Previous Page Next Page 
అనుక్షణికం -2 పేజి 94


    ఏకవచనానికి కోరచూపు చూసి, "అతను కోపగిస్తే కొంపలంటుకుంటయ్!" అన్నాడు కఠినంగా.
    "యెవరివి?"
    "మనది"
    "మనదంటే__నేను నీకేమవుతాను?"
    "భార్యని"
    "భార్యనిట్లా తార్చుతారా? వెనకటి ఇద్దర్నీ కూడా యిట్లాగే! __"
    "తారా, యింతకు ముందు యిద్దరూ __ యేదో మోజు పడ్డాను వాళ్ళనీ బాగానే చూశాను. నీ విషయం వేరు. యీ విషయంలో కాదు. మరొక విషయంలో గొడవొచ్చి__
    "యే విషయంలో?"
    "యేదొక విషయంలో"
    "యేం చేస్తే నీ తార్పుడుతనం బయటపడుతుందా?"
    "వాళ్ళు ఇతరులతో సంబంధం పెట్టుకున్నారు. అందుకని__"
    "నీ మాట వినకపోతే నా గతీ అంతేనా?"
    "తారా వాళ్ళకీ నీకూ పోలికే లేదు. నీలో గొప్ప శక్తి వుంది. అది యెట్లాంటి శక్తి ఐనా కానీ ఆ శక్తిని నేను జయించలేను"
    "ఆ శక్తే, నీ యీ పనికి అభ్యంతరపెడుతోంది."
    "తారా అతను మోజు పడ్డాడు. సాధారణంగా జరగదు. జరిగితే తీర్చకుండా వుండే అవకాశం లేదు. అతను అడ్డం తిరిగితే మన వ్యాపారాలన్నీ స్థంభించిపోతయ్"
    "నీ వ్యాపారాలా? మన వ్యాపారాలా?"
    "మనవి"
    "అట్లాంటి స్థితిలో యీ వున్నది చాలు. యిక ముగించింది."
    "అది సాధ్యం కాదు తారా. వ్యాపారం తర్వాతే నువ్వైనా, కొత్తగా చెప్తున్న విషయం కాదు. నేను యెంత సమర్ధుడినో అంత అసమర్ధుడిని. అతనితో తలపడలేను."
    "యెందుకు అబద్దాలాడతారు? నేను తార్పుడుగాణ్ని పావలా కోసం నాకెంతో కావాల్సిన భార్యనో, భార్యగా భావించే స్త్రీనో తార్చుతాను__ అని చెప్పండి."
    "ఆ మాట చెప్తే యేం చేస్తావు?
    "యేం చెయ్యను. జాలిపడతాను. లేదూ ముఖాన ఉమ్మేస్తాను."
    "పోనీ అప్పుడు పాపాలాల్ ముచ్చట తీర్చుతావా?"
    "ఛీ! సిగ్గులేదూ? ముఖాన వుమ్మేయించుకోడానికైనా సిద్ధపడుతున్నావా? యేం చేసుకుంటావు ఇంత ధనరాసులున్నాయ్? ఇంతటితో ఇదంతా చాలించరాదూ!" అంది.
    "నేను ఆశక్తుణ్ని. అది చెప్పడానికి వీలుకానిది."
    "యెందుకు వూరికే అట్లా అబద్దాలాడతావు? నువ్వు నిజంగా ఆశక్తుడివైతే నేను సహాయపడతాను.
    "పాపాలాల్ విషయం__"
    "ముందు నీ అశక్తతేంటో చెప్పు. పాపాలాల్ కీ దీనికీ సంబంధం యేంటో తెలుసుకొనీ. చెప్పు. చెప్పండి"
    "ఆంటీ తెలుసా?"
    "ఒకే ఒక్కసారి ఆరోజు చూశాను. ఆమె కళ్ళు __ చూస్తేనే యెట్లాగో అనిపించింది.
    "యీ సమస్తం ఆమెది. ఇంద్రారెడ్డి నాకేమవుతాడో నేను ఆమెకు అదే అవుతాను. ఈ మహా సంస్థని నడిపించే మహా శక్తిమంతురాలు ఆమె."
    "ఛీఛీ. మీరంతా కట్టగట్టుకు చావండి. దాని పాదాలు నాకండి. పోయి నేను నా దారిన పోతాను."
    "నిన్ను ప్రాణాలతో విడిచిపెడితే మాట. పాపాలాల్ ముచ్చట తీర్చకపోతే కథ అడ్డం తిరిగితే ఆంటీకి నేను వివరించలేక__చివరికి నీ విషయం చెప్పాలి. ఆ మరుక్షణం నన్ను కాల్చేస్తుంది. నన్ను నేను రక్షించుకోవటం కోసం నీ ప్రాణాలు తియ్యాల్సొస్తుంది. కానీ నిన్ను నేను చంపలేను. నువ్వొక మహాశక్తివి. నన్ను అశక్తుణ్ని చేసే మహాశక్తివి. నేను జయించలేక పోయిన స్త్రీని నువ్వొక్కదానివే. నా ప్రాణాలు కాపాడుకోటం కోసం, నీ ప్రాణాలు తియ్యక తప్పదు. చిన్న సౌంజ్ఞతో నిన్ను చంపించగలను. నా కళ్ళముందు కాదు."
    "అందుకే అది జరగకముందుగానే వెళ్ళిపోతాను."
    "యెక్కడికి?"
    "నా యిష్టం వచ్చిన చోటుకి"
    "యీ స్థితిలోంచి వెళ్ళి నువ్వెట్లా బతకగలవు? వొళ్ళు అమ్ముకుని. అప్పుడు మార్కెట్లో నీ రేటు యెంతకి దిగజారుతుందో తెలుసా!"
    "నాకేం కర్మ ఆ పని. నాకు అసహ్యం. నా జీవితంలో యిప్పటికి తాకిన యిద్దరు భర్తలు__ ఆ ఇద్దరన్నా నాకు అసహ్యం. నాకు అసహ్యంగా అనిపించకుండా ఒక్కసారైనా జరగలేదు. నా దారిన నేవెళ్ళిపోతాను. నాకున్న ఆస్థి నాకు చాలు."
    "నీకేముంది?"
    "యేముందా!" అని పరిహాసంగా నవ్వి, "కోర్టు వారెంట్ తో మిమ్మల్నందర్నీ ఈ మహల్ లోంచి బయటికి గెంటించగలను. నా బ్యాంక్ బ్యాలన్స్ తో ప్రపంచం చుట్టిరాగలను." అంది.
    "నీ బ్యాంకు ఖాతా మన జాయింట్ ఖాతా అని తెలుసుగా! నేనీ క్షణంలో వొక ఫోన్ కాల్ బ్యాంకు ఏజెంట్ యింటికి చేస్తే__నీ చెక్కు చేరినా అది అట్లాగే వుండి ఉదయం నా చెక్కు క్యాష్ ఐనాకే బ్యాంకు తలుపులు తెరుచుకుంటాయ్. ఈ మహల్ నీది కాదు. సమస్తం ఆ మహా రాక్షసిది."  
    "యీ మహల్ నాపేర వుంది" అంది.
    "నీ పేర యేమీ లేదు. ఆ దస్తావేజులూ అవీ__ఆ రిజిస్ట్రారాఫీసులో. అతనికి లంచమిచ్చి ఆ సంతకాల తతంగం చేశాం నీ కళ్ళముందు. నిన్ను కారులో పంపించి నేను అక్కడే వుండిపోయాను గుర్తుందా? ఆ రిజిస్ట్రారు ముద్రవేసి సంతకం చేసినవి__రికార్డులో యెక్కకపోతే అతని భయం అతనిది. అందుకని నా సేఫ్టీ కోసం కూడా__ అతనిముందే అప్పుడే వాటిని తగలబెట్టేశాడు. యిప్పుడు నీకు వాటి బూడిద కూడా దొరకదు.
    "వాటి కాపీలు నా దగ్గిరున్నయ్"
    "అవి నకిలీవి. ఆ ముద్రలు నకిలీవి. ఆ సంతకాలు చేసిన వాళ్ళెవరో యీ భూమ్మీద యెవరూ పట్టుకోలేరు"
    "ధూ." అని అతని ముఖం మీదకి వుమ్మింది. యెదురుగా సోఫాలో కూర్చుని వున్న అతని ముఖంమీద వుమ్మి చిందులు పడ్డాయి.
    "అహాహా" అని వికటాట్టహాసం చేశాడు. తొలిరోజున విన్న ఆ వికటాట్టహాసం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS