"మీ వృద్ధజంబుకం నీకివ్వొద్దనడు కదా__"
"కొత్త పరిపాలక రాంరెడ్డి యేం చేస్తాడో!" అని సిగరెట్ వెలిగించాడు రామ్మూర్తి.
"సీతమ్మతల్లీ నను బ్రోవామనీ చెప్పవే" అని రాగయుక్తంగా అని "హోండిపార్ట్ మెంటుకి యాక్సెస్ చూడు అన్నట్లు అనంతరెడ్డి కూడా అప్లయ్ చేస్తున్నాడు. ఫిజిక్స్ లో ఒక పోస్టు వుంది." అన్నాడు వరాహశాస్త్రి.
దర్భా వీరభద్రరావు, మరో యిద్దరు వచ్చారు. వీరభద్రరావు యం.ఏ. పూర్తిచేసి రీసెర్చిలో చేరాడు.
రామ్మూర్తి సినిమా బొమ్మలు చూస్తూ, "చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నదీ, దాని అందమంత చీరలోనె వున్నదీ." అంటున్నాడు.
"చాలా డేమేజింగ్ స్టేట్ మెంటోయ్ రామ్మూర్తీ. చీరలోనేనా?" అని కొంటెగా చూసి, "చీర లోపల కాదన్నమాట!" అన్నాడు శ్రీపతి.
"హాహా" అని వరాహశాస్త్రీ "హీఁహీఁ" అని రామ్మూర్తీ నవ్వారు.
"చెంగావి రంగుచీర నే హైస్కూల్లో వున్నప్పుడే చిరిగిపోయింది" అని ఓ పేపరు అందుకుని బొమ్మలు చూస్తూ, "ఆరేసుకోబోయి పారేసుకున్నాను__ కోకెత్తి కెళ్ళింది కొండగాలీ__" అని మొదలెట్టాడు వీరభద్రరావు.
"ఆ రాజమండ్రి జయబాల పారేసుకోటానికే ఆరేసుకుందిట" అన్నాడు శ్రీపతి.
"మ్యాట్నీ ఆలోచనలో వున్నాను." అన్నాడు వీరభద్రరావు సిగరెట్ దమ్ము లాగుతూ.
"యే సినిమాకి?" అన్నాడు వొకతను.
"అదే చూస్తున్నాను" అని, సినిమా ప్రకటనల పేజీలు తిరగేస్తున్నాడు వీరభద్రరావు.
ఎదురీత, చిలకమ్మ చెప్పింది, దీదార్. అలాప్, పారిస్ ఐ లవ్ యూ...
"స్వామికి గానీ, వూరుమ్మడి బతుకులుకి గానీ వెళ్ళండి__ నేను క్రితం వారం చూశాను" అన్నాడు శ్రీపతి.
"ఆ గిరీష్ కార్నాడ్ ఫిలాసఫర్లాగా వుండి బోరు కొడతాడు. కాగా నాకు హిందీ సరిగా అర్థమై చావదు" అన్నాడు వీరభద్రరావు.
"బొమ్మలు చూడడానికి భాష అక్కర్లేదు. అందరూ అర్థమయ్యే ఇంగ్లీషు సినిమాలు చూస్తున్నారా?" అన్నాడు రామ్మూర్తి.
"వూరుమ్మడి బతుకులెట్లా వుంటుంది?" అన్నాడు వీరభద్రరావు.
"మనుచరిత్రలా వుండదు దర్బారావుగారూ!" అన్నాడు శ్రీపతి.
"ప్రంచద్భూషణ బాహుమూల రుచితో__వరూధిని బాహుమూల రుచితో." అన్నాడు వరాహశాస్త్రి.
"నాకు తెలుగు సరిగా రాదు__ బాహుమూల రుచి అంటే యేమిటి మిస్టర్ వీరభద్రరావు" అన్నాడు రామ్మూర్తి.
"బాహుమూల అంటే చంక. చంక రుచండీ" అన్నాడు వీరభద్రరావు.
"చంక రుచా? యెట్లా వుంటుందిట?" అన్నాడు వరాహశాస్త్రి.
"ముసలి పెద్దనార్యుడు అంత లోతుకి దిగలేకపోయాడు. చంకల రుచీ అరవై తొమ్మిదంకె భంగిమలదాకా పోలేదు. రుచి అంటే కాంతిట." అన్నాడు శ్రీపతి.
"వస్తానండీ." అని జారుకున్నాడు వీరభద్రరావు.
"తెలుగులో రీసెర్చి స్కాలర్లమంటారు. తెలుగు కూడా రాదేం వీళ్ళకి! యీ కుర్రాడు మావూరి అబ్బాయి. వీళ్ళ నాన్న చిన్నప్పటినుండీ వేదం భట్టీయం వేయించాడు ఇతనిచేత. అమరం వల్లించి వుంటాడు." అన్నాడు వరాహశాస్త్రి.
"తెలుగు కూడా రాదేం, అంటే__ మరొక భాష యేదైనా వచ్చుననా! బట్టీపడితేనూ వల్లిస్తేనూ భాష రాదు. అనుభూతిస్తూ చదివితే వస్తుంది. డిగ్రీలకోసం చదువులు. ఏదీరాదు, డిగ్రీ తప్ప." అన్నాడు శ్రీపతి.
కులశేఖరరావు వచ్చాడు. "హలో శ్రీపతి!" అన్నాడు వుత్సాహంగా.
"రా రా కులశేఖరా. కొన్నాళ్ళు గంగి గోవుపాలు గరిటెడైనా చాలు. కొన్నాళ్ళు గాడిదపాలు వుద్ధరిణెడైనా చాలు. వుచ్చ ఐతే రెండు బొట్లు. మొరార్జీ భాయ్ అని పిలూ మోడీ వాయించేస్తున్నాడు. యూరిన్ థెరపీ పనికొస్తుందంటావా?" అన్నాడు శ్రీపతి.
"పిబరే రామరసం పిబరే మూత్రరసం." అన్నాడు వరాహశాస్త్రి రాగయుక్తంగా.
"మీ వాజ్ పేయీ యీ వుచ్చ పోటీలో లేడనుకుంటాను?" అన్నాడు శ్రీపతి.
"వాజ్ పేయీ మూర్ఖుడు కాదు." అన్నాడు కులశేఖరరావు.
"బాబూ జగజ్జీవనుడింకా చేరలేదు మీ జనతాలో. ఐనా మంత్రిగా చేర్చుకున్నారు?" అన్నాడు రామ్మూర్తి.
కులశేఖరరావు అందుకున్నాడు. "పేదల పాలిట పెన్నిధి, కారణజన్మురాలు__అని పాదపూజచేసినవాడు, ఎమర్జన్సీ బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రముఖుడు లక్షల రూపాయల పన్ను ఎగవేసిన ప్రబుద్ధుడు_ యిప్పుడు, సంపన్నురాలు ఆమెకేం తెలుసు ప్రజల సమస్యలు_ అంటున్నాడు జనతా ప్రభుత్వం యింకా స్థిరీకరణ చెందలేదట! అంటే వీణ్ని ప్రధానిని చెయ్యాలని ధ్వని. యెప్పుడు ఏం చెయ్యాలో నాకు తెలుసు_ అంటున్నాడు. ఆ మాట నిజం! పూచికపుల్ల కూడా జారపోనివేళ ఇందిర నుండి విడిపడి రొట్టె విరిగి నేతిలో పడ్డట్టయ్యాడు. వుచ్చ నీచాలు తెలియకుండా గద్దెక్కనిస్తే యెట్లా? అసలు జనతా యెవరిది? వాజ్ పేయీది. ఆ తరవాత చరణ్ సింగ్ ది. ఆ పరిసరాలలో మురార్జీ. యీ లెక్కన చూస్తే వాజ్ పేయీ ప్రధాని అవడం సమంజసం__"
"ఫెర్నాండెజ్ ని మర్చిపోయావు!" అన్నాడు శ్రీపతి.
"ఫెర్నాండెజ్ లెఫ్పిస్టు. టెర్రరిస్టు. కార్మికుల్ని రెచ్చగొట్టి గొప్పవాడవటానికి చూస్తుంటాడు. సంకరం. యేదో మినిస్ట్రీలో చోటు వుంది. దాంతో సంతోషించి మౌనంగా వుండిపోవాల్సినవాడు"
"ఇందిరది స్లోగన్ డిప్లొమసీ ఐతే జనతాది కమీషన్ల డిప్లొమసీ అని జనవాక్యం__" అన్నాడు శ్రీపతి.
జనతాది కమీషన్ల డిప్లొమసీనా! జెలసీతో అనేమాట అది. ఆ చేసిన ఎమర్జన్సీ ఘాతుకాలకి మరొక ప్రభుత్వం ఐతే మరుసటిరోజున అరెస్టు చేసి జైల్లో పడేసి వుండును__" అని చెప్పుకుపోతున్నాడు కులశేఖరరావు.
