Previous Page Next Page 
అనుక్షణికం -2 పేజి 96


    రవి యీ పాక దగ్గిరికి ఒకసారి కూడా కారులో రాలేదు సాధారణంగా__వస్తూ, యెదురుపడిన వాళ్ళ యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ యేమైనా చెబితే నోట్ చేసుకోవాల్సినవి వుంటే నోట్ చేసుకుంటాడు. తరవాత ఆ పనులు చూడటానికి ప్రయత్నిస్తుంటాడు. వీలైనంత వరకూ వీళ్ళెవరినీ అక్కడి బంగళా చుట్టూ తిరిగే పరిస్థితి కలిగించడు.
    రోడ్డుదాకా రవితోపాటు నడిచివెళ్ళి పంపించి రావటం రాములుకి అలవాటు. రిక్షానో ఆటోనో దొరకగానే వెళ్ళిపోతాడు రవి. ఈ రోజు యేవో సరుకులు, మందులు కొనాల్సి అలా నాలుగు ఫర్లాంగులు పైకివెళ్ళాడు రాములు. అవి తీసుకుని సాయిలు యింటికి వచ్చాడు రాములు.
    సాయిలు భార్య వాళ్ళ గుడిశ ముందు నిలుచుని వుంది. యెర్రని మాంసంతో మలిచిన శిల్పం. యెండకీ వానకీ వొడలిపోయి చలికి బిగదీసుకుపోయినట్లు ; ముడతల తోలు తిత్తి __పాతికేళ్ళ ప్రౌఢ బూలచ్మి.
    యిద్దరు పిల్లలు మగపిల్లాడికి ఆరేళ్ళు. ఆడపిల్లకి నాలుగేళ్ళు. యిద్దరికీ ఐదురోజుల్నుంచి జ్వరం. మందులు లేవు. యింట్లో సరుకులూ లేవు. పట్టుకొస్తానని నాలుగురోజులనాడు వచ్చి పదినిమిషాలుండి వెళ్ళినప్పుడు సాయిలు చెప్పాడు.
    సాయిలు సాధారణంగా గంగి యింటిదగ్గిరే వుంటాడు. సికిందరాబాద్ రెజిమెంటల్ బజారుప్రాంతంలో ఒకామెని వుంచుకున్నాడు. యేడాదిన్నర క్రితం. తీరిక చిక్కితే అక్కడే వుంటాడు.
    రాములు తెచ్చిన సరుకులూ మందులూ చూసి, "నీ రుణం యెట్లా తీర్చుకుంటానో రాములన్నా." అంది బూలచ్మి. ఆమె కళ్ళలో తడి వుబికింది.
    "దోస్త్ భార్యవి. గింతగూడ చెయ్యకుంటే యెట్ల!" అన్నాడు రాములు.
    "మీ దోస్తు, దోస్తు తీరున వున్నాడా యేమి! యెన్నడన్న వచ్చి చూసి పోతడు చచ్చినమో బత్కేవున్నమోనని!" అంది.
    సాయిలు ఆమెని తాకి యేడాదిన్నర అవుతుంది.
    అంతలో మోటార్ బైక్ వస్తున్న చప్పుడు.
    గుడిశ ముందు ఆగింది వచ్చి. గట్టిగా హారన్ మోగించి దిగాడు సాయిలు.
    లోనకి వచ్చాడు సాయిలు.
    "కిరాణా దుకాణంల పైసలు కడ్తినా? యింక ఉద్దరయ్య నన్నాడు" అంది.
    "యాది మరిస్తి. పైసలు గూడా లేవు చేతుల" అన్నాడు సాయిలు.
    "తినేటందుకు లేకుంటే ఉపాసముంటము. వీండ్లకి మందులు తెస్తివా? మూడు దినాల సంది పెయ్యి మీద సొయ్యి లేదు" అంది.
    "గా మందులు దుకాణంలో స్టాక్ లేవు. రేపటి దినం వస్తవట. రాంగానే తెస్త." అన్నాడు సాయిలు.
    "రాములన్న గిప్పుడే తెచ్చిచ్చిండు" అంది.
    గుడిశలో గుమ్మం లోపల వొక ప్రక్కగా కూచునివున్న రాములు వంక గుర్రుగా చూశాడు సాయిలు.
    "మరింకేమ్? రాములంటే రవిసాబ్ కంటే గొప్పోడు. వానికి యాడ దొరకనివి గూడ దొర్కుతవి" అన్నాడు వెటకారంగా.
    "గిట్ల చుట్టమోలె వచ్చి పోవుటేనా? పెడ్లం పిల్లలున్నరని యాదికి గూడ రాకున్నది నీకు" అంది.
