Previous Page Next Page 
అనుక్షణికం -2 పేజి 89


    మంచంమధ్యన ప్రక్కగా మునగదీసుకుని పడుకుంది. ఆమె కళ్ళలో నీళ్ళు.
    అతను మంచం రెండో అంచుకి తిరిగి పడుకున్నాడు. ముఖం నూనెతో వొడిలింది.
    అలా రెండు గంటలు గడిచాయి.
    నిడుపుగా జరిగి అతనివైపుకి తిరిగి అతని వీపుచుట్టూ చెయ్యివేసి తనవైపుకి తిప్పుకుని చెంపకి చెంప ఆనించి "అనంత్" అంది.
    దుఃఖం అతని గొంతులోంచి పెల్లుబికింది. అతని పెదాలమీద అరిచెయ్యి వేసి అదిమి, "మీరు అలా ఇదైపోతే నేను భరించలేను" అంది. "స్వప్నా నాకు బతకాలని లేదు. చచ్చిపోతాను. ఆత్మహత్య చేసుకుంటాను. బతికే అర్హత లేదు నాకు" అతని గొంతు జీరపోయింది. కళ్ళలో తడి వుబికింది.
    చూపుడు వేలితో కళ్ళతడి తుడిచి, పైకి జరిగి నుదుటిమీద పెదాలు అద్దింది. అతను కిందికి జరిగి ఆమె వక్షంలో ముఖం దూర్చి వెక్కి వెక్కి పడుతున్నాడు. అతని వీపుమీద చెయ్యివేసి అనునయిస్తున్నట్లుగా చిన్నగా తట్టింది.
    "యే డాక్టర్నీ కనుక్కోలేదా?" అంది.
    "యిట్లా అని నాకు తెలియదసలు"
    "మరి?"
    "పదిపన్నెండేళ్ళ నుండి ముఖ్యంగా పదిహేను పదహారేళ్ళ నుండి రకరకాల ఆలోచనలు వూహలు __ కొన్ని కొన్ని బొమ్మలు సినిమాలు చూస్తున్నప్పుడు ఇట్లా కాదు, సడన్ గా లేచి వెళ్ళాల్సివస్తే జేబులో చెయ్యి పెట్టుకుని నొక్కిపట్టి వెళ్ళాల్సి వచ్చేది. యిట్లా యెందుకైనదో_"
    "మరి?" అని, అతనిని దగ్గరికి తీసుకుని పెదాలకి పెదాలు కలిపి....
    అదే మాధుర్యపు ధార, సంగీతం లాంటి మాధుర్యపు ధార. సంగీతం నెత్తురుగా, నెత్తురు సంగీతంలం, సంగీతపు నెత్తురు, నెత్తురు సంగీతం, తేనెలా మారి నరాలలోకి ప్రవహిస్తున్నట్లు__
    చేతుల్తో కాళ్ళతో పెదాలతో కళ్ళతో స్తనాలతో నాలికతో వేళ్ళతో కదలికలతో అతనిని రెచ్చగొట్టింది. అతను వుద్వేగంగా చలించాడు. కానీ_
    ఆ చలింపు ఆ ఉద్రేకం మనసులో ఛాతీలో ఆగిపోయింది.
    వొకచేత్తో వొడిలిన నుదుటిమీదా, రెండోచేత్తో_ తపతపా బాదుకున్నాడు. తటాలున తన రెండు చేతులతో అతని చేతుల్ని పట్టుకుని "ప్లీజ్ మీరు బాధపడకండి. మీరు బాధపడటం నేను సహించలేను" అంది.
    ఐదు నిమిషాలు.
    "ఇంతకుముందు కూడా యింతేనా?" అంది.
    "నువ్వు తప్ప నాకెవరూ తెలియదు స్వప్నా" అని బావురుమన్నాడు.
    "ఓదార్చుతూ, "వెనక ఉద్రేకం పడినప్పుడు యిలా కాదన్నారు?" అంది.
    "అది వూహల్లో మనుషులతో కాదు. నాకెప్పుడూ యెవరూ తెలియదు. నిన్ను చూసినప్పటి నుండి నా మనసంతా నీతో నిండిపోయింది...." అని ఒకక్షణం ఆగి, "నేను వ్యర్దుణ్ణి, నీ జీవితాన్ని నాశనం చెయ్యను. విడాకులు తీసుకుందువు...."
    అతని నోటిమీద చెయ్యి అదిమి, "యేదో కారణం వుంటుంది. రేపూ ఎల్లుండీ ప్రయత్నిద్దాం. యిలాగే జరిగితే __ సిటీలో నిపుణుల్ని సంప్రదించుదురు"
    "ఇంకా నీ హృదయంలో నాకు చోటుందా స్వప్నా!"
    "నా హృదయంలో మీకు చోటేమిటీ__ అర్ధంలేని మాట! ఈ హృదయం మీది ఎప్పుడైందో అప్పటినుంచీ యెప్పటికీ మీదే. యిది అనంత హృదయం" అంది.
    ఆమె వక్షంలో తలదూర్చి వెక్కివెక్కి పడుతున్నాడు. ఆమె కళ్ళలో నీళ్ళు. అతనికి తెలియకుండా తుడుచుకుని అతని నుదుటిమీద పెదవులు అద్ది వీపుమీద చెయ్యి వేసి "యిక నిద్రపోదాం యివాల్టికి" అంది.
    గోడమీద ఫోటోగ్రాఫులాగా, మంచంమీద వాళ్ళిద్దరూ.
    ఆ తరవాత రెండు రాత్రులు కూడా అంతే. అతను వూరు ప్రయాణం అవుతూంటే, ఆ మానసిక స్థితిలో వొంటరిగా వెళ్ళటం భయం అనిపించి "యిద్దరం తిన్నగా సిటీకి వెళదాం రేపు. మా వాళ్ళతో హనీమూన్ కి వెళ్ళాలనిపిస్తోంది__ అని చెబుతాను" అంది.
    అంతకుముందు వాళ్ళ హరనాధ బాబాయి హనీమూన్ మాటెత్తితే "సంప్రదాయకంగా అన్నీ యిక్కడే జరిపించండి పాలు తేనె జాబిలీ అన్నీ యిక్కడే వున్నాయిగా" అంది.
    మరుసటిరోజు బయల్దేరి సిటీకి చేరుకున్నారు.
    యీ సమస్య గురించి శ్రీపతిని అడుగుతానని అనంత్ రెడ్డి అంటే, "దయచేసి తెలిసినవాళ్ళని యెవరితోనూ అనకండి. యీ వూళ్ళో డాక్టర్లని కూడా అడగొద్దు. ఏ బాంబేనో వెళదాం" అంది. రెండు రోజుల తరవాత బొంబాయి ప్రయాణం. కూడా వెళ్ళింది. అతనిని వొంటరిగా వదలాలంటే ఆమెకు భయంగా వుంటోంది.
    యెవరిని సంప్రదించాలో తెలుసుకోవటానికి నాలుగురోజులు పట్టింది.
    "పుట్టుక నుండీ చిన్నప్పటినుంచీ ఐతే వేరే సంగతి. కాగా ఫిజియో లాజికల్ గా మాకేమీ లోపం కనిపించడంలేదు. మానసిక వైద్యులకి చూపెట్టండి__" అన్నారు ముగ్గురు నిపుణులు పరస్పరం సంప్రదించుకుని.
    వొకతనికి చూపెడితే, "మీరు మానసికంగా చాలా నార్మల్ గా వున్నారు. అట్లా జరగటానికి తగిన అంశం కనపడటంలేదు" అన్నాడు _ మూడు వారాలపాటు ప్రశ్నలతో పరిశీలనలతో హింసించి.
    మరో అతనికి చూపెడితే, "ఫలానా వ్యక్తిని సంప్రదించండి" అని చెప్పాడు.
    వారంరోజులు వరసగా ప్రశ్నించి, వివరాలు అడిగి, చివరికి "మీరు మీ భార్యలో మీ తల్లిని చూస్తున్నారు. దీన్ని యీడిపస్ కాంప్లెక్స్__ అంటారు. మీ అమ్మ అంటే మీకు ఇష్టమేనా?" అన్నాడు.
    "అమ్మ అంటే అందరికీ యిష్టం వుంటుంది, కొందరికి బాగా ఎటాచ్ మెంటు కూడా వుండొచ్చు. అంతమాత్రంచేత అది ఆ సమర్ధతని పోగొడుతుందా?" అని అడిగింది స్వప్నరాగలీన.
    "అతని తల్లి రూపమూ మనసూ మీలాగా వుండివుంటుంది. అట్లా వున్నప్పుడు...."
    "యిద్దరికీ యెందులోనూ పోలికేలేదు" అన్నాడు అనంత్ రెడ్డి.
    "సర్వసామాన్యంగా జనం యీడిపస్ కాంప్లెక్సు గురించి అనుకునేలాగా ఎటాచ్ మెంట్ నీ కాంప్లెక్స్ నీ వొకటి చేసి అవగాహన చేసుకోవటానికి యత్నించాడు ఆ వైద్యుడు.
    యింకో నాలుగురోజులకి మరో వైద్యుడికి చూపెడితే .... వారంరోజులు చిన్నప్పటినుంచీ జీవితంలోని అన్ని అంశాలూ నోట్ చేసుకుని విశ్లేషించాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS