స్వప్నరాగలీనకి తల్లికంటే తండ్రి, బాబాయి యెక్కువ యిష్టం. అనంత్ రెడ్డికి తల్లితండ్రులిరువురూ సమానంగా యిష్టం. విపరీతమైన ఎటాచ్ మెంటు లేదు. అతనికున్న అటువంటి అనుబంధం వొకేవొకటి. అది స్వప్నరాగలీనతో, అదీ అమితంగా.
ఈ వైద్యుడు అతనిని అడిగీ అడిగీ అన్నీ తెలుసుకుని, సైకో యెవలిటిక్ ప్రోసెస్ లో కొన్ని అంశాలు రాబట్టీ తదితర విధాలద్వారా మరికొన్ని విషయాలు రాబట్టీ చివరికి అనంత్ రెడ్డిని అడగటం మాని__ స్వప్నరాగలీనని వొంటరిగా కూర్చోబెట్టి వాళ్ళిద్దరి పరిచయాల దగ్గిర్నుంచి అన్నివిషయాలూ అతి సూక్ష్మ వివరాలతో సహా చెప్పించుకున్నాడు. అవన్నీ నోట్ చేసుకున్నాడు.
"యిదంతా ప్రోసెస్ చేసి ఓ దారికి తెచ్చిచూడాలి. మీరు ఒకవారం అట్లా సైట్ సీయింగ్ కి ఇట్టే వెస్టర్న్ నార్త్ కి వెళ్ళిరండి అన్నాడు.
వారం తరవాత తిరిగి వెళితే, అనంత్ రెడ్డిని ఒంటరిగా కూర్చోబెట్టి "మీకు డివినిటీ మీద నమ్మకం వుందా?" అన్నాడు. "నమ్ముతాను ప్రత్యేకం తెలియదు. నాస్తికుణ్ని కాదనుకుంటాను" అన్నాడు. ఆ తరవాత ఆమెకి వంటరిగా చెప్పాడు ఆ డాక్టరు__"మీరు అతనితో కాస్త చీప్ గా వల్గర్ గా, అతను అసహ్యించుకునేటట్లు ప్రయత్నించండి అప్పుడప్పుడు" అని. "మీ వుద్దేశం ఏమిటి? నేను తనని వదులుకోవాలనుకోవటం లేదు. ఏదెలా వున్నా మేమిద్దరం విడిపోవటం అసంభవం" అంది. "నా వుద్దేశం అది కాదమ్మా. మీరు సమస్యతో యిట్లాగే జీవితం వెళ్ళబుచ్చకుండా వుండటానికి సమస్య నుంచి బయటపడటానికే చెప్తున్నాను. అట్లా ప్రయత్నించి చూడండి" అన్నాడు.
హైదరాబాద్ తిరిగివచ్చిన కొద్దిరోజులకి ఒకనాడు స్వప్నరాగలీనకి ఓ ఆలోచన తట్టి, "మీరు ఓ వేశ్యతో ప్రయత్నించి చూడండి" అంది.
"షటప్" అన్నాడు అనంత్ రెడ్డి చటుక్కున.
"నా మాట వినండి. అందులో పోయేదేం లేదు. యీ సమస్య సరిష్కారం అవటమేగా కావాలి. యెందుకో నాకు యీ ఆలోచన వచ్చింది. నా మాట విని ప్రయత్నించి చూడండి" అని నచ్చచెబితే__
"టెస్టింగ్ వరకే. ఐ వాంట్ డు యిట్ విత్ ఎనీ వన్ యెల్స్" అన్నాడు.
"సరే. టెస్టింగ్ వరకే చూడండి" అంది.
ఓరోజు ఓ ఖరీదైన హోటల్లో బసచేసి ఓ వేశ్యని ఎన్నుకున్నాడు. మాటల్లో పెట్టి "నన్ను చలింపజేసి లొంగదీసుకోగలవా?" అన్నాడు.
"నిన్నేంటి నీ బాబుని కూడా లొంగదియ్యగలను" అంది ధీమాగా.
వయసు మళ్ళిన ధనవంతుల్ని రెచ్చగొట్టి మెప్పించి బోలెడు డబ్బు గుంజే మహా నేర్పరి వేశ్య ఆమె.
అనంత్ రెడ్డిని కవ్వించి రెచ్చగొట్టటానికి ప్రయత్నించింది. మొదట్లో అతనికి అసహ్యం వేసింది. కాసేపటికి ఆ స్పర్శలో ఆ కదలికల్లో వొంటి విరుపుల్లో చేష్టల్లో పరిసరాలు మర్చిపోయాడు. తన నేర్పునంతా వుపయోగించి అతనిని రెచ్చగొట్టింది.
"నువ్వు చాతకాని అసమర్దుడవని యెవరా అనేది! సి ఇట్ ఈజ్ యాజ్ రెడీ యాజ్ ఎనీథింగ్ ఇట్స్ వండర్ ఫుల్......" అంది.
"థాంక్యూ. ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ టెస్టింగ్..... ..... .....యు విల్ బి హ్యాండ్ సమ్ లీ పెయిడ్" అని బట్టలు వేసుకుని బయటకు వచ్చాడు.
ఇంటికొచ్చి జరిగిన విషయం చెప్పాడు. కానీ ఆ రాత్రికి మార్పేమీ లేదు.
దిగులుగా కూర్చుంటే, "రేపు వెళ్ళి ఆ కాస్తా కూడా కానిచ్చి చూడండి" అంది.
"అందువల్ల వొరిగేదేమిటి? ఫిజియొలాజికల్ కాదనీ ఈడిసస్ కాంప్లెక్స్ కాదనీ తెలుస్తూనే వుంది. ఇంకా మంచి నిపుణుణ్ని ఎవరినన్నా కలుసుకుని సంప్రదించటం మంచిది" అన్నాడు అనంతరెడ్డి.
అతని నుదుటిమీద ఆప్యాయంగా పెదాలు అద్దింది. అతని కళ్ళల్లో తడి వుబికింది.
113
క్రితం నెల జూలైలో ఓ రోజున వున్నట్లుండి పెయింటింగ్ సామగ్రి అంతా కట్టకట్టేశాడు శ్రీపతి. యల్.యల్.బి.కి అప్లయ్ చేశాడు_ సీటు వచ్చింది. చేరిపోయాడు. ఇల్లు ఖాళీచేసి వచ్చి హాస్టల్లో చేరాడు. ఇనప మడత మంచాలూ కుర్చీలూ అవీ రమాదేవి యింట్లో పడేశాడు వాడమని. పెయింటింగ్స్ అన్నీ చుట్టచుట్టి ఆ కట్టా, పుస్తకాలు, పరుపు చుట్టా గట్రా తీసుకుని హాస్టలు గదికి వచ్చేశాడు.
"మిత్ర జనరంజక శ్రీపతే, వుత్తిష్ఠ, వుత్తిష్ఠ, ఉస్మానియా జ్ఞాన శార్దూలే తవ శుభాపరాహ్ణం" అంటూ వరాహశాస్త్రి వచ్చి లేపితే లేచాడు శ్రీపతి.
వరాహశాస్త్రికి పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ వచ్చింది __ ఆ మధ్య.
"పన్నెండున్నరవేళ యేమిటీ నిద్ర? యిటు భోజనా త్పూర్యము కాదు అటు భోజనానంతరమూ కాదు. లెమ్ము. మన రామ్మూర్తి వేంచేశాడు." అన్నాడు వరాహశాస్త్రి.
"యెక్కడ?" అన్నట్లు చూశాడు శ్రీపతి.
"ముందు హాల్లో పేపర్లు చూస్తున్నాడు__ సినిమా బొమ్మేదో నిలేస్తే__" అని నవ్వి, "భోజనానికి వెళ్ళిరా" అన్నాడు.
"ఆకలిగా అనిపించటంలేదు" అని బాత్రూంలోకి వెళ్ళివచ్చాడు శ్రీపతి. చారల పైజమా కమీజూ.
ఇద్దరూ హాల్లోకి వచ్చారు.
"హలో రామ్మూర్తీ. చాలా నెలల తరవాత కదా! కులాసా? లేదూ యివాళ?" అన్నాడు శ్రీపతి.
"వుంది. ఆఫీసూ ఆవకాయా లేకుండా ఆంధ్రప్రదేశ రథం నడవదు. వీళ్ళేదో వుద్యోగాలున్నాయని ప్రకటిస్తే అప్లయ్ చేద్దామని వచ్చాను. సోషియాలజీలో వొక పోస్టుంది." అన్నాడు రామ్మూర్తి.
"నీకు రాకుండా యెలా వుంటుంది! డాక్టరేట్ కూడా వచ్చేసిందిగా?" అన్నాడు శ్రీపతి.
"డాక్టరేట్ వుంటే ఐపోయిందీ. యింకా యెన్ని వుండాలీ!" అన్నాడు రామ్మూర్తి.
