Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 93


    
    ఓ మూల మోకాళ్ళపైన తలానించుకుని నేలచూపులు చూస్తూ కూర్చుని వుందామె.
    
    "మీరలా మంచంపైన పడుకోండి" చెప్పాడు మర్యాదపూర్వకంగా.
    
    "మరి మీరో?"
    
    "నేను ఈ మూల..." గొణుగుతున్నట్టుగా అన్నాడు.
    
    ఇద్దరూ ఒకే గదిలో పడుకోవాలీ అన్న ఆలోచన అతన్ని ఆ క్షణంలో మూగవాడిని చేసింది.
    
    "ఫర్వాలేదు! ఈ రాత్రికి జాగరణ చేద్దామనుకుంటున్నాను."
    
    "అదేం?"
    
    "అలవాటు చేసుకోవాలని."
    
    "అంత అవసరమేమిటి?"
    
    "ఆదిత్యా!" ఆమె గొంతు చిత్రంగా ధ్వనించింది. "చాలా చాలా నిర్ణయించుకుని మీ దగ్గరకు వచ్చినదాన్ని ఆ నిర్ణయాలు నా వాళ్ళకు రుచించేవి కాకపోవచ్చు. అప్పుడు కొన్ని రోజులపాటు నేను నిద్రలేకుండా గడపాల్సి రావచ్చు. ప్రాక్టీసు కానివ్వండి."
    
    విస్మయంగా చూస్తూ వుండిపోయాడు.
    
    "ఇంతదాకా వచ్చేక మీకో విషయం నేను స్పష్టం చేయాలి...ఆదిత్యా! అసలు నేను వచ్చింది స్నేహపూర్వకంగా కాదు, మీతో శాశ్వతంగా వుండిపోవాలని."
    
    "వ్వాట్?" పక్కలో పిడుగు పడ్డట్టు అదిరిపడ్డాడు.
    
    "ఆశ్చర్యాలూ, అందోళనలూ, ఆరాటాలూ లాంటివి మరిచిపోయి నేను చెప్పేదేమిటో అర్ధం చేసుకోండి. ఐ లవ్యూ అండ్ ఐ వాంట్ బి విత్యూ" తిరుగులేని ఓ నిర్ణయం గురించి అనేసి ఆ తరువాత మంచం మీదికి వెళ్ళింది."
    
    ఓ గొప్పింటి అమ్మాయి, అందులోనూ మెచ్యూరిటీ గల యువతి ఏకపక్షంగా ఇలాంటి విషయాన్ని తెగేసి చెప్పడంతో నిద్ర ఎగిరిపోయింది.
    
    ఇదేమిటి? ఇంత ధైర్యాన్ని ప్రదర్శిస్తూందేం? ఇప్పుడేం చేయాలి?
    
    పరిచయం, ప్రేమ అనే రెండు దశలూ పూర్తిగా రూపుదిద్దుకోక ముందే శాశ్వతంగా తనతోనే వుండిపోవడం గురించి మాట్లాడుతూందేం?
    
    రేపు తెల్లవారాక ఏం జరగబోతూంది? అందరూ ఏమనుకుంటారు?
    
    ఆదిత్య ఇలా ఆలోచిస్తుండగానే బయట జీపు ఆగిన చప్పుడయింది. అరనిముషం వ్యవధిలో పోలీసులు వచ్చారక్కడికి.
    
    అవాక్కయిపోయాడు.
    
    వచ్చింది ప్రబంధ కోసమే అనుకున్నాడు కాని, ఎస్సై సరాసరి ఆదిత్యని సమీపించి- "మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం" అన్నాడు.
    
    "దేనికి?" ద్వారం దగ్గర నిలబడిన ప్రబంధ అడిగింది.
    
    "ఆదిత్యకి తీవ్రవాదులతో సంబంధం వుంది కాబట్టి."
    
    "బుల్ షిట్!" అడ్డంగా నిలబడింది ప్రబంధ. "మిస్టర్! ఓ వ్యక్తిని బలవంతంగా మూసేయాలీ అంటే మీరు మీ మార్గంలో వస్తారని నే నూహించగలను."
    
    "దయుంచి పక్కకు తప్పుకోండి."
    
    "నే నెవరో మీకు తెలిసే వుండాలి" హెచ్చరించింది.
    
    "తెలుసు ప్రబంధగారూ! తెలిశాకనే ఇలా రావడం జరిగింది."
    
    కొద్దిగా అనుమానించింది- "ఆదిత్యని నిర్బంధిస్తే మా నాన్నతో మాట్లాడాల్సి ఉంటుంది."
    
    "మాట్లాడకనే అతడిని అరెస్ట్ చేస్తున్నాం."
    
    తన అనుమానం నిజమైపోయింది. ఆమె ఏం చేయాలో తెలీనిస్థితిలో నిలబడి వుండగానే ఆదిత్యని తీసుకుపోయారు.
    
    అర్దరాత్రి, ఒంటరితనం, తనమూలంగానే ఇదంతా జరిగిందన్న బాధ ప్రబంధనెంత కదిలించాయీ అంటే, ఆమె కళ్ళల్లో నీళ్ళు నిలిచాయి.
    
    అసలు దేనికీ జంకే అలవాటులేని తత్వం గల అమ్మాయి ప్రబంధ. ఇక్కడ ఆమె బాధపడుతున్నది తన ఉనికి అంగీకరించి క్రమంగా తనకు దగ్గరవుతున్న ఆదిత్య మనసుపైన ఈ సంఘటన ఎలాంటి ప్రభావాన్ని చూపించేదీ అర్ధంకాక.
    
    "బాస్టర్డ్స్!" అలా తిట్టుకున్నదెవర్నో ఆమెకీ తెలీదు. ఉక్రోషంగా మంచంమీద చతికిలబడింది.
    
    సమస్యని పరిష్కరించాలీ అంటే ఎక్కడినుంచి ప్రారంభించాలీ అని ఆమె ఆలోచిస్తున్న సమయంలో సౌదామిని వచ్చింది గదిలోకి.
    
    అంతే! ప్రబంధ నిగ్రహించుకోలేకపోయింది. అది ఉద్విగ్నతో, లేక వెంటనే ఏమీ చేయలేకపోయినందుకు ఉడుకుమోత్తనమో అశ్రుసిక్త నయనాలతో చెప్పేసింది జరిగిందంతా.
    
    "తెలుసు ప్రబంధా! ఇలా జరుగుతుందని ముందు తెలియబట్టే మీ అన్నయ్యని వెంటాడుతూ ఇలా వచ్చాను."
    
    "అంటే ఇదంతా చేయించింది అన్నయ్యా?" విభ్రమంగా అడిగింది.
    
    "కాదు.... మీ నాన్న!" నిశ్చలంగా అంది సౌదామిని. "నీకు తెలియకుండా నీ పెళ్ళి నిశ్చయించిన మీ నాన్న మార్గంలో ముళ్ళని ఇలా ఏరిపారేయమని మీ అన్నయ్యని నియమించాడు."
    
    ప్రత్యర్ధి స్థానంలో తండ్రి నిలబడ్డాడని తెలిసి కొద్దిగా జంకింది ప్రబంధ. ఎప్పుడో ఆ స్థితినీ ఎదుర్కోవాల్సి వస్తుందనుకుంటే అప్పుడే తనూ రంగంలోకి దిగిపోయాడు.
    
    "ఇప్పుడు ఆదిత్యనేం చేస్తారు?"
    
    ప్రబంధలో ఈ మాత్రం వెసులుబాటు" చాలు దూసుకుపోవటానికి. సౌదామిని కోరిందీ అదే- "నిజమైన తీవ్రవాది కాని ఆదిత్యని కస్టడీలోకి తీసుకున్నది అడ్డం తొలగించుకోవాలనే ప్రబంధా!"
    
    "అంటే."
    
    "బహుశా చంపేసి ఎన్ కౌంటర్ లో చనిపోయాడంటారు."
    
    "ఆంటీ!" కంపించిపోతూంది ప్రబంధ.
    
    "ఇది జరుగుతున్న చరిత్రేగా ప్రబంధా! పైగా ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఇలాంటివి నిర్వహించడం సమస్యకాదు."
    
    "నో... అలా జరగటానికి వీల్లేదు!" రొప్పుతూ కాదు, జలజలా రాలుతున్న కన్నీళ్ళను తుడుచుకుంటూ అంది. "జరగనివ్వను!"   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS