Previous Page Next Page 
అనుక్షణికం -2 పేజి 97


    "సిగ్గులేదుర? నీకు బుద్ధిలేక నన్నంటావుర" అని లేచాడు రాములు.
    సాయిలు నెమ్మదిగా లేచి గుర్రుగా చూసి, గుమ్మంలో నిలుచుని వున్న భార్య బూలచ్మి వంకచూసి, "అది నా పెండ్లమైతే గట్ల చూస్తూ వూరుకుంటదా! యేమే ఒక్కపాలి లెక్కనా, రాత్రి లెక్కనా రాములు తోటి యిసాబు?" అన్నాడు సాయిలు.
    రాములు కోపం పట్టలేక సాయిలు మీదకి దూకబోతే, సాయిలు పరుగు లంకించుకున్నాడు__మోటర్ బైక్ అక్కడే వదిలేసి.
    గుమ్మంలో నిలుచుని_ధారగా కన్నీళ్ళు పెల్లుబికి పొర్లుతూంటే రెప్పలు వాల్చింది బూలచ్మి. కన్నీళ్ళంత మూగగా__

                              116

    శ్రీపతి, ఆర్ట్స్ బిల్డింగ్ లో రామ్మూర్తి గదిలోకివెళ్ళి, "ఎకనామిక్స్ లెక్చరర్ గోకరాజు గజపతిరాజుని స్టూడెంట్లు తన్నారటకదా." అన్నాడు.
    రామ్మూర్తికి నెలరోజులక్రితం సోషియాలజీలో లెక్చరర్ వుద్యోగం వచ్చింది.
    "గోడలకి చెవులుంటాయ్. కేంటీన్ కి వెళ్దాంపద" అన్నాడు రామ్మూర్తి.
    "కేంటీన్ కీ చెవులుంటాయి" అని చిన్నగా నవ్వాడు శ్రీపతి.
    "గోడలన్నీ ఒకేరకంకాదు ఇవి మరీ పాపిష్టిగోడలు" అని బయటికి దారితీశాడు రామ్మూర్తి.
    శ్రీపతిని సంప్రదించినప్పుడు, "ఇంతకుముందు ఆ రవిని అడిగితే సాయంచేశాడుగా మళ్ళీ వెళ్ళి అడుగు. వివరించు పరిస్థితి__డిపార్ట్ మెంట్ లో డాక్టరేట్ వున్న వ్యక్తివి నువ్వొక్కడివేనని" అన్నాడు శ్రీపతి.
    "కానీ ఆ గోవర్ధన్ రెడ్డి తోకగాడు వొకడున్నాడు. వాడికి ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. గోవర్ధన్ రెడ్డికి పిండికేట్ మెంబరు వొకడు బాగా సన్నిహితంగా తెలుసు" అన్నాడు రామ్మూర్తి సిగరెట్ దమ్ములాగుతూ.
    రామ్మూర్తి సిటీలో అదివరకు వుంటున్న యింట్లోనే వుంటున్నాడు. భార్యకి రెండో కాన్పు ఈసారి ఆడపిల్ల.
    "యీ ప్రస్తుత వైస్ ఛాన్సలర్ రాంరెడ్డి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంటులో ప్రొఫెసర్ హెడ్ గా వున్నప్పుడు గోవర్ధన్ రెడ్డి దాన్లో యం.ఏ.చదువుతుండేవాడు తెలుసుగా. అప్పట్లో వాడి క్యాంపస్ సిటీ రాజకీయాలకి డిపార్ట్ మెంట్ స్టూడెంట్లని వాడుకోవటంలో ప్రొఫెసర్ సహకార సహాయాలు ఆశించాడు. రాంరెడ్డి చోటుపెట్టలేదు. అప్పుడు ఆయనమీద చాలా పుకార్లు పుట్టించాడు. అంచేత గోవర్ధనుడు పర్వతం ఎత్తటం సాధ్యంకాదు. మరో సంగతి. అసెంబ్లీ సీట్లు ఎన్నికలో గోవర్ధన్ రెడ్డీ రవీ ప్రత్యర్ధులు. ఇప్పటికీ వాళ్ళిద్దరికీ అసెంబ్లీలో యుద్ధమే. గోవర్ధన్ రెడ్డి ఒక అనర్హుడికి ఇప్పించాలని చూస్తున్నాడని చెప్పు. దాంతో రవికి పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. గాలి వాటాన్ని బట్టి పోతాడుగా మీ వృద్ధ జంబుకం. నీ కొమ్ము హెచ్చుగా వుంటే నిన్నే సపోర్టు చేస్తాడు" అని చెప్పాడు శ్రీపతి.
