత్య పక్కగా అర్ధనగ్నంగా నిలబడ్డ ప్రబంధది.
    
    తమాయించుకోలేనట్టు ఫోటో అందుకుని బరబరాచింపేశాడు వాసుదేవరావు.
    
    "ఇలాంటివి ఇంకా చాలా వున్నాయి వాసుదేవరావ్! వుండటమే కాదు, రేపు పత్రికల్లో ప్రచురితమవుతున్నాయి కూడా ఎందుకంటే ఆదిత్యని నువ్వు లేపేయటానికి మోటివ్ ప్రజలకి తెలియాలిగా."
    
    హతాశుడైపోయాడు. మూడు దశాబ్దాల తన రాజకీయ దక్షతని సవాల్ చేస్తున్న మారణాయుధాల్లా నేలపై పడి వున్న ఫోటో ముక్కలు.
    
    "వద్దు! ఇవి ప్రచురించకూడదు. వెంటనే వాటిని వెనక్కి తీసుకోవాలి. ప్రజలకి మాత్రమే కాదు, ప్రబంధని కోడలిగా చేసుకోవాలనుకుంటున్న రాయ్ కి నిజం తెలిసిపోతుంది. అలా జరగటంకన్నా పెద్ద ఓటమి మరోటి వుండదు సౌదామినీ! ఇవి పబ్లిష్ కాకూడదు."
    
    "కాకూడదు అంటే నువ్వు వెంటనే ఆదిత్యని విడుదల చేయించాలి."
    
    శరీరంలో రక్తం సలసలా కాగిపోయిందేమో సౌదామిని ముక్కలు చూయాలన్నంత ఉద్వేగంతో రెండడుగులు ముందుకేశాడు.
    
    "ఇప్పుడు నువ్వాలోచించాల్సింది నా చావు గురించి కాదు వాసుదేవరావ్! చావకూడని నీ రాజకీయ భవితవ్యం గురించి విద్యార్ధుల ఉద్యమం ఆగిపోవాలన్నా అర్జెంటుగా నీ పరువు దక్కాలీ అన్నా ఈ ఫోటోలు పబ్లిష్ కాకూడదు. అది జరక్కూడదూ అంటే ఆదిత్య విడుదల కావాలి. విడుదలైన ఆదిత్యని నేను కలుసుకుని మాట్లాడాలి."
    
    ఇప్పుడు సరాసరి ఆదిత్య, ప్రబంధల పెళ్ళి గురించి కాదు సౌదామిని ఆలోచిస్తున్నది ముందు ఆదిత్య ప్రాణహానిలేకుండా బయటపడాలి. అది చాలు ఆ తరువాత మేజరైన ప్రబంధ ఆదిత్యని పెళ్ళి చేసుకోవడంలో మొత్తం విద్యార్ధిలోకం మాత్రమే గాక, చట్టమూ అండగా నిలబడుతుంది.
    
    ఏం ఆలోచించుకున్నాడో అర నిముషం తర్వాత అన్నాడు "సరే, అరగంట వ్యవధిలో ఆదిత్య వాళ్ళింటికి వెళ్తాడు."
    
    "అదే నిజమైతే ఈ ఫోటోలు పబ్లిష్ కాకుండా నేను చూస్తాను." బయటికి వెళ్ళిపోయింది సౌదామిని.
    
    రాజకీయ ధురంధరుడైన వాసుదేవరావుని తాత్కాలికంగానైనా నిర్వీర్యుడిని చేసిన సౌదామిని సరాసరి వెళ్ళి అనితని విడిచిపెట్టడమే కాదు, అరగంట వ్యవధిలో పోలీసు కస్టడినుంచి బయటపడ్డ అదిత్యని కలుసుకుంది.
    
    "అనితని నీకు క్షేమంగా అప్పగించడం మాత్రమేకాదు ఆదిత్యా! నీ మీద జరగాల్సిన దాడిని నివారించగలిగాను. అందుకు నేను గర్వపడటం లేదు. నాకు కృతజ్ఞత చెప్పమనడం లేదు. ఒక్కటే, నీకోసం సర్వస్వమూ ఒడ్డడానికి సిద్దపడ్డ ప్రబంధకి అన్యాయం చెయ్యొద్దంటున్నాను. ఇది ఆదేశం కాదు, నా అభ్యర్ధన."
    
    ఆదిత్యని విడిచిపెట్టారన్న వార్త ఎలా పొక్కినా గాని పది నిముషాల వ్యవధిలో సూరితోపాటు ప్రణయకూడా ఆదిత్య యింటికొచ్చింది.
    
    మరో అర్ధగంట గడిచేసరికి అక్కడికి చేరుకున్న విధ్యరదుల సంఖ్య పదుల్లోకి చేరుకుంది.
    
    అంత సులభంగా పరిష్కారం కాదనుకున్న జటిలమైన ఓ సమస్యని అనుకూలంగా సాధించింది సౌదామిని అని గుర్తించిన విద్యార్ధులు, ఆమెను అభినందించబోతుంటే వారించింది సౌదామిని.
    
    ఎంత సంబరంగా ఉందని! నలుగురికోసం ఆలోచించగలిగే జీవితంలో యింతటి ఆత్మ సంతృప్తి ఉంటుందని తెలిసిన తొలి క్షణమైనందుకేమో ఆమె కళ్ళు చెమర్చాయి.
    
    "ఇక్కడితో సమస్య ముగిసిందనుకోకండి నిజానికి సమస్యకి ప్రారంభం ఇది. ఆ చెరనుంచి ప్రబంధ బయటికి రాగలిగినప్పుడు, ఆదిత్యతో వెంటనే వివాహం జరిగినప్పుడే ఈ ప్రేమ కథకి నిజమైన ముగింపు"
    
    నిశ్శబ్దంగా తల వంచుక్కూచున్న ఆదిత్యని సమీపించింది సౌదామిని. ఓ అక్కలా అతడి తల నిమిరింది. "ఆదిత్యా! నేను నీకు ఆత్మీయురాలినో, లేక ఒట్టి పరిచయస్థురాలినో నాకు తెలియదు. కాని ప్రబంధ ప్రేమరథపు ఇంధనంలా కొంత కదలికకు కారణమైనదాన్ని ఎందుకిలా చేశానూ అనే ప్రశ్నకు నేను జవాబు చెప్పలేను. నీ మీదనే పూర్తిగా ఆశలు పెంచుకున్న ప్రబంధకి అన్యాయం చేయొద్దంటున్నాను. ఇంకా చదువు పూర్తికాకముందే పెళ్ళేమిటి అనకు, అప్పటిదాకా ఆగే పరిస్థితులు కావు. అది నువ్వు మాత్రమే కాదు, నీ స్నేహితురాలూ గుర్తించాలి?"
    
    వాసుదేవరావు ఆలోచనల గురించి కాని, అతను రాయ్ తో వియ్యమందబోతున్న వాస్తవంగాని చెప్పలేదు. కాని అస్పష్టంగానైనా పరిస్థితుల గురించి తెలియచెబుతూ ప్రణయని చేరుకుంది.
    
    "బహుశా మళ్ళీ నీకు కనిపించను ప్రణయా! కనిపించకపోయినా జరిగేదాన్ని గమనిస్తూనే వుంటాను. నా పరంగా నీకు అణువంత ద్రోహం జరిగుంటే నన్ను శపించు తప్ప ప్రబంధని కాదు! చివరి అధ్యాయంలో పెద్దరికం వహించాల్సినదానివి నువ్వే! సెలవ్"
    
    నిజానికి సౌదామిని ఫోటోలను ఎవరికీ యివ్వలేదు. తప్పనిసరి పరిస్థితులలో తప్ప వాటిని ఉపయోగించకూడదనుకుంది. ఇప్పుడు తనవంతు కర్తవ్యం నిర్వహించగలిగినందుకు సంతృప్తిగా వెళ్ళిపోయింది.
    
    వాసుదేవరావు యింటికి కాదు అజ్ఞాతంలోకి.
    
    "ఎంతకాలం డాడీ! ఎన్నాళ్ళు నాకిలా కాపలా కాయగలరు?"
    
    అపరాత్రి గడిచినా పచ్చి మంచినీళ్ళయినా ముట్టుకోని ప్రబంధ ఎదురుగా నిలబడ్డ తండ్రిని గట్టిగానే నిలదీసింది.
    
    "నువ్వు నా మాట వినాలి ప్రబంధా! రాయ్ కొడుకును నువ్వు పెళ్ళి చేసుకోవాలి" కోపాన్ని నిభాయించుకుంటూ అడిగాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS