కాని ఆ క్షణంలో కలవాల్సింది సోఫియా కన్నా వినీలే అనిపించింది.
* * * *
అర్థరాత్రి గడుస్తున్న సూచనగా దూరంగా క్లాక్ టవర్ పన్నెండు గంటలు కొట్టింది. నిదుర మునిగిన నడి రాత్రిలో బంజారా హిల్సు ప్రాంతం ప్రకృతి గుండెలపై దాచుకున్న కుంపటిలా వుంది.
ఎదగోడల బాకుల మధ్య ఉక్కిరిబిక్కిరయ్యే ఊపిరితిత్తుల్లా గాలి మంద్రంగా వీస్తున్న సమయంలో శశాంక నిర్మానుష్యంగా వున్న రోడ్డుపై నడుస్తూ జయచంద్ర భవంతిని సమీపించాడు.
అంతటా నిశ్శబ్దం... సుమారు పదిహేను అడుగుల ఎత్తులో వున్న కాంపౌండ్ వాల్ దాటితే తప్ప జయచంద్ర సామ్రాజ్యంలో అడుగుపెట్టలేడు... చుట్టూ చూశాడు. ఆలోచించుకునే వ్యవధిలేదు... ఏ పోలీస్ పెట్రోలింగ్ వేన్ అయినా రాకముందే నిర్ణయం తీసుకోవాలి... సరిగ్గా ఆ సమయంలో అతడికంట బడింది గోడకి ఆనుకుని వున్న ఓ టెలిఫోన్ వైరు...
నిద్రకి ఏనాడో వెలియై భ్రాంతిలాంటి సుఖంలో బ్రతుకుతూ అదే జీవితమని భ్రమపడుతున్నానని అప్పుడప్పుడూ అనిపించే అంతరాత్మను నొక్కి చాలా రోజులైంది. నడిరాత్రి కడలి ఒడ్డున కెరటాల హోరుతో శృతి కలిపే ఝంఝా మారుతాన్ని తన ఊపిరిగా మార్చుకున్న శశాంక నుంచి వేడి సెగలు ఆవిర్లలా ఉబుకుతున్నాయి.
రెండున్నర నిముషాల వ్యవధిలో స్తంభానెక్కి గోడ పైకి వచ్చిన శశాంక చేతికి ఓ గాజు గుచ్చుకుని గాయం చేసింది... ఉబికిన రక్తాన్ని చూసుకోలేదు... నెమ్మదిగా దుమికాడు. ఓ సన్నజాజి చెట్టు మాటున అన్ని పరిసరాల్ని గమనించాడు. విశాలమైన ఆవరణలో పూల మొక్కల గాలి మెర్క్యురీ వేపర్ కాంతుల వెన్నెల్లా... ఎక్కడా అలికిడి లేదు... పైన ఓ గదిలో బెడ్ లైటు వెలుగుతూంది. నెమ్మదిగా ప్రాకుకుంటూ వాటర్ పైప్ ని చేరుకున్నాడు. ఇక్కడ శశాంకకి తను ఎవర్ని కలుసుకుంటున్నదీ తెలీదు. కలవాలనుకుంటున్నది వినీలని మాత్రమే. ఒకవేళ పొరపాటున మరెవర్ని కలుసుకోవాల్సి వచ్చినా అతడు తెగించి వుండడంతో ఎలాంటి భయమూ లేదు.
చేతులు పట్టుదప్పిపోతున్నా పైపు పై నుంచి ప్రాకుతూ మొదటి అంతస్థులోని అద్దాల కిటికీని ఓ చేత్తో పట్టుకుని ఒడుపుగా డాని ఎడ్జ్ పైకి దుమికాడు.
ఆ చప్పుడికి కర్టెన్స్ ఆవలిగా ఎవరో కదిలిన అలికిడైంది. ఒక్క ఉదుటున లోపలికి చొచ్చుకుపోయి బెడ్ పై నుంచి లేవబోతున్న ఆకారం నోరు నొక్కాడు.
ఏదో మేగజైన్ చదివిన వినీల పది నిముషాల క్రితమే లైటు ఆర్పి నిద్రపోయే ప్రయత్నంలో వుంది.
శశాంకని చూసిన వినీల గొంతు పెగల్లేదు.
ఎలా రాగలిగాడు.
ఆమె నిశ్చేష్టురాలై చూస్తూ అడిగింది "ఎందుకొచ్చావు"
"నీ సహాయం కావాలి" నెమ్మదిగా అన్నాడు.
"దానికి అర్థరాత్రి రావాలా"
"తప్పని సరైంది వినీలా. రూపని మీ నాన్న కిడ్నాప్ చేయించాడు.
"ఏమిటీ" ఆమెకు అర్థం కాలేదు. "మా డాడీ కిడ్నాప్ చేయించారా"
జరిగిందంతా చెప్పాడు. రూపకీ తనకీ వున్న అనుబంధం గురించి. తనకొచ్చిన ఫోన్ కాల్, లెటర్ సంగతి క్లుప్తంగా వివరించాడు.
"నీకు మతిపోయింది శశాంక పూర్తిగా బేలెన్స్ కోల్పోయావు"
"వినీలా" శశాంక పిడికిళ్ళు బిగుసుకున్నాయి. "నాకు రూప కావాలి"
"ఏం" నవ్వేసింది "సోఫియా ఇక్కడే వుందని చెప్పి పంపిందా"
"నాకు రూపెక్కడుందో తెలియాలి"
"డాడీ బెడ్ మీద నుంచి కదలలేని స్థితిలో వుంటే మరేం పనిలేనట్టు పసికందుని కిడ్నాప్ చేయించారా"
"వినీలా నాకు రూప ఆచూకీ తెలియాలి"
"వెళ్ళి పోలీస్ కంప్లయింట్ చేసుకో..."
"వినీలా"
"మిస్టర్ శశాంకా" అర్దోక్తిలోనే ఖండించింది. "ఇలా నా గదిలోకి మరో మగవాడెవడైనా ప్రవేశించి వుంటే ఏం జరిగేదో నువ్వూహించలేవు... గో ఎవే."
"ప్లీజ్ వినీలా" శశాంక ఓర్పు నశించిపోతూంది.
"సోఫియా దగ్గర ట్రై చేస్తే..."
ఆమె వాక్యం ఇంకా పూర్తికానే లేదు... ఆమె చెంప పగిలి పోయింది. అదే చెంపని ఆ రోజు శశాంక కొరికింది. ప్రాణాలు జివ్వుమన్నాయి. కళ్ళలో నీళ్ళు గిర్రున తిరుగుతుంటే "వెళ్ళిపో" అంది తలవంచుకునే.
"వెళ్ళను. నాకు రూప కావాలి" ఆమె భుజాన్ని పట్టుకుని దగ్గరకు లాక్కోబోతుంటే అప్పుడు వినిపించింది ద్వారం దగ్గర అడుగుల చప్పుడు.
ప్రమాదాన్ని పసిగట్టిన శశాంక ఎంత మెరుపు వేగంతో వెనక్కి ఆగాడూ అంటే స్టెన్ గన్ బట్ తో తనను మోదబోయిన సర్కార్ ని చేరి గుండెలపై తన్నాడు.
బలవంతుడైనా సర్కార్ ఈ దెబ్బ ఊహించక పోవడంతో దబ్బున నేలపై పడ్డాడు.
