Previous Page Next Page 
ఆలింగనం పేజి 94


    "ఐ లవ్ యూ! నిన్ను నేను గాఢంగా ప్రేమించాను తెలుసా?" నా చెంపలు నిమురుతూ నా కళ్ళల్లో ఏదో వెతుకుతున్నట్లుగా చూస్తూ అన్నాడు.

 

    "వదులు... నాకు నీ పట్ల అలాంటి భావం లేదు!" అన్నాను.

 

    "ముక్తా...నేను నీకు నచ్చలేదా?" నన్ను గట్టిగా గుండెలకి హత్తుకుంటూ అడిగాడు.

 

    "విక్కీ...ప్లీజ్...వదులు. నాకు ఇష్టంలేదు" అరిచాను.

 

    "ఎవడో మొహంచూడని వాడిమీద ఇష్టముందా?" నన్ను ఇంకా దగ్గరగా హత్తుకుంటూ అడిగాడు.

 

    "ఉంది" అన్నాను.

 

    "యూ ఇండియన్ విమెన్ ఆల్ సెంటిమెంటల్!" నన్ను అమాంతం రెండు చేతుల్తో ఎత్తి అన్నాడు.

 

    "ఏయ్ విక్కీ... ఏం చేస్తున్నావ్?" అరిచాను.

 

    విక్కీ నన్ను బెడ్ రూంలోకి తీసుకెళ్ళి బెడ్ మీద పడేసి, ముందుకి ఒంగాడు.

 

    "నీకు పిచ్చెక్కిందా?" అరిచాను.

 

    అతను నా గుండెల మధ్యలోంచి తలఎత్తి నా కళ్ళలోకి చూశాడు. అక్కడ కనిపిస్తున్న అసహ్యాన్ని తట్టుకోలేకేమో నన్ను నెమ్మదిగా వదిలిపెట్టేశాడు.

 

    నెమ్మదిగా నామీద నుంచి లేచాడు. క్రింద కుప్పలా పడిన ఓణీని తీసి నా పైకి విసిరాడు. ఆ తర్వాత తలవంచుకుని "సారీ!" అన్నాడు.

 

    నేను లేచి ఓణీ కట్టుకున్నాను.

 

    "నీకు సెంటిమెంట్ లేదా?" అడిగాడు.

 

    "లేదు నాది ప్రేమ!" అన్నాను.

 

    "ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం ఎవరితరం?" గొణుక్కుని బయటికి వెళ్ళిపోయాడు.

 

    నేను రెండు నిమిషాలు ఆలోచించాను. అతనిమీద నాకు కోపం రాలేదు. లేచి ముందు గదిలోకి వెళ్ళాను. విక్కీ రెండు చేతులమధ్యా తల పెట్టుకుని కూర్చుని వున్నాడు. ఆ భంగిమని బట్టి అతను బాధపడ్తున్నాడని అర్థమైంది.

 

    "విక్కీ..." పిలిచాను.

 

    అతను తలెత్తి "నేను అలా చెయ్యాలని అనుకోలేదు ముక్తా. ఎందుకో మృగంలా ప్రవర్తించాను." అన్నాడు.

 

    అతని కళ్ళల్లో కన్నీళ్ళు! తప్పు చేసిన వాడిని చూస్తేకన్నా, తప్పుచేసి పశ్చాత్తాప పడనివాడిమీదే నాకు కోపం!

 

    అందుకే విక్కీమీద కోపం రాలేదు! అయినా కాస్త వాడిగా "సహజంగా ప్రవర్తించావు. ఒక ఆడపిల్ల ఇంత చనువుగా మసులుతుంటే ఆ పనికి అభ్యంతరం పెట్టదని మీ జాతి నమ్మకం కదా!" అన్నాను.

 

    "ఛ! నన్నూ అందరితోబాటూ ఒకేగాటికి కట్టెయ్యకు. నిన్ను నేను కాంక్షించలేదు. ప్రేమించాను. అసలు నీకోసమే ఇండియాలో సెటిల్ అయిపోదామనుకున్నను తెలుసా?" అన్నాడు.

 

    "ఇప్పుడు అవడంలేదా?" అడిగాను.

 

    అతను మాట్లాడలేదు.

 

    "విక్కీ...నీలాంటి డాక్టర్ అవసరం నాదేశ ప్రజలకి వుంది. ఒక ఆముక్తవల్ల నీవు వాళ్ళకి దూరం అవకు!" అన్నాను.

 

    అతను మౌనంగా వున్నాడు.

 

    "ఏం మాట్లాడవేం?" అడిగాను.

 

    "నువ్వు సంతోషిస్తానంటే అలాగే కానియ్యి" అన్నాడు.

 

    సందీప్ చెప్పినమాట గుర్తొచ్చింది.

 

    "ఫ్రెండ్ షిప్ ఈజ్ స్మూతింగ్ ఆఫ్ ది పాత్, వెన్ ది గోయింగ్ బికమ్స్ రఫ్"

 

    "ఈ సంతోష సమయంలో మనం కాఫీ తాగితే బావుంటుందేమో?" అన్నాను.

 

    "ఓ.కే!" అన్నాడు.

 

    "నీ చేతి కాఫీ తాగాలనుంది" అల్లరిగా నవ్వుతూ అన్నాను.

 

    అతనూ నవ్వి నాతలమీద కొట్టి లోపలికి వెళ్ళాడు. ఈ స్పర్శలో ఆత్మీయత వుంది. కాంక్షలేదు! మగవాడ్ని కాస్త జాగ్రత్తగా డీల్ చేస్తే అతనిలో వున్న స్నేహం, సౌకుమార్యం, దయ బైటికి తీయవచ్చు!

 

    కానీ... మొదటగా అతను ప్రకటించే కోరికను ఎదుర్కోవాలి! అందుకు చాలా మెళుకువ కావాలి! హౌటు టీమ్ ఎ మాన్ అని ఇంతవరకూ ఎవరూ వ్రాసినట్లులేరు!

 

    విక్కీ కాఫీ చేస్తుండగా లిల్లీ వచ్చింది.

 

    "ముక్తా డాల్! నీకోసం ఏం తెచ్చానోచూడు!" అని కేకలు పెట్టింది. ఆమె చేతిలో ప్యాకెట్లున్నాయి.

 

    విక్కీ వాటిని టేబుల్ మీద పెట్టడంలో హెల్ప్ చేశాడు.

 

    "ఇది చూడు!" ఒక అట్టపెట్టె నాచేతికిస్తూ అంది.

 

    తీసి చూస్తే ముక్కుపొడుం రంగు మైసూర్ క్రేఫ్ కి మామిడి పిందెల జరీ అంచువున్న చీర!

 

    "ఎందుకూ?" అడిగాను.

 

    "నీ ప్రాణ స్నేహితురాలి పెళ్ళికి! చాలా తక్కువ టైం వుంది. ఆరో తారీఖున ఫిక్స్ అయింది. విక్కీ నీకు చాలా పనివుంది. అసలు ముక్తని ఇక్కడ వుంచేసుకుంటే బెటర్..." గడగడా చెప్పింది.

 

    "నువ్వూ పెళ్ళి అవగానే అతడితో కెనడా వెళ్ళిపోతున్నావా?" విక్కి అడిగాడు.

 

    "అవును. అలాగే ఎరేంజ్ చేస్తున్నాడు. మిగతా ప్యాకెట్స్ విప్పుతూ అంది.

 

    "చీర చాలా బావుంది లిల్లీ" చేతిలోకి తీసుకుంటూ అన్నాను.

 

    "లిల్లీ ఏం చేసినా బావుంటుంది" గర్వంగా అంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS