అమ్మా నాన్నా వెళ్ళారు. పదిరోజులుండి తాతయ్యని తీసుకొస్తామన్నారు. తాతయ్య పరిస్థితేం బాగాలేదు. వార్ధక్యం ఆయన్ని ఏ పనీ చేసుకోనివ్వడం లేదు.
ఆయన వుండగానే నా పెళ్ళి చేస్తే ఆ ఆత్మ సంతోషంగా పోతుందని నాన్న భావన.
నేను గడువుపెట్టుకున్నాను...ఏడో తారీఖు శ్యాంసుందర్ వచ్చేదాకా! అంతలోగా చంద్ర ఆచూకీ దొరకాలి. ప్రతిరోజూ పోస్టుమేన్ కోసం ఎదురు చూస్తున్నాను.
లిల్లీ దగ్గరికి వెళ్ళడంలేదు. అప్పుడప్పుడూ ఫోన్ చేస్తున్నాను. నేను ఫోన్ చేసినప్పుడు 'నీకో గుడ్ న్యూస్...' అంటూ అది రషీద్ కాంటాక్ట్ చేసినట్లుగా చెప్తుందేమోనని ఆశ! అలాంటిదేం జరగడం లేదు.
కేలండర్ లో పేజీలు గిరగిరా తిరిగిపోయాయి. నా పరీక్షలు కూడా అయిపోయాయి.
రేపు చిత్ర పెళ్ళి. ఊరినుండి ప్రతాప్ వచ్చాడు. వైజూతో కలిసి నా దగ్గరికి వచ్చాడు.
అప్పుడే తలంటుపోసుకుని బయట ఎండలో కూర్చుని జుట్టు ఆరబెట్టు కుంటున్నాను. వాళ్ళని చూడగానే చాలా ఆనందమేసింది.
"రండి...రండి..." అంటూ ఉత్సాహంగా ఆహ్వానించాను.
"ముక్తా...అలా చిక్కిపోయావే?" అని అడిగాడు ప్రతాప్.
"ప్రేమలో పడినట్లుంది" వైజయంతి నవ్వుతూ అంది.
"మళ్ళీనా?" అల్లరిగా నవ్వుతూ ప్రతాప్ ఆటపట్టించాడు.
అతనికి మా ఆడపిల్లల మనస్తత్వం ఎప్పుడూ వేళాకోళమే! అంత త్వరగా ఎలా ప్రేమిస్తారు మీరూ? అని ఆశ్చర్యపోతుంటాడు.
"దానికి మొన్న ఆదివారం పెళ్ళిచూపులయ్యాయి" వైజూ చెప్పింది.
"పెళ్ళికొడుకు ఎలా వున్నాడూ? నీకు నచ్చాడా?" అడిగాడు నన్ను.
"నేను నచ్చానో లేడో అడగవా?" నవ్వుతూ అన్నాను.
"కళ్ళున్న ఎవరికైనా నచ్చుతావు!" ఎంతో కాన్ఫిడెంట్ గా అనేశాడు ప్రతాప్.
"కానీ...నాకు భయంగా వుంది ప్రతాప్! నేను అసలు ఎవరితోనైనా ఎడ్జస్ట్ అయి బ్రతుకుతానా? ఒకవేళ నా ప్రేమల సంగతి తెలిస్తే... ఏ పెళ్ళికొడుకైనా నన్ను ఒప్పుకుంటాడా?" అడిగాను.
"అసలు నిన్ను ఎవరు చెప్పమన్నారూ? లేవెన్ స్కీ వాపౌలా జోన్స్ వా?" కసురుకుంది వైజూ.
"చెప్పకపోతే మోసం చేసినట్లు అవదా?" అడిగాను.
ప్రతాప ఆలోచనగా చూశాడు.
"నీ ఆలోచనాశక్తిమీద నాకు నమ్మకం వుంది ప్రతాప్! నువ్వు చెప్పు... ఇవన్నీ దాచాలా, చెప్పాలా?" అడిగాను.
వైజూ విసుగ్గా "నీకేమైనా మతిపోయిందా?" అని ఏదో అనబోయింది.
ప్రతాప్ ఆమెని ఆగమని సైగచేసి "చెప్పడమే మంచిది ముక్తా. నేను ఆ పెళ్ళికొడుకు పరిస్థితిలోవుంటే విని భరించలేనేమో కానీ అర్థం చేసుకోడానికి ట్రై చేస్తాను. ఒకవేళ చెప్పకుండానే పెళ్లైపోతే ఏ విషయం బయటపడినా సహించే శక్తి అస్సలు వుండదు. 'మన, నా' అనే పొజేసీవ్ నెస్ చాలా నరకం పెడ్తుంది! ముందే ఎటో తేల్చుకునే అవకాశం అతనికి ఇవ్వడమే మంచిది" అన్నాడు.
నా మనసులో మాట ప్రతాప్ చెప్పాడు.
"నీ మాట వింటాను ప్రతాప్. ఆరోజు పైనుండి క్రిందకు చూస్తే తల తిరిగే రోగం వున్నప్పుడు...ఎత్తులు ఎక్కకు...ఎక్కినా క్రిందకి చూడకు! అన్న నీ హితోక్తి విననందుకు చాలాసార్లు బాధపడ్డాను!" అంటూ వుంటే అకస్మాత్తుగా కన్నీళ్ళొచ్చాయి.
వైజయంతి నన్ను దగ్గరకి తీసుకుంది.
* * *
చిత్ర పెళ్ళి చాలా వైభవంగా జరిగింది. పెళ్ళికొడుకు ముఖంలోని ఆత్మవిశ్వాసం చూస్తుంటే అదే అతన్ని ఆరు అడుగులు పెంచినట్లుగా పొడుగ్గా కనిపించాడు. తనకి నచ్చిన అమ్మాయి తనని మనసారా ఇష్టపడడానికి మించిన అదృష్టం ఏవుంది మగవాడికి?
"అడుగో...సిద్దార్ధ..." వైజయంతి నన్ను మోచేత్తో పొడిచి చూపించింది.
కొడుకుని ఎత్తుకుని భార్యతో కలిసి వస్తున్నాడు. అక్కడ నన్ను గమనించగానే చటుక్కున మొహం మరో వైపుకి తిప్పుకున్నాడు.
ప్రతివాడూ ఒక ట్రైల్ వేస్తాడు. ఆడపిల్ల ఆ ఉచ్చులో పడడం, పడకపోవడం ఆమె తెలివితేటల్ని బట్టి వుంటుంది. ఆ రోజు నేను భయపడో... భ్రమపడో అతని ప్రపోజల్ కి అంగీకరించి వుంటే- లిల్లీ తల్లి కథ పునరావృతం అయ్యేది. మరో లిల్లీ నన్ను శపించే కళ్ళతో తయారయ్యేది! ఎంత ప్రమాదం తప్పిందీ! గుండెలమీద చెయ్యి వేసుకున్నాను.
సిద్దార్ధ రేవతి కనుసన్నల్లో మెలుగుతున్నాడు. లిల్లీ అతని వల్లే నన్ను కల్సింది. లేకపోతే ఈ రోజున నేను భయం భయంగా తల వంచుకునీ...అతను గర్వంగా తల ఎత్తుకుని వుండేవాళ్ళం!
"చీకటిపడ్తోంది...బయల్దేరుదాం" వైజూతో అన్నాను.
"అవును. లేకపోతే మళ్ళీ ఎవడో కారు తీసుకుని డ్రాప్ చేస్తానంటూ సిద్ధమౌతాడు" వైజూ నవ్వుతూ అంది.
ప్రతాప్, వెంకట్, రఫీలని కలిసి చెప్పి, ఇద్దరం బయటికి వస్తూ వుంటే...
"ఎక్స్యూజ్ మీ..." అని వినిపించింది.
నేను చటుక్కున అటు చూశాను.
వైట్ కలర్ సూట్ లో వున్న ఒక అతను "మీ పెరూ... మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుగా వుంది" అన్నాడు.
"నన్ను మీరు ఎక్కడా చూడలేదు. నా పేరు మీకు అనవసరం!" అని వైజూ చెయ్యి పట్టుకుని లాక్కెళ్తున్నట్లుగా బయటికి తీసుకొచ్చేశాను.
