"ఏం చేస్తావ్?"
చెప్పలేకపోయింది. ప్రశ్న చిన్నదే. కాని అనంతమంత సమస్య ఇమిడివుంది. ఒకవేళ అంతవరకూ బ్రతికుంటేగా ఆదిత్యని కాపాడుకునేది.
బయటికి వెళ్ళబోయిన ప్రబంధని వారించబోయింది సౌదామిని "ఎక్కడికి?" అంటూ.
తెలీదు ప్రబంధ క్కూడా.
"ఈ చీకటిలో ఒంటరిగా ఎవరితో పోరాడగలవని?"
"ఆంటీ!" మొండితనంకన్నా మెచ్యూరిటీనే ప్రదర్శించింది ప్రబంధ. "ఆదిత్యని కడతేర్చాలని ముఖ్యమంత్రి ప్రయత్నిస్తే, అతడిని కాపాడటానికి ప్రేమించిన ముఖ్యమంత్రి కూతురు అవసరమైతే తన జీవితాన్ని వెచ్చిస్తుంది."
"అంటే ఏం చేద్దామని?"
"నిరపరాధైన ఆదిత్యని విడిపించమని పోరాడతాను!"
"ఎలా?" సౌదామిని ప్రశ్నతోనే ఆగిపోలేదు. జవాబునీ అందించింది. "నీ స్నేహితుల అండతోనా? అదైతే నీ పని సులభసాధ్యమవుతుంది. నిజమే ప్రబంధా! కాని యూనివర్శిటీలో నిన్నూ, నీ అన్ననీ ద్వేషించే వర్గమూ ఉందిగా? వాళ్ళనందర్ని కూడగట్టుకుంటే తప్ప ఏ వుద్యమాన్నీ నిర్వహించలేవుగా!"
ఏం చేయాలో అప్పటికే తెలిసిన ప్రబంధ ఇక జాప్యం చేయలేదు. ఆ రాత్రివేళ బయలుదేరింది.
* * *
"నువ్వా?"
తెలతెలవారుతుండగా ఇంటికి వచ్చిన ప్రబంధని చూసి అప్రతిభురాలైంది ప్రణయ "ఏంటిలా వచ్చావు?"
ప్రబంధ తల వంచుకుని నిలబడిపోయింది చాలాసేపటిదాకా.
అది చాలు ప్రణయలాంటి అమ్మాయి స్పందించటానికి అసలు ప్రతి క్షణమూ అహంకారిగానే కనిపించిన ప్రబంధ, ఇక్కడో నిస్సహాయురాలైన యువతిలా నిలబడటం ఆమెను చాలా కలవరపరిచిందేమో!" ఇలా కూర్చో" అంది మెల్లగా.
బుద్దిమంతురాలైన అమ్మాయిలా కూర్చున్న ప్రబంధ కళ్ళలో నిలిచిన నీటిబొట్లు మరింత బాధకి గురి చేస్తుంటే- "ఏమైంది ప్రబంధా?" అడిగింది ప్రణయ ఉద్విగ్నంగా.
చెప్పింది జరిగిందంతా.
నిశ్శబ్దంగా వుండిపోయింది ప్రణయ.
"నిజానికి నేను సాహసం చేసి ఆదిత్య దగ్గరికి వెళ్ళింది ఇంత జరుగుతుందని తెలీకనే కాదు ప్రణయా! నీ మనిషిలా కనిపిస్తున్న ఆదిత్యని నా మనిషిగా మార్చుకోవాలని కూడా ఇందులో పర్యవసానాల్ని నేనూహించలేదు. పొరపాటు జరిగివుంటే అదీ నా మూలంగా ఆదిత్య నిరపరాధి ఇప్పటికీ నిన్నే ఇష్టపడుతున్నాడేమో కూడా!! చెప్పు, నా మూలంగా సమస్యలో చిక్కుకున్న అదిత్యని రక్షించుకోవాలి. 'నువ్వు పక్కకి జరిగితే అతడిని రక్షించే బాధ్యత నేను తీసుకుంటాను ప్రబంధా!' అని నువ్వు అన్నా, నేను దానికి సిద్దమే కావాల్సింది ఆదిత్యను రక్షించుకోవటం" పసిపిల్లలా గొణుగుతూ చెప్పుకుపోతూంది "గతంలో నిన్ను నేను బాధపెట్టి వుండొచ్చు. నిన్నే కాదు, నీలాగే చాలామంది స్టూడెంట్స్ ని నేను అహంతో అవమానించి ఉండవచ్చు. అందుకు మీరంతా కోపగించుకోవాల్సింది నన్ను ఆదిత్యని కాదు."
జాలి, అభిమానం, అంతకుమించి ఆ క్షణంలో ప్రబంధలో ఆదిత్యని కాపాడుకోవాలనే నిజాయితీ ప్రణయని ఎంతగా కదిలించాయీ అంటే, పక్కన కూర్చుని లాలనగా ప్రబంధ తల నిమిరింది.
"ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ఓ ముఖ్యమంత్రి కూతురు ఇలా ఆందోళన పడటాన్ని వూహించలేకపోతున్నాను."
"అహంకారిగా నేను బ్రతికింది నా వెనుకనున్న నా తండ్రి అండచూసుకునే ప్రణయా! ఇప్పుడు మా నాన్న నాకు ప్రత్యర్ధి."
"ఏ తండ్రీ చేజేతులా కూతుర్ని వదులుకోడు."
"నేను మాట్లాడుతున్నది నా గురించి కాదు ప్రణయా! నా మూలంగా సమస్యల్లో చిక్కుకున్న ఆదిత్య గురించి."
"ఆదిత్య ఒంటరివాడు కాదు. అతడి వెనుక మనమంతా లేమూ?"
"అది నిరూపించుకునేసరికి అతడే లేకుండాపోతాడు.
ప్రబంధ ఎంత కలవరపడుతున్నదీ అర్దమైందో, లేక ఆమె కలవరపాటులో యధార్దాన్నే ఆమె గ్రహించిందో నెమ్మదిగా అంది- "ఏం కాదు ప్రబంధా! ఏమీ కాకుండా చూసే పూచీ నాది."
"ఇప్పుడేం చేద్దాం?"
"ప్రభుత్వమంటే మీ నాన్నే కావచ్చేమో కాని, చట్టమంటే ఆయన్నిసైతం అదుపు చేయగలది" ఇక్కడ ఆదిత్యకన్నా ఆదిత్యనంతగా అభిమానించే ప్రబంధ నమ్మకన్ని కాపాడటమే ముఖ్యమనుకుందేమో- "వెంటనే లాయర్ తో మాట్లాడి అతడిని విడిపిద్దాం. అవసరమైతే యూనివర్శిటీ విద్యార్ధుల అండతో ఆదిత్య నిర్దోషిత్వాన్ని సమర్ధిస్తూ ధర్నాలు నిర్వహిద్దాం. ఎప్పుడో కాదు, వెంటనే."
మనసు కుదుటపడిన ప్రబంధ, కృతజ్ఞతగా ప్రణయ చేతులు పట్టుకుంది. "నా మీద కోపం లేదు కదూ?"
గుండె అడుగుపొరల్లో ఏ పల్లవి ధ్వనించిందో, ఉద్విగ్నంగా ప్రబంధని దగ్గరకు తీసుకుంది సోదరిలా "చఛ! ఏమిటి? అంత ధైర్యవంతురాలివి, ఉన్నట్టుండి ఇంత పిరికిదానివైపోయావేం? పిచ్చిపిల్లా! ప్రభుత్వాలు ప్రేమ కథల్ని నిర్దేశించలేవు."
"వద్దు!" అలజడిగా అంది ప్రబంధ. "ఇక మీ మధ్య నేను అడ్డంగా నిలబడను. లెంపలేసుకుని పక్కకు జరిగిపోతాను."
మనసు ద్రవించిన ప్రణయ రెప్పలార్పకుండా చూస్తూ వుండిపోయింది రెండు క్షణాలపాటు "నీలాంటిదాన్ని ప్రేమ మరింత మొండిగా మార్చాలి తప్ప బలహీనురాల్ని చేయకూడదు"
"లేదు ప్రణయా!" చివరి నిర్ణయంలా అంది. "నేను ప్రేమించడమే ఆదిత్యకి ఆపద తెచ్చే విషయమైతే అలాంటి ప్రేమ నాకొద్దు"
"ఇప్పటికి అర్ధమైంది"
"ఏమిటి?"
"ఆదిత్యని నువ్వెంతగా ప్రేమిస్తున్నదీ."
"లేదు... ఆదిత్య నిజానికి నీవాడు."
