Previous Page Next Page 
అనుక్షణికం -2 పేజి 95


    దుఃఖం పొర్లుకొచ్చి సోఫాలో కాళ్ళు పెట్టుకుని వెక్కి వెక్కిపడుతోంది.
    మూడు నిమిషాలు.
    వొంగి సీసా అందుకోబోయింది. అందులో యింక సగం వుంది.
    బాటు కాలితో సీసాని అవతలికి తన్నాడు.
    అవమానంతో తార ముఖం కందింది.
    లేచి నిలుచుంది. అతనూ లేచి నిలుచున్నాడు.
    "కుక్కా. దీనికంటే నీచమైన కుక్కా" అంది.
    కొట్టటానికి చెయ్యెత్తాడు.
    తార కూడా చెయ్యెత్తింది.
    అతను ఆగిపోయాడు. ఆమె చెయ్యి ఎత్తితే భయపడికాదు.
    ఆ విషాదమూ అసహ్యమూ చీదరింపూ రౌద్రమూ మిళితమైన ఆమె ముఖం చూసి కాదు.
    ఆ రూపం_వరదలాంటి, ఉప్పెనలాంటి, భూకంపంలాంటి సెక్సైటించే శక్తికి__కాస్మిక్ సెక్ల్సోజన్ లాంటి శక్తికి.
    తార చరచరా బయటికి నడిచింది. అతనూ నడిచాడు.
    ఆమె ముందుకు అడుగులు వేసి యెర్ర పడవకారులో కూర్చుంది.
    అతను పోర్టికోలో నుంచుని చూస్తున్నాడు.
    కారు కదిలింది.
    అతను లోనకి వెళ్ళాడు.
    తార, కారు నడుపుతోంది. తిరిగిన వీధులే తిరుగుతూ తిరిగినట్లుగా తిరిగి__పది నిమిషాల్లో సిటీ పరిథికి బయట వుంది కారు. సికిందరాబాద్ కాంటోన్ మెంటు రోడ్లు, గోల్కొండ కాంటోన్ మెంట్ రోడ్లవెంట ఎనభయ్ మైళ్ళ వేగంతో తిరిగి__
    యెటు యెందుకు తిరుగుతున్నదీ తెలియకుండా తిరిగి, తిరిగింది. అంతా కలిపి అరగంట.
    ఓ రోడ్డున వేగంగా వెళుతోంది.
    కారు సిటీ దాటి ఇరవై మైళ్ళు వెళ్ళింది. డియర్ వ్యూ అద్దంలో చూస్తే కాస్త దూరంలో తన కారు వెనక కారు. గుర్తించింది__ ఆ కారు సూర్యమహల్ కారు కారులో వొక్కడే. ముఖం సరిగా కనిపించకుండా నుదుటిమీదకి వాల్చి పెట్టుకున్న మనకీ క్యాప్.
    మరో ఐదు నిమిషాలు. వంద మైళ్ళ వేగంతో కారు.
    ప్రక్కన యేదో వూరు. బస్టాండు.
    గిరుక్కున బస్టాండులోకి కారు తిప్పి ఆపింది. బంగారం పూత పూసిన చట్రం వున్న పర్స్ అందుకుని భుజానికి వేళ్ళాడేసుకుంటూ దిగింది.
    కదులుతున్న ఓ బస్సులో కూర్చుంది.
    పది నిమిషాలు.
    బస్సు వేగంగా వెళుతోంది.
    రోడ్డు ప్రక్కన రెండు ఫర్లాంగుల దూరంలో రైల్వేలైను.
    బస్సు వేగంగా వెళుతోంది.
    బస్సు ఆగింది. ఆగినప్పుడు వెనక్కి తిరిగి చూసింది. కూర్చునే బస్సుకి వెనకవైపున వున్న వెడల్పాటి గాజు పలకలోంచి ఆ కారు__
    బస్సు మళ్ళీ కదిలింది. వేగంగా వెళుతోంది.
    ఎక్కడో రైలు కూత.
    ఆ రైలు కూత ఆమె బుర్రలోకి యెక్కి వినిపిస్తూ వుంది. బుర్రలో కత్తి మొనలాంటి స్ఫురింపు. వణికిపోయింది. కళ్ళలో నీళ్ళు.
    బస్సు ఒకచోట ఆగింది, వంతెన ప్రక్కగా.
    రోడ్డుకి యెడమవైపున నాలుగు ఫర్లాంగుల దూరంలో యేదో పల్లెటూరు__ పెంకుటిళ్ళు. రోడ్డుకి కుడివైపున ఫర్లాంగు దూరంలో రైల్వే లైను.
    కదలబోతున్న బస్సులోంచి సడన్ గా దిగేసింది. బస్సు వెళ్ళిపోయింది.
    దీర్ఘంగా శ్వాస పీల్చింది. చూపులో తీక్షణత.
    కాలవగట్టు మీదకి అడుగులు వేస్తూ కంటి కొసలోంచి చూసింది. ఫర్లాంగు వెనకగా ఆ కారు.
    కాలవగట్టున చకచకా నడుస్తోంది. దూరాన రైలు కూత.
    వేగంగా నడుస్తోంది. అంతలో అటునుంచి వస్తున్న రైలు.
    పరుగెత్తుతోంది. ముఖం తీక్షణంగా దీక్షగా కఠినంగా.
    నిన్నటి వర్షంతో నిండుగా నిదానంగా ప్రవహిస్తోంది వాగు.
    కారులోంచి ఆ మనిషి__పొట్టిగా__లావుగా__సగం తలుపు తెరిచి దిగి గమనిస్తున్నాడు. అర్ధం కానట్లుగా చూస్తున్నాడు.
    రైలు రానే వచ్చేస్తోంది. పరుగు తీస్తోంది. భుజానికి వెళ్ళాడుతున్న హ్యాండ్ బ్యాంగ్ జారిపడింది, కిందకి పరుగుతీస్తోంది.
    రైలు రానే వచ్చేసింది. ఆమె రైలు పట్టాల మీదకి వొరిగింది__ కానీ యింకా నేలమీదకి పడకముందే ఇంజను వచ్చేసి కొట్టుకుని__
    నెత్తుటి మరక. చీరా పావడాల పీలికలు, తొంటి భాగంతో ఇంజను ముందుభాగం ముందుకు వెళ్ళింది_రైలు పెట్టెలను ఈడ్చుకుంటూ.
    తునాతునకలై ; బోవికలు పేగులు నెత్తురు కండరాలు చెల్లాచెదురుగా పడ్డాయి__రైలు కట్టమీదా, కాలవ గట్టునా, బ్రిడ్జి కిందకీ; వాగులోకీ, నీళ్ళమీద వీపు భాగం__స్తనాలు : తేలుతూ మునుగుతూ, నీటి ప్రవాహంలో తార స్తనాల అంతిమయాత్ర.

                             115

    రవి సాయంత్రం వచ్చి రాంనగర్ పాకలో నిద్రపోయాడు.
    మెలుకువొచ్చేసరికి అవతలగా రాములు చూస్తూ కూర్చుని వున్నాడు.
    యెనిమిదైంది.
    పాకకి ఎలక్ట్రిసిటీ పెట్టించాడు.
    రాములు చిన్న నీలం బల్బు మీట నొక్కాడు రాగానే.
    వొళ్ళు విరుచుకుంటూ, "టైమెంతైంది రాములూ?" అన్నాడు.
    "యెనిమిదైనది సాబ్" అన్నాడు రాములు.
    లేచి నీళ్ళతో ముఖం కడుక్కుని, తల దువ్వుకుని__తెల్లని పైజామా లాల్చీ సవరించుకుని బయల్దేరాడు.
    యేవేవో చికాకులతో సమస్యలతో మనసు బాగోని ఒకలాంటి మూడ్ లో రవి నేరుగా ఇక్కడికి వచ్చి పడుకుని మొద్దునిద్ర పోతాడని రాములుకి తెలుసు.
    యీ ప్రాంతానికి వచ్చేటప్పుడు టాక్సీ మెయిన్ రోడ్డుమీదే ఆపించుతాడు. కారులో వస్తే రాహత్ మహల్ టాకీస్ ప్రాంతంలో పార్కుచేసి వస్తాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS