ఇద్దరిలో ఎవరు అమితంగా ప్రేమించిందీ అన్న సత్యాన్ని బేరీజు వేసుకోవడంలేదు ప్రణయ. పోరాట పటిమతో కడదాకా నిలబడగల ప్రబంధ అనే అమ్మాయి, ఇలా ఉపసంహరించుకోవడం ప్రేమకు సరికొత్త భాష్యంలా కనిపిస్తూంది.
ఇది ముగింపులా అనిపిస్తున్నా ముగింపు కాదు....! పాడాలనుకున్న యుగళగీతిపైన జరిగిన దాడితో, కోరి గుండె గొంతుస్వరాల్ని సమాధి చేసుకోవాలనే ప్రయత్నం జరుగుతూంది ప్రబంధ పరంగా.
ఏ ఆలోచన మెరిసిందో ప్రణయ కళ్ళలోనూ ఓ నీటిపొర మెదిలింది. "వెల్... సిద్దంగా వుండు" అంది.
"దేనికి?"
"రేపు నేను ఏర్పాటు చేసే ప్రెస్ కాన్ ఫరెన్స్ లో మాట్లాడటానికి."
అర్ధంకానట్టు చూసింది ప్రబంధ.
"అవును ప్రబంధా...! ఆదిత్య అరెస్టుకి అసలు మోటివ్ మీరు ప్రేమించుకోవటమే అన్న విషయాన్ని నువ్వు నిబ్బరంగా చెప్పగలగాలి"
"అభ్యంతరం లేదు"
తను మొదలు పెట్టబోయే ఉద్యమానికి నాందిలా ప్రబంధని ఒప్పించిన ప్రణయ ఏ ఉద్దేశంతో ఇది నిర్వహించాలనుకుంటున్నదీ ప్రబంధ గుర్తించలేక పోయింది.
ఇంత పబ్లిసిటీ ఇచ్చాక ఆదిత్యకి దక్కాల్సింది ప్రబంధ మాత్రమే! ఆదిత్యను రక్షించడం మాత్రమే కాదు, మానసికంగా ఇది అతడినీ ఓ కమిట్ మెంట్ వైపు నెట్టాలి. ప్రపంచానికి తెలిసిన ప్రేమకథలో ప్రబంధ భవిష్యత్ కోసమయినా ఆదిత్య ఆమెని అంగీకరించాలి. అలా మూడో మనిషి ప్రవేశానికి అవకాశమివ్వకుండా ఇద్దరి మార్గాలూ మూసేయాలి.
ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాగాని ప్రణయ యిప్పుడు మూడో మనిషి స్థానానికి జరిగిపోయింది.
ప్రేమ అమరమైతే ప్రేమని బ్రతికించటం దివ్యత్వం!
"ముఖ్యమంత్రి వాసుదేవరావు తన పదవికి రాజీనామా!"
అది ఆ రోజు వార్తల్లోని ముఖ్యాంశం.
గవర్నర్ కి రాజీనామా లేఖని అందించిన వాసుదేవరావు కొత్త నాయకుడి ఎన్నికకై అధిష్టాన వర్గానికి అవకాశం కల్పించి, అదే రోజు వైజాగ్ వచ్చేశాడు.
తన పదవికన్నా ఇప్పుడు ముఖ్యం ప్రబంధకి తను అనుకున్నట్టు పెళ్ళి జరిపించడం. వైజాగ్ చేరగానే తెలిసింది ఇల్లువిడిచి వెళ్ళిన ప్రబంధ ఇంటికి తిరిగిరాలేదని.
ఉదయం పది గంటలకల్లా కూతుర్ని ఇంటికి తీసుకురమ్మని కొడుకు శౌరిని పంపిన వాసుదేవరావు అసహనంగా క్షణాలు గడుపుతున్న సమయంలో...
ప్రబంధ, సూరిలతో పాటు ప్రణయ ఓ లాయర్ని కలుసుకుని, ఆదిత్యని విడుదల చేయించటానికి బెయిలు ఏర్పాటు చేసింది.
కాని ఆదిత్యను తను అరెస్ట్ చేయలేదన్నాడు ఎస్సై ఎస్పిని కల్సుకోవాలని ప్రయత్నించారు. అపాయింట్ మెంట్ దొరకలేదు. ఇదంతా ప్రభుత్వంలోని ఓ బలమయిన వ్యక్తి ఆదేశాలపైన జరుగుతున్న సత్యమని ప్రజలకు తెలియచెప్పాలని యూనివర్శిటీ స్టూడెంట్సుతో కలెక్టరాఫీసుకి తరలివెళ్ళిన ప్రణయ అక్కడ ధర్నా ప్రారంభించింది.
మధ్యాహ్నానికల్లా ఈ వార్త నగరం మొత్తం పాకిపోయింది. జనంతోపాటు ప్రెస్ రిపోర్టర్స్ కూడా తరలివచ్చారక్కడికి.
ఒక ప్రముఖ దినపత్రిక యజమాని కూతురుగానేకాక, యూనివర్శిటీలో మంచి గుర్తింపుగల వ్యక్తిగా విద్యార్ధుల్ని కూడగట్టుకుని విషయానికి సాధ్యమైనంత ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వటానికి ప్రయత్నించింది ప్రణయ.
సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటలకి ప్రబంధతో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన ప్రణయ వూహించలేదు అలా జరుగుతుందని.
పోలీసు బలగంతో వచ్చిన శౌరి ప్రబంధని బలవంతంగా కార్లోకి ఎక్కించడమేగాక, అడ్డం వచ్చిన సూరి బృందంపైన లాఠీఛార్జి కూడా జరిపించాడు.
ఇదంతా గమనిస్తూనే వుంది సౌదామిని.
అయితే ప్రబంధని బలవంతంగా విద్యార్ధుల మధ్యనుంచి లాక్కొచ్చిన శౌరి ప్రబంధని ఇంటికి తీసుకురాలేదు. మరెక్కడో నిర్భంధించాడు తండ్రి ఆదేశంపైన.
మరో గంటసేపు నిభాయించుకున్న సౌదామిని పదవీభ్రష్టుడు కావడమేగాక ఇలాంటి చిత్రమయిన సమస్యలో కూరుకుపోయిన వాసుదేవరావుతో అంది నెమ్మదిగా. "ప్రబంధ ఎక్కడ?"
"ఆ విషయం నీకు అనవసరం."
మృదువుగా "నిజమే... ఈ సమస్యకి నేనూ కొంత కారణమేగా?"
మెత్తబడలేదు వాసుదేవరావు ఉక్రోషంగా అన్నాడు..... "కొంతే కాదు పూర్తిగా నువ్వే బాధ్యురాలివి"
"ఒప్పుకుంటున్నాను"
"నిన్ను నమ్మినందుకు సర్వనాశనం చేశావ్"
సౌదామిని ఫాలభాగంపైన స్వేదం పేరుకుంది. తన గురించి మొత్తం తెలిసిపోయిందా?
"అప్పుడు శిక్షించాల్సింది నన్ను."
అతడి నుంచి మరికొన్ని వివరాల్ని తెలుసుకోవాలనుకుంది కానీ బయటపడలేదు వాసుదేవరావు.
"సౌదామినీ....!" తోడేలులా నవ్వాడు. "ఎప్పుడు, ఏం చేయాలో తెలిసినవాడుగా ఇప్పుడు వెంటనే తీసుకుంటున్న నిర్ణయం ఏమిటో తెలుసా? నిన్నుగాని, ప్రబంధనిగాని శిక్షించాటం కాదు. అదిత్యని శాశ్వతంగా అడ్డం తొలగించుకోవడం!"
ఉలిక్కిపడింది. తను ప్రబంధతో మామూలుగా అన్న విషయాన్ని ఇప్పుడతను నిజం చేయాలనుకుంటున్నాడు. అలజడిగా చూసింది.
వాసుదేవరావు స్థాయిలో వున్నవాడికి అదో పెద్ద సమస్యకాదు. ఆ తరువాత ఓ ఉద్యమంలా ప్రజలూ, పత్రికలూ ఆ చర్యని ఖండించొచ్చు కాని ఈలోగా ఆదిత్య కడతేరిపోతాడు.