    "నీ యవ్వ. గత్తరొచ్చి చావనన్న చచ్చిన్రు కాదు, నువ్వు నీ పిల్లలు" అని చీదరించుకున్నాడు సాయిలు.
    "నువ్వాడ గారండముండతోటి కులుకుతుంటే...." అంటోంది.
    మధ్యలోనే అందుకుని, "నోర్ ముయ్ మూతి పండ్లురాలగొడ్త. దాన్నేమన్న అంటివంటె. అది నీ అసుమంటిది కాదు. అది__"
    "అది ముగ్గురను ముంచి నిన్ను పట్టుకున్న రండ....నా అసుమంటి దెట్లవుతది?" అంది.
    "నీకు మాత్రమేమి తక్కువ? సస్తల దొరికినవు. దోస్తుల పెండ్లాలుండంగ పెండ్లి చేస్కునెడి అక్కరుండదు" వ్యంగ్యంగా అని రాములు వంకచూశాడు సాయిలు.
    "ధూ. నీ నోట్ల నా......వోతు" అని అరిచింది.
    "ఏం నీ మిండెగాన్ని అనంగనె గంత కోపమొచ్చె?" అని "హాహాహా" అని ధ్వని చేశాడు సాయిలు.
    "సాయిలూ దోస్తువని అప్పటి సందివూకున్న సంబళ్ కె బాత్ కరో" అన్నాడు రాములు తీక్షణంగా.
    "ఏం నాకె ధమ్మీయిస్తున్నవా? సాయిలంటే ఏమనుకుంటున్నావ్" అన్నాడు సాయిలు.
    ఏమనుకుంటలేను. నువ్వు చేసెడిపన్లు అన్ని నాకెరికనె" అన్నాడు రాములు తాపీగా.
    "నే చేసెడి పనులన్నీ నీ చెల్లెలు చేపించెడివె తెల్సునా?"
    "నాకు చెల్లెలు లేదు. యెవ్వరు లేరు" అన్నాడు రాములు.
    "అవ్. చెల్లెల్నేమి చేస్కుంటవ్. దోస్తు పెండ్లమయితె అక్కెర కొస్తది. నువ్వు చేసెడి పన్లు గూడ నాకెరికనె. నీకు నా యింట్ల ఏమిపని" అన్నాడు సాయిలు.
    "దోస్తుకు బుద్ధిలేకుంటే కష్టమ్ చూడలేక సాయం చేస్తున్న!"
    "వూకె చేసెటంద్కు నువ్వేమన్న లక్ పతివా?"
    "లక్ పతి అయితే సాయమేమిటి చేస్తడు! వాండ్ల యెంట తిరిగి కుక్కపన్లు చేసిపెట్టి మోటార్ బైక్ లమీద తిరిగేటోళ్ళకు పెండ్లాం పిల్లలను మరిచి సడక్ చాప్ రండకుగులాంగిరి చేసెటోళ్ళకు గూడ__"
    మధ్యలోనే అందుకుని, "ఈ దొంగ బుద్ధి దేనికి? గీ రండను లగ్గం చేస్కోరాదు! నా పిల్లల పీక పిస్కి" అన్నాడు సాయిలు.
    రాములు చటుక్కున లేచాడు. అతను వుద్రేకంగా కంపించిపోవటం లేదు. కోపంతో వూగిపోవటంలేదు. లోన నరాలలో నెత్తురు నిప్పులా వెచ్చగా పరుగులిడుతోంది.
    రాములు అమాంతం సాయిలు చొక్కా పట్టుకున్నాడు. సాయిలు రాముల్ని వొక తోపు తోశాడు. నిలదొక్కుకోలేక రాములు గుమ్మం బయటికి పడ్డాడు. సాయిలు అతనిమీదకి దూకి, "కార్కాన్ల పని జేసొనెడి కూలిముండ కొడ్క నన్నే అంటున్నావుర" అన్నాడు.
    ఇద్దరూ కలియబడ్డారు.
    ఐదు నిమిషాలు. చొక్కాలు చిరిగాయి. మోకాళ్ళు మోచేతులు కొట్టుకుపోయి నెత్తురు చెమర్చింది.
    రాములు, సాయిలు మీదకి తిరగబడి, ఛాతీమీద కూర్చుని ఒకచేత్తో వొక కాలు రెండోచేత్తో వొక చెయ్యీ పట్టుకుని విరగదీశాడు.
    "నీ కాల్మొక్కుత యిడిసి పెట్టు__" అని అన్నాడు సాయిలు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS