"సంతోషంగా వుందా"
"ఎందుకుండదు... ప్లాన్ చేసింది నేనే అయినప్పుడు"
"వ్హాట్?" ఓ క్షణం వూపిరి పీల్చడం మరిచిపోయింది సోఫియా. "నువ్వా"
"అవును సోఫియా - నేను ఢిల్లీ నుంచి రాగానే చేసిన మొదటి పని అదే. నా మనిషిని నీ హోటల్ రూం బుక్ చేసుకున్నాడు. అన్నట్టు అతనితో బాటు మా మందుల కంపెనీ మైక్రో బయాలజీ లాబ్ లో వుంటుందిలే 'బాటలిజం' అని అది కూడా పంపాను. రాత్రి భోజనం సగం తిన్నాక తక్కిన సగంలో అది కల్తీ చేసి డ్రమెటిక్ గా ఆ సీను సృష్టించాడు... నిజం చెప్పొద్దూ. పత్రికలో ఈ వార్త పబ్లిష్ అయ్యేదాకా గట్టిగా ఫాలో అయ్యిందీ నేనే సోఫియా. తర్వాత ఇదంతా ఫెబటేక్ అని నువ్వు నిరూపించుకోవచ్చు. కాని ఈలోగా నీ హోటల్ కు సరిపోయినంత చెడ్డ పేరు వచ్చినట్టే కదూ."
"గుడ్... దెబ్బ తీసావు"
"ఒప్పుకుంటున్నట్టేగా"
"ఏమని"
"నీకు సమఉజ్జీని అని"
"యా..." నవ్వింది సోఫియా రాక్షసంగా "రాత్రి శశాంక ఇల్లూ బ్లేస్ట్ చేయబడిన విషయమూ తెలుసుననుకుంటాను"
"ఊబిలో కూరుకుపోయాడెప్పుడో. నీతో చేతులు కలిపిన వాడికి ఇలాంటి ప్రమాదాలు తప్పవు"
"అప్పుడే శశాంక మీద మొహం మొత్తిందా"
"నీ మీద మోహం పెంచుకున్నాడు. అప్పుడే నాకు జుగుప్సనిపించింది"
"వెల్" స్థిరంగా అంది సోఫియా. "ఇప్పుడు నేనేం చేయబోతున్నానో తెలుసా?"
"చెప్పు"
"నువ్వు చూపించిన మార్గంలోనే నేనూ ఓ పథకం వేస్తున్నాను. సరిగ్గా ఇరవై నాలుగు గంటల్లో నీ మైక్రో బయాలజీ లాబ్ వుందే_ మందుల ఫ్యాక్టరీ_ అది మూతబడుతుంది."
"బీ బెడ్ రూంకాదది. మగాడు దొరగ్గానే మూతేయడానికి"
"షటప్"
"మహా శీలవతిలా ఏమిటా అరుపు"
"అరుపుకాదే వినీలా. నిన్నగాక మొన్న కళ్ళు తెరిచిన నీకే ఇంత అహం వుంటే ఇలాంటి వ్యవహారాల్లో తల పండిన నాకెంత వుండాలి. మరోసారి విను సరిగ్గా ఇరవై నాలుగు గంటల్లో కనీసం వెయ్యిమంది ప్రాణాలు కోల్పోతారు. దానికి నువ్వు బాధ్యత వహిస్తావు. ఎలా అన్నది వేచి చూడు." ఫోన్ క్రెడిల్ చేసింది ఓ పథకం ఆ క్షణంలోనే సోఫియా మనసులో రూపుదిద్దుకుంది.
జయచంద్ర బెడ్ పై పడున్న తరుణంలో ఆ పథకాన్ని ఖచ్చితంగా అమలుచేయగలిగేది శశాంక ఒక్కడే... అసలే పగతో ప్రజ్వరిల్లిపోతున్న శశాంకని దారిలోకి రప్పించుకోవడం కష్టం కాదు.
"రాంసింగ్" కేక పెట్టింది శశాంకని పిలిపించే ప్రయత్నంగా.
* * * *
శశాంక రాత్రి నుంచీ నిద్రపోలేదు. శరణాలయానికి వచ్చాక ఫోన్ దగ్గరే కూచున్నాడు. ఎంతటి అసహనంతో నలిగిపోతున్నాడూ అంటే 'మూవ్' అటు నుంచి వస్తే ప్రాణాలకు తెగించైనా వెళ్ళాలనుకుంటున్నాడు.
సరిగ్గా ఆ సమయంలో జాకీ పరుగెత్తుకు వచ్చాడు. ఎవరో అబ్బాయి ఇచ్చాడని ఓ కవరు శశాంకకి అందించాడు.
కవరు తెరిచిన శశాంకకి ముందు అర్థం కాలేదు అందులో రాయబడిందేమిటో...
"అంకిలు. నను చంపితోరట. గుండె మాద గుద్దే. రకతం..." కొక్కిరి గీతల్లాంటి అక్షరాల క్రింద ఎండిపోయిన రక్తపు చారికలు...
వెనుక మరో ఉత్తరం వుంది. "శశాంక... ఇది రూప రాసిందే. ఆ కింద వున్న రక్తం రూపదే. కావలిస్తే రూప బ్లడ్ గ్రూప్ తో చెక్ చేయించి చూడు పోలీసులదాకా వెళ్ళకు... రూప శవంగాని పార్సిల్ గాని రాగలదు... సోఫియాతో చేతులు కలుపుతున్నట్టు మాకు అనిపించకూడదు. తర్వాత ఏం చేయాల్సిందీ చెబుతాం వెయిట్ ఓకే"
శశాంక కళ్ళలో ఎరుపు జీరల్ని దాటుకుని నీళ్ళు ఉబికాయి.
అక్కడొక పసికందు చాలా పాశవికంగా హింసించబడుతూంది. తన ప్రయాణానికి ఫులిస్టాప్ లా ఆ చిన్న ప్రాణి రక్తం ఉపయోగించబడుతూంది.
ఉద్వేగం, ఉక్రోషం ఉధృతమౌతుంటే చేష్టలుడిగినట్టు నిలబడి పోయాడు.
అన్నపూర్ణతోపాటు జాకీ కూడా నిస్సహాయంగా చూస్తున్నారు. ఏదో చేయాలి ఏం చేయాలి. ఏం చేసైనా సాధ్యమైనంత త్వరలో రూపని దక్కించుకోవాలి.
ఆవేశంగా బయటికి వెళుతుంటే రాంసింగ్ ఎదురయ్యాడు.
ప్రస్తుత స్థితిలో సోఫియాతో ఎలాంటి సంబంధం పెట్టుకున్నా అది రూప ప్రాణాలకు హాని అని తెలుసు. ప్రత్యర్థికి కనీసం అనుమానమొచ్చినా చాలు...
అది చెప్పాలని బయటి నుంచి ఫోన్ చేశాడు సోఫియాకి. అతడు చెప్పింది వినే స్థితిలో లేని సోఫియా తన పథకమంతా వివరించింది. నిశ్శబ్దంగా విన్నాడు.
"సారీ సోఫియా... ఇప్పుడు నాకు పగ కన్నా ముఖ్యం కర్తవ్యం. రూపని దక్కించుకోవడం"
ఉక్రోషంగా ఫోన్ క్రెడిల్ చేసాడు. ధనుష్కోటిని శశాంక హత్య చేస్తుండగా తీయించిన ఫోటోని అడ్డం పెట్టుకుని సోఫియా అలా ఆజ్ఞాపిస్తోందని శశాంకకి తెలీదు.