    రవి ప్రయత్నాల వల్ల రామ్మూర్తికి వుద్యోగం వచ్చింది. అదే ఇంటర్వ్యూలో అనంతరెడ్డికి, ఫిజిక్స్ లో వుద్యోగం అతి సులభంగా వచ్చింది. కావాలని అడిగిన స్పెషలైజేషన్ అతనిది. అందులో అతనికి అమితమైన ఆసక్తి వుండి విశేషంగా కృషి చేశాడు. డాక్టరేట్ తో పాటు అంతర్జాతీయ స్థాయి జర్నల్స్ లో అతనివి కొన్ని పేపర్లు అచ్చు అయ్యాయి. నిపుణులు ప్రత్యేకించి మెచ్చుకున్నారు. అంచేత అతని పెద్దల పలుకుబడి అవసరం లేకపోయింది. బేగంపేట వైపున ఇల్లు అద్దెకు తీసుకుని కాపరం పెట్టాడు. స్వప్నరాగలీన తండ్రి వూరినుంచి పనిమనిషిని పంపించాడు ఇంట్లో పనికి. ఆమె పినతండ్రి నాగిరెడ్డి వాళ్ళింట్లోనే వుండమన్నాడు. గానీ లా వుండటం అనంత్ రెడ్డికి నచ్చలేదు. స్వప్నరాగలీన కూడా అతని అభిప్రాయాన్నే సమర్ధించింది.
    కాంటీన్ లోకి వెళ్ళకుండా అలా బస్టాపు రోడ్డు మీది ఓ చెట్టు నీడకి నడిచాడు రామ్మూర్తి.
    "ఇంత భయమేమిటోయ్" అన్నాడు శ్రీపతి.
    "చూడు నాయనా. మాలాంటివాళ్ళ కష్టాలు నీకేం తెలుస్తయ్? ఏమంటే ఎటునుండి ఏమోస్తుందో చెప్పలేం" అన్నాడు రామ్మూర్తి సిగరెట్ ముట్టిస్తూ.
    "అసలు యెలా యెందుకు జరిగింది? ఇతను మంచివాడే అనుకుంటాను. తనదారిన తను వుంటాడనుకుంటాను?" అన్నాడు శ్రీపతి.
    "ఆ ప్రొఫెసరు పూసపాటి విజయరామరాజుకి ఓ చుట్టం వున్నాడు వాడు ఎకనామిక్స్ చదువుతున్నాడు. వాడికి అత్తెసరు మార్కులొస్తయ్. గజపతిరాజుకి ఒక పేపరుంది వాల్యుయేషన్ కి. అరవయ్ ఐదుశాతం మార్కులిమ్మన్నాడట. ఇతనేమో__ ఆ పనిచేస్తే ఇతరులకి అన్యాయం చేసినట్లే అవుతుంది కదా అన్నాడట. గుడ్డొచ్చి పిల్ల నెక్కిరించిందని, నాకు నీతులు చెప్తున్నావా__ అని కసిరి బెదిరించాడట. నేనేమీ బలవంతుణ్ని కాదుగానీ నా చేతుల్తో అన్యాయం చెయ్యలేను కావాలంటే ఆ పేపరు కూడా మీరే వాల్యూ చెయ్యండి__అన్నాడట. ఇప్పుడు మార్చడానికి వీలుకాదు. చెప్పిన పని చూడు లేకపోతే ఆ తరవాత అనుభవిస్తావ్ అని వార్నింగిచ్చాడట. ఇతను విద్యార్థులకి అన్యాయం చెయ్యదలచక, చివరికి విద్యార్ధులతోటే తన్నులు తిన్నాడు పాపం" అన్నాడు రామ్మూర్తి.
    "అదెలా జరిగింది?" అన్నాడు శ్రీపతి.
    "మన పూసపాటి ముసలాయనకి యీ మురికి కూపంలో రకరకాల పలుకుబడుంది. వీడి ద్వారా మార్కులో, ముందు ముందు ఫెలోషిప్పో మరేవో లాభాలు పొందదలచిన క్రూక్ స్టూడెంట్స్ కొందరు అవీ యివీ కల్పించి వేరే డిపార్ట్ మెంట్ గాడుడుల్ని కలుపుకుని గజపతిరాజుని తన్నారు. పాపం, కంప్లెంటయినా ఇవ్వలేదు." అన్నాడు రామ్మూర్తి.
    "అదే మంచి పని" అన్నాడు శ్రీపతి.
    "ఆ కారులో జాఁమ్మని వెళుతున్న వాడిని చూశావా, ఆ నియోగినిక్కూ అదీ?" అన్నాడు రామ్మూర్తి.
    "వుఁహూఁ"
    "గౌరీపతి శర్మగాడు. మనని గమనించి ఆగకుండా పోతున్నాడు. దయతలచి నిరంజనంగాడికి వుద్యోగం ఇప్పించావా? వాడేమో ఇప్పుడు నీమీద సవాలక్ష కల్పించి చెప్తూ__ నువ్వేదో వాడికి అన్యాయం చేయించావని ప్రచారం చేస్తున్నాడు."
    "అలాగా? దేనికి? పోనీ, ఆ కుక్క యేం మొరిగితే యేం!" అన్నాడు శ్రీపతి.
    గౌరీపతిగాడిబాబు రిటైరయ్యాడు గదా__ జనతా ప్రభుత్వం వచ్చేసరికి జనసంఘ్ బలంతో యేదో కమిటీలో సభ్యుడయ్యాడు గౌరీపతిగాడికి స్టీలుపర్మిట్ ఇప్పించాడు. గౌరీపతిగాణ్ని ఆశ్రయించాడు నిరంజనంగాడు__ వీడు చేసిన తప్పుడు పనికి."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS