Previous Page Next Page 
ఆలింగనం పేజి 93


    "అలాగే...అలాగే...మీరేం దిగులుపడకండి. వెళ్ళాక తెలియపరుస్తాం" అన్నాడాయన.

 

    అమ్మ కూడా అభ్యర్థనగా చూసింది.

 

    శ్యాం టాక్సీ కదిలేటప్పుడు కిటికీలో నుండి నాకు చెయ్యి వూపాడు. నేనూ ప్రతిగా చెయ్యి వూపాను.

 

    లోపలికి రాగానే అక్కా, అమ్మా ప్రశ్నల వర్షంతో ముంచెత్తారు.

 

    "ఏం మాట్లాడాడే? నచ్చావన్నాడా? నువ్వేం చెప్పావు? తిక్కగా ఏం చెప్పలేదు కదా!"

 

    "నెల రోజుల్లో ఏ సంగతీ చెపుతానన్నాడు" అబద్ధం చెప్పాను.

 

    "నెలా? ఎందుకూ?" అమ్మ తెల్లబోయింది.

 

    "ఈ నెల రోజులూ కలిసి తిరుగుదామన్నాడా?" అక్క ఆరాగా అడిగింది.

 

    "ఊహూ! ఒకళ్ళని ఒకళ్ళం చూసుకోం" చెప్పాను.

 

    అది నిట్టూర్చింది.

 

    అమ్మ మాత్రం ఆశగా "అతనికి నువ్వు నచ్చావని అతని మొహమే చెపుతోంది. వెళ్ళేప్పుడు ఎంత ఇదిగా చెయ్యి వూపాడనీ..." అంది.

 

    "అవును. నవ్వుతూ చెయ్యి వూపాడు" అంది అక్క.

 

    నాన్న లోపలికి వచ్చి "నా బంగారు తల్లి నచ్చకపోవడం ఏవిటే? ముందు నీ సంగతి చెప్పమ్మా. అతను నీకు నచ్చాడా?" అని అడిగాడు.

 

    నేను జవాబు చెప్పలేదు. లోపలికి వెళ్ళిపోయాను.

 

    అది అంగీకార సూచకంగా వాళ్ళు అర్థం చేసుకుంటారని నాకు తెలుసు! కానీ... అంతకన్నా ఏం చెయ్యనూ?


                                                          *  *  *


    "సన్ డే రాలేదే?" విక్కీ అడిగాడు.

 

    "పని పడింది" చెప్పాను.

 

    "ఏవిటో అంత పని?" అడిగాడు.

 

    "నాకు పెళ్ళివారొచ్చారు" చెప్పాను.

 

    అతడు ఉలిక్కిపడినట్లు చూశాడు.

 

    "నిజంగానా?"

 

    "ఔను!"

 

    "ఏమన్నారూ?"

 

    "నచ్చానన్నారు"

 

    "కంగ్రాట్స్" అన్నాడు.

 

    "అంటే...వాళ్ళకి నేను నచ్చితే చాలా! నాకు అతను నచ్చఖ్కరలేదా?" అడిగాను.

 

    అతను వెంటనే "అతను నీకు నచ్చాడా?" అన్నాడు.

 

    "నచ్చాడు" అన్నాను.

 

    అతను వెనక్కి జార్లగిలబడి "మరింకేం?" అన్నాడు.

 

    "నచ్చితే పెళ్ళిచేసుకోవాలని రూలేం లేదు" అన్నాను.

 

    "చేసుకోవా?" అడిగాడు.

 

    "ఊహూ!" చెప్పాను.

 

    "ఎందుకు?" అడిగాడు.

 

    "విక్కీ...నేనూ లిల్లీ కర్నూలు ఎందుకు వెళ్ళామో తెలుసా?" అడిగాను.

 

    "మీరు చెప్పలేదుగా!"

 

    "నువ్వు అడగలేదుగా, ఓహో... అమెరికన్ కల్చర్ కదూ!" అని నవ్వి, చంద్ర గురించి మేం చేస్తున్న ప్రయత్నాలన్నీ విడమర్చి చెప్పాను.

 

    వింటున్న అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి!

 

    "మైగాడ్! మనిషిని కూడా చూడకుండా అతన్ని పెళ్ళి చేసుకోవడానికి నిర్ణయించుకున్నావా? నీకు పిచ్చా" అరిచాడు.

 

    "నీకు తెలీదు నాకు మా చిన్నక్క అంటే ఎంత ఇష్టమో! అతనిలో మా అక్కని చూసుకుంటాను" అన్నాను.

 

    "యూ ఆర్ ఏ ఫూల్" కోపంగా అన్నాడు.

 

    "ఒప్పుకుంటాను. అతను నన్ను చేసుకోవడానికి అసలు ఇష్టపడాలి కదా!" అన్నాను.

 

    "ఆముక్తా...నీ వయసుకి ఇలాంటి పిచ్చి ఊహలు రావడం సహజమే. కానీ ఇది జీవితం... సినిమా కాదు! కల్పనల్లో కథల్లో జీవించలేము. వాస్తవంలోకి రా... ఏ ఒక్క వ్యక్తి ఇష్టాలూ, అభిరుచులూ ఇంకో వ్యక్తిలో పర్ ఫెక్టుగా మేచ్ అవవు! మీ అక్క ప్రేమించినవాడు నీకు కూడా నచ్చడం అసంభవం!

 

    డైరీలో మీ అక్క అతని గురించి అద్భుతంగా రాసినంత మాత్రాన అతను అద్వితీయమైపోడు! ఒకవేళ అతనిలో ఈ మూడేళ్ళూ... ఎన్నో మార్పులు తీసుకొచ్చి మారిపోయి వుంటేనో! బట్టతలతోనో... ఒళ్ళంతా బొల్లితోనో వుంటేనో అంగీకరిస్తావా? చెప్పు..." ఇరిటేట్ అయి అరిచినట్లుగా మాట్లాడాడు.

 

    నేను నవ్వి "అలా అవదు. అతను అంత అద్భుతంగానూ వుంటాడని నా సిక్త్ సెన్స్ చెపుతోంది!" అన్నాను.

 

    విక్కీ నావైపు జాలిగా చూశాడు.

 

    "ఇండియన్ బిలీవ్ ఇన్ మిరకిల్స్" అన్నాడు.


    
    "ఔను!" అన్నాను.

 

    "ఆముక్తా..." అతను ఠక్కున లేచి నా భుజాలు పట్టుకుని నన్ను పైకి లేపాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS