Previous Page Next Page 
ఆలింగనం పేజి 95


    "పరీక్షలకి చదువుకోవాలి. పరీక్షలయిన మర్నాడే చిత్ర పెళ్ళి. నాకు కొన్ని రోజులు సెలవియ్యి" అన్నాను.

 

    "సరే...కానీ పరీక్షలవగానే నా పెళ్ళిదాకా ఇక్కడే వుండాలి" కండీషన్ పెట్టింది.

 

    "మీ అమ్మా, నాన్నా ఏవన్నారూ?" అడిగాను.

 

    "అమ్మ చాలా సంతోషించింది. వచ్చేవారం తమ్ముడూ, అమ్మా వస్తున్నారు. నాన్నగారికి చెప్పలేదు! బోస్ పిలుస్తాడు. ఆయన రిసెప్షన్ లో నన్ను చూసి ఖంగుతినాలి!" కసిగా అంది.

 

    "లిల్లీ... బాధపడ్తారు!" ఆమె చేతిమీద చెయ్యివేసి అన్నాను.

 

    "పడనీ...చిన్నప్పటినుండీ ఎన్నో సందర్భాల్లో పడ్డాను. మనసుకి మాననిగాయం అయింది.గాయానికి మందు పూసినట్లు డబ్బు విసిరేశాడు. ఇప్పుడు బాధపడడం ఆయన వంతు!" నిర్లక్ష్యంగా అంది.

 

    విక్కీ వింటూ కూర్చున్నాడు. ఎందుకూ? ఏమిటి? అని అతడు అడగడు. చెప్తేనే మాట్లాడ్తాడు. చాలామంచి హేబిట్!

 

    "రషీద్ దగ్గర్నుంచి ఏం ఫోన్ కాల్స్ రాలేదుగా!" అడిగాను.

 

    "ఇంకా మనం రాసిన ఉత్తరం అంది వుండదు" చెప్పింది లిల్లీ.

 

    నాకు ఎందుకో మెల్లి మెల్లిగా హోప్ పోతుంది. విక్కీ అన్నట్లు నేను ఫూల్ నే! లేకపోతే అతని మనస్తత్వం ఏవిటో, ఇప్పటికి పెళ్ళయిపోయిందో ఏమో అన్న అనుమానం లేకుండా ఈ పిచ్చి ఊహలేమిటి?

 

    లిల్లీ నన్ను ఇంటిదగ్గర డ్రాప్ చెయ్యడానికి వచ్చింది.

 

    "బోస్ ఫోన్ చేశాడా?" అడిగాను.

 

    దాని బుగ్గల్లో సిగ్గు దొంతరలు ముచ్చటగా సొట్టలుపడ్డాయి.

 

    "యూనో...హౌ రొమేంటిక్ హీ ఈజ్...ఫోన్లోనే...అమ్మో పెళ్ళికాని పిల్లవి...నీకు చెప్పకూడదు!" అని నవ్వింది.

 

    "ఫోన్ కి కడుపు రాగలదు జాగ్రత్త!" అన్నాను.

 

    "అమ్మ దొంగా! ఎన్ని మాటలు నేర్చావే?" నా చెవి మెలిపెట్టింది.

 

    ఇంటికొచ్చి అమ్మకీ, నాన్నకీ తన పెళ్ళి విషయం చెప్పింది.

 

    "చాలా సంతోషం తల్లీ! మా ముక్తకి కూడా ఈ మధ్యన ఓ సంబంధం చూశాం...కుదిరేటట్లే వుంది" అంది అమ్మ.

 

    అది నావైపు మర్మగర్భంగా చూసి నవ్వింది.

 

    అమ్మ బలవంతంమీద మా ఇంట్లోనే భోజనం చేసింది. "ఏదో పప్పూ, పులుసూ, వడియాలూ ఇంతకుమించి ఏం చెయ్యలేదు!" నొచ్చుకుంటూ అంది అమ్మ.

 

    "అమ్మ చేతివంట అమృతం...ఇలా కడుపునిండా తిని ఎంతకాలం అయిందో!" లిల్లీ నిజంగానే తృప్తిగా అంది.

 

    "నువ్వు అలా మాట్లాడ్తుంటే మా కాళింది గుర్తొస్తోంది!" అమ్మ కంటనీరు పెట్టుకుంది.

 

    "మీ కాళిందే అనుకో అమ్మా, ఇదిగో నాన్నగారూ...నా పెళ్ళికి మూడురోజుల ముందునుంచీ అక్కడే వుండాలి...తెల్సిందా?" తర్జనితో బెదిరిస్తున్నట్లుగా అంది.

 

    "అలాగే తల్లీ!" అన్నారు నాన్న.

 

    "ఆవకాయకీ అమ్మ ప్రేమకీ పోలికేమిటో చెప్పనా? రెండూ వదిలిపెట్టలేనంత బావుంటాయి. ఎక్కువైతే కన్నీళ్ళు చెప్పిస్తాయి!" కళ్ళు కర్చీఫ్ తో తుడుచుకుంటూ అంది లిల్లీ.

 

    అమ్మ కమ్మని గడ్డ పెరుగు వడ్డించింది.

 

    లిల్లీ వెళ్ళిపోతుంటే కారుదాకా వచ్చి-

 

    "లిల్లీ...నువ్వు పెళ్లవగానే నన్ను వదిలి కెనడా వెళ్ళిపోతావా?" దిగులుగా అడిగాను.

 

    అది నన్ను దగ్గరకి తీసుకుని "మళ్ళీ వచ్చేస్తాగా" అంది.

 

    "నువ్వు లేకుండా ఎలా బ్రతకగలనూ అనే పరిస్థితి తీసుకొచ్చావు!" చెమరిస్తున్న కళ్ళని దాచుకోవడానికి ప్రయత్నించాను.

 

    "నన్ను మరిపించేవాడు వస్తాడు!" నవ్వుతూ అంది.

 

    "నన్నూ అలాగే మర్చిపోతావా?" చిన్నపిల్లలా అడిగాను.

 

    "ముక్తా...చిన్నప్పుడు శివ నాతో చనువుగా వున్నాడని జెలసీ ఫీలయి ఏడ్చేదానివి చూడూ... అచ్చం అలాగే కనిపిస్తున్నావు ఇప్పుడు! నువ్వేం మారలేదు" అంది.

 

    "మెచ్యూరిటీ వచ్చినకొద్దీ బాధే లిల్లీ! అందరివైపునుండీ మనమే ఆలోచించగలిగే స్థితి రావడం దుర్భరం!

 

    ఎదుటివారిమీద కోపం తెచ్చుకోలేక మనని మనమే శిక్షించుకుంటాం... అందులో సుఖంలేదు" అన్నాను.

 

    "అది నేను లేట్ గా తెలుసుకున్నాను" అంది.

 

    "నేను త్వరగానే తెలుసుకున్నాను. ఇంకా నరకంగా వుంది" అన్నాను.

 

    "ఇద్దరం వృద్ధ మహిళలు జీవన సంధ్యాసమయంలో నిలబడి గడిచిన జీవితాన్ని నెమరువేసుకుంటున్నట్లుగా వుందికానీ పెళ్ళికాని పరువంలో వున్న అమ్మాయిలు మాట్లాడుకుంటున్నట్లుగా లేదు!" అంది.

 

    ఇద్దరం ఫక్కున నవ్వేశాం. ఆ నవ్వులన్నీ బహుశా తారకలై ఆకాశంలోకి ఎగిరిపోయుంటాయి!


                                   *  *  *


    పరీక్షలు మొదలయ్యాయి. కష్టపడి చదువుతున్నాను. ఎక్కడెక్కడో పోగొట్టుకుంటున్నవన్నీ కష్టపడి పేర్చుకుంటున్నాను. ఎప్పుడూ నా చదువు గురించే దిగులుపడే చిన్నక్క అనుక్షణం గుర్తొస్తోంది! ఉంటే ఎంత బావుండేది? కథే వేరుగా వుండేది.

 

    నా పరీక్షల్లోనే చైతన్య పెళ్ళి అయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS